Read more!

English | Telugu

సినిమా పేరు:తెగింపు
బ్యానర్:బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 11, 2023

సినిమా పేరు: తెగింపు
తారాగణం: అజిత్, మంజు వారియర్, సముద్రఖని, జాన్ కొక్కెన్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
సంగీతం: ఘిబ్రాన్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
రచన, దర్శకత్వం: హెచ్. వినోద్
నిర్మాత: బోనీ కపూర్ 
బ్యానర్స్: బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్
విడుదల తేదీ: జనవరి 11, 2023

'నేర్కొండ పార్వై', 'వలిమై' తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'తునివు'. తెలుగులో 'తెగింపు' పేరుతో డబ్ అయింది. యాక్షన్ హేస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కిన 'తెగింపు' ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మరి అజిత్, వినోద్ కలయికలో మూడో సినిమాగా వచ్చిన 'తెగింపు' ఎలా ఉంది? అంచనాలను అందుకుందా?.

కథ:

వైజాగ్ లోని యువర్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో రూ.500 కోట్లు కొట్టేయాలని కొందరు ప్లాన్ చేస్తారు. పక్కా ప్లానింగ్ తో భారీ మారణాయుధాలతో బ్యాంక్ లోకి ఎంటర్ అవుతారు. అయితే డార్క్ డెవిల్(అజిత్) రాకతో వారి ప్లాన్ రివర్స్ అవుతుంది. వాళ్ళు వెళ్ళే సమయానికి అప్పటికే బ్యాంక్ లో ఉన్న డెవిల్.. ఆ గ్యాంగ్ పై ఎటాక్ చేసి.. వారిని, బ్యాంక్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. తాను 500 కోట్లు కోసం రాలేదని, వేల కోట్లు కోసం వచ్చానని చెప్పి షాకిస్తాడు. అసలు డార్క్ డెవిల్ ఎవరు? అతను బ్యాంక్ రాబరీ చేయడానికి కారణమేంటి? యువర్ బ్యాంక్ నే ఎందుకు టార్గెట్ చేశాడు? ఫైనల్ గా అతను అనుకున్నది సాధించగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

ఈ సినిమాలో మనీ హేస్ట్ వెబ్ సిరీస్ ఛాయలు కొద్దిగా కనిపిస్తాయి. అయితే దర్శకుడు వినోద్ కథాకథనాల కంటే కూడా హీరోయిజం మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. అది అభిమానులకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ.. సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానికితోడు సినిమా చూస్తున్నప్పుడు రెండో సినిమాలు మెదడులో మెదులుతాయి. ఫస్టాఫ్ లో 'బీస్ట్', సెకండాఫ్ లో 'సర్కారు వారి పాట' ఛాయలు కనిపిస్తాయి.

ఫస్టాఫ్ మొదలవ్వడం ఆసక్తికరంగానే మొదలవుతుంది కానీ బ్యాంక్ హైజాక్, పోలీసుల రౌండప్, మీడియా కవరేజ్ వంటి సన్నివేశాలతో సాదాసీదాగా సాగిపోతుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ సంభాషణలు కొంతమేర అలరిస్తాయి కానీ ఫస్టాఫ్ ని పూర్తిగా గట్టెంక్కించలేకపోయాయి. ఇంటర్వెల్ కి ముందు మాత్రం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఆసక్తికరంగా లేవు. సినిమా చివరి 30 నిమిషాలు మాత్రం బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా బ్యాంక్ చైర్మన్ తో లైవ్ షో వంటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే కొన్ని బ్యాంక్ చేస్తున్న మోసాలపై ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. కొన్ని కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదు.

అజిత్ ఇచ్చిన మూడో అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో వినోద్ విఫలమయ్యాడు. చేతిలో అజిత్ ఉన్నాడు కాబట్టి కథాకథనాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా.. హీరోయిజం, భారీ యాక్షన్ సన్నివేశాలతో చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసి, దానికి అజిత్ స్టార్డమ్ తోడైతే అప్పుడు సినిమా మరోస్థాయికి వెళ్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసుంటే బాగుండేది. అజిత్ స్క్రీన్ ప్రజెన్స్, నిరవ్ షా సినిమాటోగ్రఫి, ఘిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఎడిటర్ విజయ్ వేలుకుట్టి మరో పది నిమిషాల నిడివి తగ్గించవచ్చు. ముఖ్యంగా ఫ్లాష్ ఎపిసోడ్స్ ని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది.

నటీనటుల పనితీరు:

డార్క్ డెవిల్ గా అజిత్ ఆకట్టుకున్నాడు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన స్క్రీన్ ప్రజెన్స్, మ్యానరిజమ్స్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. మంజు వారియర్ కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. నిడివి తక్కువే అయినప్పటికీ సినిమాకి కీలకమైన పాత్ర ఆమెది. ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. సముద్రఖని, జాన్ కొక్కెన్ తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫస్టాఫ్ లో 'బీస్ట్', సెకండాఫ్ లో 'సర్కారు వారి పాట' ఛాయలతో ఉన్న 'తెగింపు' సినిమా ఆకట్టుకునేలా లేదు. అజిత్ ఫ్యాన్స్ ని, యాక్షన్ ప్రియులను కొంతవరకు అలరించవచ్చు.

-గంగసాని