div id="zbutton">
Read more!

English | Telugu

సినిమా పేరు:కళ్యాణం కమనీయం
బ్యానర్:యూవీ కాన్సెప్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 14, 2023

తారాగణం: సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, కేదార్ శంకర్, సద్దామ్, దేవీప్రసాద్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ 
ఎడిటర్: జి. సత్య
రచన, దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ళ 

 

ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' వంటి పెద్ద సినిమాలతో పాటు యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన 'కళ్యాణం కమనీయం' బాక్సాఫీస్ బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సంక్రాంతికి ఊహించని విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తుందేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. మరి 'కళ్యాణం కమనీయం' ఎలా ఉంది? నిజంగానే ఊహించని విజయాన్ని అందుకునేలా ఉందా?.

 

కథ:
శివ(సంతోష్ శోభన్),శృతి(ప్రియా భవానీ శంకర్) కొంతకాలంగా ప్రేమలో ఉంటారు. శృతి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుండగా.. శివ మాత్రం బి.టెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు. శృతి తల్లి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆమె కోరిక మేరకు.. శివకి ఉద్యోగం లేకపోయినా ఇరు కుటుంబసభ్యులు మాట్లాడుకొని శృతి-శివల పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత కొన్నిరోజుల పాటు వారి జీవితం ఎంతో హాయిగా సాగిపోతుంది. శివకి అడక్కుండానే డబ్బులిస్తూ శృతి అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అయితే కొన్నిరోజుల తర్వాత శృతి ప్రవర్తనలో మార్పు వస్తుంది. త్వరగా ఉద్యోగం తెచ్చుకోమని శివపై ఒత్తిడి చేస్తుంది. శృతి ప్రవర్తనలో మార్పుకి కారణమేంటి? శివకి టాలెంట్ ఉన్నప్పటికీ జాబ్ ఎందుకు రావట్లేదు? క్యాబ్ నడుపుతూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నానని శివ అబద్దం ఎందుకు చెప్పాడు? శివ, శృతి విడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే వారి జీవితం చాలా బాగుంటుంది అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ చెప్పాలనుకున్నాడు. ఎలాంటి అసభ్యత లేకుండా, అనవసర హంగు ఆర్భాటాలకు పోకుండా దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ని స్పష్టంగా చెప్పాడు. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి. అయితే కథ చాలా చిన్నది కావడం, కథనంలో కూడా ఎలాంటి మలుపులు లేకుండా అంతా మన ఊహనికి అందేలా సాగడం మైనస్ అని చెప్పొచ్చు. అలాగే యూట్యూబ్, ఓటీటీలలో ఇలాంటి సిరీస్ లు, సినిమాలు చూసేసి ఉన్న వారికి.. ఈ సినిమా చూసేటప్పుడు ఓటీటీ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ కలిగే అవకాశముంది.

సినిమా మొదట్లో ప్రేమ సన్నివేశాలు చూపించి నిడివి పెంచే ప్రయత్నం చేయకుండా.. పెళ్లి చూపులు, పెళ్లితో నేరుగా కథలోకి తీసుకెళ్లడం బాగుంది. ఈ క్రమంలో హీరోకి, అతని తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. సన్నివేశాల్లో సహజత్వం ఉంది. ఉన్నంతలో కామెడీ కూడా ఆకట్టుకుంది. నిజానికి ఇందులో కామెడీకి ఎంతో స్కోప్ ఉన్నప్పటికీ ఎందుకనో పూర్తిస్థాయిలో నవ్వించే ప్రయత్నం చేయలేదు. చాలా చిన్న పాయింట్ తీసుకొని అల్లుకున్న కథ కాబట్టి.. కామెడీ డోస్ పెంచి, ఉన్న పాత్రలతోనే మరింత నవ్వించే ప్రయత్నం చేస్తే బాగుండేది. సినిమా నిడివి 1గంట 45 నిమిషాలు కావడం కలిసొచ్చే అంశం. ఇంత చిన్న పాయింట్ తో అంతకంటే ఎక్కువ నిడివి ఉంటే ఆడియన్స్ కి బోర్ కొట్టే ఛాన్స్ ఉంది.

శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. శ్రావణ్ స్వరపరిచిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగ్గట్లు ఆకట్టుకునేలా ఉంది. కార్తీక్ కెమెరా పనితనం సన్నివేశాలకు అందం తీసుకొచ్చింది. మరుధూరి రాజా సంభాషణలు బాగున్నాయి. ముఖ్యంగా హీరో తండ్రి పలికే సంభాషణలు అలరిస్తాయి. సత్య ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

నటీనటుల పనితీరు:
శివ పాత్రలో సంతోష్ శోభన్ ఆకట్టుకున్నాడు. భార్య సంపాదన మీద బ్రతికే నిరుద్యోగ భర్తగా అలరించాడు. ప్రతిభ ఉన్నా ఉద్యోగం రాక, మరోవైపు ఉద్యోగం చేస్తున్నానని భార్యకు అబద్దం చెప్పి.. దానిని కవర్ చేసుకోవడానికి ఇబ్బందిపడే భర్తగా సంతోష్ నటన మెప్పించింది. శృతి పాత్రలో ప్రియా భవానీ శంకర్ చక్కగా రాణించింది. అందరూ తన భర్తను చులకనగా చూస్తుండటంతో, ఎలాగైనా అతన్ని ఉద్యోగంలో చేర్పించాలనుకునే భార్య పాత్రలో పరిణితితో నటించింది. శివ తండ్రిగా కేదార్ శంకర్ నవ్వులు పూయించారు. ఉగ్యోగం లేని కొడుకుపై ఆయన సెటైర్లు బాగానే నవ్విస్తాయి. శివ ఫ్రెండ్ గా సద్దామ్, శృతి తండ్రిగా దేవీప్రసాద్, శృతి తల్లిగా పవిత్ర లోకేష్, శృతి ఆఫీస్ లో పనిచేసే మేనేజర్ గా సత్యం రాజేష్, అతిథి పాత్రలో సప్తగిరి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కథలో కొత్తదనం, కథనంలో ఊహించని మలుపులు లేకపోయినా.. ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించిన ఈ కళ్యాణం కమనీయం చిత్రాన్ని ఓసారి చూసేయొచ్చు.

- గంగసాని