Read more!

English | Telugu

సినిమా పేరు:సత్యమేవ జయతే
బ్యానర్:శివాని శివాత్మిక మూవీస్
Rating:---
విడుదలయిన తేది:Feb 13, 2009
సత్య (రాజశేఖర్‌) ఎన్‌కౌంటర్‌ స్సెషలిస్ట్‌, ఒక గొడవలో అతని భార్య (నీతుచంద్ర)ను రణదేవ్‌ (మిలింద్‌ సోమన్‌) అనే టెర్రరిస్ట్‌ చంపేస్తాడు. డాక్టర్‌ ఇక్బాల్‌ అన్సారీ అనే అతను వైజాగ్‌లో ఉంటూ మన రాష్ట్రంలో ఐ.యస్‌.ఐ. ఏజెంట్‌గా పనిచేస్తూ, బాంబు దాడుల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నాడని అతన్ని వైజాగ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చి హైకోర్టుకి అప్పగించే బాధ్యతను సత్యకి అప్పగిస్తుంది ప్రభుత్వం. సత్య తనతో పాటు వీరప్రతాప్‌ (శివాజీ), పాండు (సాయికిరణ్‌), బాసరపాప (సంజన), సత్తిరాజు (శివారెడ్డి)లను కూడా వైజాగ్‌ తీసుకెళ్తాడు. అక్కడ జరిగిన ఒక గొడవలో మహాలక్ష్మి అనే ఆమె కూడా సత్య టీమ్‌తో పాటు, అన్సారీతో సహా హైదరాబాద్‌కు పోలీస్‌ వేన్‌లో బయలుదేరుతుంది. మహాలక్ష్మి (షెర్లిన్‌)ని వీరప్రతాప్‌ ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. దారిలో రణదేవ్‌ ముఠా సత్య టీమ్‌ మీద ఎటాక్‌ చేస్తుంది. ఆ సమయంలో అన్సారీ తాను నిర్దోషిననీ, హోంమినిస్టర్‌ చేసిన అరాచకాలకు సహకరించక పోవటం వల్లే తన మీద ఐ.యస్‌.ఐ. ఏజెంట్‌ అనే ముద్ర వేశారనీ సత్యతో చెపుతాడు. అప్పుడే హోంమినిస్టర్‌తో పాటు పోలీస్‌ కమీషనర్‌ కూడా ఈ పాపంలో భాగస్తుడేనని సత్యకు తెలుస్తుంది. వీర ప్రతాప్‌, బాసర పాపలు కలిసి అన్సారీని అక్కడి నుండి తప్పిస్తారు. వీళ్ళంతా రణదేవ్‌ బారి హైదరాబాద్‌ నుండి రైల్లో పారిపోతూండగా, సత్తిరాజు, అన్సారీ రణదేవ్‌ జరిపిన కాల్పుల్లో మరణిస్తారు. చివరికి ఒక విలేఖరి చనిపోతూ డాక్టర్‌ అన్సారితో చెప్పిన మాటలను ఒక క్యాసెట్‌లో రికార్డు చేయటం వల్ల హోంమినిస్టర్‌ అరాచకాలకు సంబంధించిన సాక్ష్యాధారాలున్న ఫైలు ఎక్కడుందో సత్యకు తెలుస్తుంది. దాన్ని తెచ్చేందుకు వీరప్రతాప్‌ వెళుతూ తనతో పాటు మహాలక్ష్మిని కూడా తీసుకెళతాడు. ఆ ఫైలు దొరగ్గానే అక్కడికి రణదేవ్‌ మనుషులు రావటంతో మహాలక్ష్మికి ఆ ఫైలునిచ్చి, దాన్ని సత్యకి అందజేయమని ఆమెని అక్కడ నుండి పంపిస్తాడు వీరప్రతాప్‌. కానీ ఆమె ఆ ఫైలుని రణదేవ్‌కిస్తుంది. అంటే ఆమె రణదేవ్‌ ప్రేయసి అనీ, అతనే ఆమె సత్యటీమ్‌తో పాటు ప్రయాణించే విధంగా పోలీస్‌ కమీషనర్‌తో కలసి ప్లాన్‌ చేశాడనే విషయం వీరప్రతాప్‌కి తెలిసి హతాశుడవుతాడు. అతన్ని రణదేవ్‌ చంపేస్తాడు. ఆ తర్వాత సత్య ఎలా హోంమినిస్టర్‌, కమీషనర్‌ల అక్రమాలను, అన్యాయాలను బయట పెట్టాడనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఇది హిందీలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, తుషార్ కపూర్ లు నటించిన “ఖాకీ’’ చిత్రానికి రీమేక్. దర్శకురాలు శ్రీమతి జీవిత ఆ చిత్రాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టటం మినహా కొత్తగా ఈ చిత్రంలో చేసిందేమీ లేదు. ఇక రాజశేఖర్ నటనకు సాయికుమార్ డబ్బింగ్ ప్రాణం పోసిందని చెప్పాలి. ఇక వీరప్రతాప్ గా శివాజీ, పండుగా సాయికిరణ్, సత్తిరాజుగా శివారెడ్డి, హోంమినిష్టర్ గా షాయాజీ షిండే, అన్సారీగా అతుల్ కులకర్ణి, రణదేవ్ గా మిలింద్ సోమన్, పోలీస్ కమీషనర్ గా ఆహుతి ప్రసాద్, ముఖ్యమంత్రిగా యం.సత్యన్నారాయణ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రంలోని సంగీతంలో కొత్తగా చేసిందేమీ లేకపోగా “జానేజా డూండుతా ఫిర్ రహా’’ అనే పాట హిందీ పాట ట్యూన్ ని “సాగనీ’’ అనే పాటలో, చివరి పాట ట్యూన్ కూడా హిందీ నుండే లిఫ్ట్ చేసి మక్కీకి మక్కీ కాపీ కొట్టారు, రీ-రికార్డింగ్ ఫరవా లేదు. ఫోటోగ్రఫీ బాగుంది. ముఖ్యమంత్రి స్థాయి మనిషి “ఇలాంటి పిచ్చి నాకోడుకులను ఏరేయ్ సత్యా’’ అనటం అంత బాగాలేదు. ఇక హోంమినిష్టర్ “ఎన్నో చంకలు నాకి పైకోచ్చాను’’, “అడుగున గొడ్డు కారం రాసుకున్నట్టుంది’’ వంటి మాటలు వినటానికి మాస్ కి బాగుంటాయేమో కానీ మహిళలు ఇవి వినటానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఉన్నంతలో బాగానే ఉంది. సినిమా ల్యాగ్ లేకుండా బాగానే కట్ చేశారు. చివరి పాట బాగుంది. రాజశేఖర్ ఒక పాటలో చేసిన డ్యాన్స్ అంత బాగా లేదు. హార్స్ మెన్ బాబు యాక్షన్ సీన్ల కంపోజింగ్ బాగుంది. మాస్ కి కావలసిన రేంజ్ లో ఈ చిత్రంలో యాక్షన్ ఉంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీరు గనుక ఒకవేళ ఖాకీ హిందీ చిత్రం చూస్తే ఈ చిత్రం చూడక్కరలేదు. లేకపోతె ఓ సారి చూడొచ్చు.