Read more!

English | Telugu

సినిమా పేరు:సామజవరగమన
బ్యానర్:హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
Rating:3.00
విడుదలయిన తేది:Jun 28, 2023

సినిమా పేరు: సామజవరగమన
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా
బ్యానర్స్: హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: జూన్ 29, 2023 

ఈమధ్య కాలంలో ట్రైలర్ చూడగానే ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే అభిప్రాయాన్ని కలిగించిన చిత్రం 'సామజవరగమన'. శ్రీవిష్ణు తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్ లో సినిమా చేయడం, ప్రీమియర్ షోలకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తన గత మూడు చిత్రాలతో నిరాశపరిచిన శ్రీవిష్ణుకి విజయాన్ని అందించేలా ఉందా?...

కథ:
మామూలుగా ఒక కొడుకుని డిగ్రీ పాస్ చేయించడానికి తండ్రి కష్టపడుతుంటాడు. కానీ ఇందులో మాత్రం తండ్రిని డిగ్రీ పాస్ చేయించడానికి కొడుకు కష్టపడుతుంటాడు. బాలు(శ్రీవిష్ణు) మల్టీప్లెక్స్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అతని తండ్రి(నరేష్) మాత్రం రిటైర్ మెంట్ వయసులో డిగ్రీ ఎగ్జామ్స్ రాసుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే చదువంటే ఎంతో ఇష్టమున్న బాలు తాతయ్య, డిగ్రీ పాస్ అయితేనే తన పిల్లలకు ఆస్తిలో వాటా ఉంటుందని వీలునామా రాసి చనిపోతాడు. మిగతావారు డిగ్రీ పాస్ అయ్యి ఎవరి ఆస్తి వాళ్ళు తీసుకుంటే, బాలు తండ్రి మాత్రం డిగ్రీ పట్టా కోసం గజినీ మహ్మద్ ఏళ్ళ తరబడి దండయాత్ర చేస్తూనే ఉంటాడు. ఇలా సప్లీ పరీక్షలు రాసే క్రమంలో బాలు తండ్రికి స‌ర‌యు(రెబా మౌనికా జాన్‌) పరిచయమవుతుంది. ఆ తర్వాత సరయు పేయింగ్ గెస్ట్ గా ఉండటానికి బాలు ఇంటికి వస్తుంది. ఆ ఇంటిలో ఒక కుటుంబసభ్యురాలిగా కలిసిపోయిన సరయు, మెల్లిమెల్లిగా బాలుకి దగ్గరై అతనితో ప్రేమలో పడుతుంది. అయితే బాలుకి అసలు ప్రేమ అంటేనే పడదు. ఎవరైనా అమ్మాయి తనని ప్రేమిస్తుందని అనుమానం వచ్చినా ఆమె చేత రాఖీ కట్టించుకుంటాడు. అలాంటి బాలు తనకు తెలియకుండానే సరయుతో ప్రేమలో పడతాడు. అయితే బాలు-సరయు ప్రేమ కథకి ఒక వింత సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి? దానిని దాటుకొని బాలు-సరయు ప్రేమ కథ గెలుపు తీరాలకు చేరిందా? బాలు తండ్రి డిగ్రీ పాసయ్యి ఆస్తి సొంతం చేసుకున్నాడా? తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

ఈమధ్య కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్స్ తగ్గిపోయాయి. అయితే ఆ లోటుని తీర్చేలా ఈ 'సామజవరగమన' చిత్రం ఉంది. 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాళ్ల ఇంట్లోనే ఇరుక్కుపోతే, వారి పరిస్థితి ఏంటి? అనే కథతో రూపొందిన 'వివాహ భోజనంబు' నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. చిన్న పాయింట్ ని తీసుకొని దానిని ఎంటర్టైనింగ్ గా చెప్పడం దర్శకుడు రామ్ అబ్బరాజు శైలి అని ఆ సినిమాతో అర్థమైంది. ఇప్పుడు 'సామజవరగమన' విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు. పైగా 'వివాహ భోజనంబు'కి కథ అందించిన భాను బోగవరపు నే ఈ సినిమాకి కూడా అందించాడు. ఆ కథకి తన మార్క్ స్క్రీన్ ప్లే జోడించి మంచి ఎంటర్టైనర్ గా మలిచాడు దర్శకుడు.

ఈ సినిమా మొదలవ్వడమే నవ్వులతో మొదలవుతుంది. ప్రథమార్థం అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా నవ్విస్తూనే ఉంటుంది. ముఖ్యంగా శ్రీవిష్ణు, నరేష్ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి. తండ్రిని కొడుకు చదివించడం, ఇన్స్టిట్యూట్ లో చేర్పించడం వంటి సన్నివేశాలు కొత్త అనుభూతినిస్తూ నవ్వులు పంచుతాయి. చిన్న మెలికతో ఇంటర్వెల్ బ్లాక్ కూడా భలే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సమయానికి దాదాపు చూసే ప్రేక్షకులందరికీ సినిమాపై మంచి అభిప్రాయకలుగుతుంది. ప్రథమార్థంతో పోలిస్తే కాస్త కామెడీ డోస్ తగ్గింది అనిపించినప్పటికీ ద్వితీయార్థం కూడా బాగానే నవ్విస్తుంది. శ్రీవిష్ణు, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రల చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దాదాపు సినిమా అంత ఫ్రెష్ కామెడీతో వెళ్లినట్లు అనిపించగా, వెన్నెల కిషోర్ ట్రాక్ మాత్రం రొటీన్ గా అనిపించింది. కులపిచ్చి ఉన్న కులశేఖర్ గా వెన్నెల కిషోర్ సన్నివేశాలు కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ, కొత్తదనం లేదు. ఆశించినస్థాయిలో కామెడీ పండలేదు. ఇలా సెకండాఫ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ తో నడిచింది. అయినప్పటికీ ఫస్టాఫ్ స్థాయిలో కాకపోయినా సెకండాఫ్ లో కూడా బాగానే నవ్వుకుంటాం. సినిమాని ముగించిన తీరు కూడా బాగుంది. సినిమా నాలెడ్జ్ ఎక్కువున్నవారు క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఊహిస్తారేమో కానీ, సాధారణ ప్రేక్షకుల్లో మాత్రం సినిమా ముగింపు ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొనే అవకాశముంది. ఇప్పుడు ట్రెండ్ గా మారిన ద్వందార్థాలు, వెకిలి కామెడీ జోలికి పోకుండా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన కామెడీతోనే ఎక్కువగా నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ విషయంలో మాత్రం ఆయనను ప్రత్యేకంగా అభినందించాలి.

ప్రేమ కథలకు రకరకాల సమస్యలు వస్తుంటాయి. భాను బోగవరపు రాసిన కథలో ఓ విభిన్న సమస్యను తీసుకున్నారు. ఆయన రాసిన పాయింట్ లో కామెడీకి మంచి స్కోప్ ఉంది. ఆ పాయింట్ కి దర్శకుడు రామ్ అబ్బరాజు ఇచ్చిన ట్రీట్ మెంట్ బాగుంది. ఇక ఈ సినిమాకి నందు సవిరిగాన రాసిన సంభాషణలు కూడా ప్రధాన బలంగా నిలిచాయి. గోపీ సుందర్ తన పాటలతో ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయకపోయినప్పటికీ, నేపథ్య సంగీతంతో మాత్రం మెప్పించాడు. సినిమాకి, దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా రాంరెడ్డి కెమెరా పనితనం బ్యూటిఫుల్ గా బాగుంది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
శ్రీవిష్ణు విభిన్న తరహా చిత్రాలు చేసినప్పటికీ తన కామెడీ టైమింగ్ అతనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సరైన ఎంటర్టైనర్ పడితే అతను ఎంతలా నవ్వించగలడో మరోసారి నిరూపించాడు. ఓ వింత సమస్య ఎదురై, ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోలేక.. తను ఇబ్బందులు పడుతూ మనకు బోలెడంత వినోదాన్ని పంచాడు. శ్రీవిష్ణు బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమ గురించి, అమ్మాయిల గురించి  చెప్పే ఒక లెంగ్తీ డైలాగ్ థియేటర్ లో ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించేలా ఉంది. ఈ సినిమాకి నరేష్ సెకండ్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు హీరో తండ్రిగా మంచి లెంగ్త్ కామెడీ రోల్ పడింది. ఆ పాత్రకు నరేష్ పూర్తి న్యాయం చేసి కడుపుబ్బా నవ్వించాడు. సరయు పాత్రలో రెబా మోనికా జాన్ కూడా చక్కగా రాణించింది. నవ్వించడమే కాకుండా, ప్రేమించిన వాడు ఎక్కడ దూరమవుతాడోనన్న బాధని కూడా ఆమె చక్కగా ప్రదర్శించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నవ్వులు పూయించాడు. కులపిచ్చి ఉన్న వ్యక్తిగా వెన్నెల కిషోర్, శ్రీవిష్ణు స్నేహితుడిగా సుదర్శన్ బాగానే నవ్వించారు. రాజీవ్ కనకాల, రఘు బాబు, దేవి ప్రసాద్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈమధ్య కాలంలో కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకోగల సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని తీర్చేలా ఈ 'సామజవరగమన' చిత్రం ఉంది. ఒక చిన్న పాయింట్ ని తీసుకొని దానిని ఆద్యంతం నవ్వుకునేలా చక్కగా మలిచారు. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునే సందర్భాలు సినిమాలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్, అలాగే సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుకునేలా ఉన్నాయి. సెకండాఫ్ లో కాస్త తడబాటు కనిపించినా ఓవరాల్ గా మాత్రం మంచి వినోదాన్ని పంచుతుంది. కుటుంబంతో కలిసి వెళ్లి సరదాగా నవ్వుకుందాం అనుకునేవాళ్ళకి ఈ సినిమా మంచి ఆప్షన్.

- గంగసాని