Read more!

English | Telugu

సినిమా పేరు:రైడ్
బ్యానర్:శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jun 5, 2009
మహేష్(తనీష్) బికామ్ సెకండ్ ఇయర్ చదువుతూ, తండ్రి (కాశీ విశ్వనాథ్) ఆరోగ్యం బాగోకపోవటం వల్ల, ఇల్లు జరుగుబాటు కోసం చదువు మానేసి, ఒక కంపెనీలో కలేక్షన్ బోయ్‌లా చేరతాడు.ఆ ఉద్యోగం కావాలంటే బైక్ తప్పనిసరిగా ఉండాలంటాడు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి (బ్రహ్మానందం). అతని తల్లి (తులసి) దేవుడికి దీపారాధన చేసే వెండి కుందులు అమ్మేసి ఆ బైక్‌ని మహేష్‌కి కొనిస్తుంది. ఇలా కలేక్షన్‌కి వేళ్ళిన ఒకచోట విచిత్ర పరిస్థితుల్లో రాణి (శ్వేతబసు ప్రసాద్) కలుస్తుంది. వీరి పరిచయం పెరిగి ప్రేమకు దారితీస్తుంది. ఒకసారి మహేష్ తండ్రికి గుండేనొప్పి రావటంతో, మహేష్ తల్లి అతన్ని హాస్పిటల్లో చేరుస్తుంది. అప్పుడు మందుల కోసం వెళ్ళిన మహేష్ బైక్‌ని ఎవరో దొంగిలిస్తారు. బైక్ గురించి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదుఇదిలా ఉంటే అర్జున్ (నాని)కి బైక్‌ అంటే పిచ్చి ప్రేమ. అతను బైక్ కోసం తన తండ్రి (ఆహుతి ప్రసాద్‌‍)ని అడుగుతుంటాడు. కానీ అతను కొనివ్వడు. ఇలా ఉండగా అర్జున్ తన క్లాస్‌మేట్‍ పూజ (అక్ష)ని బైక్ మీద ఎక్కించుకుని తిరుగుతుంటాడు. ఆ బైక్ మహేష్‌ది. ఒకసారి మహేష్ తన బైక్‌ని అర్జున్ వేసుకెళ్ళటం చూసి దాన్ని ఎత్తుకెళ్తాడు. అక్కడ మహేష్‌కీ, అర్జున్‌కీ గొడవ మొదలవుతుంది. అర్జున్ తన స్నేహితులతో వచ్చి మహేష్‌ని కొట్టి బైక్ తీసుకెళ్తాడు. దాంతో మహేష్ తన స్నేహితులతో అర్జున్ ఇంటికి వెళ్ళి తన బైక్‌ని అర్జున్ దొంగిలించాడని, అర్జున్ తండ్రితో చెప్పి తన బైక్‌ణి తాను తీసుకెళ్తాడు.అసలు ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నిజానికి ఆ బైక్‌ని అర్జున్ దొంగిలించడు. ఒక బైక్ రేసులో గెల్చిన డబ్బుతో ఆ బైక్‌ణి అర్జున్ సెకండ్ హ్యాండ్ మార్కేట్‍లో ఇరవై వేలకి కొంటాడు. ఆ విషయం తెలిసిన మహేష్ స్నేహితులు, అర్జున్ స్నేహితులు ఈ విషయం మీరిద్దరే తేల్చుకోండని సలహా ఇస్తారు. అప్పుడు అక్కడే గుళ్ళో ఉన్న పూజారి ఈ బైక్‌ని రోజులో మధ్యాహ్నం వరకు ఒకరూ, మధ్యాహ్నం నుంచి మరొకరు ఉపయోగించుకోమని సలహా ఇస్తాడు.అలా ఆ ఇద్దరూ ఆ బైక్‌ని వినియోగించుకుంటుంటే ఒకరోజు ఒక వ్యక్తి కొంత మందితో వచ్చి అర్జున్‌ని కొట్టి పడేస్తాడు. అది గమనించిన మహేష్ అతన్ని హాస్పిటల్లో చేరుస్తాడు. అప్పటి నుంచీ ఆ ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. అర్జున్‌ని కొట్టిన వ్యక్తి చెల్లెలు పూజ, అతను ప్రేమించిన అమ్మాయి రాణి. మహేష్, అర్జున్ ఇద్దరూ తనకు కావలసిన అమ్మాయిలను తనకు దక్కకుండా చేయటంతో అతను వీళ్ళ బైక్‌ని ఎత్తుకెళ్ళి వీళ్ళిద్దరితో ఆట మొదలెడతాడు. ఆ ఆట ఏమిటి..? చివరికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి
ఎనాలసిస్ :
దర్శకత్వం టేకింగ్ పరంగా బాగుంది. కానీ తన బైక్‌ని అర్జున్ నుంచి మహేష్ దొంగతనంగా తీసుకెళ్ళాల్సిన అవసరమేంటో అర్థం కాదు. అలాగే షోరూంలో బైక్ కొన్న వ్యక్తి మహేష్ తన బండి కాగితాలు చూపించి పోలీసులను తీసుకొచ్చి హ్యాపీగా అధికారికంగా తీసుకెళ్లవచ్చు. అర్జున్‌కి ఆ బైక్ మీద నిజానికి ఎలాంటి హక్కూ ఉండదు.అదీ దొంగతనంగా తెచ్చిన బైక్‌ని కొన్న వాడికి అసలు ఓనర్‌ని ఎదిరించే నైతిక హక్కు, అధికారం అసలుండదు. ఇది చాలా సింపుల్‍ లాజిక్. ఈ పాయింట్‍ దర్శకుడు ఏలా మిస్సయ్యాడో అర్థం కాదు. ఒక వేళ హైదరాబాద్ స్టైల్లో అలాగే జరుగుతుందేమో మరి.ఇక గజ ఈ ఇద్దరు మిత్రుల్ని బచ్చా గాళ్ళని చేసి బైక్‌తో ఆడుకోవటం అనవసరమైన పొడిగింపు. ఆ సీన్ల ప్రయోజనం పెద్దగా లేదనేచెప్పాలి. దాన్ని మరో విధంగా ప్లాన్ చేసుంటే ఇంకా బాగుండేదేమో. ఇద్దరు హీరోల కుటుంబాల్లోని మానవ సంబంధాలు దర్శకుడు బాగా చిత్రీకరించాడు. కొన్ని సందర్భాల్లో మనసుకి హత్తుకునే విధంగా ఆ సీన్లను చిత్రీకరించాడు దర్శకుడు. ముఖ్యంగా కాశివిశ్వనాథ్, తనీష్ నిద్రపోతున్నప్పుడు వచ్చి కాళ్ళు పట్టే సీను, ఆహుతి ప్రసాద్ పిల్లల కోసమే జీవితం అనే సీను బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: తనీష్‌కి యువ హీరోగా మంచి భవిష్యత్తుంది. అలాగని నాని బాగా చేయలేదని కాదు. ఇద్దరూ ఏవరి స్టైల్లో వారు బాగానే నటించారు. శ్వేతాబసుప్రసాద్‍చెప్పే "ఓరి నాయనో" డైలాగ్ మాడ్యులేషన్ కొంచెం బాగానే ఓవరనిపించింది. అక్ష కొన్ని సీన్లలో బాగా గ్లామర్‌గా కనిపించింది. కొన్ని సీన్లలో ముఖంలో కళా కాంతులు లేకుండా కనిపించింది. సీనియర్ నటి తులసి పాత్ర చిన్నదైనా చాలా చక్కగా నటించింది. సుధ కూడా అంతే. ఇక తనీష్ స్నేహితుడు, బ్రహ్మానందం బావమరిది పాత్రలో నటించిన యువకుడికి మంచి ఈజ్‍ ఉంది. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన పాత్ర వరకూ తాను బాగానే పోషించాడు. సంగీతం -: తొలిసారిగా సంగీత దర్శకుడిగా మారిన గాయకుడు హేమచంద్ర ఈ చిత్రానికి మంచి సంగీతం అందించాడనే చెప్పాలి. పాటలన్నీ నేటి యుతకు బాగా నచ్చే విధంగా ఉన్నాయి. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన "మంగమ్మగారి మనవడు'' చిత్రంలోని "దంచవే మేనత్త కూతురా..'' అనే సాంగ్‌ని ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఈ పాట వినటానికి చాలా బాగుంది. రీ-రికార్డింగ్ కూడా బాగుంది. తెలుగు సినిమాకి హేమచంద్ర రూపంలో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడని చెప్పాలి. కెమెరా -: సీనియర్ కేమెరామేన్ శ్యామ్‌ కె. నాయుడు గురించి కొత్తగా రాసేదేముంది. చాలా బాగుంది. యాక్షన్ -: రామ్-లక్ష్మణ్‍, అలెన్ అమీన్ కంపోజ్‍ చేసిన యాక్షన్‍ సీన్లు ఒ.కె. ఎడిటింగ్ -: బాగుంది. ఆర్ట్ -: ఒ.కె. కొరియోగ్రఫీ -: నీట్‍గా ఉంది. లాజిక్కులకు పోకుండా ఏదో సరదాగా సినిమా చూద్దామనుకుంటే ఈ సినిమా చూడండి.