Read more!

English | Telugu

సినిమా పేరు:శాకుంతలం
బ్యానర్:గుణా టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Apr 14, 2023

సినిమా పేరు: శాకుంతలం
తారాగణం: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖడేఖర్, గౌతమి, మోహన్ బాబు, అల్లు అర్హ, మధుబాల, జిషు సేన్‌గుప్తా, కబీర్ బేడి, ప్రకాశ్ రాజ్ (గెస్ట్), అదితి బాలన్, అనన్య నాగళ్ల, శివకృష్ణ, కబీర్ దుహాన్ సింగ్, వర్షిణి సౌందరాజన్, సుబ్బరాజు, హరీశ్ ఉత్తమన్, ఆదర్శ్ బాలకృష్ణ, యశ్ పురి 
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
పాటలు: చైతన్యప్రసాద్, శ్రీమణి
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: అశోక్
యాక్షన్: కింగ్ సాల్మన్, వెంకట్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: నీలిమ గుణ
దర్శకత్వం: గుణశేఖర్
బ్యానర్: గుణా టీమ్ వర్క్స్
విడుదల తేదీ: 14 ఏప్రిల్2023

సమంత నాయికగా 'శాకుంతలం' చిత్రాన్ని తీస్తున్నట్లు డైరెక్టర్ గుణశేఖర్ ప్రకటించినప్పుడు చాలామంది ఆయన ఈ సాహసం ఎందుకు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు. దుష్యతుడు, శకుంతల పాత్రల్లో దిగ్గజ తారలు ఎన్టీఆర్, బి. సరోజాదేవి నటించిన 1966 నాటి 'శకుంతల' చిత్రమే బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. పైగా శాకుంతలంలో దుష్యంతుని పాత్రకు తెలుగువాళ్లకు పరిచయంలేని మలయాళం నటుడు దేవ్ మోహన్‌ను ఎంపిక చేసి, మరింతగా సర్ప్రైజ్ చేశారు గుణశేఖర్. దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ నిర్మించిన 'శాకుంతలం' ఎలా ఉందంటే...

కథ
విశ్వామిత్రుని తపస్సును భగ్నం చేసి, ఆయన్ను మోహంలో ముంచేసి, ఆయన ద్వారా ఒక కూతుర్ని కని, ఆ పసిపాపను అడవుల్లోనే వదిలేసి వెళ్లిపోతుంది అప్సరస మేనక. ఆ పాపకు శకుంతల అని పేరుపెట్టి, పెంచి పెద్దచేస్తాడు కణ్వ మహర్షి. ఆయన ఆశ్రమంలో లేని సమయంలో ఆశ్రమవాసులు తలపెట్టిన యాగాన్ని నిర్విఘ్నంగా జరగడానికి అసురులను అడ్డుకోడానికి దుష్యంత మహారాజు కణ్వ ఆశ్రమానికి వచ్చి, శకుంతలను చూసీ చూడంగానే మోహిస్తాడు. ఆమె కూడా అతనికి మనసిస్తుంది. గాంధర్వ వివాహంతో దంపతులైన ఆ ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. యాగ రక్షణ బాధ్యత ముగియడంతో మళ్లీ వస్తానని చెప్పి, తన రాజ్యానికి వెళ్లిపోతాడు దుష్యంతుడు. శకుంతల గర్భం దాలుస్తుంది. కణ్వ మహర్షి ఆశ్రమానికి తిరిగివచ్చి, జరిగిన విషయం తెలుసుకుంటాడు. కణ్వ మహర్షిని సందర్శించడానికి వచ్చిన దుర్వాసుడు అక్కడ దుష్యంతుని తలపుల్లో ఉండి తనను ఉపేక్షించిందని శకుంతలపై ఆగ్రహించి, దుష్యంతుడు ఆమెని మరిచిపోతాడని శపించి వెళ్లిపోతాడు. ఇదేదీ గ్రహించే స్థితిలో ఉండదు శకుంతల. దుష్యంతుడు ఎంతకీ రాకపోవడంతో, శకుంతలను ఆయన దగ్గరికే పంపిస్తాడు కణ్వ మహర్షి. రాజసభకు వచ్చిన శకుంతలను దుష్యంతుడు గుర్తుపట్టడు. నిండు గర్భిణి శకుంతలకు సభలో అవమానం జరుగుతుంది. ఆమెను వెంటనే అక్కడ్నించి వెళ్లిపొమ్మని ఆజ్ఞాపిస్తాడు దుష్యంతుడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో చూస్తాం.


ఎనాలసిస్ :

మహాకవి కాళిదాసు విరచిత 'అభిజ్ఞాన శాకుంతలం'ను అనుసరించి తనదైన కల్పనాశక్తితో 'శాకుంతలం'ను రూపొందించాడు గుణశేఖర్. 2డి, 3డి ఫార్మట్స్‌లో దీన్ని రిలీజ్ చేశారు. 3డిలో 'శాకుంతలం' విజువల్ బ్యూటీగా కనిపిస్తుంది. దుష్యంతుడు ఎప్పుడైతే తొలిసారి శకుంతలను చూస్తాడో, అప్పుడే మనమూ ఆమెను తొలిసారి వీక్షిస్తాం. లెక్కకు మిక్కిలి సంఖ్యలో సీతాకోకచిలుకలు చుట్టుముట్టి ఉండగా, వాటి మధ్యలోంచి శకుంతల కనిపించే దృశ్యాన్ని ఎంతో బ్యూటిఫుల్‌గా తీశాడు దర్శకుడు. కణ్వ మహర్షి ఆశ్రమం చూస్తుంటే, మనకు జేమ్స్ కామెరాన్ మూవీ 'అవతార్‌'లోని పండోరా దీవి స్ఫురణకు వస్తుంది. అంత అందంగా కణ్వాశ్రమం గోచరిస్తుంది. అయితే అక్కడి వన్యప్రాణులన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో తయారైనవనే విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతూ అసంతృప్తికి గురవుతాం. మరింత నాణ్యంగా సహజ ప్రాణులన్నట్లు వాటిని కల్పిస్తే బాగుండేది కదా అనుకుంటాం. 

శకుంతల కథ గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్లకు ఫర్వాలేదు కానీ, ఆమె కథ గురించి తెలీనివాళ్లకు ప్రథమార్ధం నెమ్మదిగా సాగే కథా గమనం విసుగు పుట్టిస్తుంది. కణ్వాశ్రమంలో జరిగే యాగాన్ని భగ్నం చేయాలనుకొనే అసురుల ఎపిసోడ్ కూడా ప్రభావవంతంగా లేదు. శకుంతలను శపించే క్రమంలో దుర్వాసుని నోటివెంట వచ్చే మాటలు అర్థవంతంగా లేదు. మొదట ఆమె ఎవరో తెలీదన్నట్లు పలికిన దుర్వాసుడు ఆ వెంటనే ఆమెను శకుంతల అని సంబోధించి శపించడం అర్థవంతం అనిపించలేదు. తన మనోనేత్రంతో ఆమె ఎవరిని తలపోస్తున్నదో గ్రహించినట్లు చూపిస్తే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల దుర్వాసుని రాక, పోక ఒక వ్యర్థ సన్నివేశంలా తయారయ్యింది. ద్వితీయార్ధంలో దుష్యంతుని దర్బారుకు శకుంతల వచ్చిన తర్వాత కథనం కాస్త ఆసక్తికరంగా ఉంటుందనుకుంటే అదీ ఆశించిన రీతిలో లేదు. క్లైమాక్స్‌లో వచ్చే భరతుని సన్నివేశాలు ముద్దుముద్దుగా అనిపిస్తాయి. 

కాలనేమితో దుష్యంతుడు తలపడే యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకొనే రీతిలో లేవు. ఆ సన్నివేశాలకు ఉపయోగించిన సీజీ వర్క్ నాణ్యంగా లేదు. మణిశర్మ మ్యూజిక్ బాగుంది. చైతన్యప్రసాద్ కలం నుంచి జాలువారిన పాటలు బాగున్నాయి. సినిమా విజువల్‌గా అందంగా కనిపించిందంటే.. అది శేఖర్ వి. జోసెఫ్ సినిమాటోగ్రఫీ మహిమే. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. అశోక్ ఆర్ట్ వర్క్ ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాలో అసంతృప్తి కలిగించిన ఇంకో అంశం.. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు. సాధారణంగా తన సంభాషణలతో సన్నివేశాల్లోని గాఢతను పెంచే సామర్థ్యం ఉన్న ఆయన 'శాకుంతలం' విషయానికి వచ్చేసరికి విఫలమయ్యాడనే చెప్పాలి. "అప్సర కుమార్తె అయినా అనాథ అయ్యింది", "నీ కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోగలం కానీ నీ కర్మని పంచుకోలేమమ్మా".. లాంటి అతి కొద్ది మాటలు ఆకట్టుకున్నాయి కానీ, చాలా సందర్భాల్లో అవి ప్రభావవంతంగా తోచలేదు. మొత్తంగా శాకుంతలంను ఆకర్షణీయంగా తెరకెక్కించడంలో గుణశేఖర్ విజయవంతం కాలేకపోయారు. 

నటీనటుల పనితీరు

శకుంతల రాణించడానికి సమంత చాలా కష్టపడింది. ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని, దాని అంతఃసంఘర్షణను బాగానే పలికించింది. కానీ ఆ పాత్రకు ఉండాల్సిన అమాయకత్వం ఆమె మోములో ప్రతిఫలించలేదు. దుష్యంతుని తొలిసారి చూసినప్పుడు భయ విహ్వలగా కనిపించిందే కానీ ముగ్ధమోహనత్వం గోచరించలేదు. దుష్యంతుని పాత్రను ఒక కొత్త మలయాళీ నటుడు ఎలా చేస్తాడో అనుకున్నాం కానీ ఆ పాత్రలో ఊహించిన దానికి మించి దేవ్ మోహన్ రాణించాడు. అందగాడిగా కనిపించిన అతను, హావభావాల పరంగా కూడా మెప్పించాడు. సినిమాలో చాలా పాత్రలున్నాయి. కొన్ని ఇలా వచ్చి అలా మాయమయ్యేవే. అందువల్ల వాటిని పోషించిన వాళ్లకు నటించడానికి ఎక్కువ ఆస్కారం దొరకలేదు. కణ్వ మహర్షి, గౌతమీ మాత పాత్రల్లో సచిన్ ఖడేకర్, గౌతమి సరిగ్గా సరిపోయారు. కాలనేమి రాక్షసులుగా కనిపించిన కబీర్ దుహాన్ సింగ్, సుబ్బరాజు, హరీశ్ ఉత్తమన్ సోసోగా ఉన్నారు. కబీర్ బేడి ఆహార్యం కశ్యప ప్రజాపతి పాత్రకు ఏమాత్రం సరిపోలేదు. దుర్వాస మునిగా మోహన్‌బాబు అతిథి పాత్రలో కనిపించారు కానీ మెరవలేకపోయారు. భరతునిగా అల్లు అర్హ సొంత గొంతుతో ముద్దుముద్దుగా మాట్లాడింది. మేనకగా మధుబాల, దేవేంద్రునిగా జిషు సేన్‌గుప్తా, శకుంతల చెలులు ప్రియంవద, అనసూయ పాత్రల్లో అదితి బాలన్, అనన్య నాగళ్ల ఇమిడిపోయారు. దుష్యంతుని మంత్రి వేషంలో శివకృష్ణ కనిపించారంతే. దుష్యంతుని మిత్రునిగా శివ బాలాజీ ఓకే. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఇవాళ్టి రోజుల్లో ఒక పౌరాణిక గాథను తెరకెక్కించడం ఒక సాహసం. ఆ సాహసాన్ని దర్శకుడు గుణశేఖర్ చేశారు. అయితే అది దుస్సాహసమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. శకుంతల భావావేశం, భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందడం బహు కష్టం. సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ఈ కీలకాంశమే.

- బుద్ధి యజ్ఞమూర్తి