Read more!

English | Telugu

సినిమా పేరు:సిద్ధం
బ్యానర్:శ్రేయ ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Feb 12, 2009
ఇది దయానంద్‌ (జగపతిబాబు) అనే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ కథ. అతనికి భార్య (సింధూ తులానీ), కూతురు హరిణి ఉంటారు. అతనితో పాటు ఫ్రాన్సిస్‌, అఖిల్‌, సలీమ్‌ అనే వారు కూడా అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నా, దయానంద్‌కి వచ్చినంత పేరు ఇంకెవరికీ రాదు. అది సలీమ్‌కి కంటికంపుగా ఉంటుంది. దుబాయ్‌లో ఉండే బిలాల్‌, ఛోటా అనే ఇద్దరు మాఫియా లీడర్లు, హైదరాబాద్‌లో తమ ముఠాలతో వేరు వేరుగా తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. ఛోటా అనుచరుడైన అశోక్‌ (సుబ్బరాజు) తన తల్లి అనారోగ్యంతో ఉంటే మలేసియా నుంచి హైదరాబాద్‌ వస్తాడు. ఇది తెలుసుకున్న దయానంద్‌ తన సహచరులతో అశోక్‌ ఇంటి మీద దాడి చేస్తాడు. దయానంద్‌ వద్దంటున్నా సలీమ్‌ జరిపిన కాల్పుల్లో అశోక్‌ తల్లి చనిపోతుంది. దయానంద్‌ ఆఫీసుకు మాఫియా వారితో కనెక్షన్లున్న కొత్త పోలీస్‌ కమీషనర్‌ (రాధారవి) వస్తాడు. అతనికి సలీమ్‌ బాగా దగ్గరవుతాడు. దయానంద్‌ మీద కొత్త కమీషనర్‌కి సలీమ్‌ వలన అకారణ ద్వేషం ఏర్పడుతుంది. దయానంద్‌ని కమీషనర్‌ అవమానిస్తుంటే, తన ఉద్యోగానికి దయానంద్‌ రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసినా ఒక పోలీస్‌గా దయానంద్‌ తన డ్యూటీని చేస్తూనే ఉంటాడు. కార్పొరేటర్‌ సుధీర్‌ని చంపేస్తాడు దయానంద్‌. దాంతో దయానంద్‌ మీద షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్‌ వేస్తాడు కమీషనర్‌. ఇదే అదునుగా భావించిన సలీమ్‌ దయానంద్‌ని చంపబోతే అఖిల్‌ తన రివాల్వర్‌తో సలీమ్‌ని చంపుతాడు. దయానంద్‌ పోలీస్‌ కమీషనర్‌ని చంపుతాడు. తాను కూడా క్రిమినల్‌ కనుక తనను కాపాడమనీ, దుబాయ్‌కి తీసుకెళ్ళమని బిలాల్‌కి దయానంద్‌ చెపుతాడు. దాంతో దయానంద్‌ని దుబాయ్‌కి రప్పిస్తాడు బిలాల్‌. అక్కడ తన భార్యని చంపిన బిలాల్‌ని దయానంద్‌ చంపేస్తాడు. చివరికి మాజీ కమీషనర్‌ సాయంతో, తన ఉద్యోగంలో చేరతాడు దయానంద్‌ ఇది కథ.
ఎనాలసిస్ :
ఇది పక్కా కాపీ కథ. నానాపాటేకర్ హీరోగా నటించిన హిందీ చిత్రం “అబ్ తక్ చెప్పన్’’ అనే సూపర్ హిట్ చిత్రానికి ఇది మక్కీకి మక్కీ కాపీ. ఆఖరికి ఇందులో డైలాగులతో సహా ఆ చిత్రంలోనివే కావటం గమనార్హం. ఇక నానాపాటేకర్ జగపతి బాబుని ఎలాగూ పోల్చలేం. కానీ జగపతి బాబు కూడా తన శక్తివంచన లేకుండా తనపాత్రకు న్యాయం చేశాడని చెప్పాలి. సిందూ మీనన్ పాత్ర నిడివి తక్కవే అయినా బాగా నటించింది. రిటైర్డ్ కమీషనర్ గా కోట, పోలీస్ కమీషనర్ గా రాధారవి, అశోక్ గా సుబ్బరాజు, ఫ్రాన్సిస్ గా నర్సింగ్, బిలాల్ గా కొత్త నటుడు బాగానే నటించారు. ఇక దర్శకుడిగా జె.డి. చక్రవర్తి కొత్తగా చేసిందేమీ లేదు. నీట్ గా కాపీ కొట్టడం తప్ప. పాటలు లేవు కానీ రీ-రికార్డింగ్ మాత్రం అర్థవంతంగా బాగుంది. భరణి. కె.ధరణ్ కెమెరా వర్క్ చాలా బాగుంది. “అబ్ తక్ చప్పన్’’ సినిమాలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా బూతులు చాలానే వాడారు. ఉదాహరణకు “జీ లో దమ్ముంటే’’. “లుంగీ ఉడా పుంగీ బాజా’’, “చెత్త నా కోడక’’, “బ్రోకర్ నా కోడక’’, “బెహెన్ కి ఘోస్లా’’ వంటి సభ్యసమాజం వినటానికి ఇబ్బంది పడే ఛండాలపు మాటలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. ఎడిటింగ్ నీట్ గా, క్రిస్పీగా చక్కగా వుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రొటీన్ గా ఉండే చిత్రాల్లో విభిన్నంగా ఉండే ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు. “ఒకవేళ మీరు అబ్ తక్ చెప్పన్’’ చిత్రాన్ని కనుక చూడకపోతే.