English | Telugu
బ్యానర్:స్టూడియో గ్రీన్
Rating:2.25
విడుదలయిన తేది:Feb 9, 2017
పోలీస్ కథలు మనకేం కొత్త కాదు. ప్రతీ హీరో.. ఖాకీ కట్టి, లాఠీ పట్టి హడావుడి చేసిన వాడే. నిజాయతీ పరుడైన పోలీస్ - అవినీతికి నిలువెత్తు నిదర్శనం లాంటి విలన్.. వాళ్ల మధ్య పోరు. ఇంతకు మించి పోలీస్ కథల్లో కొత్తగా కనిపించేది ఏం ఉండదు. సింగం సిరీస్‌లో వచ్చిన రెండు కథలూ అంతే. అయితే.. ఆయా సినిమాలు విజయవంతం అవ్వడానికి కారణం ఒక్కటే. శక్తిమంతమైన క్యారెక్టరైజేషన్, పట్టుగా సాగిన హరి స్ర్కీన్ ప్లే! రొటీన్ కథ కూడా కేవలం ఈ రెండు పునాదులపై... హిట్ సినిమాగా నిలబడిపోయింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో సినిమా వచ్చింది. అదే.. సింగం 3. మరి ఈసారి సూర్య ఏం చేశాడు? ఈ సినిమాతో ఏం కొత్తదనం కురిపించాడు? తొలి రెండు భాగాల్లో కనిపించిన ప్లస్సులు ఈ సినిమాలో ఇంకా శక్తిని కూడదీసుకొన్నాయా? మైనస్స్‌లు తగ్గాయా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాలి.
* కథ
మంగళూరు పోలీస్ కమీషనర్ దారుణహత్యకు గురవుతాడు. దాంతో కర్నాటకలో శాంతిభధ్రతల సమస్య తలెత్తుతుంది. పరిస్థితులు పోలీసుల చేజాయిపోతుంది. ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తుంది ప్రభుత్వం. కమీషనర్ హత్య కేసు శోధించడానిఇక సింగం (సూర్య)ని నియమిస్తుంది ప్రభుత్వం. ఈ హత్య వెనుక మైనింగ్ మాఫియా ఉందని గ్రహిస్తాడు సింగం. వాళ్లను పట్టుకోవడానికి సింగం ఏం చేశాడన్నది కథ. సింగం 1 పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. సింగం 2 పట్నాని వస్తాడు. ఇప్పుడు సింగం 3 కదా. ఈసారి ఇండియన్ పోలీస్ పవర్ సిడ్నీలో చూపించాడు సూర్య. అంతకు ఇంచి తొలి రెండు భాగాలకూ, సింగం 3కీ ఎలాంటి తేడా లేదు.
ఎనాలసిస్ :
కథ పరంగా దర్శకుడు కొత్తగా ఏం ఆలోచించలేదు. కేవలం హీరో క్యారెక్టరైజేషన్‌ని ఫాలో అయిపోతూ సన్నివేశాల్ని అల్లుకుపోయాడు. సినిమా ప్రారంభం చాలా స్లోగా ఉంటుంది. అనుష్క - సూర్యల మధ్య సాగే ట్రాక్ మరీ బోర్ కొట్టించేసింది. కథలో విషయం లేదని, సీన్లు చూపిస్తూ దర్శకుడు టైమ్ పాస్ చేస్తున్నాడన్న విషయం తొందరగా అర్థమైపోతుంది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా చూపించిందేం లేదు. పార్ట్ 1, పార్ట్ 2లో సూర్య ఎలా ఉన్నాడో, ఎంత పెద్ద గొంతుతో అరిచాడో.. సేమ్ టూ సేమ్ ఇక్కడా అలానే ఉన్నాడు, అలానే అరిచాడు. సింగం 1, 2లనే మళ్లీ చూస్తున్నామా? అనుకొనేంతలోగా కథని ఇన్వెస్టిగేషన్ యాంగిల్‌లో నడిపించాడు హరి. విశ్రాంతి ముందొచ్చే నాలుగైదు సన్నివేశాలు మాస్‌ని ఆకట్టుకొంటాయి. హరి స్ర్కీన్ ప్లే పదును.. సరిగ్గా అక్కడే కనిపిస్తుంది. విలన్లతో హీరో ఢీ కొట్టడం దగ్గర్నుంచి కథ మొదలైనట్టు. ద్వితీయార్థం లో సిడ్నీ కేంద్రంగా సూర్య రెచ్చిపోయి చేసిన ఫైట్లు మాస్‌ని అలరిస్తాయి. అక్కడి ఛేజింగుల్ని కూడా హరి చాలా స్టైలీష్‌గా తీశాడు. నేపథ్యం ఆస్ట్రేలియాకు మారినా. సూర్య ఎప్పటిలా అరుపులూ కేకలతో అదీ అనకాపల్లిలా మార్చేశాడు. బ్యాక్ గ్రౌండ్ మారింది గానీ..ఆ ఇంపాక్ట్‌ని ఎక్కువ సేపు చూపించలేకపోయాడు హరి. తొలిభాగంతో పోలిస్తే ద్వితీయార్థం కాస్త పట్టుగా సాగింది. యాక్షన్ సీన్లు బాగా పండాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఓ మంచి మాస్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అయితే క్లైమాక్స్‌లో ఆ ఆవేశం చప్పున చల్లారిపోతుంది. రొటీన్ క్లైమాక్స్, ఫైట్లతో హరి విసుగెత్తించాడు. ఊహించని ట్విస్టులేం లేకపోవడంతో కథనం కూడా బోర్ కొట్టిచింది.
* నటీనటుల ప్రతిభ
సింగం సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలూ హిట్ అయ్యాయంటే.. దాని వెనుక సూర్య కృషి చాలా ఉంది. యాక్షన్ హీరోగా విజృంభించి నటించేశాడు. సరిగ్గా ఈ సినిమాలోనూ అదే చేశాడు. సూర్య చాలా ఫిట్‌గా కనిపించాడు. తన గెటప్ కూడా బాగుంది. సూర్య ఒక్కడే ఈ సినిమాని కాపాడగలిగే అస్త్రం. అతను చేసిన ఫైట్లు, చెప్పిన డైలాగులూ మాస్‌ని అలరిస్తాయి. అనుష్క మరీ బొద్దుగా కనిపించింది. ఇలానే ఉంటే.. స్వీటీకి అవకాశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. శ్రుతిది కేవలం గ్లామర్ డాళ్ పాత్ర. విలన్లుగా కనిపించిన ఇద్దరూ మైనస్సే. బలమైన విలన్ లేనప్పుడు హీరో ఎంత గొంతు చించుకొన్నా ఏం లాభం? తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహాలేం పెద్దగా కనిపించలేదు. సినిమా అంతా తమిళ నేటివిటీతో నిండిపోయింది.
* సాంకేతిక వర్గం
హరి స్ర్కీన్ ప్లే టెక్నిక్ ఈ సినిమాలో పెద్దగా కనిపించలేదు. కథ, కథనం సాదాసీదాగా సాగాయి. మాటలూ అర్థవంతంగా లేవు. యాక్షన్ ఎపిసోడ్లు తెరకెక్కించిన విధానం బాగుంది. పాటలు మైనస్. వైఫై పాట, దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమా కోసం డబ్బు కుమ్మరించారు. అదంతా మేకింగ్‌లో కనిపించింది. ఇంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కథ, కథనాలపై కూడా దృష్టి పెట్టాల్సింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
యముడు... యాక్షన్ రుద్దుడు