Read more!

English | Telugu

సినిమా పేరు:సీమ టపాకాయ్
బ్యానర్:వెల్ఫేర్ క్రియేషన్స్
Rating:3.00
విడుదలయిన తేది:May 13, 2011

శ్రీకృష్ణ కోటీశ్వరుడి కొడుకు.అతను సత్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సత్యకు కోటీశ్వరులంటే మంట. సత్య ప్రేమ కోసం శ్రీకృష్ణ తానొక పేదవాడినని అబధం చెపుతాడు. ఆమెకు పరిచయం చేయటం కోసం ఆగర్భశ్రీమంతులైన తన కుటుంబ సభ్యులందరినీ చిరిగిపోయిన బట్టలేయించి ఆమెకు పరిచయం చేస్తాడు. సత్య ప్రేమ కోసం తన తండ్రితో రోడ్డు మీద అరటిపళ్ళు అమ్మిస్తాడు. ఇంతా చేస్తే సత్య తండ్రి కర్నూలుకు చెందిన కోటీశ్వరుడైన ఒక ఫ్యాక్షనిస్టు. తన తండ్రి అన్నా కూడా సత్యకు పడదు. మరి సత్య ప్రేమను ఆమెతో అబద్ధం చెప్పి ప్రేమించిన కోటీశ్వరుడు శ్రీకృష్ణ ఎలాపొందాడన్నది మిగిలిన వినోదాత్మకమైన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - హాస్యరస చిత్రాలను తీయటంలో నాగేశ్వరరెడ్డిది ఒక ప్రత్యేకమైన శైలి. అందుకు తగ్గ హీరో అల్లరి నరేష్ అతనికి దొరికాక వాళ్ళిద్దరూ కలసి చేసే అల్లరి ఈ సినిమాను ఆద్యంతం నవ్వులు పండించేలా చేసింది. లాజిక్ చూడకుండా కేవలం నవ్వుకోవటానికి మాత్రమే ఈ సినిమా చేసినట్లుంటుంది. స్క్రీన్ ప్లే బాగుంది.కథలో కొత్తదనం లేకపోయినా కథనంలో కొత్తదనం కనపడుతుంది.

కాసేపు ప్రేక్షకులను హాయిగా నవ్వించాలన్న ప్రయత్నమే ఈ చిత్రం అన్నది ఈ చిత్రం ఉద్దేశంగా కనపడుతుంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో "సీమశాస్త్రి" అన్న సినిమా వచ్చింది. ఈ సినిమా దానికన్నా మనల్ని బాగా నవ్విస్తుంది.

నటన - నరేష్ కి ఇలాంటి చిత్రాలు నల్లేరు మీద నడక. ఈ సినిమాలో అతను చాలా సరదాగా నటించాడు. ఇక హీరోయిన్ పూర్ణకు ఇది తొలి చిత్రమైనా ఎక్కడా ఆ కొత్తదనం కనిపించదు. బాగా అనుభవమున్న నటిలా నటించింది పూర్ణ. ఇక షాయాజీ షిండే, బ్రహ్మానందం, యల్.బి.శ్రీరామ్, సుధ, సురేఖావాణి, రవి తదితరులు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు మనల్ని నవ్విస్తారీ చిత్రంలో.

సంగీతం - వందే మాతరం శ్రీనివాస్ సంగీతం బాగుంది. అన్ని పాటలూ బాగున్నా ఒక చిన్న లోపం బాధిస్తుంది. "సింహాసనం" చిత్రంలోని "ఆకాశంలో ఒకతార" అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. అది తప్పేం కాదు. కానీ దాన్ని "ఆకాశమలో" అంటూ రీమిక్స్ చేయటమే ఇబ్బంది కలిగించే విషయం.పాత పాటలను రీమిక్స్ చేసేటప్పుడు సంగీత దర్శకులు భాష విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది కదా.

సినిమాటోగ్రఫీ - బాగుంది. సినిమా ఆద్యంతం మనకు ఆహ్లాదం కలిగించే రీతిలో ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ ఉంది.

మాటలు - మరుధూరి రాజా చాలా కాలం తర్వాత తన కలాన్ని ఝుళిపించాడు. హాస్యానికి పెట్టింది పేరైన మరుధూరి రాజా మాటల్లో చమత్కారం బాగానే ఉండి, మనల్ని నవ్విస్తుంది.

పాటలు - పాటల్లో సాహిత్యం ఫరవాలేదు.

ఎడిటింగ్ - బాగుంది.

ఆర్ట్ - ఆర్ట్ డైరెక్టర్ పనితనం చాలా బాగుంది.

కొరియోగ్రఫీ - గందరగోళం మూమెంట్లు, సంపర్కానికి వేంపర్లాడే జంతువుల ముమెంట్లూ లేకుండా, నీట్ గా ఉంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మీరు మీ కుటుంబంతో కలసి ఓ రెండున్నర గంటల పాటు సరదాగా నవ్వుకుంటూ గడపాలనుకుంటే ఈ సినిమా తప్పక చూడండి.