Read more!

English | Telugu

సినిమా పేరు:రుద్ర‌మ‌దేవి
బ్యానర్:శ్రీమతి రాగిణి గుణ
Rating:2.75
విడుదలయిన తేది:Oct 9, 2015

ఊరంత ప‌ళ్లెంలో... ఓ ఆవ‌గింజంత అన్నం వ‌డ్డిస్తే..  క‌నిపిస్తుందా?
ఆవ‌గించంత ప‌ళ్లెంలో... ఊరి కి స‌రిప‌డా భోజ‌నం వ‌డ్డిస్తే... ఉప‌యోగం ఉందా?

సినిమా కూడా అంతే!   ఏ క‌థ‌ని ఎంత‌లో చెప్పాలి? ఏ క‌థ‌ని ఎంత చెప్పాలి?  అనే క్యాలిక్లేష‌న్స్ కూడా అత్య‌వ‌స‌రం. చాంతాడంత కాన్వాన్స్‌, గంపెడు మంది ఆర్టిస్టులో, అందులో లెక్క‌పెట్ట‌లేనంత మంది స్టార్లూ ఉంటే స‌రిపోదు. వాళ్ల‌ని వాడుకోవాలి. తీసుకొన్న క‌థ‌కీ... ఎంచుకొన్న కాన్వాస్ కీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన సినిమాలు బాహుబ‌లిలా భ‌ళా అనిపిస్తాయి. మ్యాచింగ్ త‌ప్పితే, రుద్ర‌మ‌దేవిలా ఉసూరుమ‌నిపిస్తాయి.( ఇక్క‌డ బాహుబ‌లికీ, రుద్ర‌మ‌దేవికీ పోలిక లేక‌పోవ‌చ్చు. కానీ ఈరెండూ భారీ కాన్వాసుపై తీర్చిదిద్దిన చిత్రాలే.. ! అందుకే ఈ పోలిక అవ‌స‌రం అనిపించింది)!

రుద్ర‌మ‌దేవి గురించి ఎప్పుడు చెప్పుకొన్నా - తొమ్మిదేళ్ల రిసెర్చ్‌, మూడేళ్ల క‌ష్టం అంటూ గుణ శేఖ‌ర్ ఏక‌రువు పెట్టేవాడు. అది నిజ‌మే కావ‌చ్చు. కానీ సినిమా చూస్తున్న  ఆడియ‌న్‌కి మాత్రం ఈ లెక్క‌లు ప‌ట్ట‌వు. అయ్యో క‌ష్ట‌ప‌డి తీసుంటాడు కాబ‌ట్టి సినిమా చూసేద్దాం అనుకోరు. న‌చ్చితే నే సినిమా చూస్తారు, లేదంటే లేదు. మ‌రి ఈ రుద్ర‌మ‌దేవిలో అంతగా న‌చ్చే విష‌యాలు ఏమున్నాయి?  గుణ క‌ష్టం ఫ‌లించిందా?  త‌న శ్ర‌మ తెర‌పై  ప్ర‌తిఫ‌లించిందా?  తెలియాలంటే రివ్యూలోకి అడుగుపెట్టాల్సిందే.

STORY:

కాకతీయ రాజు గ‌ణ‌ప‌తి దేవుడికి (కృష్ణంరాజు)కి వార‌సుల్లేరు. మ‌గ‌బిడ్డ పుడితే త‌ప్ప ఆ రాజ్యం క‌ష్టాలు గ‌ట్టెక్క‌వు అన్న‌ది రాజ్య ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. వాళ్లంతా.. మ‌గ‌బిడ్డే కావాల‌ని కోరుకొంటారు. ఆడ‌బిడ్డ పుడితే.. ఆ రాజ్యంపై దండెత్తి ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తుంటాడు దేవ‌గిరి రాజు సింగ‌న్న (రాజ మ‌రాద్‌). కొంత‌మంది సామంత రాజులు (సుమ‌న్‌, ఆదిత్య‌మీన‌న్‌) లు కూడా స‌రైన అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి క్లిష్ట‌మైన స‌మ‌యంలో గ‌ణ‌ప‌తి దేవుడి ఇంట ఆడ‌పిల్ల పుడుతుంది. ఆ శిశువుకు రుద్ర‌మ‌దేవి (అనుష్క‌) అని నామ‌క‌ర‌ణం చేస్తారు. అయితే రాజ్య ప‌రిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఆడ బిడ్డ అనే విష‌యాన్ని దాచి.. మ‌గ బిడ్డ రుద్ర‌దేవ యువ‌రాజుగా రాజ్య ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తారు. రుద్ర దేవ స‌క‌ల విద్య‌ల్లోనూ శిక్ష‌ణ తీసుకొంటూ.. రాజ్యాన్నిపాలించేందుకు అన్ని విధాలా స‌న్న‌ద్ధం అవుతాడు. కానీ.. తాను ఓ అమ్మాయిన‌న్న విష‌యం దాచిపెట్ట‌డం అంత సుల‌భం కాద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఆ గుట్టు బ‌య‌ట‌పెడితే.. శుత్రురాజులు యుద్దానికి దిగ‌బ‌డ‌తారు. రాజ్యంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోతుంది. ఈ ద‌శ‌లోనే గోన‌గ‌న్నారెడ్డి (అల్లు అర్జున్‌) సామంత‌రాజుల‌ను చంపుకొంటూ.. రుద్ర‌మ‌దేవికి స‌వాల్‌గా మార‌తాడు. మ‌రోవైపు చాణుక్య వీర‌భ‌ద్రుడు (రానా) రుద్ర‌మ‌దేవిని ప్రేమిస్తాడు. ఈ స‌మ‌యంలో రుద్ర‌మ ఎలాంటి నిర్ణ‌యం తీసుకొందా?  త‌న రాజ్యాన్ని ఎలా కాపాడుకొంది?  అనే విష‌యాల్ని తెర‌పై చూడాలి.


ఎనాలసిస్ :

చ‌రిత్ర‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించాల‌నుకోవ‌డం, అందుకోసం ఇన్నేళ్లు క‌ష్ట‌ప‌డ‌డం, ఎన్నో రిస్కుల్ని భ‌రించి ఈసినిమా తీయ‌డం... ఇవ‌న్నీ చూస్తుంటే గుణ‌శేఖ‌ర్‌ని అభినందించ‌కుండా ఉండ‌లేం. రిస్క్ అని తెలిసినా మూడేళ్ల నుంచీ ఇదే ప్రాజెక్టుకు త‌న జీవితాన్ని అర్పించాడు. ఈ క‌థ‌పై గుణ చాలా రిసెర్క్ చేశాడ‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. చ‌రిత్ర‌కు సంబంధించిన క‌థ‌లో చెప్పిన‌ప్పుడు అందులో క‌మ‌ర్షియాలిటీ గురించి ఆలోచించాల్సిందే. ఆ విష‌యంలో గుణ కూడా చాలా వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఎలా చెబుతారో, ఈ క‌థ‌నీ అలానే చెప్ప‌డం మొద‌లెట్టాడు. ఓ గంభీర‌మైన ప్రారంభం, ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టుతో విశ్రాంతి, ప్రీ క్లైమాక్స్ లో ఎమోష‌న్‌, ఓ భారీ యుద్దంతో సినిమాని ముగించ‌డం.. ఇదీ గుణ అల్లుకొన్న స్ర్కీన్ ప్లే.

అంటే ఈ క‌థ‌ని జ‌న‌రంజ‌కంగా చెప్ప‌డానికి కావ‌ల్సినంత స‌రంజామా మొత్తం సిద్ధం చేసుకొన్నాడ‌న్న‌మాట‌. దానికి తోడు అనుష్క‌, బ‌న్నీ, రానా, నిత్య‌మేన‌న్‌... ఇలా స్టార్ల‌కు కొద‌వ లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. తాను ఎంచుకొన్న అతి పెద్ద కాన్వాస్ కి కావ‌ల్సిన‌ట్టుగానే స్టార్ బ‌లం తోడైంది. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ చెప్ప‌ద‌ల‌చుకొన్న క‌థ‌ని భావోద్వేగ భ‌రితంగా మ‌ల‌చ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. రుద్ర‌మ‌దేవి చ‌రిత్ర‌లో కీల‌క‌మైన ఘ‌ట్టాల‌నే క‌థ‌గా తీసుకొన్నా.. వాటిని ప్ర‌భావ‌వంతంగా చూపించ‌డంలో త‌డ‌బడ్డాడు. అరె... గొప్ప‌గా తీశాడే అనిపించే స‌న్నివేశంగానీ, రోమాలు నిక్క‌బొడిచి - జ‌య‌హో రుద్ర‌మ అనిపించే సంఘ‌ర్ష‌ణ‌ను గానీ గుణ చూపించ‌లేక‌పోయాడు. దానికి తోడు.. విజువ‌ల్ గ్రాండిటీ.. తెర‌పై క‌నిపించ‌లేదు. అన్నీ బ్లూమేట్‌లో తీసిన స‌న్నివేశాలే. ఏది గ్రాపిక్కో, ఏది సెట్లో తీశారో, ఏది నేచుర‌ల్ లైటింగ్‌లో తీశారో ఇట్టే క‌నిపెట్టేస్తున్నారు ప్రేక్ష‌కులు. వాళ్ల‌కు ఈ సినిమా ఓ వీడియో గేమ్‌లా క‌నిపించినా ఆశ్చ‌ర్యం లేదు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రుద్ర‌మ‌దేవి, గోన‌గ‌న్నారెడ్డి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ల‌ను క‌మ‌ర్షియ‌ల్‌సినిమాలో హీరో, హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేసేంత రేంజులో తీశాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌లో క‌నీసం నాలుగైదు చోట్ల‌.. ఆ స్పీడ‌ప్ ఉంటే బాగుండేది. కానీ మొద‌టి స‌గం స్లోగా సాగింది. రెండో స‌గం వ‌చ్చేస‌రికి ఆ వేగం కూడా క‌నిపించ‌లేకుండా పోయింది. గోన‌గ‌న్నారెడ్డి పాత్రంటూ లేక‌పోతే, ఆ పాత్ర‌ని బ‌న్నీ చేయ‌క‌పోతే, తెలంగాణ మాండ‌లికంలో డైలాగులు చెప్ప‌క‌పోతే... ఈ సినిమాని అంత సేపు భ‌రించ‌డం క‌ష్టం. ఈ సినిమాని నిల‌బెట్టిన విష‌యం ఏదైనా ఉందీ అంటే.. అది గోన‌గ‌న్నారెడ్డి పాత్రే. ఆ పాత్ర‌ని గుణ బాగా వాడుకొన్నాడు. అల్లు అర్జున్‌లాంటి స్టార్ ఈ పాత్ర చేయ‌డానికి ముందుకొచ్చినందుకు, గుణ దాన్ని స‌క్ర‌మంగా వాడుకొన్నందుకు ఇద్దరూ అభినంద‌నీయులే. ఈ సినిమాలో బ‌న్నీ ఉన్న‌ప్పుడు ఉన్న కిక్‌, మిగిలిన స‌మ‌యాల్లో ఉండ‌దు. దాన్ని బ‌ట్టి బ‌న్నీ ఎంత హెల్ప్ అయ్యాడో అర్థం అవుతుంది. చాలామంది న‌టీన‌టులున్నా వాళ్లంతా గ్రూఫ్ ఫొటోల‌కే ప‌రిమితం అయిన‌ట్టు క‌నిపిస్తారు. మొహాల‌ను చూపించ‌డానికి అంత‌మందిని ఎందుకు తీసుకొన్నాడో గుణ‌కే తెలియాలి.

అనుష్క పాత్ర‌లో రెండు పార్శ్వాలున్నాయి. వాటిని స్వీటీ అద్భుతంగా ప‌లికించింది. త‌న క‌ష్టం అడుగ‌డుగునా తెలుస్తూనే ఉంది. కానీ ఆ పాత్ర కూడా ఎలివేట్ అవ్వాల్సినంత రీతిలో అవ్వ‌లేదంటే... అది గుణ‌శేఖ‌ర్ స్ర్కిప్టు లోప‌మే. రానా పాత్ర‌నీ స‌రిగా వాడుకోలేదు. బ‌న్నీ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. తెలంగాణ మాండ‌లికంలో పలికిన ప్ర‌తీ డైలాగ్ పేలింది. ప్రేక్ష‌కుల్ని కూర్చోబెట్టేది కూడా బ‌న్నీ పాత్రే. ఈ సినిమా తో క్రెడిట్ ఎవ‌రికైనా వ‌చ్చిందంటే అది బ‌న్నీకే. నిత్య‌మేన‌న్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకొనేలానే ఉంది. కేథ‌రిన్‌, హంసానందిని మొహాలు చూపించారంతే. కృష్ణంరాజు ఓకే. ప్ర‌కాష్‌రాజ్ సోష‌ల్ సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులా రెచ్చిపోయి డైలాగులు చెప్పాడు.

రుద్ర‌మదేవి ఆల్బ‌మ్ అంతా విన్నాక ఇది ఇళ‌య‌రాజా పాట‌లేనా అనిపిస్తాయి. అయితే తెర‌పై రెండు గీతాల్ని మాత్రం గుణ చాలా క‌ల‌ర్‌ఫుల్ గా తీర్చిదిద్దాడు. నేప‌థ్య సంగీతంలో రాజా మెరుపుల్లేవు. కెమెరామెన్ క‌ష్టం...అడుగడుగునా అర్థ‌మ‌వుతూనేఉంటుంది. తోట త‌ర‌ణి వేసిన‌వి సెట్లా, లేదంటే స్కెచ్చులానే అలా చూపించారా అనిపిస్తుంది. విజువ‌ల్ ఎఫెక్ట్ ఏమాత్రం గొప్ప‌గా లేవు. బాహుబ‌లి ముందు ఈ సినిమా వ‌చ్చుంటే ప్రేక్ష‌కుడు అదే గొప్ప అనుకొందుడేమో. ఇప్పుడు ఆ అవ‌కాశం కూడా లేదు. అన‌వ‌స‌రంగా వ‌చ్చిప‌డి పోయేపాట‌లు ఈ చిత్ర వేగాన్ని మ‌రింత త‌గ్గించాయి. క‌థ‌కుడిగా గుణ‌శేఖ‌ర్ కి మంచి మార్కులు ప‌డినా, ద‌ర్శ‌కుడిగా మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. కావ‌ల్సినంత ఎమోష‌న్‌కి డ్రామాని పండించే వీలున్నా... వాటిని స‌ద్వినియోగం చేసుకోలేదు.

గోన‌గ‌న్నారెడ్డిగా బ‌న్నీ న‌ట‌న‌, అనుష్క శ్ర‌మ‌, రుద్ర‌మ‌దేవి చ‌రిత్ర‌పై ఉన్న గౌర‌వం.. ఈవే ఈసినిమాకి కాపాడాలి. ఈసినిమాకి ఎన్ని వ‌సూళ్లు వ‌చ్చినా.. దానికి కార‌ణం మాత్రం.. ఈ మూడు విష‌యాలే!