English | Telugu
బ్యానర్:జోవిత సినిమాస్
Rating:2.25
విడుదలయిన తేది:Mar 3, 2022
సినిమా పేరు: సెబాస్టియన్ పిసి 524
తారాగణం: కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి, ఆదర్శ్ బాలకృష్ణ, రవితేజ, రాజ్ విక్రమ్, జార్జ్ మర్యన్
కథ: బాలాజీ సయ్యపురెడ్డి
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి
కూర్పు: విప్లవ్ నైషదం
ఆర్ట్: కిరణ్ మామిడి
ఫైట్స్: అంజి
నిర్మాతలు: బి. సిద్ధారెడ్డి, జయచంద్రారెడ్డి
దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
బ్యానర్: జోవిత సినిమాస్
విడుదల తేదీ: 4 మార్చి 2022
'రాజావారు రాణిగారు', 'యస్ఆర్ కల్యాణమంటపం' లాంటి చిన్న సినిమాల్లో హీరోగా నటించి, విజయాలు సాధించి, అందరి దృష్టిలో పడిన నటుడు కిరణ్ అబ్బవరం. హ్యాండ్సమ్ హీరోగా, సన్నివేశాలకు తగ్గట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే నటునిగా విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన అతను తన మూడో ప్రయత్నంగా 'సెబాస్టియన్ పిసి 524' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మన ముందుకు వచ్చాడు. ట్రైలర్‌తో ఇంట్రెస్ట్ పెంచిన ఈ క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే...
కథ:- సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం)కు రేచీకటి. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దనీ, దాని కారణంగా పోలీస్ ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దనీ తల్లి (రోహిణి) తన ఆఖరి కోరికగా చెప్తుంది. కానీ నైట్ డ్యూటీల కారణంగా డ్యూటీ సరిగా చేయలేక పదే పదే ట్రాన్స్‌ఫర్స్ అవుతూ వస్తాడు సెబాస్టియన్. చివరకు తను పుట్టి పెరిగిన మదనపల్లికి బదిలీ మీద వస్తాడు. అక్కడే అతని చిన్ననాటి స్నేహితుడు తేజ (రాజ్ విక్రమ్), తను ఇష్టపడిన హేలీ (నువేక్ష) ఉంటారు. ఒకరోజు ఎస్సై (శ్రీకాంత్ అయ్యంగార్) సహా కానిస్టేబుల్స్ అందరూ సిటీకి బందోబస్తు నిమిత్తం వెళ్లగా, ఆ రాత్రి స్టేషన్‌లో సెబాస్టియన్ ఒక్కడే ఉండాల్సి వస్తుంది. అదే రోజు ఆ ఊళ్లోని నీలిమ (కోమలీ ప్రసాద్) అనే పెళ్లయిన యువతి హత్యకు గురవుతుంది. ఆమెను ఎవరు హత్య చేశారు? ఆ హత్యకు, సెబాస్టియన్‌కు ఉన్న కనెక్షన్ ఏమిటి? అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
హీరో రేచీకటి, యువతి హత్య కేసు అనే రెండు పాయింట్ల చుట్టూ 'సెబాస్టియన్ పిసి 524' సినిమాను నడిపించాడు డైరెక్టర్ బాలాజీ సయ్యపురెడ్డి. రేచీకటి ఉన్నవాడు పోలీసు ఉద్యోగానికి పనికిరాడు. కానీ ఆ విషయాన్ని దాచి, పోలీసు కానిస్టేబుల్ అవుతాడు సెబాస్టియన్. అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం తన రేచీకటి వల్ల ఎన్ని తప్పులు జరుగుతున్నా ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి తంటాలు పడతాడే కానీ, తన జబ్బు గురించి డిపార్ట్‌మెంట్‌కు తెలియనివ్వని యువకునిగా సెబాస్టియన్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ మలిచాడు. మొదట్లో ఈ రకమైన క్యారెక్టరైజేషన్ బాగానే ఉందనిపించినా, నీలిమ హత్య జరిగిన తర్వాత, కేసు ఇన్వెస్టిగేషన్ సాగే కొద్దీ అదే క్యారెక్టరైజేషన్‌పై మనకు చికాకు కలుగుతుంది.
సెబాస్టియన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అరగంట సేపు సినిమా ఆహ్లాదకరంగానే నడిచినట్లు అనిపిస్తుంది. మర్డర్ కేసులో అతనికి క్లూ దొరికిందనే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఓకేనే. సెకండాఫ్‌లో డ్రామా రక్తి కడుతుందని ఆశిస్తే, అందుకు భిన్నంగా కథనం ఉండేసరికి బోర్ ఫీలవుతాం. కథనంలోని ట్విస్టులు పేలవంగా తోస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్‌తో పాటు, మిగతా కొన్ని పాత్రల తీరుతెన్నులను దర్శకుడు జనరంజకంగా తీర్చిదిద్దడంలో ఫెయిలయ్యాడు. హీరో ఇష్టపడిన అమ్మాయి క్యారెక్టరైజేషన్‌ను మనం తట్టుకోలేం. ఆ క్యారెక్టర్‌తో మనం డిస్కనెక్ట్ అవుతుంటే, హీరోతో ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యేలా సీన్లు రావడంతో తీవ్ర అసంతృప్తి చెందుతాం. పలు సన్నివేశాల చిత్రీకరణ కూడా డైరెక్టర్‌లోని అనుభవ రాహిత్యాన్ని తెలియజేసింది.
టెక్నికల్‌గా చూస్తే రాజ్ కె. నల్లి సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో లేకపోయినా, సన్నివేశాలకు తగ్గట్లు ఉంది. హీరో ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎలివేట్ చేసింది. జిబ్రాన్ మ్యూజిక్ సమకూర్చిన పాటలు మెలోడియస్‌గా ఉండి ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగుందన్నట్లు అనిపిస్తే, కొన్నిచోట్ల ఓవర్‌బోర్డ్‌గా వెళ్లిపోయి, కర్ణకఠోరంగా అనిపించింది. మదనపల్లి లాంటి ఊరి నేపథ్యంతో తీసిన సినిమాలో ఇంగ్లీష్ మాటలు వినిపించే బీజీయంను వాడటం అసందర్భం. అక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. రెండు గంటల తొమ్మిది నిమిషాల నిడివితో ఈ సినిమాని మన ముందు ప్రెజెంట్ చేశాడు ఎడిటర్ విప్లవ్ నైషదం. అయినప్పటికీ సెకండాఫ్‌ను దారిలోకి తీసుకురాలేకపోయాడంటే అది అతని తప్పు కాదు.
ప్లస్ పాయింట్స్
కిరణ్ అబ్బవరం నటన
పాటలు, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
బోర్ కొట్టించిన సెకండాఫ్ స్క్రీన్‌ప్లే
హీరో క్యారెక్టరైజేన్ కొనసాగిన తీరు, మరికొన్ని పాత్రల తీరుతెన్నులు
పరిణతి లోపించిన సన్నివేశాల చిత్రీకరణ
నటీనటుల పనితీరు:- తొలి సినిమా 'రాజావారు రాణిగారు'లో స్వచ్ఛమైన ప్రేమికునిగా అమాయకంగా కనిపించిన కిరణ్ అబ్బవరం, రెండో సినిమా 'యస్ఆర్ కల్యాణమంటపం'లో రొమాంటిక్ యాంగిల్, గుండె ధైర్యం ఉన్న యువకునిగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ రెండింటికి పూర్తి భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో, రేచీకటి ఉన్న పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్‌తో తనను తాను భిన్నంగా తెరపై ప్రెజెంట్ చేసుకున్నాడు. సబ్జెక్టు విషయం పక్కనపెడితే, నటునిగా అతను ఎంతో మెచ్యూరిటీ కనపరిచాడు. తనకున్న జబ్బు బయటపడి, ఉద్యోగం పోతుందేమోననే భయం ఉన్న మనిషిగా చక్కని నటన కనపర్చాడు. అదే సమయంలో ఎమోషనల్ సీన్లతోనూ మెప్పించాడు. నీలిమగా ప్రేక్షకుల సానుభూతి కొంతమేర పొందే పాత్రలో కోమలీ ప్రసాద్ బాగానే ఉంది. కన్నింగ్‌నెస్ ఉండే హేలీ క్యారెక్టర్‌లో నువేక్షను మనం ప్రేమించలేం. అది ఆమె తప్పు కాదు, ఆమె క్యారెక్టరైజేషన్ తప్పు. సెబాస్టియన్ క్లోజ్ ఫ్రెండ్ తేజగా రాజ్ విక్రమ్‌ది మిస్ క్యాస్టింగ్ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ తీరుకూ, అతని లుక్స్‌కూ సంబంధం కుదరలేదు. ఎస్సైగా శ్రీకాంత్ అయ్యంగార్, కానిస్టేబుల్ నిరంజన్‌గా రవితేజ తమ పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. డాక్టర్‌గా సూర్య తన పాత్రకు ఎప్పట్లా న్యాయం చేశాడు. సెబాస్టియన్ తల్లిగా రోహిణి సరిగ్గా సరిపోయారు. నీలిమ భర్త పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ, చర్చి ఫాదర్‌గా తమిళ యాక్టర్ జార్జ్ మర్యన్ కనిపించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
దారితప్పిన సెకండాఫ్ స్క్రీన్‌ప్లే కారణంగా, హీరో క్యారెక్టరైజేషన్‌తో పాటు మరికొన్ని క్యారెక్టర్ల తీరు తెన్నుల కారణంగా థ్రిల్ కలిగించడానికి బదులు బోర్ కొట్టించిన క్రైమ్ డ్రామా 'సెబాస్టియన్ పిసి 524'. ఈ లోపాల కారణంగానే ఆసక్తికరమైన పాయింట్ ఉండి కూడా ప్రేక్షకుల్ని అసంతృప్తికి గురిచేసిందీ సినిమా.
- బుద్ధి యజ్ఞమూర్తి