Read more!

English | Telugu

సినిమా పేరు:బద్రీనాథ్
బ్యానర్:గీత ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jun 10, 2011

మన దేశంలో ఉన్న 138 పుణ్యక్షేత్రాలను కాపాడటానికి క్షేత్రపాలకులను తయారుచేయాలని, తక్షశిలలో ఉండే సర్వ యుద్ధవిద్యాకోవిదుడు, ఏడుపదుల వయసు దాటిన భీష్మనారాయణ (ప్రకాష్ రాజ్) వద్ద చిన్నపిల్లలను సమస్తయుద్ధవిద్యల్లో తర్ఫీదు ఇప్పిస్తుంటారు హిందూ ఆధ్యాత్మిక వాదులు. కానీ అక్కడ ఉండే గోవులు కాసే వ్యక్తి కొడుకైన బద్రీనాథ్ లో ఉన్న ఏకసంధాగ్రాహి తత్వాన్ని గమనించిన భీష్మనారాయణ ఆ పిల్లవాడికి కూడా తనకు తెలిసిన విద్యల్లో తర్ఫీదు ఇస్తుంటాడు.ఆ పిల్లవాడు (అల్లు అర్జున్) పెరిగి బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడవుతాడు.

 అక్కడికి తన తాతను తీసుకుని అలకనంద (తమన్నాభాటియా) అనే పక్కా నాస్తికురాలు వస్తుంది. ఆమె నాస్తికురాలు ఎందుకైందో తెలుసుకున్న బద్రీనాథ్ ఆమెను ఆస్తికురాలిగా మారుస్తాడు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఆరునెలలు మంచు కురవటం వల్ల మూయబడి ఉంటుంది. అప్పుడు ఒక జ్యోతిని గుళ్ళో వెలిగిస్తారు. ఆ జ్యోతిని చూసి బ్రహ్మకమలం పువ్వుకి మనపేరు రాసి దేవుడి ముందు పెట్టి, ఆరు నెలల తర్వాత తిరిగి గుడి తలుపులు తెరచినప్పుడు వెలుగుతున్న ఆ జ్యోతిని దర్శిస్తే మనం కోరుకున్న కోరికలు తీరతాయని అలకనందకు బద్రీ చెపుతాడు.దాంతో బద్రీని ప్రేమిస్తున్న అలకనంద ఆ విషయం అతనికి చెప్పకుండ అలాగే చేస్తుంది.

 

కానీ ఆమెను కిడ్నాప్ చేయటానికి ఆమె బావ మనుషులతో వస్తాడు. అలకనందకు గుడి తెరిచే సమయానికి జ్యోతిని తానే చూపిస్తానని బద్రీ ఆమెకు మాట ఇస్తాడు. అతను బద్రీని గాయపరచి అలకనందను తమ ఊరికి తీసుకెళ్తారు. మరి బద్రీ ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడా...? లేదా...? అన్నది మిగిలిన కథ.  

 


ఎనాలసిస్ :

దర్శకత్వం - దర్శకుడిగా వినాయక్ టేకింగ్ గురించి ఈరోజు కొత్తగా మాట్లాడుకోనక్కరలేదు. కానీ వినాయక్ కూడా మరో మెహెర్ రమేష్ లా ఈ సినిమాని తీయటమే ఆందోళన కలిగించే విషయం. గ్రీన్ మ్యాట్ లో దాదాపు సగం సినిమా తీసినట్లుంది. స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా ఉంది. తమన్నా గుళ్ళో హారతి ఊదేస్తుంది. అది ఆమె నాస్తికురాలన్న సంగతి ముందుగా రిజిస్టర్ అయ్యుంటే ఆ సీన్ ఇంపాక్ట్ ఉండేది. అలా కాకుండా ఆ సీన్ తీయటం వల్ల ఆ సీన్ ప్రేక్షకులకు డైజెస్ట్ కాదు. అలాగే తమన్నా బావ, అత్త పాత్రలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవు. విలన్ కెల్లీ డోర్జీ, అతని కొడుకుల పాత్రలు చాలా పేలవంగా సాగటం ఈ సినిమాకి మరో మైనస్.

 

బ్రహ్మానందం, యమ్.యస్.నారాయణ, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గీతా సింగ్ ల కామెడీ ట్రాక్ కూడా "ఇంద్ర" సినిమా నుండి  కాపీ కొట్టారు. అలాగే అలకనంద బ్రహ్మకమలం పువ్వులను తేచ్చేందుకు వేసిన సెట్ కూడా మగధీర సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్లైమాక్స్ సెట్ ను గుర్తుచేస్తుంది. ఇలా ఇంద్ర, మగధీర, శక్తి సినిమాలను కాపీకొట్టి "బద్రీనాథ్" అనే సినిమా కథను తయారుచేసినట్లు సినిమా అంటే ఏమీ తెలియని పిల్లాణ్ణి అడిగినా చెపుతాడు.

 

ఈ కథని ఆరేళ్ళ క్రితం వద్దనుకున్న అల్లు అరవింద్ మరి ఇప్పుడదే కథతో సినిమా తీయటం అంటే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవటం అంటే ఇదేనేమోననిపిస్తుంది. భారతదేశ సినీ చరిత్రలోనే ఇలాంటి పాయింట్ ఇంతవరకూ రాలేదని గొప్పగా చెప్పి, ఈ సినిమా ఫ్లాపయితే ఆ బాధ్యత తనదేనన్న చిన్నికృష్ణ ఈ సినిమాకొచ్చే అపప్రథను చచ్చినట్టు భుజానవేసుకోవాలి.

సంగీతం - ఈ సినిమా ఆడియో ఇప్పటికే విడుదలయ్యింది కనుక పాటల గురించి అందరికీ తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్పటం అనవసరం. ఇక రీ-రికార్డింగ్ ఈ సినిమాకి శబ్దకాలుష్యంలా ఉందని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో "ఇంద్ర", "మగధీర" రీ-రికార్డింగ్ ట్రాకులేమన్నా వాడారా అనిపిస్తుంది.

నటన - అల్లు అర్జున్ తన ప్రతి సినిమాకీ కష్టపడ్డట్టే ఈ సినిమాకి కూడా వళ్ళు దాచుకోకుండా కష్టపడ్డాడు. కానీ ఆ కష్టానికి ఫలితం బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారటమే బాధగా ఉంటుంది.తమన్నా గ్లామర్ ఒ.కె. కానీ ఆమె క్యారెక్టరైజేషన్ ఏమాత్రం బాగాలేదు. అందుకామె తప్పులేకపోయినా ఇనుముతో కూడిన నిప్పుకి కూడా సమ్మెట పోట్లు తప్పవు కదా...! మిగిలిన వాళ్ళంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. తెలుగోడి కూతురు అయ్యుండీ, తెలుగు రానట్లు తమన్నాఅత్త పాత్రకు డబ్బింగ్ చెప్పించటం వినటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది.

సినిమాటోగ్రఫీ - ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చించేసే రేంజ్ లో ఏం లేదు. ఇంతకంటే బాగా తీయగలిగే మొనగాళ్ళు మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

మాటలు - ఈ సినిమాలోని మాటలు చాలా పేలవంగా ఉన్నాయి. ఏ అప్ కమింగ్ రైటర్ చేత రాయించినా ఇంతకంటే మాటలు ఇంకా బాగుండేవని చెప్పొచ్చు.

పాటలు - "ఓంకారేశ్వరి" లాంటి పాటను మళ్ళీ రాయటానికి వేటూరి గారు లేరేనన్న బాధ ఆ పాటలోని సాహిత్యాన్ని వింటే కలుగుతుంది. మిగిలిన పాటలు సగటు స్థాయిలోనే ఉన్నాయి.

ఎడిటింగ్ - ఫరవాలేదు.

ఆర్ట్ - ఈ సినిమాకి పనిచేసిన విభాగాల్లో ఇది మాత్రం బాగుంది.

కొరియోగ్రఫీ - టైటిల్ సాంగ్ లో కొరియోగ్రఫీ చాలా బాగుంది.

యాక్షన్ - ఎందుకనో ఈ సినిమాలోని యాక్షన్ సీన్లలో క్లారిటీ మిస్సవుతూంది. బహుశా గ్రీన్ మ్యాట్‍ షూట్ వల్ల కావచ్చు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఇది "శక్తి-2" అని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ సినిమాకి మేమిచ్చిన రేటింగ్ కూడా కాస్త ఎక్కువేనని చెప్పాలి. అది కూడా అల్లు అర్జున్ మీద, గీతా ఆర్ట్స్ మీద అభిమానంతో ఇచ్చిందే. ఈ సినిమాలో ఏదొ ఒకటి రెండు సీన్లలో తప్ప మిగిలిన సినిమాలో ఫీల్ ఉండదు. ఈ సినిమా చూడటం క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అనిపిస్తుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ సినిమా చూస్తామంటే మీ ఇష్టం. చూడండి.