Read more!

English | Telugu

సినిమా పేరు:సొంత ఊరు
బ్యానర్:శ్రావ్య ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Mar 21, 2009
ఒక మారుమూల పల్లెటూరిలో బుజ్జి (రాజా) అప్పడాలమ్ముకుంటూంటాడు. అతను వికలాంగుడు, ఆ ఊళ్ళో రుద్రుడు (ఎల్‌.బి.శ్రీరాం) కాటికాపరి, మల్లి (తీర్ధ) ఓ వేశ్య. దేవుడు (తనికెళ్ళ భరణి) ఆ ఊరి పెద్ద. దేవుడంటే అందరికీ ఎంతో అభిమానం. ఇక బుజ్జి మల్లిని ప్రేమిస్తుంటాడు. అంతేకాదు ఆమెని పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. దాంతో మల్లి నవ్వుకుంటూంది. తనకి కారు కొనిపెడితే పెళ్ళికి ఒప్పుకుంటానని మల్లి అనడంతో బుజ్జి ఓ సెకెండ్‌హ్యాండ్‌ కారు కొనడానికి రెడీ అవుతాడు. ఇక రుద్రుడు కూతురుకి ఇద్దరు పిల్లలు, మొగుడు వదిలేయడంతో రుద్రుడు దగ్గరే ఉంటుంది. ఆ ఊళ్ళోని ఓ వ్యక్తితో ఆమెకి సంబంధం ఉన్న విషయం రుద్రుడికి తెలిసినా ఏమీ చేయలేకపోతాడు. వీరి కథలు ఇలా ఉండగా ఓ ఫ్యాక్టరీ నిర్మించడం కోసం ఊరిని ఖాళీ చేయాలని పరిహారంగా లక్షల రూపాయలు ఇస్తారని దాంతో తమ భవిష్యత్తు బావుంటుందని దేవుడు ఊరివారికి చెప్పడంతో డబ్బుకి ఆశపడ్డ వారు ఒప్పుకుంటారు.సొంత ఊళ్ళో ఎంతో ఆనందంగా ఉన్నవారు పట్నంలో ఎలాంటి దుర్భర జీవితాలు గడిపారన్నది మిగితా కథ.
ఎనాలసిస్ :
ఊళ్ళలో నుండి వలసవచ్చిన ప్రతి వారికీ ఈ సినిమా చూస్తున్నంత సేపూ తమ ఊరు గుర్తుకువస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి రుద్రుడు పాత్ర జీవం పోసింది. అక్కడక్కడా కాస్త సాగదీసినట్టనిపించా కథ, కథనం ఆకట్టుకుంటుంది. ప్రధానంగా ఈ సినిమా మొత్తం బుజ్జి, మల్లి, రుద్రుడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆ మూడు క్యారెక్టర్‌లతో సినిమా నడిపించిన తీరు బావున్నా, బుజ్జి క్యారెక్టర్‌ని అనవసరంగా చంపేసారనిపిస్తుంది. ఫ్యాక్టరీల పేరుతో పల్లెటూరు అంతరించి పోవడంతో అక్కడి నుంచి సిటీలకి వలస వచ్చే వారి జీవితాలని ఆవిష్కరించే ప్రయత్నం బావుంది. కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్‌ కాకపోవచ్చేమో గానీ ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఓ మంచి సినిమా చూసామన్న తృప్తి మాత్రం మిగులుతుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :- రాజా తన కెరీర్‌లో మొదటిసారి వికలాండుగా నటించాడు. ఉన్నంతలో ఆయన నటన ఫర్వాలేదు, వేశ్యగా తీర్ధ నటన కొంచె అతిగా అనిపించినా ఆ క్యారెక్టర్‌కి ఆ మాత్రం ఉండాలి కాబట్టి ఓకే. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రుద్రుడి పాత్ర గురించి. ఈ పాత్రకి ఎల్‌.బి. శ్రీరాం జీవం పోసాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన గెటప్‌, హావభావాలు, డైలాగ్‌ డెలివరీ అన్నీ ఆకట్టుకుంటాయి. తనికెళ్ళభరణి పాత్ర కూడా ఫర్వాలేదు.సంగీతం :- యావరేజ్‌గా ఉందిమాటలు :- గంధం నాగరాజు మాటలు అక్కడక్కడా బావున్నాయి. ముఖ్యంగా ఎల్‌.బి. శ్రీరాం క్యారెక్టర్‌కి రాసిన మాటలు ఆకట్టుకుంటాయి.దర్శకత్వం :- బావుంది.