Read more!

English | Telugu

సినిమా పేరు:సోలో
బ్యానర్:యస్ వి ఆర్ సినిమా
Rating:3.00
విడుదలయిన తేది:Nov 25, 2011

గౌతమ్ (నారా రోహిత్) అనే ఒక అనాథ పెరిగి పెద్దయ్యాక ఒక పెద్ద కుటుంబం ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అతనికి వైష్ణవి అనే మెడిసన్ చదువుతున్న అమ్మాయి కనపడుతుంది. ఆమెని ప్రేమించి, ఎలాగో నానా బాధలూ పడి ఆమె కూడా తనను ప్రేమించేలా చేసుకుంటాడు గౌతమ్. ఆమెకు ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) అంటే ప్రాణం. తన అక్క (జయసుధ) పెద్ద కుటుంబం లేని ఇంటికి కోడలుగా వెళ్ళటం వల్ల ఆమె సుఖ పడటంలేదనే భావనతో ఉన్న వైష్ణవి తండ్రి తన కూతుర్ని పెద్ద కుటుంబం ఉన్నవాడికే ఇచ్చి చేయాలనుకుంటాడు. గౌతమ్ కి కుటుంబం లేదని తెలిసి వైష్ణవి తండ్రి వారి ప్రేమను అంగీకరించాడా...? వారి ప్రేమ సఫలం కావటానికి గౌతమ్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

దర్శకత్వం - దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి ఒక పద్ధతి ప్రకారం దర్శకత్వం వహించాడు. ఈ మధ్య మరుగున పడిపోతున్న మానవ విలువలు చూపించే చిత్రాలు రాని సమయంలో ఈ చిత్రం ఉమ్మడి కుటుంబాల ప్రాథాన్యత, అలాగే ప్రేమకు అసలైన నిర్వచనం, నిజమైన ప్రేమికుడు ఎలా ఉండాలన్నది వంటి విషయాలను చర్చించటం ఈ చిత్రంలోని ప్రథాన ఆకర్షణ. ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఈ చిత్రాన్ని బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా మలచటం ముచ్చటగా ఉంది. సినిమా తొలి సగం మనకు కథ పెద్దగా ఉండక పోయినా ఎంటర్ టైన్ మెంట్ తో నడుస్తుంది. అలాగే సెకండ్ ఆఫ్ లో ఎమోషన్స్ మనసుని ఆకట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వైష్ణవి తన తండ్రితో మాట్లాడే మాటలు, ఆ సీన్ లో జయసుధ, ప్రకాష్ రాజ్ ల నటన ప్రేక్షకుల మనసులను ఆర్ద్ర్తతో నింపుతాయి...! నిర్మాణపు విలువలు ఫరవాలేదు...బాగున్నాయి.

నటన - హీరోగా నారా రోహిత్ కు "బాణం" తర్వాత ఇది రెండవ సినిమా.ఈ సినిమాలో అతని నటనలో చాలా పరిణితి కనిపించింది. వైష్ణవి తన ప్రేమను అంగీకరించలేదని తెలిసిన సమయంలోనూ, ప్రకాష్ రాజ్ తో నటించిన సన్నివేశాల్లోనూ, క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ తో మాట్లాడే సమయంలోనూ అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డ్యాన్స్ విషయంలో మాత్రం నారా రోహిత్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. హీరోయిన్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలోనే ఉంది. శ్రీనివాసరెడ్డి, ఆలీల కామెడీ బాగానే పండింది. ప్రకాష్ రాజ్, జయసుధ, షాయాజీ షిండే తదితరులు తమ పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.

సంగీతం - మణిశర్మ సంగీతం కొత్తగా లేకపోయినా పాటలు వినసొంపుగానే ఉన్నాయి...రీ-రికార్డింగ్ బాగుంది.

కెమెరా - బాగుంది. లొకేషన్లను అందంగా చూపించటంలో కెమెరా పనితనం బాగుంది.

మాటలు - ఈ చిత్రానికి మాటలు ప్రాణం. ఈ చిత్రంలోని మాటలు సింపుల్ గా, అర్థవంతంగా, సందర్భోచితంగా ఉన్నాయి.

పాటలు - "విశ్వదాభిరామ గొంతు దిగని గరళమే ప్రేమ" పాటలోని సాహిత్యం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. మిగిలిన పాటలు కూడా అర్థవంతంగానే ఉన్నాయి.

ఎడిటింగ్ - బాగుంది.

ఆర్ట్ - రఘు కులకర్ణి ఆర్ట్ పనితనం చాలా బాగుంది.

కొరియోగ్రఫీ - గొప్పగా లేకపోయినా ఛండాలంగా మాత్రం లేదు.

యాక్షన్ - ఈ సినిమాలో ఒకే ఒక యాక్షన్ సన్నివేశముంది. అది చాలా ఆకట్టుకునే విధంగా ఉంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ సినిమా చూసిన తర్వాత ఇది మరో "బొమ్మరిల్లు" చిత్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...! ఏ అసభ్యత లేని ఒక చక్కని విభిన్నమైన ప్రేమకథా చిత్రం సకుటుంబంగా చూడాలంటే ఈ చిత్రం చూడండి.