Read more!

English | Telugu

సినిమా పేరు:రోజులు మారాయి
బ్యానర్:గుడ్ ఫ్రెండ్స్
Rating:1.50
విడుదలయిన తేది:Jul 1, 2016

మారుతి బ్రాండ్ సినిమాలంటే థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఉంటుంది. అయితే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా మారడం, "భలే భలే మగాడివోయ్" తర్వాత మారుతి కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన సినిమా కావడంతో "రోజులు మారాయి" అనే సినిమాపై అంచనాలు పెరిగాయి. "కేరింత" ఫేమ్ పార్వతీశం, చేతన్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో "దృశ్యం" ఫేమ్ కృతిక, "ఐస్ క్రీమ్" ఫేమ్ తేజస్వి హీరోయిన్లుగా నటించారు. అసలు "రోజులు మారాయి" అనే టైటిల్ కు జస్టిఫికేషన్ ఏమిటి? ఎవరికి "రోజులు మారాయి" ?? వంటి విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే..!!

కథ:

సత్య (కృతిక), రంభ (తేజస్వి) ఒకే హాస్టల్ లో ఉంటూ ఉద్యోగాలు చేసుకొంటుంటారు. మనస్తత్వాలు వేరైనా ఇద్దరూ పయనించే మార్గం మాత్రం ఒకటే. ఒకరితో ప్రేమ నటిస్తూ, వారి నుంచి డబ్బును గుంజుతూ.. మరొకరిని ప్రేమిస్తుంటారు. ఒకానొక సందర్భంలో శ్రీశైలం దగ్గర్లోని ఒక బాబాని కలుసుకొన్న వారికి తమను పెళ్లి చేసుకొన్నవారు మూడు రోజుల్లో మరణిస్తారనే చేదు నిజం తెలుస్తుంది. అప్పుడు అమ్మాయిలిద్దరూ వాళ్ళు ప్రేమించేవారిని కాకుండా వారిని ప్రేమిస్తున్నవారిని పేళ్లాడి ఆ జాతక దోషం నుంచి బయటపడాలని ఫిక్స్ అవుతారు.

జాతక దోష ప్రభావం కారణంగా పీటర్ (పార్వతీశం), అశ్వధ్ (చేతన్)లు తమ ప్రాణాలను పోగొట్టుకొన్నారా?

సత్య, రంభలు తాము ప్రేమించినవారిని పెళ్లి చేసుకోగలిగారా? లేదా? అన్నది క్లుప్తంగా "రోజులు మారాయి" కథాంశం!

 


ఎనాలసిస్ :

 

నటీనటుల పనితీరు:

పీటర్ పాత్రలో ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకుల చేత వీరాలెవల్లో నవ్వించేశాడు పార్వతీశం. విజయనగరం స్లాంగ్ లో పీటర్ చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కు బాగా ఎక్కుతాయి. అశ్వధ్ పాత్రలో హీరోగా పరిచయమైన చేతన్ కు నటించడం రాదని, అది బయటపడకుండా ఉండడానికి వీరాలెవల్లో ప్రయత్నిస్తున్నాడని పరిచయ సన్నివేశంలోనే అర్ధమైపోతుంది. సినిమా మొత్తం మనోడి అర్ధాంకాని, లేని ఎక్స్ ప్రెషన్ ను చూడడానికి ఆడియన్ కాస్త ఇబ్బంది పడాల్సిందే. సత్య అనే సహృదయం గల యువతిగా నటించిన కృతిక ఇప్పటికే రెండు సినిమాల్లో నటించినప్పటికీ.. హావభావాల ప్రదర్శనలో ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదన్నని వాస్తవం. అసలు అమ్మాయి మొఖంలో బాధ, ఆవేదన లాంటి ఫీలింగ్స్ ను సన్నివేశం బట్టి అర్ధం చేసుకోవాలే కానీ.. చూస్తే మాత్రం తెలియవు. అందర్లోకంటే సీనియర్ అయిన తేజస్వి మాత్రం నటన పరంగానే కాకుండా గ్లామర్ షో తోనూ అలరించింది. పార్వతీశం-తేజస్విల కాంబినేషన్ సీన్స్ హిలేరియస్ గా సాగుతాయి. బంచిక్ బాబాగా ఆలీ కామెడీకి థియేటర్ లో నవ్వినవాళ్ళెవరూ లేరు.

సాంకేతికవర్గం పనితీరు:

జె.బి సమకూర్చిన బాణీల్లో కొత్తదనం ఎక్కడా లేదు. రోమాంటిక్ సాంగ్ "ప్రేమకథా చిత్రమ్"లో రీమిక్స్ సాంగ్ ను తలపించగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ "బస్టాప్" సినిమాలోనిది కావడం గమనార్హం. రామ్ రెడ్డి ఫోటోగ్రఫీ కలర్ ఫూల్ గా ఉంది. కానీ.. లైటింగ్ తో సన్నివేశానికి అవసరమైన మూడ్ ను క్రియేట్ చేయడంలో విఫలమయ్యాడు. రవివర్మ నంబూరి సంభాషణలు ట్రెండీగా ఉన్నప్పటికీ.. డబుల్ మీనింగ్ డైలాగులు కొన్ని చోట్ల మరీ శ్రుతి మించాయి. ఇక రచయిత ప్రాసల కోసం పడిన పాట్లు అన్నీయిన్నీ కావు.

టైటిల్ కార్డ్స్ లో "కథ-స్క్రీన్ ప్లే: మారుతి" అని అంత ప్రత్యేకంగా ఎందుకు వేయించుకొన్నాడో అసలర్ధం కాదు. ఈ సినిమాకి మైనస్ లుగా మారినవి ఆ రెండే. కథ మొత్తం ఫస్టాఫ్ లోనే అయిపోతుంది. ఇక సెకండాఫ్ గంటసేపు సాగదీసిన విధానం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. కథేమీ కొత్తది కాదు.. అప్పుడెప్పుడో వచ్చిన "ఏమండీ ఆవిడోచ్చింది" సినిమా మొదలుకొని మొన్న వచ్చిన "మిత్రుడు" వరకూ చాలా సినిమాల్లో ఈ తరహా "జాతకం" కథలను చూసేసాం.

దర్శకుడిగా మురళీకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేయడంలో దారుణంగా విఫలమయ్యాడు. సినిమా మొత్తం చూశాక మారుతియే దర్శకత్వం వహించేశాడేమో అనిపించకమానదు. ఇక సెకండాఫ్ లో వచ్చే హాస్టల్ ఎపిసోడ్, హారర్ కామెడీ ఎపిసోడ్ లు దర్శకుడి ప్రతిభకు తార్కాణాలుగా పేర్కొనాలో, అతడు ఇంకా పది సంవత్సరాలు వెనకే ఆగిపోయాడనుకోవాలో అర్ధం కాదు. మారుతి అందించిన స్క్రీన్ ప్లేలో క్లారిటీ లేక దర్శకుడు కూడా ఆయన చెప్పినట్లే తీసేశాడు తప్పితే.. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి మాత్రం కాదని సెకండాఫ్ మొత్తం తెలుస్తూనే ఉంటుంది.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఆడుకోవడమనే బేసిక్ కాన్సెప్ట్ ను తీసుకొని.. దానికి జాతకం అనే మరో అంశాన్ని జోడించి కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మరియు ఫేస్ బుక్ ట్రెండింగ్ జోకులు మిక్స్ చేసేస్తే ఆడియన్స్ సినిమాను హిట్ చేసేస్తారని ఆలోచించడం ఎంత పెద్ద తప్పో "రోజులు మారాయి" చూస్తే అర్ధమైపోతుంది. గంట సేపట్లో అయిపోయే సినిమాను రెండు గంటలు సాగదీయడం "రోజులు మారాయి" చిత్రానికి పెద్ద మైనస్. పార్వతీశం-తేజస్విల కాంబినేషన్ సీన్స్ మినహా సినిమాలో ఎంటర్ టైనింగ్ సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. ముఖ్యంగా "దృశ్యం" సినిమాను కాపీ కొట్టే సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. ఇక ఆలీ ఎపిసోడ్ మొత్తం ఎడిటింగ్ లో లేపేసినా సినిమాకి కొంచెం కలిసొచ్చేదేమో అనిపించకమానదు. ఫస్టాఫ్ మొత్తం పార్వతీశం చెప్పే డబుల్ మీనింగ్ పంచ్ డైలాగులు ఓ మోస్తరుగా నవ్వించినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం బోర్ కొట్టేస్తుంది. సో.. సెకండాఫ్ ను ఓపిగ్గా భరించగలిగే ఓపిక ఉండి డబుల్ మీనింగ్ డైలాగులు ఎంజాయ్ చేసే పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మినహా మరెవరినీ మెప్పించలేని చిత్రం "రోజులు మారాయి"!