Read more!

English | Telugu

సినిమా పేరు:విమానం
బ్యానర్:జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్
Rating:3.00
విడుదలయిన తేది:Jun 9, 2023

సినిమా పేరు: విమానం
తారాగణం: సముద్రఖని, అనసూయ భరధ్వాజ్, మీరా జాస్మిన్, మాస్ట‌ర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్ర‌న్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రాఫర్: వివేక్ కాలేపు
ఆర్ట్ : జె.జె. మూర్తి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
మాటలు: హ‌ను రావూరి
రచన, దర్శకత్వం: శివ ప్ర‌సాద్ యానాల
నిర్మాత: కిర‌ణ్‌ కొర్ర‌పాటి
బ్యానర్స్: జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్
విడుదల తేదీ: జూన్ 9, 2023 

కొన్ని చిన్న సినిమాలు ట్రైలర్ తోనే ఈ సినిమాలో ఏదో విషయం ఉంది అనుకునేలా చేస్తాయి. ఇటీవల 'విమానం' సినిమా ట్రైలర్ అలాంటి అభిప్రాయాన్నే కలిగించింది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ వంటి బాగా తెలిసిన నటీనటులు ఉండటం, జీ స్టూడియోస్‌ నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ చిత్రం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ 'విమానం' సినిమా ఎలా ఉంది? నిజంగానే వెండితెర మీద మ్యాజిక్ చేసేలా ఉందా?..

కథ:
పేద కుటుంబంలో పుట్టిన పదేళ్ల పిల్లాడు రాజు(ధృవన్)కి విమానం అంటే చాలా ఇష్టం. పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు విమానం గురించే ఉంటాయి. స్కూల్ కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గాలిలో ఎగురుతున్న విమానాలను చూసి సంబరపడుతుంటాడు. ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలలు కంటుంటాడు. పెద్దయ్యాక ఏమవుతావని ఎవరైనా అడిగితే పైలట్ అవుతానని చెప్పేవాడు. రాజు తండ్రి వీరయ్య(సముద్రఖని) పేదవాడు, వికలాంగుడు అయినప్పటికీ ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం గలవాడు. బస్తీలో సులభ్ కాంప్లెక్స్ ను నడిపిస్తూ ఆ వచ్చే కొంచెం డబ్బులతోనే తల్లిలేని తన పిల్లాడు రాజుని అల్లారుముద్దుగా పెంచుతుంటాడు. రాజుని బాగా చదివించి, గొప్పవాడిని చేయాలి అనుకుంటాడు. రాజు కూడా పైలట్ అవ్వాలనే లక్ష్యంతో బాగా చదువుతుంటాడు. పరీక్ష రాసి సైనిక్ స్కూల్ లో సీటు కూడా సంపాదిస్తాడు. ఇక రాజు చదువుకి ఢోకా లేదు, అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో ఊహించని కష్టం ఎదురవుతుంది. రాజు ఎక్కువరోజులు బ్రతకడని తెలుస్తుంది. అప్పటిదాకా తన కొడుకు బాగా బతకాలని కోరుకున్న వీరయ్యకు, ఇప్పుడు కొడుకు బతికుంటే చాలు అనుకునే పరిస్థితి ఎదురైంది. తన కొడుకుని బ్రతికించుకోవడం తన చేతుల్లో లేదని తెలుసుకున్న వీరయ్య.. కనీసం విమానం ఎక్కాలి అనుకునే తన కొడుకు చివరి కోరిక తీర్చాలి అనుకుంటాడు. కానీ చిల్లర తప్ప నోట్లు ఎరుగని వీరయ్యకి విమాన టికెట్లు కొనడం అనేది తలకు మించిన భారం. ఆ డబ్బుల కోసం అతను చేయని ప్రయత్నాలు ఉండవు. ఈ క్రమంలో అతనికి మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. ఓ వైపు రాజు ఎన్నిరోజులు బ్రతుకుతాడో తెలీదు, మరోవైపు వీరయ్య దగ్గర డబ్బుల్లేవు. మరి విమానం ఎక్కాలనే రాజు కోరికను వీరయ్య తీర్చాడా? పదేళ్ల కొడుకు విమాన ప్రయాణం కోసం ఓ పేద తండ్రి సాగించిన విషాద ప్రయాణం ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

'పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.. పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పే' అంటుంటారు. తన లాగా తన కొడుకు ఈ పేదరికంలో, కష్టాలలో ఉండకూడదు.. చదివించి గొప్పవాడిని చేయాలనుకునే ఓ తండ్రి కథ ఇది. అయితే తమకు ఆస్తే కాదు, తన కొడుక్కి ఆయుష్షు కూడా తక్కువే అని తెలిశాక.. విమానం ఎక్కాలన్న తన కొడుకు పెద్ద కలని నెరవేర్చడానికి ఆ తండ్రి పడే తపన, వేదన ఈ కథ. చచ్చేలోపు సాధించాలి అంటారు.. కానీ చస్తామని తెలిసి కూడా సాధించడానికి ప్రయత్నించేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లా మారడానికి స్ఫూర్తి నింపే కథే ఇది. దర్శకుడు శివ ప్ర‌సాద్ యానాల ఎంచుకున్న కథాంశం, కథని నడిపించిన తీరు ఆకట్టుకున్నాయి.

ఈ విమానం సినిమా కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో అద్భుతంగా నడిచింది. ఎప్పుడు విమానం గురించే ఆలోచిస్తూ, రాజు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు అలరిస్తాయి. ఓ వైపు రాజుకి విమానం అంటే పిచ్చి, మరోవైపు వీరయ్యకి కొడుకు రాజు అంటే ప్రేమ అని తెలిపేలా వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. అలాగే ఆటో డ్రైవర్ గా ధనరాజ్, శరీరాన్ని అమ్ముకొని జీవించే సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ, సుమతిని ప్రేమించే చెప్పులు కొట్టుకునే కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించారు. అయితే ఈ పాత్రలు వినోదాన్ని పంచుతూ కథలో భాగంగానే ఉంటాయి కానీ, కథ ఫ్లోని డిస్టర్బ్ చేసేలా ఉండవు. ధనరాజ్ కి, అతని కొడుక్కి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. అలాగే సుమతి-కోటి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఎంతగానో నవ్విస్తాయి. చివరిలో కంటతడి కూడా పెట్టిస్తాయి. కొడుకు కోసం వీరయ్య సాగించే ప్రయాణంలో ఈ పాత్రలు అవసరమైన మేర భాగమవుతాయి.

ప్రథమార్థం చాలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ముందు ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా, అక్కడక్కడా సినిమాటిక్ గా అనిపించినా.. మనకు తెలియకుండానే చిన్నగా కథలోని ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతాం. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు కంటతడి పెట్టిస్తుంది. ఇది పెద్ద కథ కాదు, ఊహించని మలుపులు ఉండవు. చిన్నదైనా ఓ మంచి పాయింట్ ని తీసుకొని.. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో అందంగా మలిచాడు దర్శకుడు. భావోద్వేగ సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడం అంత తేలిక కాదు. కానీ ఆ విషయంలో దర్శకుడికి మంచి మార్కులు పడ్డాయి. సున్నితమైన భావోద్వేగాలను మనసుకి హత్తుకునేలా తెరకెక్కించాడు.

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లాడు. భావోద్వేగాలు అంతగా పలకడంలో చరణ్ అర్జున్ సంగీతం కీలక పాత్ర పోషించింది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్లుగా సినిమాటోగ్రాఫర్ వివేక్ కాలేపు సన్నివేశాలను కెమెరాలో చక్కగా బంధించాడు. సన్నివేశాల్లో కనిపించిన సహజత్వం వివేక్ కాలేపు కెమెరా పనితనాన్ని, జె.జె. మూర్తి ఆర్ట్ వర్క్ ని తెలియజేసేలా ఉంది. మార్తాండ్ కె. వెంకటేష్ కూర్పు చక్కగా కుదిరింది. తన సీనియారిటీతో సినిమాని బాగా ప్రజెంట్ చేశారు. హ‌ను రావూరి సంభాషణలు బాగున్నాయి. "అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్న అంటారు" వంటి హత్తుకునే సంభాషణలు సినిమాలో ఎన్నో ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకి అవసరమైన మేర ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
పదేళ్ల కొడుకు చివరి కోరిక తీర్చడానికి తపన పడే, వేదన పడే ఓ పేద తండ్రి పాత్రలో సముద్రఖని ఒదిగిపోయారు. భావోద్వేగాలను చక్కగా పలికించి, సినిమాకి కీలకమైన పాత్రకి పూర్తి న్యాయం చేసి, సినిమాని నిలబెట్టారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఆయన నటన కంటతడి పెట్టించేలా ఉంది. విమానం ఎక్కాలని కలలు కనే రాజు పాత్రలో మాస్టర్ ధృవన్ ఆకట్టుకున్నాడు. ముఖంలో, మాటల్లో అమాయకత్వాన్ని పలికిస్తూ పాత్రకి అవసరమైన ఎమోషన్ ని తీసుకురాగలిగాడు. సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఆహార్యం, హావభావాలతో పాత్రలో లీనమైనట్లు అనిపించింది. వేశ్యని ఇష్టపడుతూ ఆమెతో గడపాలని, ఆమెని పెళ్లి చేసుకోవాలని కలలు కనే కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ రాణించాడు. ఆటో డ్రైవర్ గా ధనరాజ్, ఫోటోగ్రాఫర్ గా రాజేంద్ర‌న్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. అతిథి పాత్రలో మీరా జాస్మిన్ కాసేపే కనిపించినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేసింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మొదటిసారి విమాన ప్రయాణం కొత్త అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ విమాన ప్రయాణం కొన్ని నవ్వులతో, కొన్ని కన్నీళ్లతో ఎంతో అందంగా సాగుతుంది. పెద్ద కథ, భారీతనం, ఊహించని మలుపులు లేకపోయినా.. సున్నితమైన భావోద్వేగాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. 

 

-గంగసాని