Read more!

English | Telugu

సినిమా పేరు:సరైనోడు
బ్యానర్:గీతా ఆర్ట్స్
Rating:2.25
విడుదలయిన తేది:Apr 22, 2016

 

ఇది వ‌ర‌కు అర‌వ యాక్ష‌న్‌ సినిమాలు కొన్ని డ‌బ్బింగ్ రూపంలోకి తెలుగులోకి వ‌చ్చేవి.
అందులో హీరో, విల‌న్‌.. వాళ్లిద్దరి ఫైటింగు. మ‌ధ్య‌లో బాగోద‌ని ఓ పాట‌. ఓ సీను. కొంచెం అర‌వ‌యాస‌కొట్టే కామెడీ.. సినిమా మొత్తం ఇలానే ఉండేది. అప్పుడెప్పుడో వ‌చ్చిన అర‌వ డ‌బ్బింగు సినిమాలు ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవ‌డం.. అంటారా?  స‌రైనోడు చూస్తే.. అప్ప‌టి అర‌వ సినిమా చూసిన‌ట్టే ఉంది మ‌రి.  ఇందులోనూ అంతే. ఓ హీరో. ఓ విల‌న్‌. విల‌న్ ఎప్ప‌ట్లా దుర్మార్గుడు. హీరో అప్ప‌ట్లానే మంచోడు. ఇద్ద‌రికీ మ‌ధ్య ఫైటింగు. చివ‌రికి విల‌న్ ఛ‌స్తాడు. హీరో గెలుస్తాడు. స‌రైనోడు సినిమా కూడా అంతే!  బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో, ర‌కుల్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా.. ఇలా బోల్డంత బిల్డ‌ప్ ఉన్న ఈ సినిమా.. తెర‌పై ఎలా వ‌చ్చింది. ఆ హీరో, విల‌న్ల ఫైటింగైనా రక్తి క‌ట్టిందా??  అది చూసి మ‌న మెద‌డు గ‌డ్డ‌క‌ట్టిందా?  తెలియాలంటే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే.

కథ :

అన‌గ‌న‌గా ఓ హీరో... అత‌నే అల్లు అర్జున్‌. చాలా మంచోడు. చెడ్డొల చెమ్నాలు తీస్తుంటాడు. నో కేస్‌.
అన‌గ‌న‌గా ఓ విల‌న్‌.. అత‌నే ఆది. చాలా చెడ్డొడు. ఎన్నో దుర్గార్మాలు చేస్తుంటాడు... నో కేస్‌.
అన‌గ‌న‌గా ఓ హీరోయిన్‌.. చాలా అందంగా ఉంటుంది. ఎమ్మెల్యేగా ప‌నిచేస్తుంది. హీరో ల‌వ్‌లో ప‌డేస్తాడు. అన‌గ‌న‌గా ఇంకో హీరోయిన్‌.. చాలా అందంగా ఉంటుంది. హీరో ల‌వ్‌లో ప‌డిపోతుంది.  కానీ చుట్టూ బోల్డ‌న్ని స‌మ‌స్య‌లు. వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు, ఆ స‌మ‌స్య‌ల‌కీ విల‌న్‌కీ, ఆ స‌మ‌స్య‌ల‌కీ హీరోకి ఏంటి సంబంధం అన్న‌దే క‌థ‌. ఇంత హింట్ ఇస్తే.. అస‌లు ఈ సినిమా క‌థ ఎలా మొద‌లైందో, ఎలా ఎండ్ అయ్యిందో ఈజీగా ఊహించేయొచ్చు. మ‌న ఊహ‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా సాగుతుంటుంది.

 


ఎనాలసిస్ :

అస‌లు ఈ క‌థ‌ని అల్లు అర్జున్ ఎలా ఒప్పుకొన్నాడా అన్న‌ది పెద్ద డౌటు. నిజానికి ఈ సినిమాలో క‌థేం లేదు. హీరో, విల‌న్ ల ఫైట్ త‌ప్ప‌. అదీ స‌రిగ్గా ఎలివేట్ కాలేదు. హీరో.. విల‌న్ ఇద్దరూ క‌లిసేది సినిమా మొద‌లైన రెండు గంట‌ల త‌ర‌వాత‌. మ‌ధ్య‌లో ముసుగులో గుద్దుటాల కార్య‌క్ర‌మ‌మ‌మే. ఓ పాట‌, ఓ ఫైటు, మ‌ధ్య‌లో కొన్ని సీన్లు.. మ‌ళ్లీ ఓ పాట‌.. ఓ ఫైటు సినిమాలో ఈ లెక్క ఎక్క‌డా త‌ప్ప‌లేదు. హీరో ఎమ్మెల్యే వెంట ఎందుకు ప‌డ‌తాడో అర్థం కాదు. ఆమె ప్రేమ‌లో ప‌డిపోయాక‌.. మ‌రో అమ్మాయిని మ‌ళ్లీ ఎలా ప్రేమిస్తాడో తెలీదు. కేథ‌రిన్ పాత్ర అలానే ఏడ్చింది. హీరోని పీక‌ల్దాకా ప్రేమించి.. ''నువ్వు నాకంటే.. ఆ అమ్మాయికే క‌రెక్ట్‌'' అని ఎందుకు మిడిల్ డ్రాప్ అయిపోతుందో తెలీదు. ఈ క‌థ‌ని త‌న‌కిష్టం వ‌చ్చిన‌ట్టు న‌డిపించేశాడు ద‌ర్శ‌కుడు. ర‌కుల్‌ని విల‌న్ గ్యాంగ్ కిడ్నాప్ చేసే సీన్ అయితే లాజిక్‌కు అంద‌దు. ర‌కుల్‌ని కిడ్నాప్ చేయ‌బోతే బ‌న్నీ వ‌చ్చి కాపాడిన‌ట్టు చూపిస్తారు. క‌ట్ చేస్తే... హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి విల‌న్ ముందుకు తీసుకెళ్తారు. అంటే.. మ‌ధ్య‌లో లింకు తెగిపోయింద‌న్న‌మాట‌. సినిమాకి ఎడిటింగ్ చేస్తున్న‌ప్పుడు ఆమాత్రం చూసుకోరా?  లాజిక్కులు వెదుక్కొంటూ పోతే.. సినిమా నిండా లోపాలే.  ప‌తాక స‌న్నివేశాలైతే.. `జ‌నాలు లాజిక్కులు ప‌ట్టించుకోరులే.. ఎలా తీసినా చూస్తారు.. `అని ఆ సీన్లు తీసిన‌ట్టుంది. ప్రేక్ష‌కుల‌పై మ‌రీ అంత చిన్న చూపా?  ఈ సినిమాలో ఫైట్లు కావ‌ల్సిన‌న్ని ఉన్నాయి. హీరో బిల్డ‌ప్ షాట్ల‌కు అంతూ పొంతూ ఉండ‌దు. స్టైల్ పేరుతో.. హీరోని స్లో మోష‌న్‌లో న‌డిపించ‌డం ఇంకెంత కాల‌మో?

అల్లు అర్జున్ మంచి పెర్‌ఫార్మ‌ర్‌. కానీ లాభం ఏముంది?  క‌థ‌లో ఆ ద‌మ్ముండాలి. హీరోయిజం బిల్డ‌ప్ షాట్స్‌తో ఎలివేట్ అవ్వ‌దు. స‌న్నివేశాల్లో బ‌లం ఉండాలి. అవి రెండూ లోపించిన సినిమా ఇది. అయినా స‌రే.. బ‌న్నీ త‌న వంతుగా సినిమాని లాక్కొచ్చి ఒడ్డున ప‌డేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఫైట్ల‌లో అద‌ర‌గొట్టాడు. డాన్సులూ ఆక‌ట్టుకొంటాయి. కొన్ని డైలాగులు మాస్‌కి బాగా న‌చ్చుతాయి. కేథ‌రిన్‌ని ఎమ్మెల్యేగా చూపించారు. అంతా బాగానే ఉంది. మ‌రీ ఎమ్మెల్యేలు అలాంటి డ్ర‌స్సులేసుకొంటారా?  ఈ సినిమా చూశాక ఏ ఎమ్మెల్యే మ‌నోభావాలూ  దెబ్బ‌తిన‌వా?? ర‌కుల్‌ని అంతంత మాత్ర‌మైన పాత్రే. శ్రీ‌కాంత్ త‌న అనుభ‌వాన్నంతా ఈ సినిమాకి ఉప‌యోగించాడు. ఆది న‌ట‌న‌. అత‌ని పాత్ర‌కు ఇచ్చిన ప్రాధాన్యం ఆక‌ట్టుకొంటాయి. అయితే.. అదీ బూడిద‌లో వేసిన ప‌న్నీరే.

త‌మ‌న్ పాట‌లు ఫాస్ట్ ఫాస్ట్‌గా సాగిపోయాయి. ఏం అర్థం కావు. అంజ‌లితో ఐటెమ్ సాంగ్‌లో మాత్ర‌మే బ‌న్నీలోని స్టెప్పుల్ని చూసే అవ‌కాశం ద‌క్కింది. ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయి. మ‌ధ్య‌లో సీన్ల‌కు సీన్లు లేపేసిన‌ట్టున్నారు. దాంతో కంటిన్యుటి దెబ్బ‌తింది. బోయ‌పాటి శ్రీ‌ను ఇప్ప‌టికైనా త‌న ఫార్ములాని దాటి బ‌య‌ట‌కు రావాలి. ప్ర‌తీ సినిమా ఒకేలా క‌నిపిస్తోంది. హీరో మారుతున్నాడంతే. ఫైట్ల‌పై పెట్టిన శ్ర‌ద్ద‌.. టేకింగ్‌పై పెట్టిన శ్ర‌ద్ద‌.. క‌థ‌, క‌థ‌నాల‌పై పెట్టుండే బాగుండేది.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మాస్ సినిమాలు, అందునా మాకు ఫైటింగులు ఉంటే చాలు అనుకొన్న‌వాళ్ల‌కు స‌రైనోడు న‌చ్చ‌తుంది. మేం బ‌న్నీ కోస‌మే సినిమా చూస్తాం అనుకొన్న‌వాళ్ల‌కూ న‌చ్చుతుంది. అంతే త‌ప్ప రేసుగుర్రంలా ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్ సినిమా చూద్దాం అనుకొంటే మాత్రం స‌రైనోడు సినిమాకి దూరంగా ఉండ‌డం మంచిది