Read more!

English | Telugu

సినిమా పేరు:రుద్రుడు
బ్యానర్:ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌
Rating:2.00
విడుదలయిన తేది:Apr 14, 2023

సినిమా పేరు: రుద్రుడు
తారాగణం: రాఘవ లారెన్స్‌, ప్రియా భవానీ శంకర్‌, శరత్‌ కుమార్‌, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్‌, కాళి వెంకట్
సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌
నేపథ్య సంగీతం: సామ్‌ సి.ఎస్‌
సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్ 
ఎడిటర్: ఆంటోనీ
ఫైట్స్: శివ
దర్శకుడు, నిర్మాత: కతిరేశన్‌
బ్యానర్: ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2023

కొరియోగ్రాఫర్ గా, యాక్టర్ గా, డాన్సర్ గా తమిళ్ తో పాటు తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ముఖ్యంగా 'కాంచన' సిరీస్ తో నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఆయన నటించిన 'రుద్రుడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లారెన్స్ గత చిత్రాల మాదిరిగా హారర్ సినిమా కాకపోవడం, దానికితోడు ట్రైలర్ కూడా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు ఏర్పడలేదు. మరి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందిన ఈ ఫిల్మ్.. ట్రైలర్ లాగే తేలిపోయిందా? లేక అలరించేలా ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

రుద్ర(రాఘవ లారెన్స్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి తన తల్లిదండ్రులే(నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్‌) ప్రపంచం. ఓ వైపు తన ఉద్యోగం, మరోవైపు తన తండ్రి ట్రావెల్స్ వ్యాపారంతో అతని జీవితం అందంగా సాగిపోతుంటుంది. ప్రేయసి అనన్య(ప్రియా భవాని శంకర్) రాకతో జీవితం మరింత అందంగా మారుతుంది. ఇక ఆమెని పెళ్లి చేసుకొని, కుటుంబంతో కలిసి ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న రుద్ర జీవితంలో కొన్ని అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. తన ఫ్రెండ్ తో కలిసి పెద్ద వ్యాపారం పెడదామని రుద్ర తండ్రి ఆరు కోట్లు అప్పు చేయగా.. ఆ డబ్బుతో ఫ్రెండ్ పారిపోతాడు. దీంతో ఆ బాధతో గుండెపోటుతో రుద్ర తండ్రి చనిపోతాడు. ట్రావెల్స్ అమ్మి కొంత అప్పు తీర్చిన రుద్ర.. మిగతా అప్పు తీర్చడం కోసం లండన్ వెళ్లి ఉద్యోగం చేస్తాడు. అప్పటికే లండన్ వెళ్లే ముందు అనన్యను పెళ్లి చేసుకుంటాడు రుద్ర. ఇప్పుడిప్పుడే కుటుంబం గాడిన పడుతుంది, అప్పులు తీరిపోయి మళ్ళీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండొచ్చు అని రుద్ర కలలు కంటుండగా.. అతన్ని ఊహించని విషాదాలు వెంటాడుతాయి. రుద్ర జీవితంలో తీరని విషాదానికి కారణమైన భూమి(శరత్ కుమార్) ఎవరు?.. అతని వల్ల రుద్ర తన వాళ్ళని ఎలా కోల్పోయాడు? భూమి గురించి తెలుసుకొని రుద్ర అతన్ని ఎలా అంతమొందించాడు? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

రుద్రుడు ట్రైలర్ చూసినప్పుడే ఇదొక రొటీన్ ఫిల్మ్ అని అర్థమైపోతుంది. ఇక సినిమా మొదలైన కాసేపటికే ఇందులో ఏమాత్రం కొత్తదనం లేదని తేలిపోతుంది. ఈ రొటీన్ కథని నమ్మి కతిరేశన్‌ సినిమాని నిర్మించడమే కాకుండా.. ఈ సినిమాతో దర్శకుడిగా కూడా మారాలి అనిపించేలా ఆయనకు ఈ కథలో ఏం నచ్చిందో అర్థంకాదు. సినిమా ప్రారంభమవ్వడమే ఊర మాస్ ఫైట్లతో స్టార్ట్ అవుతుంది. ఓ వైపు రుద్ర వరుస హత్యలు చేయడం చూపిస్తూ, మరోవైపు పారలల్ గా అతని గతాన్ని చూపిస్తారు. ఈ క్రమంలో రుద్ర ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు, ప్రేమ సన్నివేశాలు అలరించకపోగా.. విసుగు తెప్పిస్తాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఎప్పటి సినిమా చూస్తున్నామనే భావన కలుగుతుంది.

విలన్ వల్ల హీరో కుటుంబానికి అన్యాయం జరగడం, ఆ విలన్ పై హీరో రివేంజ్ తీర్చుకోవడం అనేది కొన్ని వందల సార్లు తీసేసి, చూసేసి బాగా అరిగిపోయిన కథ. అలాంటి పరమ రొటీన్ కథ తీసుకున్నప్పుడు.. ఆసక్తికరమైన కథనం, సన్నివేశాల్లో కొత్తదనం ఉండేలా అయినా చూసుకోవాలి. కానీ రుద్రుడు విషయంలో అలాంటి ప్రయత్నమే జరగలేదు. కథ లాగానే కథనం కూడా ఏమాత్రం ఆసక్తిగా లేకుండా సాగిపోయింది. ముఖ్యంగా ప్రథమార్థంలో వచ్చే మెజారిటీ సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, అలాగే సాధారణ క్రిమినల్ అయిన భూమి అంత డబ్బు ఎలా సంపాదించాడని చూపించిన ఆలోచన కొంతవరకు పరవాలేదు అనిపిస్తాయి. అయితే అవేవి సినిమాని గట్టెంకించలేవు. 

మామూలుగా లారెన్స్ సినిమాలంటే ప్రేక్షకులు డ్యాన్స్ లు ఆశిస్తారు. ఇందులోనూ ఓ రెండు పాటల్లో డ్యాన్స్ అదరగొట్టాడు. అయితే పాటలే పూర్తిగా తేలిపోయాయి. జి.వి. ప్రకాష్ స్వరపరిచిన ఒక్క పాట ఆకట్టుకోలేకపోయింది. ఒకట్రెండు పాటలైతే లిరిక్స్ కూడా అర్థంకాకుండా.. డప్పుల మోతతో గందలగోళంగా ఉన్నాయి. సామ్‌ సి.ఎస్‌ నేపథ్య సంగీతం బాగానే ఉంది. అయితే యాక్షన్ సన్నివేశాల్లో కొన్నిచోట్ల మోత ఎక్కువైపోయింది. అక్కడక్కడా 'అఖండ'లో థమన్ ని గుర్తు చేశాడు. ఈ సినిమాలో ఫైట్లు కూడా అఖండను గుర్తు చేసేలా ఉన్నాయి. స్టంట్ శివ ఫైట్లు ఊర మాస్ గా ఉన్నాయి. ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఆంటోనీ తన కూర్పుతో ఈ చిత్రాన్ని కాపాడటానికి కూడా ఏం లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

రుద్రగా లారెన్స్ నటన ఆకట్టుకుంది. ఉద్యోగం, కుటుంబం, స్నేహితులే ప్రపంచంగా బ్రతికే ఒక సాధారణ వ్యక్తి అయిన రుద్ర నుంచి రుద్రుడిగా మారే పాత్రలో లారెన్స్ చక్కగా రాణించాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో ఆయన ఆవేశాన్ని ప్రదర్శించినప్పుడు.. ఆ ముఖ కదలికలు ఆయన గతంలో నటించిన హారర్ సినిమాలలోని నటనను గుర్తు చేసేలా ఉన్నాయి. అనన్య పాత్ర పోషించిన ప్రియా భవాని శంకర్ కు నటిగా ప్రతిభ చూపించుకోవడానికి పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక భూమిగా శరత్‌ కుమార్‌ తన మార్క్ చూపించారు. అయితే ఆయన గెటప్ మీద, ముఖ్యంగా విగ్ మీద శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. రుద్ర తండ్రిగా నాజర్, తల్లిగా పూర్ణిమ భాగ్యరాజ్‌, స్నేహితుడిగా కాళి వెంకట్ రాణించారు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రొటీన్ కథని తీసుకొని, దానిని మరింత రొటీన్ గా తెరకెక్కించిన చిత్రం 'రుద్రుడు'. లారెన్స్ డ్యాన్స్ లు, ఊర మాస్ ఫైట్లు ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఈ సినిమా వైపు లుక్కేయొచ్చు. అంతకుమించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు.

-గంగసాని