Read more!

English | Telugu

సినిమా పేరు:సమ్మతమే
బ్యానర్:యూజీ ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jun 24, 2022

సినిమా పేరు: సమ్మతమే
తారాగ‌ణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ, సప్తగిరి, శివన్నారాయణ
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్ర‌ఫీ: సతీష్ రెడ్డి మాసం
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
నిర్మాత: కనకాల ప్రవీణ
ద‌ర్శ‌క‌త్వం: గోపినాథ్ రెడ్డి
బ్యాన‌ర్: యూజీ ప్రొడక్షన్స్
విడుద‌ల తేదీ: 24 జూన్ 2022

'రాజావారు రాణిగారు', 'SR కళ్యాణమండపం' సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'సెబాస్టియన్' సినిమాతో పలకరించి నిరాశపరిచాడు. నాలుగు నెలలకే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'సమ్మతమే'. గోపినాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ ఎందుకనో బజ్ క్రియేట్ కాలేదు. పైగా ప్రస్తుతం థియేటర్లలో చిన్న, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి అంతగా బాలేదు. మరి ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సమ్మతమే' చిత్రం ప్రేక్షకుల చేత సమ్మతమే అనిపించుకునేలా ఉందో లేదో తెలుసుకుందాం.

కథ:-

చిన్న వయసులోనే అమ్మను పోగొట్టుకున్న కృష్ణ(కిరణ్ అబ్బవరం).. తన ఇంట్లో మళ్ళీ వెలుగులు నిండాలంటే మహాలక్ష్మి లాంటి భార్య తన జీవితంలోకి రావాలని కలలు కంటుంటాడు. చిన్నప్పటి నుంచే పెళ్లి మీద ఇష్టం పెంచుకున్న కృష్ణ.. తండ్రి సూచనతో బాగా చదువుకొని, ఉద్యోగంలో చేరిన వెంటనే పెళ్ళికి సిద్ధమవుతాడు. అయితే తాను పెళ్లి చేసుకున్నాకే ప్రేమిస్తానని, అలాగే తనకు కాబోయే భార్యకు కూడా తనే ఫస్ట్ లవ్ అవ్వాలని అనుకుంటాడు. అలాగే తనను కాబోయే భార్య అసలు అబద్ధాలు ఆడకూడదు, అన్ని విషయాల్లో చాలా పద్ధతిగా ఉండాలంటూ ఏవేవో గొప్పగా ఊహించుకుంటాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్లుగా.. తనకు తెలియకుండానే తాను ఊహించుకున్న దానికి పూర్తి భిన్నమైన శాన్వి(చాందిని చౌదరి) ప్రేమలో పడతాడు. శాన్వి చాలా మోడరన్ గా ఉంటుంది. సిగరెట్, మందు లాంటి అలవాట్లు ఉన్నాయి. అబద్దాలు కూడా ఆడుతుంది. మరి అలాంటి శాన్వితో కృష్ణ ప్రేమలో ఎలా పడ్డాడు? శాన్వి కోసం తను మారిపోయాడా లేక శాన్వినే తనకు నచ్చినట్లు మార్చుకున్నాడా? అసలు రెండు భిన్న మనస్తత్వాలున్న వీరిద్దరూ ఒక్కటయ్యారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

మనకు నచ్చిన వ్యక్తిని లైఫ్ పార్టనర్ చేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ వ్యక్తి లైఫ్ ని మనం కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు. ఒకరిని మనం ఇష్టపడుతున్నామంటే వారి ఇష్టాలను మనం గౌరవించాలి. అంతేగాని మన ఇష్టాలను వారి మీద రుద్దుతూ, మనకి నచ్చినట్లు వాళ్ళని బ్రతకమంటూ.. వాళ్ళ లైఫ్ ని కూడా మనమే బ్రతికేయాలి అనుకోకూడదు. ఇది ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్. నిజానికి డైరెక్టర్ అనుకున్న పాయింట్ బాగుంది. అందుకు తగ్గట్లు హీరో, హీరోయిన్ పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. కానీ సెకండాఫ్ లోనే కాస్త తడబాటు కనిపించింది. లేదంటే సినిమా మరోలా ఉండేది.

ఫస్టాఫ్ నడిపించిన విధానం బాగుంది. చిన్నప్పుడు తల్లితో కృష్ణ బాండింగ్, తల్లి దూరమయ్యాక పెళ్లే తన గోల్ గా మారడం, పెద్దయ్యాక శాన్వితో పరిచయం.. ఇలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా సాగిపోయింది. ముఖ్యంగా కృష్ణ, శాన్వి మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పెద్దగా హడావిడి లేదు, పెద్ద పెద్ద డైలాగ్స్ లేవు. బోర్ కొట్టకుండా కూల్, సరదాగా ఫస్టాఫ్ నడిచింది.

ఫస్టాఫ్ తో పునాది బలంగా వేసిన దర్శకుడు కీలకమైన సెకండాఫ్ లో మాత్రం తడబడ్డాడు. కృష్ణ తను ఊహించుకున్న దానికి పూర్తి భిన్నమైన అమ్మాయితో ప్రేమలో పడటంతో, ఆ అమ్మాయిని తనకి నచ్చినట్లు మార్చుకోవాలి అనుకుంటాడు. మరోవైపు శాన్వి కూడా తనకి నచ్చినట్లు తను బ్రతకాలి అనుకుంటుంది, అదే టైములో కృష్ణని బాధపెట్టకూడదు అనుకుంటుంది. ఇద్దరి మధ్య డ్రామా నడిపించడానికి ఎంతో స్కోప్ ఉన్నప్పటికీ డైరెక్టర్ ఆ ప్లేని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఎక్కువగా మాంటేజ్ లతోనే చుట్టేశాడు. కీలకమైన సప్తగిరి ట్రాక్ కూడా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ పండగ పోగా, అతికించినట్లు అనిపించింది. మొత్తానికి సెకండాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలిగించింది. దర్శకుడు సెకండాఫ్ మీద మరింత శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా మంచి సినిమా అయ్యుండేది. ఈ సినిమాకి కథ, కథనంతో పాటు మాటలు కూడా దర్శకుడే అందించాడు. మాటల రచయితగా మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. చాలా సన్నివేశాల్లో మాటలు ఆకట్టుకున్నాయి.

సతీష్ రెడ్డి మాసం కెమెరా పనితనం బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ పర్లేదు. సాంగ్స్ వింటున్నప్పుడు బానే ఉన్నాయి కానీ హమ్ చేసుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగ్గట్లు ఉంది. ఎడిటర్ విప్లవ్ సెకండాఫ్ లో మరింత కోత పెట్టాల్సింది.

న‌టీన‌టుల ప‌నితీరు:-

పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు చేస్తూ అలరిస్తున్న కిరణ్ అబ్బవరం మరోసారి అలాంటి పాత్రలోనే నటించాడు. తన సహజ నటనతో మళ్ళీ మెప్పించాడు. తను ప్రేమించింది.. చిన్నప్పటి నుంచి తను ఊహించుకున్న అమ్మాయి కాదని తెలిసి.. తనను మార్చుకునే క్రమంలో కిరణ్ కనబరిచిన నటన ఆకట్టుకుంది. ఇక ఇందులో చాందినికి నటనకు స్కోప్ ఉన్న మంచి పాత్ర దక్కింది. ఒక వైపు తనకు నచ్చినట్లు బ్రతుకుతూ, మరోవైపు తనకు నచ్చిన వాళ్ళని బాధపెట్టకూడదు అనుకునే అమ్మాయి పాత్రలో చాందిని ఒదిగిపోయింది. సినిమాలో వీరిద్దరి పాత్రలే కీలకం. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, కానీ చెప్పడంతోనే కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ 'సమ్మతమే' అనేలా ఉంది. సెకండాఫ్ మాత్రం సాగదీతలా అనిపించింది. మొత్తానికి సినిమా ఒక్కసారి చూసేలా ఉంది.

-గంగసాని