Read more!

English | Telugu

సినిమా పేరు:వేదం
బ్యానర్:ఆర్కా మీడియా
Rating:3.00
విడుదలయిన తేది:Jun 4, 2010
వివేక్ చక్రవర్తి (మనోజ్‍ కుమార్) మిలటరీ కుటుంబంలో పుడతాడు. అతని తల్లి అతను మిలటరీలో చేరితే చూడాలనుకుంటుంది. కానీ అతను రాక్ స్టార్ అవ్వాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో హైదరాబాద్‌లో ఒక లైవ్ ప్రోగ్రాం కి తన ట్రూప్‌తో బయలుదేరతాడు. ఫ్లైట్‍ మిస్సవడటంతో బై రోడ్ బయలుదేరతారు. కేబుల్‍ రాజు (బన్నీ) జూబ్లీ హిల్స్ లోని బస్తీలో కేబుల్‍ ఆపరేటర్‌గా ఉంటాడు. కానీ అతను తనో డబ్బున్న అబ్బాయిలా బిల్డప్ ఇస్తూ.... బాగా డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకు పెళ్ళి సమబంధం సెటిల్‍ చేయటానికి ఆమె తల్లి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ప్లాన్ చేస్తుంది. అక్కడికి రాజుని కూడా రమ్మంటుంది ఆ అమ్మాయి. అక్కడికి వెళ్ళాలంటే నలభైవేలు పెట్టి పాస్ లు కొనాలి. అది రాజు సమస్య. రత్తమ్మ కంపెనీలో అమలాపురం సరోజ వ్యభిచారం చేస్తుంది. రత్తమ్మ అయిదు వేలు వసూలు చేసి, సరోజకి వెయ్యి ఇస్తుంటుంది. అందుకని సరోజ అక్కణ్ణించి మకాం హైదరాబాద్‌కి ఎత్తెయటానికి సన్నాహాలు చేస్తుంది. సిరిసిల్లలోని రాములు (నాగరాజు)చేనేత కార్మికుడు, కోడలు (శరణ్య), మనవడు ఉంటారు. ఆ ఊరి పటేల్‍ వద్ద చేసిన అప్పుకి గాను చదువుకునే రాములు మనవణ్ణి తన ఇటుక బట్టీల దగ్గర పనికి పెట్టుకుంటాడు. తన మనవణ్ణి పటేల్‍ బారి నుండి కాపాడటానికి తన కోడలు కిడ్నీ అమ్మటానికి రాములు హైదరాబాద్ బయలుదేరతాడు. హైదరాబాద్‌లోని రహీముద్దీన్ ఖురేషి (మనోజ్‍ వాజ్‍పాయ్) తన భార్యతో వస్తూండగా గణేష్ ఊరేగింపులో జరిగిన గొడవ వల్ల అతని భార్యకు గర్భస్రావమవుతుంది. దాంతో అతను షార్జాకి వెళ్ళిపోవటానికి సన్నాహాలు చేస్తుంటాడు.
ఎనాలసిస్ :
ఇది అయిదు కథల సమాహారం. ఈ అయిదు కథలకు జీహాద్ బ్యాక్ డ్రాప్ కలిపిన ముగింపునిచ్చారు. "త్రీ ఇడియట్స్" వంటి సినిమాలు తెలుగులో లేరన్న మాటకు ఈ చిత్రం సమాధానం చెపుతుందని కీరవాణి అనటం ఈ చిత్రం ఎటువంటిదో చెపుతుంది. మంచు మనోజ్‍ కుమార్ ఈ చిత్రంలో అతిథి పాత్ర వంటి పాత్రలో నటించటం చెప్పుకోతగ్గ విశేషమయితే, కేబుల్‍ రాజు పాత్రలో అల్లు అర్జున్ నటించటం మరో విశేషం. ఇక్కడ పాత్రలే కనిపిస్తాయి గానీ పాత్రధారుల వ్యక్తిగత ఇమేజ్‍మనకు కనిపించకుండా దర్శకుడు క్రిష్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ అయిదు కథలను ఒకే సారి డీల్‍ చేయటం నిజానికి కత్తిమీద సాము వంటిది. అయినా దర్శకుడు సమర్థవంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే మీద మరింత శ్రద్ధ తీసుకునుంటే సినిమా మరింత బాగుండేది. ఓవరాల్‍ గా ఈ చిత్రం ఆసక్తికరంగానే ఉంటుంది. నటన -: ఇక నటీనటుల నటన విషయానికొస్తే అందరూ బాగా నటించారనే చెప్పాలి. మనోజ్‍ కుమార్ తన వరకూ తాను బాగానే చేశాడు. నిజానికి అతనికి ఆ పాత్రలో అంతకంటే చేయటానికేమీ లేదు. బన్నీ ఈ చిత్రంలో కొత్తగా నటించటానికి చాలా ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకూ సఫలీకృతుడయ్యాడు. ముఖ్యంగా బన్నీ తను డబ్బు దొంగిలించేందుకు రాములు వెంటపడినప్పుడూ, అలా దొంగిలించిన డబ్బుని తిరిగి రాములుకి అందజేసినప్పుడూ అల్లు అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. అనుష్క సరోజ పాత్రలో వీలయినంత బాగా నటించింది. కానీ ఆమె ఇంకా బాగా చేయగలదనిపించింది. మనోజ్‍ వాజ్‍పాయ్, రాములు పాత్రధారి, శరణ్య, రఘుబాబు తదితరులు తమ తమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు. సంగీతం -: కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నందించటమే కాకుండా, ఈ చిత్రంలో నాలుగు పాటలు వ్రాయటం విశేషం. పాటల్లో సాహిత్యం, సంగీతం ఆ యా సందర్భాలకు తగ్గట్టు చక్కగా కుదిరాయి. వీటికన్నా ముఖ్యంగా ఈ చిత్రంలో చెప్పుకోవాల్సింది రీ-రికార్డింగ్ గురించి. బన్నీ తను డబ్బు దొంగిలించేందుకు రాములు వెంటపడినప్పుడూ, అలా దొంగిలించిన డబ్బుని తిరిగి రాములుకి అందజేసినప్పుడూ రీరికార్డింగా కొత్తగా వినిపించి చాలా బాగుంది. మాటలు -: "ఇల్లు కట్టేవాడికి ఇల్లు వుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులు వుండవు... అలాగే బట్టలు నేసేవాడికి బట్టలు వుండవు''...... "మనిషి నకిలీ నోట్లను తయారు చేస్తాడు... నోట్లు మాత్రం నకిలీ మనుషులను తయారు చేస్తున్నాయి''.... "తెలుగులో నీళ్ళు.... ఇంగ్లీష్‌లో వాటర్‌.... హిందీలో పానీ... వాటి భాషా బేధాలు తప్ప భావం ఒక్కటే... పైనుంనోడిని ఏ పేరుతో పిలవాలనే విషయంలో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు కానీ... నిజానికి అక్కడ వుంది మాత్రం ఒక్కడే'' వంటి డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కెమెరా -: ఈ సినిమాని చక్కగా చూపించటంలో కెమేరా పనితనం బాగున్నా, అక్కడక్కడా కొన్ని సీన్లలో రెడ్ టింట్‍ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అలా కావాలని చేసినా, అనుకోకుండా జరిగినా అది కాస్త ఎబ్బెట్టుగానే ఉంది. మొత్తానికి కెమెరా వర్క్ ఫరవాలేదు బాగుంది. ఎడిటింగ్ -: నీట్‍ గా ఉంది. క్రిస్ప్ గా కట్‍ చేశారు. కొరియోగ్రఫీ -: అన్ని పాటల్లోనూ కొత్తగా చూపించే గట్టి ప్రయత్నమే చేశారు. ఒ.కె. బాగుంది. యాక్షన్ -: రియలిస్టిక్ గా ఉండేలా యాక్షన్ సీన్లు కంపోజ్‍ చేశారు. ఆ ప్రయత్నం బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
"గమ్యం" వంటి సూపర్ హిట్‍ చిత్రం అందించిన క్రిష్ నుండి వచ్చిన రెండవ చిత్రం కనుక ఈ చిత్రం మీద ప్రేక్షకులకు భారీ అంచనాలుండటం సహజం. ఆ అంచనాలను క్రిష్ ఎంతవరకూ రీచయ్యాడన్నది రెండు వారాలాగితే గానీ చెప్పలేం. ఎందుకంటే... ఈ సినిమాలో వున్న హీరోలు చనిపోవడం... హీరోయిన్‌ పచ్చి వేశ్యలాగా ఓ సందర్భంలో పోలీస్‌తో మాట్లాడుతూ.... "పది సార్లు పడుకోమన్నా నేను పడుకుంటాను'' అనే డైలాగ్‌ని అనడం మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు జీర్ణించుకుంటారనేది చెప్పడం చాలా కష్టం. అయినా ఒక కొత్త ప్రయత్నం చేసిన క్రిష్ ని అభినందించాలి. రొటీన్ కు భిన్నంగా విభిన్న తరహా చిత్రం చూడాలనుకుంటే ఈ చిత్రాన్నిఓసారి చూడొచ్చు.