Read more!

English | Telugu

సినిమా పేరు:విరూపాక్ష
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
Rating:3.00
విడుదలయిన తేది:Apr 21, 2023

సినిమా పేరు: విరూపాక్ష
తారాగణం: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, సాయి చంద్, అజయ్, బ్రహ్మాజీ, అభినవ్, శ్యామల, ఛత్రపతి శేఖర్ 
సంగీతం: అజ‌నీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: శాందత్ సాయినుద్దీన్ 
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్‌ డిజైనర్‌: నాగేంద్ర
స్క్రీన్‌ప్లే: సుకుమార్
దర్శకుడు:  కార్తీక్ దండు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ 
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2023

ఇటీవల ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా అంటే 'విరూపాక్ష' అని చెప్పొచ్చు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించడం, ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? రోడ్డు ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా ఆయనకు కొత్త ఉత్సాహాన్నిచ్చేలా ఉందా? వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుందా?...

కథ:
1970-80 ప్రాంతంలో రుద్రవనం అనే ఊరిలో పిల్లలు వరుసగా చనిపోతుంటారు. దానికి కారణం క్షుద్రపూజలు చేస్తున్న ఓ జంట అని భావించిన ఆ ఊరి ప్రజలు.. వారిని సజీవ దహనం చేస్తారు. మంటల్లో కాలిపోతూనే 'వచ్చే పుష్కరానికి  ఈ ఊరు స్మశానం అవుతుంది' అని శపించి కన్ను మూస్తుంది ఆ జంట. 12 ఏళ్ళ తర్వాత ఆ ఊరిలో జాతరకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. అదే సమయంలో ఊరిలో పాఠశాల నిర్మాణానికి తమ స్థలం రాసివ్వాలనే ఉద్దేశంతో.. దాదాపు 15 ఏళ్ళ తర్వాత తన తల్లితో కలిసి ఊరిలో అడుగుపెడతాడు సూర్య(సాయి ధరమ్ తేజ్). అక్కడి వచ్చాక ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్రప్రసాద్(రాజీవ్ కనకాల) కూతురు నందిని(సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు అమ్మవారి గుడిలో పూజకు ఏర్పాట్లు జరుగుతుండగా ఓ వ్యక్తి గర్భగుడిలో రక్తం కక్కుకొని చనిపోతాడు. దానిని అరిష్టంగా భావించిన ఆ ఊరి పెద్దలు.. ఎనిమిది రోజుల పాటు ఊరిని అష్టదిగ్బంధనం చేస్తారు. అయినప్పటికీ వరుస మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. చనిపోయిన వారిలో సూర్య సోదరి కూడా ఉంటుంది. అప్పటికే సోదరిని కోల్పోయిన సూర్య.. ప్రేయసిని కూడా పోగుట్టుకునే పరిస్థితి వస్తుంది. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది? ఆ మరణాల వెనకున్నది ఎవరు? ఆ మర్మాన్ని ఛేదించి తన ప్రేయసిని, ఆ ఊరిని సూర్య రక్షించగలిగాడా? అనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది అర్థమైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. సినిమా ప్రారంభమవ్వడమే క్షుద్రపూజలు, సజీవ దహనంతో ఆసక్తికరంగా మొదలైంది. 12 ఏళ్ళ తర్వాత ఆ ఊరిలో మళ్ళీ చావులు మొదలవుతున్నాయి అని తెలిపేలా నేరుగా కథలోకి వెళ్తూ దర్శకుడు చూపించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అయితే సూర్య-నందిని లవ్ ట్రాక్ అంతగా మెప్పించలేకపోయింది. వారి మధ్య ప్రేమ సన్నివేశాలు పక్కన పెడితే, ఫస్టాఫ్ లో ఎక్కడా టెంపో మిస్ అవ్వలేదు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తించేలా ప్రథమార్థం నడిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ మెప్పించింది. సెకండాఫ్ లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని కలిగించింది.

ద్వితీయార్థంలో తన ప్రేయసిని, ఊరిని కాపాడుకోవడం కోసం.. తన ప్రాణానికి ప్రమాదమని తెలిసి కూడా సూర్య ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశాలు మెప్పించాయి. ప్రధానంగా సెకండాఫ్ లో వచ్చే రెండు ట్విస్ట్ లు కట్టిపడేస్తాయి. ఇదంతా భైరవ అనే వ్యక్తి చేస్తున్నాడు అని తెలుసు. కానీ అసలు ఆ భైరవ ఎవరు?, ఎలా ఉంటాడో తెలిసి హీరోతో పాటు చూసే ఆడియన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతారు. ఇక ఆ భైరవ వెనుక మరొకరు ఉన్నారని తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు ఆడియన్స్ డబుల్ సర్ ప్రైజ్ అవుతారనడంలో సందేహం లేదు. ఆ ట్విస్ట్ లు ముందే తెలుసుకొని సినిమాకి వెళ్తే మాత్రం.. సినిమా అసలు కిక్ ఇవ్వదు. ప్రథమార్థంలో వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు, ద్వితీయార్థంలో ఒకరి అరా ల్యాగ్ సన్నివేశాలు తప్ప సినిమా అంతా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

అయితే ఈ సినిమా ద్వారా క్షుద్రపూజలు నిజంగానే ఉంటాయని చెప్పినట్లుగా ఉంది. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్. అలాగే కొన్ని సన్నివేశాలు సున్నిత మనస్కులు చూడలేకపోవచ్చు. ఆ విషయాలను పక్కనపెట్టి సినిమా పరంగా చూస్తే కథాకథనాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొదటి సినిమానే అయినప్పటికీ దర్శకుడిగా కార్తీక్ దండు తన ప్రతిభ చాటుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడి ప్రతిభ కనిపించింది. ప్రతి విభాగం నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు.

టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా చాలా గొప్పగా ఉంది. శాందత్ సాయినుద్దీన్ కెమెరా పనితనం కట్టిపడేసింది. ఇక అజ‌నీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సన్నివేశాలను తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లి, సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ఇక ప్రొడక్షన్‌ డిజైనర్‌ నాగేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జోనర్ కి తగ్గట్లుగా 1970-90 నాటి వాతావరణాన్ని అద్భుతంగా సృష్టించారు. నవీన్ నూలి కూర్పు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
తన ప్రేయసిని, ఊరి ప్రజలను కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సూర్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఆకట్టుకున్నారు. ఆ పాత్రకు ఏం కావాలో అది చేశాడు. ఇక సంయుక్త మీనన్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. నందిని పాత్రలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నటనతో కట్టిపడేసింది. నందిని తండ్రిగా ఊరి సర్పంచ్ పాత్రలో రాజీవ్ కనకాల చక్కగా రాణించారు. పూజారిగా సాయి చంద్‌ ఆ పాత్రకు నిండుతనం తీసుకొచ్చారు. అఘోరగా అజయ్ మెప్పించారు. ఊరి పెద్ద అబ్బాయిరాజు పాత్రలో సునీల్ కనిపించారు. అయితే ఆ పాత్ర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బ్రహ్మాజీ, అభినవ్, శ్యామల, ఛత్రపతి శేఖర్ తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ సినిమా క్షుద్రపూజలు నిజంగానే ఉన్నాయనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని పక్కనపెట్టి సినిమాని సినిమాలా చూస్తే మాత్రం కథాకథనాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

-గంగసాని