Read more!

English | Telugu

సినిమా పేరు:రంగ‌రంగ వైభ‌వంగా
బ్యానర్:శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
Rating:2.50
విడుదలయిన తేది:Sep 2, 2022

సినిమా పేరు: రంగ‌రంగ వైభవంగా
తారాగ‌ణం: వైష్ణ‌వ్ తేజ్‌, కేతికా శ‌ర్మ‌, న‌వీన్‌చంద్ర‌, న‌రేశ్‌, ప్ర‌భు, తుల‌సి, ప్ర‌గ‌తి, కౌశిక్ ఘంట‌సాల‌, సుబ్బ‌రాజు, నాగ‌బాబు, రాజ్‌కుమార్‌, స‌త్యా, అలీ
పాట‌లు: శ్రీ‌మ‌ణి, రోల్ రైడా
మ్యూజిక్: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌
ద‌ర్శ‌కత్వం: గిరీశాయ‌
బ్యాన‌ర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
విడుద‌ల తేదీ: 2 సెప్టెంబ‌ర్ 2022

'ఉప్పెన‌'తో హీరోగా ప‌రిచ‌య‌మై, తొలి సినిమాతోటే ఘ‌న విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా, న‌ట‌న ప‌రంగా కూడా అంద‌రి మెప్పూ పొందాడు పంజా వైష్ణ‌వ్ తేజ్‌. రెండో సినిమా 'కొండ‌పొలం' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిలైనా, న‌టుడిగా మ‌రింత ఎదిగాడ‌నే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'రంగ‌రంగ వైభ‌వంగా' అంటూ ముచ్చ‌ట‌గా మూడో సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చాడు. 'అర్జున్‌రెడ్డి' త‌మిళ రీమేక్ 'ఆదిత్య‌వ‌ర్మ‌'తో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన గిరీశాయ ఈ సినిమాని రూపొందించాడు. 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన 'రంగ‌రంగ వైభ‌వంగా' ఎలా ఉందంటే...

క‌థ‌

చంటి (న‌రేశ్‌) కొడుకు రిషి (వైష్ణ‌వ్ తేజ్‌), రాము (ప్ర‌భు) కూతురు రాధ (కేతికా శ‌ర్మ‌) ఒకే రోజు ఒకే టైమ్‌లో పుడ‌తారు. చంటి, రాము చిన్న‌నాటి నుంచే ప్రాణ స్నేహితులు. హైద‌రాబాద్‌లో ప‌క్క‌ప‌క్క‌నే ఇళ్లు క‌ట్టుకొని జీవ‌నం సాగిస్తుంటారు. రిషి, రాధ మ‌ధ్య స్నేహం 14వ ఏట నుంచి ప్రేమ‌గా మారుతుంది. అయితే చిన్న గొడ‌వ కార‌ణంగా ఇగోల‌కు పోయి ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోరు. చివ‌ర‌కు సుబ్బ‌రాజు వ‌ల్ల ఇద్ద‌రూ క‌ల‌త‌లు తొల‌గిపోయి ఒక్క‌టై, రొమాన్స్‌లో మునిగి తేలుతారు. రాధకు శుభ అనే అక్క‌తో పాటు వంశీ (న‌వీన్‌చంద్ర‌) అనే అన్న ఉంటారు. వంశీ వ‌ల్ల మ‌రోసారి రిషి, రాధ విడిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది. అంతే కాదు, ఆ రెండు కుటుంబాలూ విడిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. అలాంటి క్లిష్ట స్థితి నుంచి త‌మ ప్రేమ‌ను రిషి ఎలా కాపాడుకున్నాడు, రెండు కుటుంబాల‌ను తిరిగి ఎలా క‌లిపాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

'రంగ‌రంగ వైభ‌వంగా' ఫ‌స్టాఫ్ అంతా ఎప్పుడో వ‌చ్చిన త‌రుణ్‌, ఆర్తీ అగ‌ర్వాల్ సినిమా 'నువ్వులేక నేనులేను'ను జ్ఞాపకం చేస్తుంది. తండ్రులిద్ద‌రూ ప్రాణ‌స్నేహితులు కావ‌డం, వారి పిల్ల‌లైన హీరో హీరోయిన్లు ప్రేమ‌లో ప‌డ‌టం, ఇగోతో వేర‌వ‌డం, వారి ప్రేమ‌కు ప‌రీక్ష ఎదుర‌వ‌డం.. వంటి అంశాల‌న్నీ ఆ త‌ర‌హాలోనే ఉంటాయి. సెకండాఫ్ క‌థ‌ను కాస్త మార్చి తీశాడు ద‌ర్శ‌కుడు గిరీశాయ‌. అయితే ద్వితీయార్ధం మొద‌లై ఓ ప‌ది నిమిషాలు గ‌డిచిన త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ మ‌నం ముందుగానే ఊహించేస్తుంటాం. అంటే అంత ప్రెడిక్ట‌బుల్‌గా సీన్ల‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. రిషి, రాధ మ‌ధ్య రొమాంటిక్ సీన్ల‌ను చాలా బాగా చిత్రీక‌రించిన అత‌ను, క‌థ‌లోని ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణ‌మ‌య్యే వంశీ క్యారెక్ట‌ర్‌ను మ‌లిచే విష‌యంలో తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయాడు. ఒక సంద‌ర్భంలో రాధ‌ను బైక్ మీద తీసుకెళ్తూ, మ‌ధ్య‌లో వంశీని క‌వ్విస్తాడు రిషి. త‌నూ బైక్ మీద వారిని చేజ్ చేయ‌డానికి ట్రై చేస్తాడు వంశీ. ఆ సంద‌ర్భంగా వ‌చ్చే సీన్లను అత‌ను తీసిన విధానం ఎంత హాస్యాస్ప‌దంగా ఉంటాయో! ఇలాంటి వీక్ సీన్స్‌, వీక్ స్క్రీన్‌ప్లే వ‌ల్లే సెకండాఫ్ బోరింగ్‌గా త‌యార‌య్యింది. 

రిషి, రాధ క్యారెక్ట‌రైజేష‌న్స్ ఎన్నో సినిమాల్లో మ‌నం చూసిన హీరో హీరోయిన్ల క్యారెక్ట‌ర్ల త‌ర‌హాలోనే క‌నిపించినా, వారి మ‌ధ్య స‌న్నివేశాల్ని మ‌నం ఎంజాయ్ చేస్తాం. దీనికి వైష్ణ‌వ్‌తేజ్‌, కేతికా శ‌ర్మ స్క్రీన్ ప్రెజెన్స్‌, వారి మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ కార‌ణం. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు పొలిటిక‌ల్ ట‌చ్ ఇవ్వ‌డం వ‌ల్ల మేలు క‌ల‌గ‌లేదు స‌రిక‌దా, న‌ష్టం వాటిల్లింది. స‌మాజ సేవా పార్టీ యూత్ లీడ‌ర్ ప‌ద‌వికి న‌వీన్‌చంద్ర‌, సుబ్బ‌రాజు పోటీప‌డ‌టం, అందులో న‌వీన్‌చంద్ర గెల‌వ‌డం, త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కు రిషి న‌ష్టం క‌లిగిస్తున్నాడ‌ని న‌వీన్‌చంద్ర అనుకోవ‌డం, త‌ద్వారా ఏర్ప‌డే ప‌రిణామాలు ఆక‌ట్టుకొనే రీతిలో లేవు. వంశీ (న‌వీన్‌చంద్ర‌) క్యారెక్ట‌రైజేష‌న్‌లోని లోపాలు, అత‌ని బిహేవియ‌ర్ ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయి త‌ప్పితే, నేచుర‌ల్‌గా అనిపించ‌వు. ప‌దేళ్లుగా మాట్లాడుకోని రిషి, రాధ‌.. సుబ్బ‌రాజు కార‌ణంగా ఒక లిప్ కిస్‌తో తిరిగి ఒక్క‌ట‌య్యే ఎపిసోడ్ ఆహ్లాద‌న్నిచ్చింది.

త‌న కామెడీతో ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్వించ‌గ‌ల స‌త్యాను ద‌ర్శ‌కుడు స‌రిగ్గా ఉప‌యోగించు కోలేక‌పోయాడు. అత‌నితో ఓ ఎపిసోడ్‌ను సృష్టించిన ద‌ర్శ‌కుడు, ప్రేక్ష‌కుల్ని హాయిగా న‌వ్వించే సీన్ల‌ను రూపొందించ‌లేక‌పోయాడు. టెక్నిక‌ల్‌గా చూసిన‌ప్పుడు స్క్రీన్‌ప్లే బాగా వీక్‌గా ఉంద‌ని చెప్పాలి. కొన్ని చోట్ల న‌వ్వించిన డైలాగ్స్, కొన్నిచోట్ల అప‌రిప‌క్వంగా అనిపించాయి. దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ ఒక ప్ల‌స్ పాయింట్‌. పాట‌ల‌న్నీ సంద‌ర్భానుసారం వ‌చ్చి, మెలోడియ‌స్‌గా ఉండ‌టం రిలీఫ్ పాయింట్‌. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. సినిమా రిచ్‌గా క‌నిపించిందంటే మ్యూజిక్‌తో పాటు, షామ్‌ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ కూడా కార‌ణ‌మే. న‌టీన‌టుల హావ‌భావాల‌ను కెమెరా చ‌క్క‌గా కాప్చ‌ర్ చేసింది. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు లాంటి సీనియ‌ర్ మోస్ట్ ఎడిట‌ర్ కూడా సెకండాఫ్‌ను ర‌క్షించ‌లేక‌పోయాడు. చ‌క్క‌ని రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కావాల్సిన ఈ మూవీకి ఆ ఫీల్‌ను తెప్పించ‌లేక‌పోయాడు.

న‌టీన‌టుల ప‌నితీరు

రిషి పాత్ర పోష‌ణ‌లో ఏ సంద‌ర్భంలోనూ వంక పెట్ట‌లేని విధంగా చ‌క్క‌ని న‌ట‌న చూపించాడు పంజా వైష్ణ‌వ్‌తేజ్‌. హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ల‌లో అత‌ను ఎంతో బాగా రాణించాడు. సుబ్బ‌రాజుతో, స‌త్యాతో వ‌చ్చే కామెడీ సీన్ల‌లోనూ మెప్పించాడు. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌తో కూడిన స‌న్నివేశాల‌నూ ప‌రిణ‌తితో చేశాడు. ఈ సినిమాతో మ‌రో అంద‌మైన‌, ప్ర‌తిభావంతురాలైన హీరోయిన్ కేతికా శ‌ర్మ రూపంలో మ‌న‌కు దొరికిన‌ట్లే. ఇటు గ్లామ‌ర్‌తో, అటు ప‌ర్ఫార్మెన్స్‌తో రాధ పాత్ర‌లో చ‌క్క‌గా ఇమిడిపోయింది కేతిక‌. గ్రే షేడ్స్ ఉండే వంశీ పాత్ర‌లో న‌వీన్‌చంద్ర ఇమిడిపోయాడు. అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్ మ‌రింత బాగున్న‌ట్ల‌యితే ఇంకా రాణించేవాడు. ప్రాణ స్నేహితులుగా న‌రేశ్‌, ప్ర‌భు, వారి భార్య‌ల పాత్ర‌ల్లో ప్ర‌గ‌తి, తుల‌సి అతికిన‌ట్లు స‌రిపోయారు. సుబ్బ‌రాజు, రాజ్‌కుమార్ (హీరో ఫ్రెండ్‌), అలీ, స‌త్యా, కౌశిక్ ఘంట‌సాల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. మినిస్ట‌ర్‌గా నాగ‌బాబు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'రంగ‌రంగ వైభ‌వంగా' అనేది ఇప్ప‌టికే మ‌నం చూసిన అనేకానేక రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామాల త‌ర‌హాలో ఉన్న సినిమా. సెకండాఫ్‌లో వ‌చ్చే బ‌ల‌హీన‌మైన సీన్ల‌తో ఎంట‌ర్‌టైన‌ర్‌గా మారే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్న సినిమా. వైష్ణ‌వ్‌తేజ్‌, కేతికా శ‌ర్మ మ‌ధ్య రొమాంటిక్ సీన్లు, అక్క‌డ‌క్క‌డా కొన్ని ఫ్యామిలీ సీన్లు మాత్ర‌మే ఆక‌ట్టుకునే ఈ సినిమాతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ కావ‌డం క‌ష్టం.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి