Read more!

English | Telugu

సినిమా పేరు:పూలరంగడు
బ్యానర్:ఆర్ ఆర్ మూవీ మేకర్స్
Rating:3.00
విడుదలయిన తేది:Feb 17, 2012

ఏ బిజినెస్ చేసినా లాస్ వస్తూంటే, దాని కోసం అప్పులు చేసుకుంటూ, ఆ అప్పులోళ్ళకి దొరక్కుండా పారిపోతూ ఉండే వాడు రంగడు (సునీల్). అతనికి వరంగల్ నుండి ఒక ఆఫర్ వస్తుంది. అక్కడ ఉన్న కోట్లు ఖరీదు చేసే ముప్పై ఎకరాల భూమి ముప్పై లక్షలకే ఇస్తామని రంగడి దగ్గరికి వస్తారు. ఆ భూమిని కొనటానికి అప్పు తానిస్తానంటాడు మామూలుగా రంగడికి అప్పిచ్చే పెద్దమనిషి. కాకపోతే అందుకు ప్రతిగా అతని ఇల్లు తనకు తనఖా పెట్టమంటాడు. ఆ ఇల్లు అమ్మి చెల్లెలి పెళ్ళి చేద్దామనుకుంటారు రంగది కుటుంబం. రంగడి తండ్రి (కోట) కొడుకు మీద నమ్మకంతో ఇల్లు తనఖా పెడతాడు. ఆ స్థలం మీద కొండారెడ్డి (దేవ్ గిల్), లాలాగౌడ్ (ప్రదీప్ రావత్) ల కళ్ళు పడ్డాయనీ, దాన్ని కొన్నవాడిని వాళ్ళకు దొరికితే చంపేస్తారనీ, ముప్పై లక్షలకు ఆ స్థలం కొన్న తర్వాత వరంగల్ వెళితే అక్కడ తెలుస్తుంది. నరరూప రాక్షసుల్లాంటి వాళ్ళిద్దరినీ ఒప్పించి రంగడు తన స్థలం ఎలా సోంతం చేసుకున్నాడన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

మామూలుగా తెలుగు సినీ పరిశ్రమకొచ్చిన కొత్త దర్శకుల రెండవ చిత్రం దాదాపు ఫ్లాపనే తెలుగు సినిమా సెంటిమెంట్ ను వీరభద్రం చౌదరి బ్రేక్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే "పూలరంగడు" చిత్రం సూపర్ హిట్టయ్యింది కాబట్టి. వీరభద్రం చౌదరి తన తొలి చిత్రం "అహ నా పెళ్ళంట"చిత్రంలోనే తానెంత ప్రామిసింగ్ దర్శకుడో తెలుగు సినీ పరిశ్రమకు తెలియజేశాడు. తన రెండవ చిత్రం కూడా అందుకు తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే అందుకు రెట్టింపు ఎంటర్ టైన్ మెంట్ అందించేలా తీశాడు. ఈ సినిమా కథ గొప్పది కాకపోయినా కథ నడిపిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించటంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఇక హీరో సునీల్ అనగానే ప్రేక్షకులు కామేడీ ఆశిస్తారు. కనుక ఈ సినిమాని పూర్తిస్థాయి వినోదాత్మకంగా మలిచి, చక్కని సెంటిమెంట్ తో మనసు కదిలిస్తాడు దర్శకుడు. తెలుగు తెరకు ఒక మంచి దర్శకుడు వీరభద్రం చౌదరి రూపంలో వచ్చాడని నమ్మకంగా చెప్పవచ్చు. ఇక ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణపు విలువలు వారి బ్యానర్ గౌరవం నిలబెట్టేలా బాగున్నాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నటన - సునీల్ చాలా తెలివైన, జాగ్రత్త కలిగిన నటుడు. అతను తన కామెడియన్ అన్న ఇమేజ్ లోంచి హీరో ఇమేజ్ పొందటానికి పక్కా ప్లాన్ తో సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. అందుకు అతను మానసికంగా, శారీరకంగా చేస్తున్న కృషి అభినందనీయం. మర్యాదరామన్న ఫీల్ పోకుండా ఆ ఫ్లావర్ లోనే క్లైమాక్స్ లో ప్రేక్షకులంతా ఎప్పుడు సునీల్ విలన్ ని కొడతాడా అనీ, చొక్కా ఎప్పుడు విప్పుతాడా అని ఎదురుచూసేలా చేసి, అప్పుడు విలన్ ని కొట్టటం బాగుంది. ఇక అతని నటన గురించీ డ్యాన్సుల గురించీ బాగుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

ఇషా చావ్లాకి ఇది రెండవ చిత్రం. ఇది సూపర్ హిట్ కావటంతో ఆమె ప్రతిభకు తోడు ఆ అమ్మాయిది శుభపాదం అనే సెంటిమెంటు కూడా ఇప్పుడు తొడయ్యింది. ఇక ప్రదీప్ రావత్, దేవ్ గిల్, ఆలీ, రాజేష్, కోట, సుధ, ప్రగతి, సుమిత్ర, రఘుబాబు ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - అనూప్ రూబెన్స్ చాలా మంచి సంగీత దర్శకుడు. అది ఈ సినిమాతో మరో సారి నిరూపించబడింది. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే పెద్ద హిట్టయ్యింది. ఇక రీ-రికార్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సీన్ మూడ్ ని ఎలివేట్ చేసే విధంగా చాలా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ కి కూడా చక్కని ఫీల్ కలిగించేలా ఈ చిత్రంలోని రీ-రికార్డింగ్ ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే సమకాలీన సంగీత దర్శకుల్లో లేనిది అనూప్ లో ఉన్నది ఏమిటంటే పాటల్లోని సాహిత్యం ఏ గందరగోళం లేకుండా చక్కగా మనకు వినపడుతుంది. తమన్ కావాలనుకునే వాళ్ళంతా ఇక నుంచీ అనూప్ రూబెన్స్ వెంటపడతారనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.

సినిమాటోగ్రఫీ - ప్రసాద్ మూరెళ్ళకు నంది అవార్డు ఎందుకొచ్చిందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

మాటలు - ఈ చిత్రానికి మాటలు పెద్ద ఎస్సెట్. " ఎరా సైకిల్ పంచరయ్యిందా... అంటే... కాదు ఇదే మన వెంచర్", "బాటా...అంటే... చిన్న మాట" వంటి ప్రాసలతో మాటలు బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని మాటల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. శ్రీధర్ సీపానకు సంభాషణల రచయితగా మంచి భవిష్యత్తుందనటంలో సందేహం లేదు.

పాటలు - పాటల్లో సాహిత్యం, సంగీతం పోటీపడ్డాయి. అన్ని పాటలూ బాగున్నాయి.

ఎడిటింగ్ - గౌతంరాజు పేరు కాదు ఇదొక బ్రాండ్...! కాదంటారా...?

ఆర్ట్ - బాగుంది.

కొరియోగ్రఫీ - సునీల్ కోసం ప్రత్యేకంగా ద్యాన్సులు డిజైన్ చేసినట్టున్నారు. ఈ సినిమాలోని కొరియోగ్రఫీ కేక...అదిరింది.

యాక్షన్ - సూపర్...! ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఫైట్ రాజమౌళి సినిమాలో తీసినట్టు తీశారు...! యాక్షన్ చాలా బాగుంది.

అనుమానం లేకుండా ఈ సినిమా ఓ రెండు గంటల పాటు సకుటుంబంగా చూసి హాయిగా నవ్వుకునే సినిమా...హ్యాపీగా చూడవచ్చు.