Read more!

English | Telugu

సినిమా పేరు:రాత్రి
బ్యానర్:అన్నపూర్ణ సినీ క్రియేషన్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 3, 2009
శేఖర్ చక్రవర్తి (షాయాజీ షిండే) అనే యాభై యేళ్ళ ధనవంతుడు షర్మిలీ (ప్రీతి మెహ్రా) అనే అమ్మాయిని, తన గురువు అఖండానంద స్వామి (జీవా)వద్దన్నా ఉదయం పెళ్ళి చేసుకుని ఆ రాత్రి గోవాకి హనీమూన్‌కి బయలుదేరతాడు. శేఖర్ గురువు శేఖర్‌ని వెళ్ళొద్దంటాడు. వెళితే శేఖర్ చనిపోతావని హెచ్చరిస్తాడు. కానీ అతను గురువు మాటలు లెక్కచేయకుండా గోవాకి భార్యతో బయలుదేరతాడు. దారిలో అనేక సంఘటనలు జరుగుతూంటాయి. గోవాకి నేషనల్‍ హైవేలో బయలుదేరిన శేఖర్ చక్రవర్తిని అడవిలో నుండి వెళ్తే గోవాకి మూడు గంటలు ముందుగా చేరుకోవచ్చని, అతని భార్య షర్మిలీ చెప్పటంతో అడవి దారిలోనుండి కారుని పోనిస్తాడు శేఖర్ చక్రవర్తి. దారిలో మంచి నీళ్ళ కోసం షర్మిలీ అడిగితే, ఆ అడవిలో ఒకమ్మాయి కుండతో కనిపిస్తుంది. ఆమె అచ్చం షర్మిలీలా ఉంటుంది. ఓ తెల్లని బొచ్చుకుక్క కారు దారికి అడ్డంగా వస్తుంది. తర్వాత ఆ కుక్క పిల్ల చనిపోయి కారు మీద పడుతుంది. దాన్ని పూడ్చిపెట్టి మరీ బయలుదేరతారు శేఖర్ దంపతులు. ఇలాంటి సంఘటనలకు భయపడ్డ షర్మిలీ అక్కడున్న ఒక ఇంట్లో తలదాచుకుందామంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ షర్మిలీని పోలిన ఫొటో ఉంటుంది. ఉన్నట్టుండి శేఖర్ మీదకు గొడ్డలి వస్తుంది. కొద్దిలో ప్రమాదం తప్పిపోతుంది. ఈ లోగా శేఖర్ చనిపోయి పడుంటాడు. అక్కడికి కృష్ణ (సమీర్) అనే పోలీసాఫీసర్ వస్తాడు. విషయం ఏమిటంటే కృష్ణ, షర్మిలీ ఇద్దరూ ప్రేమికులు. వీళ్ళిద్దరూ కలసి కుట్ర పన్ని శేఖర్‌ని చంపి, అతని ఆస్తిని కాజేయాలని పన్నాగం పన్నుతారు. కానీ శేఖర్ చనిపోయిన తర్వాత మరిన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి. అవి అలా ఎలా జరుగుతాయి...? శేఖర్ నిజంగానే చనిపోయాడా...? చివరికి ఏమయింది అనేది మిగిలిన కథ..
ఎనాలసిస్ :
ఈ సినిమాని మొత్తం అయిదుగురు నటీ నటులతో తీశారు.షాయాజీ షిండే, ప్రీతి మెహ్రా, జీవా, సమీర్, శ్రీనివాసరెడ్డి, వహీదా వీళ్ళే ఈ చిత్రంలోని మొత్తం నటీనటులు. సినిమా మొత్తం రాత్రి పూటే జరుగుతుంది. దర్శకుడికి అనుభవం లేదనే విషయం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. టేకింగ్ పరంగా కొంచెం ఫరవాలేదు కానీ స్క్రీన్‌ప్లే విషయంలో అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక ఈ సినిమాని ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువ ఖర్చుతో తీయాలనే నిర్మాత తపన మనకు ఈ సినిమా ప్రతి ఫ్రేం లోనూ కనపడుతుంది ఇక నటన పరంగా షాయాజీ షిండే తన స్థాయిలో తాను బాగానే నటించాడు. అతను ఈ సినిమాలో బాగా పెద్ద పెద్ద డైలాగులు చెపుతాడు. ప్రీతి మెహ్రా తన పాత్రను సమర్థవంతంగా పోషించినా, గ్లామర్ విషయంలో ఆమెను చూడటం కష్టమే. ఇక జీవా పాత్ర ప్రేక్షకులను తప్పుదారి పట్టించటానికి దర్శకుడు వాడుకున్న ఆయుధం. అయినా ఈ పాత్ర సినిమాకి అవసరం లేనిదే అవుతుంది.శ్రీనివాసరెడ్డి పాత్ర కూడా అంతే. కొద్దిగా పిచ్చి కామెడీ, వహీదాతో ఒక పాటకు మాత్రమే అతని పాత్ర పరమావధిగా ఉంటుంది. అంతకు మించి సినిమాకు ఆ పాత్ర ప్రయోజనం శూన్యం.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం -: ప్రమోద్ కుమార్ ఈ సినిమాకు చాలా చీప్ బ్యాగ్రౌండ్ మ్యుజిక్‌నిచ్చాడు. ఇక ఈ సినిమాలో ఉన్న పాటల్లో ఒక హిందీ పాట ట్యూన్‌ని డైరెక్ట్ గా కాపీకొట్టాడు.ఆ కాపి పాట తప్ప మిగిలిన పాటలేం బాగోలేదు సినిమాటోగ్రఫీ -: ఇదొకటి ఈ సినిమాలో బాగుంది. జాన్ కెమెరా పనితనం బాగుంది. నైట్‍ ఎఫెక్ట్ లో లైటింగ్ స్కీమ్ బాగుంది. ఎడిటింగ్ -: ఈ డిపార్ట్‌ మెంట్‍ కూడా బాగానే పనిచేసింది. ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమా తొలి సగమంతా ఇది హారర్ సినిమా అనిపించటానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు.కానీ ఫలితం శూన్యం. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఫరవాలేదు. అయినా ఇదేం చూసి తీరాల్సినంత గొప్ప సినిమా ఏం కాదు.