Read more!

English | Telugu

సినిమా పేరు:ఉగ్రం
బ్యానర్:షైన్‌ స్క్రీన్స్
Rating:2.50
విడుదలయిన తేది:May 5, 2023

సినిమా పేరు: ఉగ్రం
తారాగణం: అల్లరి నరేష్, మిర్నా మీనన్
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
కథ: తూమ్ వెంకట్
మాటలు: అబ్బూరి రవి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్‌ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది
బ్యానర్: షైన్‌ స్క్రీన్స్
విడుదల తేదీ: మే 5, 2023

ఒకప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. 'నాంది' నుంచి రూట్ మార్చి సీరియస్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన 'నాంది' చిత్రం నరేష్ కి నటుడిగా మంచి పేరు తీసుకురావడంతో పాటు, మంచి విజయాన్ని కూడా అందించింది. ఇప్పుడు వీరి కలయికలో రెండో సినిమాగా 'ఉగ్రం' రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర పోషించాడు. టీజర్, ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీరియస్ పోలీస్ రోల్ లో నరేష్ ఎలా ఉన్నాడు? నాంది కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నరేష్ కి మరో విజయాన్ని అందించేలా ఉందా?...

కథ:

శివ కుమార్(నరేష్) నిజాయితీ గల పోలీస్.. ఆవేశ పరుడు. ఎస్ఐ ట్రైనింగ్ సమయంలో అపర్ణ(మిర్నా మీనన్)ను ప్రేమిస్తాడు. ఇద్దరు మూడేళ్ళ పాటు ప్రేమించుకొని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటారు. ఎలాంటి సమస్యలు లేకుండా కొన్నేళ్లు గడిచిపోతాయి. శివ ఎస్ఐ నుంచి సీఐ గా ప్రమోట్ అవుతాడు. వారికి లక్కీ అనే ఐదేళ్ల పాప ఉంటుంది. శివ డ్యూటీలో పడి ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడనే కంప్లైంట్ తప్ప.. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముగ్గురూ హ్యాపీగా ఉంటారు. అయితే ఒకసారి శివ కారణంగా జైలుకి వెళ్లిన కొందరు వ్యక్తులు.. ఇంటికొచ్చి అపర్ణతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. దీంతో ఎంతో మనస్తాపం చెందిన అపర్ణ, తన కూతురిని తీసుకొని పుట్టింటికి బయల్దేరుతుంది. శివ వారిని కారులో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత తీవ్ర గాయాలతో శివ ఆస్పత్రి పాలవుతాడు. అపర్ణ, లక్కీ మాత్రం మిస్ అవుతారు. వారిద్దరే కాదు.. సిటీలో ఎందరో అలా కనపడకుండా పోతారు. అసలు ఆ కిడ్నాప్ ల వెనకుంది ఎవరు? కిడ్నాప్ చేసిన మనుషుల్ని ఏం చేస్తున్నారు? ఆ కిడ్నాపర్లు ఎవరో కనిపెట్టి, వారి నుండి తన భార్య పాపతో పాటు మిగతా వారిని శివ రక్షించగలిడగా? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

దర్శకుడు విజయ్, 'నాంది' మాదిరిగానే ఈ సినిమా కోసం కూడా ఓ సీరియస్ కథను ఎంచుకున్నాడు. నాందికి కథ అందించిన తూమ్ వెంకట్ నే ఈ చిత్రానికి కూడా కథ అందించాడు. వారు ఎంచుకున్న కథాంశం బాగుంది. అయితే దానికి సరైన రూపం ఇవ్వలేకపోయారు. సినిమా ఎంతో ఇంటెన్స్ తో స్టార్ట్ అవుతుంది. కానీ కాసేపటికే గాడి తప్పుతుంది. రాత్రి యాక్సిడెంట్ అవ్వడంతో తన భార్య, పాపని శివ ఆస్పత్రిలో చేర్పించడం.. ఉదయం లేచి చూసేసరికి ఇక్కడ అలాంటి పేషెంట్స్ ఎవరు లేరని ఆస్పత్రి వాళ్ళు చెప్పడంతో సినిమా ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. పోలీస్ గా నరేష్ ఇంట్రడక్షన్ కూడా ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత టెంపో మిస్ అయింది. సన్నివేశాలు సాదాసీదాగా సాగిపోయాయి. ఫ్యామిలీ డ్రామా పండలేదు. ఫ్యామిలీ సన్నివేశాలు బోర్ కొట్టించేలా ఉన్నాయి. ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలే మెప్పించాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలను వేధించేవారికి బుద్ధి చెప్పే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకున్నాయి.

మెయిన్ కథలోకి వెళ్ళడానికి దర్శకుడు విజయ్ చాలా సమయం తీసుకున్నాడు. ఫస్టాఫ్ లో కథని ముందుకి నడిపించడం కంటే హీరో పాత్రని ఎస్టాబ్లిష్ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అసలు కథ సెకండాఫ్ లోనే మొదలవుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభంలోనూ కాస్త తడబాటు కనిపించింది. ఈ సినిమాలో ఉన్నదే రెండు పాటలు. హీరో, హీరోయిన్ ల ప్రేమ కథను తెలిపేలా మొదటి పాట ఉంటుంది. అది ప్లేస్ మెంట్ బాగానే కుదిరింది. కానీ రెండో పాటనే పూర్తిగా రాంగ్ ప్లేస్ మెంట్. అసలు కథ ఇప్పుడే మొదలైంది, ఇక్కడి నుండి ఇంటెన్స్ గా సాగుతుంది అని ఆడియన్స్ అనుకునేలోపే.. ఎప్పుడో గోవా ట్రిప్ సాంగ్ సెకండాఫ్ లో రావడం ఫ్లోని డిస్టర్బ్ చేసేలా ఉంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తించేలా ఉండాలి. ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కొంతవరకు బాగానే ఉన్నా.. వాటిని మరింత బలంగా రాసుకొని ఉండాల్సింది. చివరి 30 నిమిషాలే సినిమా కాస్త వేగంగా నడిచింది. అయితే విలన్ పాత్రను చివరి 10-15 నిమిషాల పాటే చూపించడం, క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఏం లేకపోవడం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఎంచుకున్న కథ బాగున్నా ఆసక్తికరమైన కథనం తోడవ్వలేదు. పాటలు, యాక్షన్ సన్నివేశాల రూపంలో కమర్షియల్ హంగులు జోడించారు. సినిమాలో ఉన్న అన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బాగున్నప్పటికీ.. కేవలం యాక్షన్ సన్నివేశాలతోనే సినిమా నిలబడలేదు. ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠను రేకెత్తించగలగాలి, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి. ఆ విషయంలో ఉగ్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.

శ్రీచరణ్‌ పాకాల స్వరపరిచిన రెండు పాటలూ మెప్పించలేకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది. తన బీజీఎం తో కొన్ని కొన్ని సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. సిద్ధార్థ్ జె కెమెరా పనితనం బాగుంది. సన్నివేశాల మూడ్ కి తగ్గట్టుగా ఆయన ఫ్రేమింగ్, లైటింగ్ ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

కామెడీ పాత్రలతో నవ్వించడమే కాదు.. సీరియస్ పాత్రలు చేసి మెప్పించగలనని అల్లరి నరేష్ మరోసారి రుజువు చేశాడు. పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ పాత్రలో ఉన్న ఆవేశాన్ని చక్కగా ప్రదర్శించాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అదే ఇంటెన్స్ మైంటైన్ చేశాడు. యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఉగ్రరూపం చూపించాడు. మిర్నా మీనన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో తన మార్క్ చూపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో రాణించింది. లక్కీగా బేబీ ఊహ రెడ్డి తన బుజ్జి బుజ్జి మాటలతో ఆకట్టుకుంది. ఎస్ఐ గా శత్రు, డాక్టర్ గా ఇంద్రజ, అపర్ణ తండ్రిగా శరత్ లోహితస్వ పాత్రల పరిధి మేరకు రాణించారు. అపర్ణ తల్లిగా రూపలక్ష్మి జస్ట్ అలా కనిపించారు అంతే. ఆమె పాత్రకు డైలాగ్ లు కూడా లేవు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'నాంది' ద్వయం అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కలయికలో వచ్చిన 'ఉగ్రం' ఆ స్థాయి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగున్నా.. దానికి సరైన రూపం ఇవ్వలేకపోయాడు. నరేష్ నటన, కొన్ని పవర్ ఫుల్ సన్నివేశాల కోసం ఒక్కసారి చూడొచ్చు.

 

-గంగసాని