Read more!

English | Telugu

సినిమా పేరు:రంగబలి
బ్యానర్:శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
Rating:2.25
విడుదలయిన తేది:Jul 7, 2023

సినిమా పేరు: రంగబలి
తారాగణం: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో, శరత్‌ కుమార్‌, గోపరాజు రమణ, మురళి శర్మ, బ్రహ్మాజీ, సప్తగిరి, శుభలేఖ సుధాకర్, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, భద్రం, నోయెల్
సంగీతం: పవన్‌ సి.హెచ్‌
సినిమాటోగ్రాఫర్: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రచన, దర్శకత్వం: పవన్ బసంశెట్టి
నిర్మాత: సుధాక‌ర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీ: జూలై 07, 2023 

ఇటీవల టీజర్, ట్రైలర్ కంటే కుండా ప్రమోషనల్ కంటెంట్ తో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'రంగబలి'. 2018 లో వచ్చిన 'ఛలో' తరువాత నాగశౌర్యకి ఆ స్థాయి విజయం దక్కలేదు. 'రంగబలి' కూడా 'ఛలో' తరహాలోనే యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో మరోసారి శౌర్య ఆ స్థాయి మ్యాజిక్ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి ఈ 'రంగబలి' సినిమా ఎలా ఉంది? శౌర్యకు ఘన విజయాన్ని అందించేలా ఉందా?...

కథ:
శౌర్య అలియాస్ షో(నాగశౌర్య)కి తన ఊరు రాజవరం అంటే ఎంతో ఇష్టం. మొసలికి నీళ్ళల్లో బలం ఎలాగో, తనకి తన ఊరే బలమని చిన్న వయసులోనే తెలుసుకున్న షో.. చావైనా బ్రతుకైనా ఊళ్లోనే అని నిర్ణయించుకుంటాడు. షో తండ్రి(గోపరాజు రమణ) 20 ఏళ్లుగా అదే ఊరిలో రంగబలి సెంటర్ లో మెడికల్ షాప్ నడుపుతుంటాడు. తన తర్వాత ఆ షాప్ బాధ్యత షో చూసుకోవాలనేది తండ్రి ఆలోచన. అయితే పేరుకి బి ఫార్మసీ చదివిన షో, ప్రిస్క్రిప్షన్ చూసి కూడా మెడిసిన్స్ ఇవ్వలేడు. దీంతో వైజాగ్ లోని తన ఫ్రెండ్ మెడికల్ కాలేజ్ లో ట్రైనింగ్ కోసం షోని కొద్ది నెలలు అక్కడికి పంపాలని తండ్రి భావిస్తాడు. పొద్దున లేస్తే తెల్ల చొక్కా వేసుకొని గొడవకు పోవడం, సాయంత్రమైతే ఫ్రెండ్స్ తో కలిసి మందు కొట్టడం.. ఇదే ప్రపంచంగా బ్రతికే షోకి ఆ ప్రాంత ఎమ్మెల్యే పరశురామ్(షైన్ టామ్ చాకో) అనుచరుడిగానూ ఊరిలో పేరుంది. ఇలా ఊరిలో తనే కింగ్ అనుకునే షో కి, ఊరు వదిలి వెళ్ళడం ఇష్టముండదు. కానీ తను ఊరిలోనే సెటిల్ అవ్వాలంటే మెడికల్ షాప్ చూసుకోవడం తప్ప వేరే దారి లేదని గ్రహిస్తాడు. దాంతో నాలుగు నెలల ట్రైనింగ్ కోసం వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా) అనే స్టూడెంట్ దగ్గర మెడిసిన్స్ పాఠాలతో పాటు ప్రేమ పాఠాలు కూడా నేర్చుకుంటాడు. తక్కువ సమయంలోనూ ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. సహజ తండ్రి(మురళి శర్మ)కి కూతురంటే ప్రాణం. ఆమె షోని ప్రేమించానని చెప్పగానే మొదట పెళ్ళికి ఒప్పుకుంటాడు. కానీ షో ది వైజాగ్ కాదు, రాజవరం అని తెలియగానే సహజ తండ్రి పెళ్ళికి నో చెప్తాడు. ఇప్పుడు షో ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఊరు వదిలి రావడం, లేదా ఊరిలో ఉన్న రంగబలి సెంటర్ పేరు మార్చడం. ఊరు వదలడం ఏమాత్రం ఇష్టంలేని షో, రంగబలి సెంటర్ పేరు ఎలాగైనా మార్చాలి అనుకుంటాడు. అసలు రంగబలి సెంటర్ కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ సెంటర్ కి షో ప్రేమకథకి సంబంధం ఏంటి? రంగబలి సెంటర్ పేరు మార్పు కోసం అప్పటిదాకా కలిసి తిరిగిన వాళ్ళతోనే పోరాడాల్సిన పరిస్థితి షోకి ఎందుకు వచ్చింది? షో తాను అనుకున్నట్లుగా రంగబలి సెంటర్ పేరు మార్చి తన ప్రేమని గెలిపించుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

మంచి విషయాల కంటే చెడు విషయాలే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. మంచి కంటే చెడు విషయాలనే మనం ఎక్కువ పట్టించుకుంటాం, చెడు విషయాల వెనకే పరుగెడుతుంటాం. ఒక మనిషి చేసిన వంద మంచి పనుల కంటే, అతని వల్ల జరిగిన ఒక చెడే ఎక్కువ గుర్తుంటుంది. హింస, చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా, మంచి విషయాల గురించి మాత్రమే మాట్లాడుకుంటే మంచిదనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడు పవన్ బసంశెట్టి చెప్పాలనుకున్నాడు. ఆయన ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ, దానిని ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు.

ప్రథమార్థం హీరో చైల్డ్ ఎపిసోడ్ తో ప్రారంభమవుతుంది. హీరోకి గొడవలు, ఊరు అంటే ఎంత ఇష్టమో బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే హీరో గొడవ అనగానే పరుగెత్తుకుంటూ వెళ్లడం నాగశౌర్య నటించిన 'ఛలో' సినిమాని గుర్తు చేస్తుంది. అందులో గొడవలు అంటే ఇష్టముండే హీరోని చదువు పేరుతో వేరే ఊరికి పంపిస్తాడు అతని తండ్రి. అక్కడ హీరోయిన్ తో ప్రేమలో పడిన హీరో, ఆ ప్రేమ కారణంగా ఒక పెద్ద గొడవలో ఇరుక్కుంటాడు. రంగబలి ప్రథమార్థం కూడా ఇంచుమించు అదే లైన్ లో నడుస్తుంది. ఊరిలో ఉండి గొడవలే ప్రపంచంగా బ్రతికే హీరోని అతని తండ్రి ట్రైనింగ్ కోసం వైజాగ్ కి పంపుతాడు. అక్కడ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ కారణంగా రంగబలి సెంటర్ పేరు మార్చాలనే గొడవలోకి దిగుతాడు. అయితే ప్రథమార్థంలో 'ఛలో' విషయాన్ని మర్చిపోయేలా, అసలు కథ ఏంటనే ఆలోచన రాకుండా సత్య కామెడీ మ్యాజిక్ చేసింది. ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటే తట్టుకోలేని అగాధం అనే పాత్రలో సత్య కనిపించాడు. ఆ పాత్రతో అతను నవ్వులు పూయించాడు. ఫస్టాఫ్ చూస్తున్నంతసేపు అతనే సినిమాకి సెకండ్ హీరో అనిపిస్తుంది. అంతలా నవ్వించాడు. అయితే కొన్ని కొన్ని కామెడీ సన్నివేశాలు వెగటుగా ఉన్నాయి. కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు కుటుంబ ప్రేక్షకులు ఇబ్బంది పడేలా ఉన్నాయి. అలాంటి సంభాషణలు లేకుండా క్లీన్ కామెడీ అందించే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఆ కొన్ని సంభాషణలు పక్కన పెడితే ఫస్టాఫ్ మాత్రం బాగానే నవ్వించింది.

ద్వితీయార్థంలోనే అసలైన రంగబలి కథ ఉంటుంది. అయితే ఫస్టాఫ్ ని కామెడీతో బాగానే లాక్కొచ్చిన దర్శకుడు.. సెకండాఫ్ లో అసలైన కథలోకి ప్రవేశించాక మాత్రం అడుగడుగునా తడబడ్డాడు. ఫస్టాఫ్ లో కథతో సంబంధం లేకుండా బాగానే నవ్వుకున్న ప్రేక్షకులు, సెకండాఫ్ లో ఒక్కసారిగా కథ సీరియస్ టర్న్ తీసుకోవడంతో అంతగా కనెక్ట్ కాలేరు. పైగా రంగబలి సెంటర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకునేలా లేదు. ఓల్డ్ టెంప్లేట్ లో సాగింది. సెకండాఫ్ లో ఒకానొక సమయంలో అసలు ఇందులో నాగశౌర్య హీరోనేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. దానిని కవర్ చేయడం కోసమే అన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో నాగశౌర్యకి సంబంధం ఉన్నట్టుగా చూపించారు. కానీ అది అంతగా అతికినట్లు లేదు. పైగా ఇందులో నాగశౌర్యకి సరైన ప్రత్యర్థి కూడా లేడు. ఎమ్మెల్యే పరశురామ్(షైన్ టామ్ చాకో) పాత్రని సరిగా మలచలేదు. ఆ పాత్ర కమెడియన్ కి ఎక్కువ, విలన్ గా తక్కువ అన్నట్టుగా ఉంది. సినిమాని ముగించిన తీరు కూడా మెప్పించదు. ఏదో నాలుగు మాటలు చెప్పి కంగారు కంగారుగా ముగించినట్లు ఉంది.

ఫస్టాఫ్ చూస్తే దర్శకుడుకి మంచి కామెడీ సెన్స్ ఉందని తెలుస్తుంది. దృష్టి పెడితే అతను మంచి ఎంటర్టైనర్స్ ని అందించగలడు. అలాగే కమర్షియల్ సినిమాకి అవసరమైన విజువలైజేషన్ కూడా అతనికి ఉంది.. కానీ దానిని తెరమీదకు ఆకర్షణీయంగా తీసుకొచ్చే అనుభవం లేదని సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది. 

పాటలతో మెప్పించలేకపోయిన పవన్‌ సి.హెచ్‌.. నేపథ్య సంగీతంతో మాత్రం పరవాలేదు అనిపించుకున్నాడు. పాటల చిత్రీకరణ బాగానే ఉన్నప్పటికీ.. అసందర్భంగా రావడం, పాటలు వినసొంపుగా లేకపోవడంతో దాదాపు పాటలన్నీ పంటికింద రాళ్ళలాగే అనిపించాయి. దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం బాగానే ఉంది. సెకండాఫ్ లో డైరెక్షన్ తో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తడబాటు కూడా కాస్త కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో నాగశౌర్య స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామెడీ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు. ఈ సినిమా కోసం అతను పడిన కష్టం తెర మీద కనిపించింది. సహజగా యుక్తి తరేజా బాగానే రాణించింది. అందం, అభినయంతో మెప్పించింది. ఇక ఈ సినిమాకి సత్య ప్రాణం అని చెప్పొచ్చు. తన కామెడీతో ఫస్టాఫ్ ని నిలబెట్టాడు. ఆ కామెడీ పండకపోతే ఫస్టాఫ్ కూడా పూర్తిగా తేలిపోయింది. కాలేజ్ సన్నివేశాల్లో గానీ, రంగబలి సెంటర్ బాంబ్ ఎపిసోడ్ లో గానీ నవ్వులు పూయించాడు. నాగశౌర్య తండ్రి పాత్రలో గోపరాజు రమణ మెప్పించాడు. మధ్య తరగతి తండ్రి ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ ని చక్కగా పలికించాడు. ఎమ్మెల్యే పరశురామ్ గా షైన్ టామ్ చాకో, రంగారెడ్డిగా శరత్‌ కుమార్‌, హీరోయిన్ తండ్రిగా మురళి శర్మ, రంగారెడ్డి స్నేహితుడిగా శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ, సప్తగిరి, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, భద్రం, నోయెల్ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగుంది. కామెడీ సన్నివేశాలు కూడా బాగానే పండాయి. కానీ అసలైన కథను చెప్పడంలో తడబడ్డాడు. తన ఆలోచనకు ఆకర్షణీయమైన రూపం తీసుకురావడంలో విఫలమయ్యాడు. సినిమా మొత్తంలో ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు మాత్రమే అలరించాయి. ప్రథమార్థం హాస్యపరంగా బాగానే ఉన్నా, ద్వితీయార్థంలో ఇటు హాస్యం లేక, అటు కథనం గాడితప్పి నిజంగానే సినిమా బలి అయింది.

-గంగసాని