Read more!

English | Telugu

సినిమా పేరు:ప్రతినిధి 2
బ్యానర్:వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్
Rating:2.75
విడుదలయిన తేది:May 10, 2024

సినిమా పేరు: ప్రతినిధి 2 
తారాగణం: నారా రోహిత్, సిరి లెల్లా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, దినేష్ తేజ్, అజయ్ ఘోష్, ఇంద్రజ, సప్తగిరి, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: మహతి స్వరసాగర్ 
డీఓపీ: నాని చమిడిశెట్టి 
రచన, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాత: కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్
బ్యానర్: వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్
విడుదల తేదీ: మే 10, 2023

ఎన్నికల సీజన్ లో పొలిటికల్ సినిమాలకు ఉండే డిమాండే వేరు. అందుకే, నారా రోహిత్ హీరోగా మూర్తి దర్శకత్వంలో రూపొందిన 'ప్రతినిధి 2'.. విడుదలకు ముందు అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో 'ప్రతినిధి'తో మెప్పించిన నారా రోహిత్ ఇప్పుడు 'ప్రతినిధి 2'తో రావడం, పైగా ఈ చిత్రంతో జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా మారడంతో.. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి 'ప్రతినిధి 2' ఎలా ఉంది? 'ప్రతినిధి' స్థాయిలో మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

చేతన్(నారా రోహిత్) ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే నిజాయితీగల చేతన్ ను.. NNC అనే ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. ఆ ఛానల్ ను వేదికగా చేసుకొని, రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ.. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి(సచిన్ ఖేడేకర్) బాంబు బ్లాస్ట్ లో మరణిస్తాడు. తండ్రి మరణంతో కొడుకు విశ్వ(దినేష్ తేజ్) సీఎంగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతాడు. మరోవైపు బాంబు బ్లాస్ట్ వెనకున్న అసలు నిజాన్ని వెలికితీసే ప్రయత్నం చేతన్ చేస్తుండగా.. ఊహించని విధంగా అతనే అరెస్ట్ అవుతాడు. అసలు సీఎంని చంపాలనుకున్నది ఎవరు? బాంబు బ్లాస్ట్ కి, చేతన్ కి సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

నారా రోహిత్, జర్నలిస్ట్ మూర్తి కలిసి పొలిటికల్ మూవీ చేస్తున్నారని తెలిసినప్పుడు.. ఇది ఓ పార్టీకి అనుకూలంగానో, మరో పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ సినిమా చూసాక ఆ అభిప్రాయం తప్పని తేలిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా ఎవరినో టార్గెట్ చేసినట్టుగా లేదు. ఒక జర్నలిస్ట్ దేనికి లొంగకుండా నిజాయితీగా ఉంటే.. వ్యవస్థను ఎలా గాడిలో పెట్టవచ్చో, రాజకీయనాయకుల ఆటలను ఎలా అరికట్టవచ్చో చూపించారు. జర్నలిస్ట్ లలో ఆలోచన రేకెత్తించడంతో పాటు, ఓటర్లలో చైతన్యం కలిగించేలా ఉంది ఈ చిత్రం.

ఇది పొలిటికల్ డ్రామా అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకున్నారు. పొలిటికల్ సినిమాలను ఇష్టపడే వారితో పాటు, మాస్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా మెప్పించే అవకాశముంది. ఫైట్, సాంగ్ తో హీరో పాత్రని పాత్రని కమర్షియల్ హీరోలా పరిచయం చేశారు. ఆరంభ సన్నివేశాలు హీరో పాత్ర తీరుని తెలియజేసేలా ఉండగా.. NNC ఛానల్ సీఈఓగా అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల అరాచకాలు హీరో వెలుగులోకి తీసుకురావడం.. సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాంబ్ బ్లాస్ట్, ఆ తర్వాత చోటుచేసుకునే అంశాలతో ప్రథమార్థం నడిచింది. విరామ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సీఎం మర్డర్ మిస్టరీని ఛేదిస్తూ సెకండాఫ్ నడుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మలుపులు మెప్పిస్తాయి. అదే సమయంలో హీరో ఫ్లాష్ బ్యాక్, ఫైట్లు, పాటలు మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాని గుర్తు చేస్తాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పించేలా ఉంది.

దర్శకుడిగా తొలిప్రయత్నంతోనే జర్నలిస్ట్ మూర్తి ఆకట్టుకున్నాడు. జర్నలిస్ట్ తలచుకుంటే రాజకీయ వ్యవస్థను ఎలా మార్చవచ్చనే సందేశాత్మక కథను ఎంచుకున్న మూర్తి.. దానికి కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకుల మెప్పు పొందేలా తెరమీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన రాసిన డైలాగ్స్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉన్నాయి. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ నేపథ్యసంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. రవితేజ గిరజాల ఎడిటింగ్ నీట్ గా ఉంది. అయితే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

నిజాయితీగల జర్నలిస్ట్ చేతన్ పాత్రలో నారా రోహిత్ చక్కగా రాణించాడు. తనదైన డైలాగ్ డెలివరీతో మరోసారి మెప్పించిన ఆయన.. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. సిరి లెల్లా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, దినేష్ తేజ్, అజయ్ ఘోష్, ఇంద్రజ, సప్తగిరి, తనికెళ్ళ భరణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

సందేశాత్మక కథకు కమర్షియల్ హంగులు జోడించి తీసిన ఈ పొలిటికల్ అండ్ మర్డర్ మిస్టరీ ఫిల్మ్ ఆకట్టుకుంది.