Read more!

English | Telugu

సినిమా పేరు:ది వారియ‌ర్
బ్యానర్:శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్‌
Rating:2.50
విడుదలయిన తేది:Jul 14, 2022

సినిమా పేరు: ది వారియ‌ర్‌
తారాగ‌ణం: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్ష‌ర గౌడ‌, న‌దియా, జ‌య‌ప్ర‌కాశ్‌, బ్ర‌హ్మాజీ, అజ‌య్‌, నాగ‌మ‌హేశ్‌, శ‌ర‌ణ్య‌, పోసాని కృష్ణ‌ముర‌ళి
మాట‌లు: బుర్రా సాయిమాధ‌వ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, సాహితి, శ్రీ‌మ‌ణి
మ్యూజిక్: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ వాసుదేవ్‌
ఎడిటింగ్: న‌వీన్ నూలి
ఆర్ట్: డి.వై. స‌త్య‌నారాయ‌ణ‌
నిర్మాత: శ్రీ‌నివాసా చిట్టూరి
ద‌ర్శ‌కుడు: ఎన్. లింగుస్వామి
బ్యాన‌ర్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్‌
విడుద‌ల తేదీ: 14 జూలై 2022

త‌మిళ సినిమాల‌తో మ‌నకు ప‌రిచ‌య‌మైన డైరెక్ట‌ర్‌ ఎన్‌. లింగుస్వామి మొట్ట‌మొద‌టి సారిగా 'ది వారియ‌ర్' అనే తెలుగు సినిమాను డైరెక్ట్ చేయ‌డం, అదీ హీరో రామ్‌తో కావ‌డం సినీ ప్రియుల్లో ఆస‌క్తి రేకెత్తించింది. ఆ ఆస‌క్తిని బుల్లెట్ సాంగ్ రెట్టింపు చేసింది. ట్రైల‌ర్ చూశాక లింగుస్వామి స్టైల్ యాక్ష‌న్ మూవీ మ‌న ముందుకు వ‌స్తోంద‌నే న‌మ్మ‌కం క‌లిగింది. నేటి సంచ‌ల‌న తార కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన 'ది వారియ‌ర్' ఎలా ఉందంటే...

క‌థ‌:-
స‌త్యా (రామ్ పోతినేని) హౌస్ స‌ర్జ‌న్ పూర్తిచేసుకొని, క‌ర్నూలులోని హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్‌గా చేరేందుకు అమ్మ (న‌దియా)తో క‌లిసి వ‌స్తాడు. ఒక‌సారి న‌డిరోడ్డుమీద ప‌ట్ట‌ప‌గ‌లు ఒక వ్య‌క్తిని కొంత‌మంది దుండ‌గులు న‌రికేసి వెళ్ల‌గా, అటువైపే బుల్లెట్ మీద వెళ్తున్న స‌త్యా.. కొన ఊపిరితో ఉన్న ఆ వ్య‌క్తిని హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లి, స‌ర్జ‌రీ చేసి ప్రాణాలు కాపాడ‌తాడు. కానీ ఆ వెంట‌నే అత‌డిని అంత‌కు ముందు న‌రికిన వ్య‌క్తులు వ‌చ్చి, అత‌డి ప్రాణాలు తీసేస్తారు. వాళ్లు క‌ర్నూలు మొత్తాన్నీ త‌న క‌నుస‌న్న‌ల‌తో శాసిస్తోన్న గురు అనే ఫ్యాక్ష‌నిస్టు మ‌నుషుల‌ని తెలుస్తుంది. హాస్పిట‌ల్‌లో న‌కిలీ సెలైన్ బాటిల్స్ కార‌ణంగా ముగ్గురు చిన్న‌పిల్ల‌లు చ‌నిపోయి, మ‌రికొంత మంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ల‌డంతో, త‌ట్టుకోలేక‌పోయిన స‌త్యా.. ఆ సెలైన్ బాటిల్స్ గురు బినామీ అయిన ర‌వి (అజ‌య్‌) కంపెనీ నుంంచి వ‌చ్చాయ‌ని తెలుసుకొని, సాక్ష్యాధారాల‌తో అత‌డిని ప‌ట్టిస్తాడు. కొండారెడ్డి బురుజు ద‌గ్గ‌ర త‌న ప్రియురాలు మ‌హాల‌క్ష్మి (కృతి శెట్టి)ని క‌లిసి వ‌స్తున్న స‌త్యాపై ఎటాక్ చేసిన గురు.. అత‌డిని తీవ్రంగా గాయ‌ప‌రుస్తాడు. హాస్పిట‌ల్ డీన్ (జ‌య‌ప్ర‌కాశ్‌) సాయంతో స‌త్యా వాళ్ల‌మ్మ అత‌డిని తీసుకొని క‌ర్నూలు నుంచి వెళ్లిపోతుంది. రెండేళ్ల త‌ర్వాత క‌ర్నూలుకు అనూహ్యంగా డీఎస్పీ హోదాలో వ‌చ్చి గురుతో త‌ల‌ప‌డ‌తాడు స‌త్యా. ఒక డాక్ట‌ర్‌గా గురును ఎదుర్కోలేక‌పోయిన స‌త్యా.. ఒక పోలీస్‌గా ఎలా ఎదుర్కొన్నాడు, అనుకున్న‌ది సాధించాడా? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

రోగుల ప్రాణాల‌ను కాపాడాల‌నుకొనే నిబ‌ద్ధ‌త గ‌ల డాక్ట‌ర్ నుంచి, గురు లాంటి రాక్ష‌సుడ్ని ఏరివేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్న పోలీసాఫీస‌ర్‌గా స‌త్యా మార‌డాన్ని డైరెక్ట‌ర్ లింగుస్వామి చ‌క్క‌గా చిత్రించాడు. డాక్ట‌ర్‌గా క‌ర్నూలు నుంచి వెళ్లిపోయి ఐపీఎస్ చ‌దివి, రెండేళ్ల త‌ర్వాత అక్క‌డికే డీఎస్పీగా వ‌చ్చాడ‌ని చూపించ‌డం బాగానే ఉంది. అయితే ఒక సీన్‌లో త‌న పై ఆఫీస‌ర్ అయిన ఎస్పీని కొట్టి, అత‌డిని స‌స్పెండ్ చేయించ‌డం లాజిక‌ల్‌గా అనిపించ‌లేదు. ఫ‌స్టాఫ్‌లో డాక్ట‌ర్‌గా క‌నిపించినంత సేపు ఎంట‌ర్‌టైన్ చేసే రామ్‌, ఆ త‌ర్వాత పోలీస్‌గా క‌నిపించే గంట‌న్న‌ర సేపు యాక్ష‌న్ హీరోగా మాస్‌ను మెప్పించే య‌త్నం చేశాడు. హీరో హీరోయిన్ల ప‌రిచ‌య దృశ్యాలు, వారి మ‌ధ్య ఇంటిమ‌సీ పెరిగే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. యాక్ష‌న్ సీన్ల‌ను బాగా డిజైన్ చేశారు. రామ్‌, ఆది మ‌ధ్య క్లైమాక్స్ ఫైట్ యాక్ష‌న్ ప్రియుల‌ను క‌చ్చితంగా అల‌రిస్తుంది. 

అయితే క‌థలో ఏమాత్రం కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, ఇప్ప‌టికే ఎన్నో సినిమాల్లో చూసిన త‌ర‌హాలోనే హీరో, విల‌న్ల పాత్ర‌లు ఉండ‌టం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైన‌స్ పాయింట్‌. ప్రాణాలు పోతున్న మ‌నిషికి ఊపిరినివ్వాల‌ని త‌పించే మ‌న‌స్త‌త్వం స‌త్యాద‌ని తెలిసి కూడా, ఓ సీన్‌లో అత‌ను త‌న కొడుకును, భార్య‌ను ఏమైనా చేశాడ‌మోన‌ని గురు ఆదుర్దాకు గుర‌వ‌డం, వారెక్క‌డున్నారో వాక‌బు చేయ‌డం, తను కిడ్నాప్ చేసిన మ‌హాల‌క్ష్మిని వ‌దిలేయ‌డం.. అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్‌లో దొర్లిన పొర‌పాటు. డాక్ట‌ర్ క్యారెక్ట‌ర్ ఉన్నంత సేపు ఆహ్లాద‌క‌రంగా, స్పీడుగా సాగిన క‌థ‌నం, డీఎస్పీ క్యారెక్ట‌ర్ ఎంట‌రైన ద‌గ్గ‌ర్నుంచీ రొటీన్ ఫార్మ‌ట్‌లో సాగి, స్పీడు త‌గ్గించేసింది. లింగుస్వామి సినిమాల్లో యాక్ష‌న్‌కు ఓ స్టైల్ ఉంటుంది. అది ఈ సినిమాలోనూ క‌నిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్నిచోట్ల స‌న్నివేశాలు మ‌రీ మూస‌ధోర‌ణిలో ఉండి, ఆవులింత‌లు తెప్పిస్తాయి.

టెక్నిక‌ల్ అంశాల‌కొస్తే, పాట‌ల‌కు మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు దేవి శ్రీ‌ప్ర‌సాద్‌. నాలుగు పాట‌లూ చిత్రీక‌ర‌ణ ప‌రంగా ఆక‌ట్టుకున్నాయి. అయితే రెండు పాట‌ల ప్లేస్‌మెంట్స్ స‌రిగ్గా కుద‌ర‌లేదు. కేవ‌లం పాట‌ల కోసమే హీరో హీరోయిన్ల మ‌ధ్య సీన్లు క్రియేట్ చేసిన‌ట్లున్నాయి, ఆ రెండు సంద‌ర్భాల్లోనూ. బ్యాగ్రౌండ్ స్కోర్ మ‌రింత ఇంప్రెసివ్‌గా ఉండాల్సింద‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌ను సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్ర‌ఫీ బాగా కాప్చ‌ర్ చేసింది. హీరో, విల‌న్‌ క్లోజ‌ప్ షాట్స్ ఆక‌ట్టుకుంటాయి. సెకండాఫ్‌లో న‌వీన్ నూలి ఎడిటింగ్ మ‌రింత క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. డి.వై. స‌త్య‌నారాయ‌ణ ఆర్ట్ వ‌ర్క్ బాగుంది.

న‌టీన‌టుల ప‌నితీరు:-

మొద‌ట డాక్ట‌ర్‌గా, త‌ర్వాత పోలీస్‌గా రెండు గెట‌ప్పుల క్యారెక్ట‌ర్‌ను రామ్ పోతినేని త‌న‌దైన ఎన‌ర్జీ లెవ‌ల్స్‌తో సునాయాసంగా చేసేశాడు. రెండు ఛాయ‌లున్న ఆ పాత్ర‌లో చ‌క్క‌గా ఇమిడిపోయాడు. డాక్ట‌ర్‌గా ఎంత ముచ్చ‌ట‌గా అనిపించాడో, డీఎస్పీగా ఎంత అగ్రెసివ్‌గా ప‌ర్ఫామ్ చేశాడు. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో అద‌ర‌గొట్టిన అత‌ను, పాట‌ల్లో ఎంతో హుషారుగా స్టెప్పులేసి అల‌రించాడు. గురు క్యారెక్ట‌ర్‌లో ఆది పినిశెట్టి భీక‌రంగా న‌టించేశాడు. ఆ క్యారెక్ట‌ర్‌ను త‌న ప‌ర్ఫార్మెన్స్‌తో వేరే లెవ‌ల్‌కు తీసుకుపోయాడు. ఫ‌స్టాఫ్‌లో అత‌ని న‌ట‌న ముందు రామ్ సైతం త‌గ్గిపోయాడు. అత‌ని లుక్స్ కానీ, డైలాగ్ డిక్ష‌న్ కానీ సూప‌ర్బ్ అనే లెవ‌ల్లో ఉన్నాయి. విజిల్ మ‌హాల‌క్ష్మిగా కృతి శెట్టి హీరోతో రొమాన్స్‌కు, పాట‌ల‌కు ప‌రిమిత‌మైంది. అయితే ఆమె గ్లామ‌ర్ ఈ సినిమాకు అద‌న‌పు ఎట్రాక్ష‌న్‌. హీరో త‌ల్లిగా న‌దియా ఎప్ప‌ట్లా త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆక‌ట్టుకుంది. ఎస్సై దేవ‌రాజ్‌గా బ్ర‌హ్మాజీ త‌న వంతు బాధ్య‌త‌ను చ‌క్క‌గా చేశాడు. కృతి తండ్రిగా రెండు సీన్ల‌లో క‌నిపించి, మాయ‌మ‌య్యాడు పోసాని. అజ‌య్‌, నాగ‌మ‌హేశ్, జ‌య‌ప్ర‌కాశ్‌, శ‌ర‌ణ్య‌ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చేశారు. గురు భార్య‌గా అక్ష‌ర గౌడ స‌రిపోయింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'ది వారియ‌ర్' ఒక రొటీన్ మాస్ మ‌సాలా డ్రామా. ఏమాత్రం కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నంతో సాగే ఈ సినిమా ప్ర‌ధానంగా రామ్ పోతినేని, ఆది పినిశెట్టి ప‌ర్ఫార్మెన్స్ మీద ఆధార‌ప‌డింది. ఆ ఇద్ద‌రూ డిజ‌ప్పాయింట్ చేయ‌రు. నాలుగు పాట‌లు, ఐదు ఫైట్లు, హీరో విల‌న్ల స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు, చివ‌ర‌కు చెడుపై మంచి విజ‌యం సాధించ‌డం అనే రెగ్యుల‌ర్ మ‌సాలా సినిమాల‌కు అల‌వాటుప‌డ్డ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా టైమ్‌పాస్ ఇస్తుంది. ఎక్కువ‌ ఊహించుకొని వెళ్తే ఆశాభంగం త‌ప్ప‌దు.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి