English | Telugu
బ్యానర్:ఈడీ ఎంటర్టైనమెంట్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jun 29, 2023
సినిమా పేరు: స్పై
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, ఐశ్వర్య మీనన్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్‌పాండే, నితిన్ మెహతా, జిష్షూసేన్ గుప్తా, సాన్య థాకూర్, ఆర్యన్ రాజేష్, అతిథి పాత్రలో రానా దగ్గుబాటి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రాఫర్: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
కథ: కె.రాజశేఖర్ రెడ్డి
స్క్రీన్ ప్లే: అనిరుద్ కృష్ణమూర్తి
దర్శకత్వం: గ్యారీ బీహెచ్
నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి
బ్యానర్: ఈడీ ఎంటర్టైనమెంట్స్
విడుదల తేదీ: జూన్ 29, 2023
'స్వామిరారా' నుంచి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తను నటించిన సినిమా అంటే ఖచ్చితంగా విషయం ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగేలా చేసుకోగలిగారు నిఖిల్ సిద్ధార్థ. 'కార్తికేయ-2' పాన్ ఇండియా స్థాయి విజయాన్ని అందుకోవడంతో నిఖిల్ మీద నమ్మకం మరింత పెరిగింది. 'కార్తికేయ-2' తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా సక్సెస్ ని అందుకుంటుందనే అంచనాలు ఏర్పడేలా చేసిన నిఖిల్ తాజా చిత్రం 'స్పై'. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా ప్రచారం పొందటంతో పాటు టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో 'స్పై' పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ 'స్పై' సినిమా ఎలా ఉంది? నిఖిల్ కి 'కార్తికేయ-2' స్థాయి విజయాన్ని అందించేలా ఉందా?...
కథ:
తీవ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేసే ఖాదీర్ ఖాన్(నితిన్ మెహతా)ని అంతమొందించడానికి శ్రీలంక వెళ్లిన 'రా' ఏజెంట్ సుభాష్(ఆర్యన్ రాజేష్) ఆ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేస్తాడు. కానీ అదే మిషన్ లో సుభాష్ కూడా మరణిస్తాడు. అయితే ఐదేళ్ల తర్వాత తాను బ్రతికే ఉన్నానని ఖాదీర్ ఖాన్ ఒక వీడియో విడుదల చేయడంతో ఇండియా షాక్ అవుతుంది. అతన్ని హతమార్చామని ప్రపంచానికి చెప్పుకున్న ఇండియా, దీనిని తమ ప్రతిష్టకు సంబంధించిన విషయంగా భావిస్తుంది. అంతేకాదు ఖాదీర్ న్యూక్లియర్ ఎటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడన్న సమాచారంతో 'రా'ని మళ్ళీ రంగంలోకి దింపుతుంది. ఖాదీర్ ఖాన్ ని పట్టుకొని హతమార్చే మిషన్ ని లీడ్ చేసే బాధ్యతను జై(నిఖిల్ సిద్ధార్థ)కి అప్పగిస్తారు. జై ఎవరో కాదు.. సుభాష్ కి సొంత తమ్ముడే. తన అన్నని చంపిన వ్యక్తిని పట్టుకొని, అతన్ని చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు జై. అలాంటి జైకి తన అన్న మరణంతో ముడిపడి ఉన్న ఖాదీర్ ఖాన్ మిషన్ బాధ్యత వస్తుంది. చనిపోయిన ఖాదీర్ ఖాన్ ఎలా తిరిగొచ్చాడు? సుభాష్ మరణం వెనకున్న వ్యక్తి ఎవరు? 'రా' ప్రధాన కార్యాలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన అత్యంత సీక్రెట్ ఫైల్ ఎలా మిస్ అయింది? ఆ ఫైల్ కి, ఖాదీర్ ఖాన్ తిరిగిరావడానికి సంబంధమేంటి? ఖాదీర్ ప్లాన్ చేసిన న్యూక్లియర్ ఎటాక్ ని ఆపగలిగారా? అనేవి తెలియాలంటే సినిమా చూడాలి.
ఎనాలసిస్ :
నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా ఇది ప్రచారం పొందింది. కానీ ఇందులో నేతాజీ డెత్ మిస్టరీ అనేది ఒక భాగమే కానీ, పూర్తిగా దాని చుట్టూ అల్లుకున్న కథ కాదు. నేతాజీ డెత్ మిస్టరీ నేపథ్యమనే విషయాన్ని మైండ్ లో ఉంచుకొని సినిమాకి వెళ్ళినవారు మాత్రం తీవ్ర నిరాశ చెందుతారు. ఇక సినిమా విషయానికొస్తే, స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు అనగానే.. తరువాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను కలిగించే థ్రిల్లింగ్ అంశాలు, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఆశిస్తాం. కానీ ఆ విషయంలో స్పై పూర్తిగా నిరాశపరిచింది. ఒక్క సన్నివేశంలో కూడా తరువాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మనకు కలగదు. యాక్షన్ సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు.
ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు రచనలో ఎంతో బాధ్యత ఉండాలి. సినిమా చూసేటప్పుడు కథనంలో కానీ, సన్నివేశాలు, సంభాషణలలో కానీ మనకి ఆ బాధ్యత కనిపించదు. కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నిజంగా ఇది స్పై థ్రిల్లర్ సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. ఖాదీర్ ఖాన్ ని అంతమొందించి, సుభాష్(ఆర్యన్ రాజేష్) అనుమానాస్పదంగా మృతి చెందటంతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కొన్నేళ్ల తర్వాత ఖాదీర్ ఖాన్ బ్రతికే ఉన్నాడని తెలియడం కూడా ఆసక్తికరంగానే ఉంది. కానీ ఖాదీర్ ఖాన్ ని పట్టుకునే మిషనే ట్రాక్ తప్పి ఫెయిల్ అయింది. అనవసరమైన ప్రేమ సన్నివేశాలను, కామెడీ ట్రాక్ ని ఇరికించడం కథలోని సీరియస్ నెస్ ని దెబ్బతీసింది. నిఖిల్-ఐశ్వర్య మీనన్ మధ్య లవ్ ఎపిసోడ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పైగా వారి మధ్య సాంగ్ కథ ఫ్లోని డిస్టర్బ్ చేసేలా ఉంది. ఇక 'రా' ఏజెంట్స్ లో ఒకడిగా అభినవ్ గోమఠం ని తీసుకొని, ప్రేక్షకులను వినోదాన్ని పంచుదామనుకున్నారు. కానీ అది బెడిసికొట్టింది. ప్రతి మాటకి అతను కౌంటర్ వేయడం.. నవ్వు తెప్పించడం కంటే, చిరాకు తెప్పించిన సందర్భాలే ఎక్కువ. పైగా ప్రతి విషయాన్ని అతను ఏం తెలియనట్టు అడుగుతుంటే, అసలు అతను రా ఏజెంటేనా అనిపిస్తుంది. ప్రథమార్థం ఎలాంటి మెరుపులు లేకుండానే ముగుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా గొప్పగా అనిపించదు. ద్వితీయార్థంలో కూడా ఒకట్రెండు నేతాజీ సన్నివేశాలు తప్ప మిగతా అంతా ఫ్లాట్ గానే వెళ్తుంది. నేతాజీ సన్నివేశాలు కూడా ఎక్కువగా మాటల రూపంలోనే ఉన్నాయి. భారతీయులందరికీ నేతాజీ ఒక గొప్ప స్వాతంత్య్ర యోధుడు అని తెలుసు. అలాంటిది నేతాజీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదన్నట్టుగా సంభాషణలు ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
నిజానికి నేతాజీ మిస్టరీ నేపథ్యంలో సినిమా చేయడమనేది గొప్ప ఆలోచన. లోతైన పరిశోధన చేసి, దాని చుట్టూ కథ అల్లుకొని సినిమా చేస్తే అద్భుతంగా ఉండేది. కానీ ఈ సినిమాలో ఆ విషయాన్ని టచ్ చేసి చేయనట్టుగా టచ్ చేశారు. పోనీ మిగతా కథనమైనా ఆసక్తికరంగా సాగిందా అంటే అదీ లేదు. రచనలో ఎన్నో తప్పులు దొర్లాయి. ఒక రా ఏజెంట్ చనిపోతే, అతను ఎలా చనిపోయాడో అతనితో పాటు మిషన్ లో పాల్గొన్న టీం మెంబెర్స్ కి తెలుస్తుంది కదా.. దానికోసం ఎవరెవరినో అడగటం ఎందుకు?, సరిహద్దు దేశాల నుంచి ట్రక్స్ కనీస చెకింగ్ కూడా లేకుండా మన దేశంలోకి అంత తేలికగా ప్రవేశిస్తాయా? వంటి పలు ప్రశ్నలు సినిమా చూస్తున్నప్పుడు మన మదిలో మెదులుతుంటాయి.
ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మెప్పించలేకపోయారు. ఎడిటర్ గా నిడివి మీద దృష్టి పెట్టారు కానీ, డైరెక్టర్ గా కథాకథనాల మీద కావాల్సినంత దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. ఈ చిత్రానికి నిర్మాత రాజశేఖర్ రెడ్డినే కథ అందించారు. అయితే సినిమా చూస్తుంటే ముందుగా 'రా' ఏజెంట్ సుభాష్ డెత్ మిస్టరీనే మెయిన్ కథగా రాసుకున్నారేమో, ఆ తర్వాత నేతాజీ లైన్ ని జోడించారేమో అనిపిస్తుంది. అందుకే కథాకథనాల్లో ఆ తడబాటు కనిపించిందనే అభిప్రాయం కలుగుతుంది. ఈ సినిమాకి కథ ఒకరు, కథనం ఒకరు, దర్శకత్వం మరొకరు. ఈ ముగ్గురూ కలిసి మంచి అవుట్ పుట్ ని ఇవ్వడంలో విఫలయమయ్యారు. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం పరవాలేదు. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో తను మ్యాజిక్ చేయలేకపోయాడు. వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
'రా' ఏజెంట్ జై పాత్రలో నిఖిల్ ఒదిగిపోయారు. అన్నని చంపిన వ్యక్తిని పట్టుకోవాలని తపించే తమ్ముడిగా, దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ఏజెంట్ గా తన నటనతో ఆకట్టుకున్నారు. ఐశ్వర్య మీనన్ కూడా నిఖిల్ ప్రేయసిగా, రా ఏజెంట్ గా బాగానే రాణించింది. ఎప్పుడూ జై వెన్నంటే ఉండే రా ఏజెంట్ గా అభినవ్ గోమఠం కనిపించారు. అయితే రా ఏజెంట్ కంటే రెగ్యులర్ కమెడియన్ తరహా పాత్రలోనే కనిపించిన అతను అక్కడక్కడా మాత్రమే నవ్వించారు. పేరుకి ఈ సినిమా కథ ఆర్యన్ రాజేష్ పోషించిన సుభాష్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఆయన పాత్ర నిడివి చాలా అంటే చాలా తక్కువ. అసలు డైలాగ్ లు కూడా ఉండవు. అందుకే ఆ పాత్రకి మనం ఏమాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాలేం. అతిథి పాత్రలో రానా దగ్గుబాటి అలరించారు. ఒక్క సన్నివేశంలోనే కనిపించినా తన మార్క్ స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించారు. మకరంద్ దేశ్‌పాండే, నితిన్ మెహతా, జిష్షూసేన్ గుప్తా, సాన్య థాకూర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నేతాజీ డెత్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా, 'కార్తికేయ 2' తరహాలో మరోసారి నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాడనే అంచనాలతో 'స్పై' సినిమాకి వెళ్తే మాత్రం తీవ్రంగా నిరాశ చెందుతారు. కథాకథనాలు ఆకట్టుకునేలా లేవు. ఒకట్రెండు నేతాజీ సన్నివేశాలు తప్ప, కట్టిపడేసే సన్నివేశాలే లేవు. స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని కూడా ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువే.
-గంగసాని