Read more!

English | Telugu

సినిమా పేరు:వెంగమాంబ
బ్యానర్:వి.యమ్. సి. ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 17, 2009
తరిగొండ వేంగమాంబ కథ ఈ చిత్రం యొక్క ఇతివృత్తం. అన్నమయ్య మేలుకొలుపుతో మేలుకొనే శ్రీ వేంకటేశ్వరస్వామి, తరిగొండ వేంగమాంబ ముత్యాల హారతితో దినచర్య ముగిస్తాడు. ఈ ముత్యాల హారతి అనంతరం ఎవరికీ దర్శనముండదు. తరిగొండలో కానాల కృష్ణయ్య, మంగమ్మ (సుధ) దంపతులకు వేంగమాంబ జన్మిస్తుంది. పసితనం నుండే ఆ వేంకటా చలపతిని భర్తగా భావించేది వేంగమాంబ. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఒక చక్కని యువకుణ్ణి చూసి వివాహం జరిపిస్తారు. కానీ శోభనం రోజున అతనికి వేంగమాంబ ఆదిశక్తిలా కనిపిస్తుంది. శోభనం ఆగిపోతుంది. ఆ యువకుడికి వేరే పెళ్ళి చేయాలని ఆలోచిస్తారు. అందుకు వేంగమాంబ అంగీకరించదు. ఆ యువకుడిని పాము కరుస్తుంది. అతను చనిపోయేటప్పుడు వేంగమాంబను విధవగా మార్చ వద్దని తన తండ్రి వద్ద మాట తీసుకుని చనిపోతాడు. అక్కడి అగ్రహారీకులు ఆమెను విధవను చేయాల్సిందేనని పట్టుబడతారు. కానీ వేంగమాంబ అందుకు అంగీకరించదు. ఆమె చదువుకొనేందుకు మదనపల్లికి వేళుతుంది. చదువు పూర్తిచేసుకుని ఊరికి తిరిగి వచ్చిన వేంగమాంబ నృసింహ శతకాన్ని వ్రాయటానికి ఉపక్రమిస్తుంది. ఆ శతకాన్ని కాల్చటానికి ప్రయత్నించిన వేంగమాంబ మేనత్త నారాయణమ్మ కూతురు వళ్ళంతా మంటలు పుట్టటంతో నారాయణమ్మ వేంగమాంబను క్షమించమని వేడుకుంటుంది. తరిగొండకు వచ్చిన ఒక పీఠాధిపతి వేంగమాంబను ప్రశ్నించాలనుకుంటాడు. కానీ ఆమె మహత్తుని కళ్ళారా చూసిన ఆ పిఠాధిపతి ఆమెను క్షమించమని అడుగుతాడు. ఒక ముస్లిమ్ మతస్తుడికి దాహమేస్తే గుళ్ళోని మంచి నీళ్ళను అతనికిచ్చి అతని దాహార్తిని నివారిస్తుంది వేంగమాంబ. దాంతో ఆ ఊరి నుంచి వేమగమాంబను వెలి వేయాలంటారు కొందరు దుర్మార్గులు. అందుకు తానే ఆ ఊరిని వెలి వేస్తున్నానని వేంగమాంబ ఆ ఊరినుండి వెళ్ళి దూర్వాస మహర్షి తపస్సు చేసిన గుహలో తపస్సు చేస్తుంటుంది. ఆమెను అక్కడ సజీవ దహనం చేయటానికి ప్రయత్నిస్తారు దుర్మార్గులు. అందరూ వేంగమాంబ చనిపోయిందనుకుంటారు. కానీ వేంగమాంబ తిరుమలేశుని దర్శించుకునేమదుకు తిరుపతికి వస్తుంది. అక్కడ స్వామి వారికి వేంగమాంబ తులసి మాలను సమర్పిస్తుంది. కానీ అక్కడి పూజారి దీక్షితులు విధవ స్వామి వారికి తులసి మాలను సమర్పిమచటమా అని ఆ మాలను దూరంగా పారేస్తాడు.కానీ స్వామి ఆ తులసి మాలను ధరించి వేంగమాంబకు కనిపిస్తాడు. దాంతో నగలు కాజేసిందన్న నెపంతో వేంగమాంబను స్వామివారి నుంచి దూరం చేస్తారు. కానీ వేంగమాంబ చేసే తులసి మాల ప్రతి రోజూ స్వామివారి మేడలో ఉంటుంది. వేసిన తలుపులు వేసినట్టుండగానే తులసి మాలను ఎవరు స్వామివారి మెడలో వేస్తున్నారని కనిపెట్టటానికి మహంతు కాపలా కాస్తే వేంగమాంబే తులసి మాలను శ్రీవారి మేడలో వేయటం గమనించి ఆమెను తిరుపతికి తిరిగి రప్పిస్తారు. అక్కడ ఆమె శ్రీవారిని స్తుతిస్తూ అన్నమయ్యలా కీర్తనలు రచిస్తుంది. వాటిని శ్రీవారికి అంకితమిచ్చి ఆయనలో ఐక్యమైపోతుంది. ఇది క్లుప్తంగా ఈ చిత్ర కథ.
ఎనాలసిస్ :
సీరియల్స్ తీయటంలో 70కి పై చిలుకు నంది బహుమతులు సంపాదించుకున్న అపార అనుభవజ్ఞుడైన దర్శకుడు ఉదయభాస్కర్‌‍‍. అయినా సీరియల్‍ తీయటానికీ సినిమా తీయటానికీ చిన్న తేడా ఉంది. ఇదే వెంగమాంబ కథను 52 ఎపిసోడ్ల సీరియల్‍ గా తీసిన అనుభవముంది. మొత్తంగా ఈ సినిమాని బాగానే నడిపించినా, టి.వి.సీరియల్‍ నటీనటులతో ఈ సినిమాని నింపే సరికి ఇది ప్రేక్షకుల్లో టి.వి.సీరియల్‍ అనే భావననే కలిగించే ప్రమాదముంది. కొన్ని సీన్లు ముఖ్యంగా వేంగమాంబను దేవుడి గదిలోకి అడుగుపెట్టవద్దని తల్లి ఆన పెట్టే సీన్లోనూ, వేంగమాంబ భర్త చనిపోయిన సీన్లో వేంగమాంబను విధవ (విగత జీవుడైన ధవుడు కలది)ను చేయవద్దని సుబ్బరాయశర్మ శరత్ కుమానర్‌ని బ్రతిమాలే సీన్ లోనూ, పీఠాధిపతికి వేంగమాంబ నమస్కరించే సీన్లోనూ సెంటిమెంట్‍ బాగా పండింది. ఇలా చాలా సీన్లలో మనసు చెమ్మగిల్లుతుంది. ఈ సినిమా దర్శకుణ్ణి అన్నమయ్య చిత్రం బాగా ప్రభావితం చేసింది.అందుకుదాహరణలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. కానీ రాఘవేంద్రరావుకీ, ఉదయభాస్కర్‌కీ ఉన్న తేడా అక్కడ కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ చిత్ర కథలో భర్త పోయిన భార్యను విధవను చేస్తే, భార్య పోయిన భర్తను ఎందుకు వేధవను చేయరని సమాజాన్ని వెంగమాంబ ప్రశ్నించటాన్ని బట్టి విధవా పునర్వివాహాలకు ఆద్యురాలు వెంగమాంబేననిపిస్తుంది. అంతటి సామాజిక విప్లవం కోసం పోరాడిన వెంగమాంబ చాలా గొప్ప వ్యక్తి
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: మీనా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక శ్రీనివాసుడుగా సాయికిరణ్‍ తన స్థాయికి మించి నటించాడు. చాలా బాగా నటించాడని చెప్పాలి. అతని ఆహార్యం కూడా ముచ్చటగా ఉంది. శరత్ బాబు, సుబ్బరాయశర్మ, రాగిణి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక విలన్‌గా అనంత్ ఏ మాత్రం సరిపోలేదు సరికదా, ఆ పాత్ర అతను పోషించటం కొంచెం ఎక్కువనిపించింది. ఇక దీక్షితులుగా అశోక్ కుమార్ నటన కృతకంగా ఉంది. అతను సీరియల్స్ లో ఎక్కువే కానీ సినిమాకి చాలా తక్కువ. సన శ్రీలక్ష్మి పాత్రకు సెట్‍ కాలేదనే చెప్పాలి. సుధ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.సంగీతం-: కీరవాణి సంగీతం బాగానే వుంది. ఈ చిత్రంలో 21 పాటలున్నా అది తెలియనంతగా ఈ చిత్రం లోని సంగీతం ఉంది. మామూలుగా ఆరు పాటలున్న సినిమాలో, పాట రాగానే సిగిరెట్‍ తాగటానికీ, టీ తాగటానికీ వేళ్ళే ప్రేక్షకులున్న ఈ రోజుల్లో, ఈ సినిమాలోని పాటలకు ఒక్క ప్రేక్షకుడు కూడా బయటకు వెళ్ళకపోవటం గమనార్హం. రీ-రికార్డింగ్ బాగుంది.కెమెరా-: చక్కగా ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్ కూడా బాగున్నాయి.ఎడిటింగ్-: బాగుందికొరియోగ్రఫీ-: ఫరవాలేదుఆర్ట్-: చాలా బాగుంది. శ్రీ వేంకటేశ్వరుని గుడి సెట్‍, కొన్ని మీనియేచర్ వర్కులూ బాగున్నాయి.ఇది ఒక ఆధ్యాత్మిక చిత్రమే కాక సామాజిక చిత్రం కూడా. గతంలో అన్నమయ్య చిత్రాన్ని నిర్మించిన దొరస్వామిరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. భక్తి భావన కలిగించే ఈ చిత్రం ఆనాటి మన సమాజంలోని సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతబింబించే చిత్రం కూడా. ఇది అందరూ తప్పక చూడాల్సిన చిత్రం