Read more!

English | Telugu

సినిమా పేరు:కొండా
బ్యానర్:Shrestha Patel Movies
Rating:2.00
విడుదలయిన తేది:Jun 23, 2022

సినిమా పేరు: కొండా
తారాగ‌ణం: త్రిగుణ్‌, ఇర్రా మోర్‌, పృథ్వీరాజ్‌, తుల‌సి, ఎల్బీ శ్రీ‌రామ్‌, ఆటో రామ్‌ప్ర‌సాద్‌, అభిలాష్ చౌద‌రి, ప్ర‌శాంత్ కార్తి, శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర‌
మ్యూజిక్: డి.ఎస్‌.ఆర్‌.
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి
ఎడిటింగ్: మ‌నీష్ ఠాకూర్‌
నిర్మాత: కొండా సుస్మితా ప‌టేల్‌
ద‌ర్శ‌క‌త్వం: రామ్‌గోపాల్ వ‌ర్మ‌
బ్యాన‌ర్: శ్రేష్ఠ పటేల్ మూవీస్
విడుద‌ల తేదీ: 23 జూన్ 2022

రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా అంటే క‌నీస స్థాయిలోనైనా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఉంటుంది. వ‌రంగ‌ల్ రాజ‌కీయ, సామాజిక ముఖ‌చిత్రంపై త‌మ‌దైన ముద్ర‌వేసిన కొండా దంప‌తులు.. ముర‌ళి, సురేఖ జీవితంలోని కొన్ని ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన సినిమా కావ‌డంతో 'కొండా'పై మ‌రింత ఆస‌క్తి రేకెత్త‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం కాదు. కానీ విడుద‌ల‌కు ముందు ఎంత‌గా ప్ర‌చారం ల‌భించినా, 'కొండా'ను కొనేందుకు బ‌య్య‌ర్లు ఏమీ ఉత్సాహంతో ఉర‌క‌లు వేయ‌లేదు. రిలీజ‌య్యాక థియేట‌ర్ల‌కు జ‌నం పొలోమ‌ని పోటెత్త‌లేదు. అలాంటి విచిత్ర‌మైన స్థితిలో విడుద‌లైన 'కొండా' మూవీ ఎలా ఉందంటే...

క‌థ‌:-
క‌ళ్ల ముందు అన్యాయం జ‌రుగుతుంటే కొండా ముర‌ళి (త్రిగుణ్‌) చూస్తూ ఊరుకోలేడు. వెంట‌నే రెస్పాండ్ అవుతాడు, అదీ ఫిజిక‌ల్‌గా. అలా ఊళ్లో అమ్మాయిల మానాల్ని హ‌రిస్తున్న ఓ కామాంధుడిని అతడి ఇంటికి వెళ్లి మ‌రీ చిత‌క్కొడ‌తాడు ముర‌ళి. దాంతో కొట్టించుకున్న వాడు చూస్తూ ఊరుకోడ‌ని, ఊళ్లో ఉంటే ప్ర‌మాద‌మ‌నీ అమ్మానాన్న‌లు (తుల‌సి, ఎల్బీ శ్రీ‌రామ్‌) అత‌డికి బ్రెయిన్‌వాష్ చేసి, వ‌రంగ‌ల్‌లోని లాల్ బ‌హ‌దూర్ కాలేజీలో చ‌దువుకోవ‌డానికి పంపిస్తారు. అక్క‌డ సురేఖ (ఇర్రా మోర్‌) అనే స్టూడెంట్‌ను చూసి మ‌న‌సు పారేసుకుంటాడు ముర‌ళి. అక్క‌డే విప్ల‌వం కోసం ప‌నిచేసే ఆర్కే (ప్ర‌శాంత్ కార్తి) ప‌రిచ‌య‌మ‌వుతాడు. ముర‌ళి దుడుకుత‌నం చూసి, అత‌డిని త‌న ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించుకుంటాడు స్థానిక రాజ‌కీయ నాయకుడైన న‌ల్ల సుధాక‌ర్ (పృథ్వీ). ముర‌ళి, సురేఖ పెళ్లి చేసుకుంటారు. మొద‌ట సుధాక‌ర్‌ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నాడ‌నుకున్న ముర‌ళికి, త‌ర్వాత అత‌ని నిజ స్వ‌రూపం అర్థ‌మై, బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. కానీ ముర‌ళి స్నేహితుడు కొల్లి ప్ర‌తాప్ (ఆటో రాంప్ర‌సాద్‌) మాత్రం సుధాక‌ర్ పంచ‌నే ఉండి ముర‌ళిని వెన్నుపోటు పొడుస్తాడు. అత‌డిచ్చిన స‌మాచారం ప్ర‌కార‌మే త‌న మ‌నుషుల‌తో ముర‌ళిపై ఎటాక్ చేయిస్తాడు సుధాక‌ర్‌. తుపాకీ తూటాలు త‌గిలినా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తాడు ముర‌ళి. ఆ త‌ర్వాత ముర‌ళి ఏం చేశాడు, ప్ర‌తీకారం తీర్చుకున్నాడా, లేదా? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

పేరుకు కొండా దంప‌తుల క‌థ అని రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌చారం చేశాడు కానీ, ఇందులో వాస్త‌వాల కంటే క‌ల్పితాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఈజీగా తెలిసిపోతుంది. కొండా ముర‌ళికి ప్ర‌ధాన శ‌త్రువు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అనే విష‌యం ప్ర‌పంచానికంత‌టికీ తెలిసిందే. అందుకే ఆ పేరును వాడితే సెన్సార్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే ఉద్దేశంతో ఆ పాత్ర‌ను న‌ల్ల సుధాక‌ర్‌గా మార్చార‌ని ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఈ మూవీలో న‌ల్ల సుధాక‌ర్ విల‌న్‌గా ద‌ర్శ‌న‌మిస్తాడు. ముర‌ళి ప‌క్క‌లో బ‌ల్లెంలా మారి, త‌న‌కెక్క‌డ పోటీ వ‌స్తాడోన‌ని, అత‌డిని అడ్డు తొల‌గించుకోవ‌డానికి సుధాక‌ర్ ప‌దే ప‌దే ప్ర‌య‌త్నం చేయ‌డం ఈ సినిమాలో చూస్తాం. 

క్యారెక్ట‌రైజేష‌న్స్ విష‌యానికొస్తే.. కొండా ముర‌ళి, న‌ల్ల సుధాక‌ర్ పాత్ర‌ల‌ను మిగ‌తా పాత్ర‌ల కంటే కాస్త బెట‌ర్‌గా తీర్చిదిద్దారు. ముర‌ళిలోని మొండిత‌నాన్ని, ధైర్యాన్ని చాలావ‌ర‌కు బాగానే ఆ పాత్రలో చూపించారు. కొండా సురేఖ క్యారెక్ట‌రైజేష‌న్ ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదు. కాలేజీలో ఆమెపై చిత్రీక‌రించిన పాట‌.. చాలా నాసిర‌కం టేస్ట్ ఉన్న‌వాళ్ల‌కు త‌ప్ప ఇంకెవ‌రికీ న‌చ్చ‌దు. ఒంటిపై ఓణీ తీసేసి, న‌డుమూ, నాభి చూపిస్తూ ఆమె చిందులు వేయ‌డం చూసి.. అప్ప‌ట్లో సురేఖ ఇలా ఉండేదా? అని ఎవ‌రైనా బుగ్గలు నొక్కుకుంటే.. అది వారి త‌ప్పు కాదు. ఆ పాటే కాదు, ఇందులో అన్ని పాట‌ల చిత్రీక‌ర‌ణ వ‌ర‌స్ట్‌గా ఉంది. బండ్ల దొర అనే కిరాత‌కుడ్ని చంపడాన్ని ఓ పాట ద్వారా చూపించారు. అందులో పాత్ర‌ధారుల హావ‌భావాలు చూసి, మ‌న గుండెల‌దిరిపోతాయి.

సినిమా చూస్తుంటే.. న‌టీన‌టుల హావ‌భావాలు స‌న్నివేశానికి అనుగుణంగా ఉన్నాయా, పాత్ర తీరుకు త‌గ్గ‌ట్లు ఉన్నాయా అనే విష‌యం ప‌ట్టించుకోకుండా చ‌కా చ‌కా చుట్టేశార‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఇంతోటి సీన్లు తీయ‌డానికి రామ్‌గోపాల్ వ‌ర్మ అవ‌స‌ర‌మా అనిపించ‌క మాన‌దు. కొండొక‌చో.. ఈ సీన్లు ఇలా తీసింది ఆర్జీవీయేనా అనే అనుమాన‌మూ క‌లుగుతుంది. పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న ముర‌ళిని బెయిల్‌పై తీసుకురావ‌డానికి సురేఖ వెళ్లిన‌ప్పుడు ఆమెను ఇన్‌స్పెక్ట‌ర్లు నాలుక త‌డుపుకుంటూ ఆబ‌గా చూడ్డం ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఒక‌సారి కాదు రెండు సార్లు. అంతేనా.. ముర‌ళిని విడిపించ‌మ‌ని న‌ల్ల సుధాక‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన సురేఖ‌.. "నీకేమివ్వాలి?" అని అడుగుతుంది. సుధాక‌ర్‌.. "నువ్వేమిస్తావ‌ని నేన‌డ‌గ‌డం లేదు, నువ్వేం తినిపిస్తావ‌ని అడుగుతున్నా" అంటాడు చిలిపిగా న‌వ్వుతా. నిజంగా సురేఖతో నిజ జీవిత పాత్ర‌లు అలాగే బిహేవ్ చేశాయా? ఈ విష‌యాన్ని ఆమే వెల్ల‌డించాలి.

సంభాష‌ణ‌లు కొన్ని చోట్ల ఇంప్రెసివ్‌గా, ఇంకొన్నిచోట్ల చౌక‌బారుగా అనిపించాయి. ద‌ర్శ‌క‌త్వం ఏమాత్రం ఆక‌ట్టుకొనేలా లేదు. డి.య‌స్‌.ఆర్‌. మ్యూజిక్ స‌న్నివేశాల‌కు బలాన్ని చేకూర్చ‌డంలో విఫ‌ల‌మైంది. పాట‌ల మ్యూజిక్ అయితే దారుణం. ఐదు పాట‌ల్లో ఏదీ న‌చ్చేట్లుగా ఉండ‌దు. మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. త‌న‌కిచ్చిన స‌న్నివేశాల్ని అతికించ‌డానికీ, క‌త్తిరించ‌డానికీ ఎడిట‌ర్‌ మ‌నీష్ ఠాకూర్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెలీదు. అయినా అత‌ను మాత్రం ఏం చేస్తాడు!

న‌టీన‌టుల ప‌నితీరు:-

కొండా ముర‌ళి పాత్ర‌కు త్రిగుణ్ న్యాయం చేశాడు. హావ‌భావాల విష‌యంలో ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించాడు. అత‌ని బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. సురేఖ పాత్ర‌లో ఇర్రా మోర్‌ను చూడ‌లేం. ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్ త‌ర‌చూ మ‌న‌ల్ని భ‌య‌పెడ‌తాయి. ఆమె చేత కావాల‌నే అలా చేయించారా? డౌట్‌. న‌ల్ల సుధాక‌ర్‌గా పృథ్వీరాజ్ స‌రిగ్గా సూటైపోయాడు. కిస‌కిస‌మ‌ని న‌వ్వేప్పుడు అత‌డ్ని చూడాల్సిందే. ముర‌ళి త‌ల్లి పాత్ర‌ధారి అయిన‌ తుల‌సి చేత ఓవ‌రాక్టింగ్ చేయించాడు డైరెక్ట‌ర్‌. తండ్రిగా ఎల్బీ శ్రీ‌రామ్ సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్ చూపించారు. ముర‌ళిని వెన్నుపోటు పొడిచిన కొల్లి ప్ర‌తాప్‌గా ఆటో రాంప్ర‌సాద్‌, న‌క్స‌లైట్ ఆర్కేగా ప్ర‌శాంత్ కార్తి ఫర్వాలేద‌నిపించారు. ఇన్‌స్పెక్ట‌ర్ రియాజ్‌గా అభిలాష్ చౌద‌రి ఓకే. ఇన్‌స్పెక్ట‌ర్ గోకుల్ పాత్ర‌లో శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర‌కు న‌టించ‌డానికి అవ‌కాశం ల‌భించ‌లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ద‌ర్శ‌కుడిగా రామ్‌గోపాల్ వ‌ర్మలోని ప్ర‌తిభా పాట‌వాలు తిరోగ‌మ‌న దిశ‌లో ఉన్నాయ‌ని చెప్ప‌డానికి 'కొండా' మూవీ మ‌రో నిద‌ర్శ‌నం. క‌థ‌నం, క్యారెక్ట‌రైజేష‌న్స్‌, స‌న్నివేశాల క‌ల్ప‌న‌, వాటి చిత్ర‌ణ చాలా నాసిర‌కంగా ఉన్న 'కొండా' సినిమాని ఆస్వాదించ‌డానికి కొండంత‌ గుండె ఉండాలి. మ‌న‌బోటి చిన్న‌ గుండెలు త‌ట్టుకోవ‌డం క‌ష్టం.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి