Read more!

English | Telugu

సినిమా పేరు:శంక‌రాభ‌ర‌ణం
బ్యానర్:కోన వెంకట్ ప్రేజెంట్స్
Rating:1.50
విడుదలయిన తేది:Dec 4, 2015

శంక‌రాభ‌ర‌ణం అని మీ సినిమాకి పేరెందుకు పెట్టారు?  అని అడిగితే..
అది మార్కెట్ స్ట్రాట‌జీ అన్నాడు కోన వెంక‌ట్‌.
అంటే.. ఓ సినిమా పేరు త్వ‌ర‌గా జ‌నానికి చేరువ అవ్వ‌డానికి వేసిన ట్రిక్ అన్న‌మాట‌. రెడీమెడ్ ఆలోచ‌న‌లే త‌ప్ప‌.. సొంతంగా ఆలోచించ‌లేని బుర్ర‌ల‌కు అంత‌కంటే.. ఉదాహ‌ర‌ణ ఏం కావాలి?  టైటిల్ ఒక్క‌దాంట్లోనే కాదు. ఏది త్వ‌ర‌గా సేల్ అయిపోతుందో.. దాన్ని ప‌ట్టుకొన్నాడు కోన‌. నిర్మాత‌గా అత‌ని ఆలోచ‌న‌ల్లో ఏమాత్రం త‌ప్పులేదు. కాక‌పోతే.. ర‌చ‌యిత‌గా త‌న‌ని తాను సంతృప్తి ప‌డే మార్గం మాత్రం ఇది కాదు. శంక‌రాభ‌ర‌ణం అని పేరు పెట్టి.. రొటీన్ క్రైమ్ కామెడీ క‌థ‌ని తీసుకొని, దానికి కిడ్నాప్ డ్రామా మేళ‌వించి, అందులో బోల్డంత మంది పేడింగ్‌ని పెట్టేసి.. పైపై మెరుగులు దిద్దే ప్ర‌య‌త్నం చేసిన సినిమా ఇది. మ‌రి ఆ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీ కృత‌మ‌య్యాయి?  అస‌లు శంక‌రాభ‌ర‌ణం క‌థేంటి?
తెలియాలంటే రివ్యూలోకి అడుగుపెట్టాల్సిందే.

 

STORY:

అమెరికాలో బిజినెస్‌మేన్‌ ర‌ఘు (సుమ‌న్‌). వాళ్ల‌బ్బాయి గౌత‌మ్ (నిఖిల్‌). రఘు బిజినెస్‌లో భారీగా న‌ష్ట‌పోతాడు.  దివాళా తీసే ప‌రిస్థితి. అర్జంటుగా  రూ.12కోట్ల అప్పులు తీర్చాలి. లేదంటే.. జైలుకి వెళ్లాలి. ఇలాంటి ప‌రిస్థితిల్లో గౌత‌మ్ ముందు ఒక్క‌టే దారి ఉంటుంది. ఇండియాలో ఉన్న త‌మ పాత ఇల్లు `శంక‌రాభ‌ర‌ణం` అమ్మాలి. ఆ డ‌బ్బుతో అప్పులు తీర్చాలి. ఈ ల‌క్ష్యంతోనే.. గౌత‌మ్ ఇండియాకి వ‌స్తాడు. అయితే ఇక్క‌డ ఆ ఇల్లు మేన‌మామ (రావు ర‌మేష్‌) అధీనంలో ఉంటుంది. వాళ్ల‌మ్మాయి హ్యాపీ (నందిత‌న‌) గౌత‌మ్‌ని తొలి చూపులోనే ప్రేమించేస్తుంది. శంక‌రాభ‌ర‌ణం అమ్మేలోగా... గౌత‌మ్‌ని ఓ బీహారీ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఇంత‌కీ ఆ బీహారీ గ్యాంగ్ ఎవ‌రు?  గౌత‌మ్‌ని ఎందుకు కిడ్నాప్ చేసింది?  ఆ గ్యాంగ్‌కీ హోంమినిస్ట‌ర్ (సంప‌త్‌)కీ ఉన్న సంబంధం ఏమిటి?  ఈ క‌థ‌లోకి మున్నీ (అంజ‌లి) ఎలా వ‌చ్చింది?  అనేది తెర‌పై చూడాల్సిందే.


ఎనాలసిస్ :

హీరో అమ్మాల‌నుకొన్న ఇంటి పేరు శంక‌రాభ‌ర‌ణం. అంతే. అందుకోసం ఓ క్లాసిక్ పేరుని అన‌వ‌స‌రంగా వాడేసి, ఇంకొక‌రు వాడుకొనే ఛాన్సు లేకుండా చేశాడు కోన వెంక‌ట్‌. టైటిల్ సంగ‌తి అటు పెడితే... ఈసినిమా కోసం అల్లుకొన్న స‌న్నివేశాలు, రాసుకొన్న పంచ్‌లు.. అన్నీ సేల‌బులిటీ చూసుకొన్న‌వే. ఓ స‌న్నివేశం త‌ర‌వాత మ‌రోటి.. దాని త‌ర‌వాత ఇంకోటి అలా అలా పేర్చుకొంటూ వెళ్లాడు కోన‌. చూడ్డానికి సినిమా ముక్క ముక్క‌లుగా క‌నిపిస్తుంది. ఏముక్క‌కాముక్క బాగానే ఉంద‌నిపిస్తుంది. కానీ.. వాట‌న్నింటినీ క‌లిపి చూస్తే మాత్రం `విష‌యం త‌క్కువ‌... హంగామా ఎక్కువ` అనిపిస్తుంది. ఈటైపు క‌థ‌లు ఇది వ‌ర‌కు చాలానే వ‌చ్చాయి. దానికి కాస్త కిడ్నాప్ డ్రామా యాడ్ చేశాడంతే. అది కూడా `ఫ‌స్ గ‌యారే ఒబామా` నుంచి తీసుకొన్న‌దే. అంటే.. క‌థ విష‌యంలో కోన త‌న బుర్ర‌నేం వాడ‌లేదు. అయితే త‌న‌దైన ఛ‌మ‌క్కుల‌తో, కామెడీతో బండి న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. అక్క‌డ‌డ‌క్క‌డ ఓ జోక్ పేలుతూ.. ఓ స‌న్నివేశం బాగానే ఉంద‌నిపిస్తూ.. మ‌ధ్య‌లో ఓ ట్విస్టుతో ఇంట్ర‌వెల్ కార్డు వేశాడు. అయితే విశ్రాంతి కార్డు వ‌ర‌కూ సినిమాని లాగ‌డానికి నానా యాత‌న ప‌డిన‌ట్టు అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. గంట సినిమాలో అర‌గంట బోర్ బోర్‌గా సాగిందంటే కోన స్ర్కీన్ ప్లే మ‌హ‌త్తు ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అస‌లు ఈ క‌థ‌ని నిఖిల్ ఎందుకు ఓకే చేశాడో అర్థం కాదు. హీరో పాత్ర‌ని డ‌మ్మీని చేసి, మిగిలిన అర కొర పాత్ర‌ల్ని ఎలివేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడి, క‌థ‌కుడి ఆంత‌ర్యం ఏమిటో అంతుప‌ట్ట‌దు. హీరో నిఖిల్‌ది గుంపులో గోవిందం పాత్ర‌గా త‌యారైంది. మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌ల‌చ‌బ‌డిన‌ట్టు.. పాత్ర‌ల‌నేకం ఒక‌దాని త‌ర‌వాత మ‌రోటి వ‌స్తూ క‌థ‌ని డస్ట్ర‌బ్ (అస‌లు క‌థంటూ ఉంటే) చేస్తుంటాయి. సెకండాప్‌లో మున్నీగా అంజ‌లి ఎంట్రీ ఇవ్వ‌డం, ఫృద్వీ, కాస్త కామెడీ పంచ‌డం, కోన స్టైల్ ఆఫ్ సెటైర్లు పండ‌డంతో ఏదో కాస్త గ‌ట్టెక్కేసిందంతే. లేదంటే వ‌రుస‌గా మూడు హిట్లు అందుకొన్న నిఖిల్‌కి ఓ భారీ డిజాస్ట‌ర్ త‌గిలేద్దును. కామెడీ వ‌ర్క‌వుట్ అవ్వ‌డంతో ఇదో కాల‌క్షేప చిత్రం మిగిలిపోయింది.

ముందే చెప్పిన‌ట్టు నిఖిల్ చేయాల్సిన సినిమా కాదిది. అయినా క‌నిపించినంత‌లో ఏదో క‌ష్ట‌ప‌డ్డాడు. మ‌రీ ముఖ్యంగా డాన్సుల్లో ఆక‌ట్టుకొన్నాడు. నందిత కొన్ని ప్రేముల్లో చూడ్డానికి బాగుంది. మ‌రికొన్ని సీన్ల‌లో ఆమె కాస్ట్యూమ్స్ ఎబెట్టుగా క‌నిపిస్తాయి. అంజ‌లిది చిన్న పాత్రే. కానీ దానికిచ్చిన హంగామా ఓ రేంజులో ఉంటుంది.క‌నీసం ఆ పాటి ప్రాధాన్యం హీరోకి లేకుండా పోయింది. ఫృద్వీ, ష‌క‌ల‌క‌శంక‌ర్, స‌ప్త‌గిరి వీళ్లంతా య‌ధావిధిగా న‌వ్విస్తారు. విల‌న్ గ్యాంగ్ కూడా ఓకే. లెక్క‌కు మించి న‌టీన‌టులున్నా.. చాలామంది పేర్లు కూడా మైండ్‌లో రిజిస్ట‌ర్ కావంటే.. స‌న్నివేశాలు ఎంత పేల‌వంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

సాంకేతికంగా సంగీతం ఓకే అనిపిస్తుంది. ఆర్ ఆర్ మాత్రం చాలా సినిమాల‌కు న‌క‌లుగా గోచ‌రిస్తుంది. క్లైమాక్స్‌లో అయితే శంభో శివ శంభో ఆర్‌. ఆర్‌ని ఎత్తేసిన‌ట్టు అనిపించింది. కోన స్ర్కీన్ ప్లే పండ‌లేదు. అయితే అక్క‌డ‌క్క‌డ త‌న‌దైన శైలిలో చ‌మ‌క్కులు వినిపించాడు. ఓ సాదా సీదా క‌థ‌ని ద‌ర్శ‌కుడు కూడా అంతే సాదా సీదాగా హ్యాండిల్ చేశాడు. క్వాలిటీ ప‌రంగా వంక పెట్ట‌లేం.

ఏదో టైమ్ పాస్ కే వాస్తే.. అనుకొంటే ఈ కిడ్నాప్ డ్రామాని కొంత‌వ‌ర‌కూ భ‌రించొచ్చు. స్వామి రారా, కార్తికేయ‌లా నావెల్టీ కోసం ప్ర‌య‌త్నించారంటే.. భంగ‌పాటు త‌ప్ప‌దు.