Read more!

English | Telugu

సినిమా పేరు:థాంక్యూ
బ్యానర్:శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
Rating:2.50
విడుదలయిన తేది:Jul 22, 2022

సినిమా పేరు: థాంక్యూ
తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, రాశీ ఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌, సాయిసుశాంత్ రెడ్డి, ప్ర‌కాశ్ రాజ్‌, ఈశ్వ‌రీ రావు, సంప‌త్ రాజ్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌
క‌థ: బీవీయ‌స్ ర‌వి
డైలాగ్స్: వెంక‌ట్ డి. ప‌తి, మిథున్ చైత‌న్య‌
పాట‌లు: చంద్ర‌బోస్‌, అనంత శ్రీ‌రామ్‌, వ‌న‌మాలి, విశ్వా
మ్యూజిక్: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: పీసీ శ్రీ‌రామ్‌
ఎడిటింగ్: న‌వీన్ నూలి
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రామ్ కుమార్‌
ఫైట్స్: వెంక‌ట్‌
నిర్మాత‌లు: రాజు, శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ కె. కుమార్‌
బ్యాన‌ర్: శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
విడుద‌ల తేదీ: 22 జూలై 2022

'జోష్' మూవీతో నాగ‌చైత‌న్య‌ను హీరోగా మ‌న‌కు ప‌రిచ‌యం చేసిన దిల్ రాజు ఇన్నాళ్ల త‌ర్వాత అత‌నితో తీసిన రెండో సినిమా 'థాంక్యూ'. డెబ్యూ మూవీతో చైతూకు హిట్ ఇవ్వ‌లేక‌పోయిన ఆయ‌న ఈ సినిమాతో 'థాంక్యూ' చెప్పించుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేశారు. బీవీఎస్ ర‌వి ఇచ్చిన స్టోరీని సెల్యులాయిడ్ మీద‌కు తీసుకువ‌చ్చాడు విక్ర‌మ్ కుమార్‌. 'మ‌నం' లాంటి మ‌ర‌పురాని చిత్రం త‌ర్వాత చైతూతో ఆయ‌న చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే...

క‌థ‌:- అభిరామ్ అలియాస్ అభి (నాగ‌చైత‌న్య‌) ఉద్యోగం నిమిత్తం ఒక క‌న్స‌ల్టెన్సీ కంపెనీ ద్వారా అమెరికా వెళ్తాడు. అక్క‌డ మెడిక‌ల్‌కు సంబంధించిన 'వైద్య' అనే యాప్‌ను సొంతంగా డెవ‌ల‌ప్‌చేసి, అదే పేరుతో ఏర్ప‌డిన‌ కంపెనీకి సీఈఓ అవుతాడు. తాను అమెరికాకు వ‌చ్చిన‌ప్పుడు ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర త‌న‌ను రిసీవ్ చేసుకున్న ప్రియ (రాశీ ఖ‌న్నా)తో ప్రేమ‌లోప‌డి, ఆమెతో స‌హ‌జీవ‌నం చేస్తుంటాడు. అయితే విజ‌యంతో వ‌చ్చిన పొగ‌రు త‌ల‌కెక్కి త‌న ఎదుగుద‌ల‌కు తానొక్క‌డినే కార‌ణ‌మ‌నీ, ఇంకెవరికీ అందులో పాత్ర లేద‌నీ భావిస్తాడు. అత‌డి కార‌ణంగా ఒక ప్రాణం కూడా పోతుంది. పూర్తిగా స్వార్థ‌ప‌రుడిగా మారిపోయిన అత‌డిని చూసి బాధ‌పడ్డ‌ ప్రియ అత‌డ్ని వ‌దిలేసి వెళ్లిపోతుంది. అభి మ‌న‌స్సాక్షి అత‌డిని ప్ర‌శ్నిస్తుంది. అత‌డి స‌క్సెస్‌కు కార‌ణ‌మైన వాళ్ల‌ను గుర్తు చేస్తుంది. దాంతో ఒక్క‌సారి గ‌తం అత‌ని క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతుంది. రియ‌లైజ్ అయిన అత‌ను వాళ్ల‌కు థాంక్యూ చెప్ప‌డానికి, త‌న మూలాల్లోకి ఒక‌సారి తొంగిచూడ్డానికి ఇండియా వెళ్తాడు. ఇంత‌కీ అత‌డికి ఎదుగుద‌ల‌కు కార‌కులెవ‌రు? అత‌డి గ‌త‌మేంటి?  అభి, ప్రియ మ‌ళ్లీ క‌లుసుకున్నారా? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

మ‌న స‌క్సెస్‌కు కార‌కులైన‌వారినీ, మ‌న‌ల్ని ప్రోత్స‌హించిన‌వాళ్ల‌నీ మ‌ర‌చిపోకూడ‌ద‌నీ, వాళ్ల‌కు 'థాంక్యూ' చెప్పాల‌నే పాయింట్ ఈ క‌థ‌కు మూలం. కానీ క‌థలో కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. ఉద్యోగం కోసం అమెరికా వ‌చ్చిన అభిని ప్రియ రిసీవ్ చేసుకోవ‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం, క‌న్స‌ల్టెంట్ (ప్ర‌కాశ్‌రాజ్‌)ను కాద‌ని, అభి సొంతంగా వైద్య అనే యాప్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం, ఆ పేరుతో ఏర్ప‌డిన కంపెనీకి సీఈవో అయ్యాక అది కేవ‌లం త‌న ఒక్క‌డివ‌ల్లే సాధ్య‌ప‌డింద‌నీ, ఇంకెవ‌రికీ అందులో పాత్ర‌లేద‌నే అహం త‌లకెక్క‌డం, క‌న్స‌ల్టెంట్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటే, అత‌డికి సాయం చేయ‌మ‌న్న ప్రియ‌తో అత‌డికి వినిపించేట్లు కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌టం, క‌న్స‌ల్టెంట్ చ‌నిపోవ‌డం, ప్రెగ్నెంట్‌ అయిన ప్రియ ఆ విష‌యం అభికి చెప్ప‌కుండానే అత‌డిని వ‌దిలేసి వెళ్లిపోవ‌డం.. ఇదంతా మొద‌టి అర‌గంట‌లో జ‌రిగే తంతు. ఈ సీన్ల‌న్నీ చాలా ఫ్లాట్‌గా క‌నిపిస్తాయి. మ‌నం అభితో అస‌లు క‌నెక్ట్ కాలేం. 

మ‌న‌లో అస‌హ‌నం మొద‌ల‌య్యాక‌, అప్పుడు అభి త‌న మూలాల‌ను గుర్తుచేసుకోవ‌డంతో క‌థ నారాయ‌ణ‌పురంకు వెళ్తుంది. అక్క‌డ ఊరికి పెద్ద‌లాంటి నారాయ‌ణ‌రావు (సంప‌త్‌ రాజ్‌) కూతురు పార్వ‌తి (మాళ‌వికా నాయ‌ర్‌)తో అత‌డు ప్రేమ‌లో ప‌డే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. నారాయ‌ణ‌పురంనూ, పార్వ‌తినీ వ‌దిలి వెళ్లిపోయే స‌న్నివేశాలు మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. అత‌డికి క‌ర్త‌వ్యాన్ని బోధించేదీ, త‌న ప్రేమ‌ను త్యాగం చేసేదీ పార్వ‌తి. ఆమె పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా మ‌లిచాడు. ఆ త‌ర్వాత క‌థ వైజాగ్‌కు మ‌ళ్లుతుంది. అక్క‌డ కాలేజీలో ఎమ్మెల్యే కొడుకు శ‌ర్వా (సాయిసుశాంత్ రెడ్డి)తో అత‌డికి శ‌త్రువు అవుతాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వైరం పెరుగుతూ వ‌చ్చే స‌న్నివేశాల‌ను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా మ‌ల‌చి ఉండాల్సింది. ఆ ఇద్ద‌రి గొడ‌వ‌ల‌కు సంబంధించిన ఎపిసోడ్‌ను ట్రిమ్ చేయాల్సింది. 

ఆ ఇద్ద‌రూ మ‌హేశ్ ఫ్యాన్స్‌. 'పోకిరి' సినిమా రిలీజైన‌ప్పుడు పెద్ద క‌టౌట్ ఏర్పాటు చేసే విష‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు బాగానే ఉన్నాయి. అలాగే శ‌ర్వా చెల్లెలు చిన్ను (అవికా గోర్‌)తో అభికి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఏర్ప‌డే స‌న్నివేశాలు కూడా బాగానే వ‌చ్చాయి. పార్వ‌తి, చిన్నుల‌ను అభి క‌లుసుకొనే స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. క్లైమాక్స్ మ‌న ఊహ‌ల‌కు త‌గ్గ‌ట్లే ఉంటుంది. సినిమాకు సంబంధించిన ప్ర‌ధాన‌మైన మైన‌స్ పాయింట్‌.. అభి పాత్ర‌తో మ‌నం స‌హానుభూతి చెందే బ‌ల‌మైన స‌న్నివేశాలు రెండు మూడు కంటే ఎక్కువ లేక‌పోవ‌డం. అభి త‌న మూలాల్లోకి ప్ర‌యాణం చేస్తుంటే.. 'మ‌హ‌ర్షి' మూవీ గుర్తుకు రావ‌డం మ‌న త‌ప్పు కాదు.

టెక్నిక‌ల్‌గా మాత్రం 'థాంక్యూ' ఉన్న‌త స్థాయిలో ఉంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ పీసీ శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్‌. వింట‌ర్‌లో అమెరికా అందాల్ని ఆయ‌న కెమెరా బాగా క్యాప్చ‌ర్ చేసింది. అలాగే నారాయ‌ణ‌పురం గ్రామంలో అభి-పారు మ‌ధ్య ప్రేమాయ‌ణంను హృద్యంగా మ‌న ముందు ప్రెజెంట్ చేసింది. త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకో ప్ల‌స్ పాయింట్. పాట‌లు క‌థ‌తో పాటు ట్రావెల్ చేస్తాయి. పైకి 2 గంట‌ల 9 నిమిషాల నిడివి ఉన్న సినిమా అయినా, ల్యాగ్ అనిపించిందంటే.. అది మొద‌టి అర‌గంట సినిమా, త‌ర్వాత వైజాగ్‌లో అభి-శ‌ర్వా మ‌ధ్య గొడ‌వ‌ల‌కు సంబంధించిన ఎపిసోడ్ వ‌ల్లే. 

న‌టీన‌టుల ప‌నితీరు:- అభిరామ్‌గా నాగ‌చైత‌న్య మ‌రోసారి ఇంప్రెస్ చేశాడు. మ‌జిలీ మూవీ నుంచి న‌టునిగా అత‌ను మ‌రో స్థాయిలో క‌నిపిస్తున్నాడు. మూడు పార్శ్వాల పాత్ర‌ను ఎంతో ఈజ్‌తో చేశాడు. నారాయ‌ణ‌పురంలో 18 సంవ‌త్స‌రాల టీనేజ్ బాయ్‌గా అత‌డి లుక్ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. ఆ వ‌య‌సు కుర్రాడిలానే ఉన్నాడ‌త‌ను. 35 ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చిన వ్య‌క్తిగా ఎంతో మెచ్యూర్డ్ ప‌ర్ఫార్మెన్స్ చూపించాడు. హీరోయిన్ల‌లో పార్వ‌తిగా న‌టించిన మాళ‌వికా నాయ‌ర్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వాలి. నిడివి త‌క్కువ అయినా ఆ క్యారెక్ట‌ర్‌లో గొప్ప‌గా రాణించి, ఇంప్రెస్ చేసింది. రాశీ ఖ‌న్నా చేసిన ప్రియ పాత్ర 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' మూవీలోని యామిని క్యారెక్ట‌ర్‌కు కొన‌సాగింపులా అనిపించింది. ప‌రిధుల మేర‌కు న‌టించింది. చిన్నుగా అవికా గోర్ స‌రిగ్గా స‌రిపోయింది. శ‌ర్వా పాత్ర‌లో సాయిసుశాంత్ రెడ్డి ఆక‌ట్టుకున్నాడు. ఈ మూవీ త‌ర్వాత అత‌నికి మ‌రిన్ని మంచి పాత్ర‌లు వ‌స్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ప్ర‌కాశ్‌రాజ్‌, ఈశ్వ‌రీ రావు, సంప‌త్ రాజ్ త‌మ పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. పార్వ‌తి భ‌ర్త‌గా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ క‌నిపించాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నిడివి త‌క్కువే అయినా, మ‌న‌సుని హ‌త్తుకొనే స‌న్నివేశాలు బ‌హు త‌క్కువ‌గా, ల్యాగ్ అనిపించే స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్న మూవీ 'థాంక్యూ'. దానివ‌ల్లే ఓ ఫీల్ గుడ్ ఫిల్మ్‌గా మ‌న మ‌న‌సుల్ని గెలుచుకొనే ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. క‌థ న‌డిచే తీరు వ‌ల్ల యూత్‌ను ఎట్రాక్ట్ చేయ‌డం క‌ష్టం. ఫ్యామిలీ ఆడియెన్సే ఈ సినిమాను గ‌ట్టెక్కించాలి. కానీ వారు థియేట‌ర్ల‌కు వ‌చ్చి 'థాంక్యూ' చెప్తారా?

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి