Read more!

English | Telugu

సినిమా పేరు:ప్రేమ కావాలి
బ్యానర్:ఆర్. ఆర్. మూవీ మేకర్స్
Rating:3.50
విడుదలయిన తేది:Feb 25, 2011

కథ - శీను (ఆది) ఖమ్మం లో ఉండే కుర్రాడు.అతను హైదరాబాద్ లో చదువుకుంటూ ఉంటాడు.అతనికి తన కాలేజీలో చదివే ప్రేమ(ఇషా చావ్లా) అనే అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడుతుంది.అది ప్రేమగా మారుతుంది.ఆమె తండ్రి చంచల్ గూడా జైలర్ విజయ రామారావు (నాజర్). ఆమె వదిన సింధూ తులానీ.ఆమె గుడికి వెళ్తూంటే కొందరు దుండగులు ఆమెను అటకాయిస్తారు.ఆ సమయంలో శీను ఆమెను కాపాడతాడు.అలా ఆమెకు దగ్గరవుతాడు శీను.శీను కాలీజీలో యన్ సి సి లో అండర్ ఆఫీసర్ గా ఉంటాడు. ట్రైనింగ్ నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళాల్సి వస్తుంది.ప్రేమను వదిలి వెళ్ళాలంటే అతనికి బాధగా ఉంటుంది.ఆమెను రెండు నెలల పాటు చూడటం కుదరదు అనే భావనతో శీను ఉండగా,ఆమెను ఆ సందర్భంలో ఆంను ముద్దుపెట్టుకుంటాడు శీను. దాన్ని వ్యతిరేకిస్తుంది ప్రేమ.శీను హిమాచల్ ప్రదేశ్ కి వెళతాడు.

ఇదంతా తర్వాత మనకు తెలుస్తుంది. ప్రేమను శీను ముద్దు పెట్టుకునే దృశ్యాన్ని బాబ్జి(షఫీ) తన సెల్ ఫోన్ లో ఫొటో తీసి ప్రేమను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.ఇంతకీ విషయమేమిటంటే ఒక తీవ్రవాదిని చంచల్ గూడా జైలు నుంచి విడిపించటానికి ముంబాయిలో ఉన్న ఠాకూర్ (దేవ్ గిల్) అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అతని ఆజ్ఞ మేరకు హైదరాబాద్ లో ఉండే బాబ్జి తన అనుచరులతో కలసి ప్రేమను కిడ్నాప్ చేసి, తద్వారా ఆ ఉగ్రవాదిని విడిపించాలని భావిస్తాడు. కానీ శీను వల్ల అది కుదరదు.తర్వాత ఆ ఉగ్రవాదిని మరో జైలుకి తరలిస్తున్నారని తెలుసుకున్న ఠాకూర్, జైలర్ విజయరామారావు ఇ-మెయిల్‍ పాస్ వర్డ్ ప్రేమ ద్వారా తెలుసుకోమని బాబ్జిని ఆదేశిస్తాడు.తన ఫొటో కోసం తండ్రి ఇ-మెయిల్ పాస్ వర్డ్ తెలుసుకుంటుంది ప్రేమ.అది తెలుసుకున్న ఠాకూర్‍ బృందం ఉగ్రవాదిని వేరే జైలుకి తరలిస్తూండగా దారిలో విడిపించుకుంటారు. జైలర్ ని హోం మినిస్టర్ సస్పెండ్ చేస్తాడు. దాంతో జైలర్ తన కూతురు ప్రేమను దండిస్తాడు. అది చూసిన శీను ఆ ఉగ్రవాదిని తిరిగి ఎలా తీసుకు వచ్చాడు, తన ప్రేమను ఎలా పొంద గలిగాడన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - దర్శకుడు విజయభాస్కర్ ఎలాంటి దర్శకుడో అతని "నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి" చిత్రాలే చెపుతాయి.అతని దర్శకత్వ ప్రతిభ గురించి ఎలాంటి అనుమానం అక్కరలేదు.ఇది యువతకు నచ్చే ప్రేమకథ కనుక యూత్ ఫుల్ గా ఈ చిత్రాన్ని మలచటంలో దర్శకుడు ఈ చిత్రం ద్వారా మరోసారి సఫలీకృతుడయ్యాడు. సినిమా తొలి సగమంతా ఎంటర్ టైన్ మెంట్ తో సాగి సెకండ్ హాఫ్ లో యాక్షన్ పార్ట్ ని జోడిస్తాడు దర్శకుడు. విజయభాస్కర్ రోటీన్ సక్సస్ ఫార్ములానే అనుసరించినా, దాన్ని కొత్తగా వాడుకోవటంతో సినిమా ఎక్కడా బోరుకొట్టలేదు.

నటన - ఆది తాతయ్య పి.జె.శర్మ, తండ్రి సాయికుమార్ ఇద్దరూ నటులే కావటంతో అతనికి నటనలో మెళుకవలు బయట ఎక్కడో నేర్చుకోవాల్సిన పనిలేదు.అలాంటి నట వంశానికి చెందిన మూడో తరం నటుడు ఆది పూర్తి స్థాయిలో తర్ఫీదు పోంది మరి సినీ రంగానికి హీరోగా పరిచయం చేయబడ్డాడని ఈ చిత్రంలోని అతని నటన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. నేటి తరం యువ హీరోకి కావలసిన అన్ని లక్షణాలూ ఆదిలో పుష్కలంగా ఉన్నాయి.అతను ఈ చిత్రంలో డ్యాన్సుల్లో, ఫైట్స్ లో పూర్తి ఎనర్జిటిక్ గా నటించాడు. ఇది అతని తొలి చిత్రమైనా అతనిలో ఆ కొత్తదనం ఎక్కడా కనిపించదు.పైగా ఎంతో అనుభవమున్న హీరోలా చక్కగా నటించాడు ఆది. యువ హీరోగా అతనికి మంచి భవిష్యత్తుంది.

ఇక హీరోయిన్ ఇషా చావ్లా కూడా బాగానే నటించింది. బ్రహ్మానందం, యమ్ యస్ నారాయణల కామేడీ బాగానే పండింది. ఆలీ కూడా కాసేపు మనల్ని నవ్విస్తాడు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - ఈ చిత్రం సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ కు మంచి బ్రేక్ నిస్తుంది.అన్ని పాటలూ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది. కెమెరా - ఛోటా కె నాయుడు కేమెరా పనితనం గురించి ఈ రోజున కొత్తగా చెప్పక్కరలేదు. కేమెరా వర్క్ చాలా బాగుంది.

మాటలు - మాటల్లో కొన్ని పంచ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రసాద్ వర్మ మాటలు బాగున్నాయి.

పాటలు - విజయభాస్కర్ చిత్రాల్లో పాటలు మామూలుగానే బాగుంటాయి.సాయికుమార్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం కాబట్టి ఈ చిత్రంలోని పాటల్లోని సాహిత్యం ఇంకాస్త బాగుందనే చెప్పాలి.

ఎడిటింగ్ -ఈ చిత్రానికి ఎడిటర్ గౌతంరాజు. ఈయన కొన్ని వందల చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన అనుభవశాలి. ఎడిటింగ్ బాగుంది.

ఆర్ట్ - రవీందర్ కళాదర్శకత్వం బాగుంది. పాటల్లో వేసిన సెట్స్ బాగున్నాయి. కొరియోగ్రఫీ - కొరియోగ్రఫీ అన్ని పాటల్లోనూ బాగుంది.

యాక్షన్ - రామ్-లక్ష్మణ్ యాక్షన్ కంపోజింగ్ బాగుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అశ్లీలత, అసభ్యత లేని ఒక క్లీన్ యూత్ ఫూల్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఈ చిత్రం హ్యాపీగా చూడొచ్చు.