Read more!

English | Telugu

సినిమా పేరు:పొన్నియిన్ సెల్వన్-2
బ్యానర్:లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్‌
Rating:2.75
విడుదలయిన తేది:Apr 28, 2023

సినిమా పేరు: పొన్నియిన్ సెల్వ‌న్‌
తారాగ‌ణం: చియాన్ విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తీ, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష‌, శ‌ర‌త్ కుమార్‌, పార్తీప‌న్‌, రెహ‌మాన్‌, జ‌య‌రామ్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌భు, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి
క‌థ: క‌ల్కి కృష్ణ‌మూర్తి
స్క్రీన్‌ప్లే: మ‌ణిర‌త్నం, జ‌య‌మోహ‌న్‌, కుమ‌ర‌వేల్‌
సంభాష‌ణ‌లు: త‌నికెళ్ల భ‌ర‌ణి
సంగీతం: ఎ.ఆర్‌. రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌
ఎడిటింగ్: ఎ. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: తోట త‌ర‌ణి
నిర్మాతలు: సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం
ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం
బ్యాన‌ర్స్: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్‌
విడుద‌ల తేదీ: ఏప్రిల్ 28, 2023

తమిళ బాహుబలిగా ప్రచారం పొందిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ చిత్ర మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘన విజయం సాధించింది. అయితే తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని తమిళనాడుతో పాటు ఓవర్సీస్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మొదటి భాగం.. తెలుగు, హిందీ సహా మిగతా భాషల ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండో భాగం తమిళ్ తో పాటు ఇతర భాషల ప్రేక్షకుల మెప్పు కూడా పొంది.. మొదటి భాగాన్ని మించిన విజయాన్ని సాధించేలా ఉందా?..

కథ:
మొదటి భాగంలో చోళ యువ‌రాజులు ఆదిత్య క‌రికాలుడు(విక్రమ్), అరుళ్‌మోళి అలియాస్ పొన్నియిన్ సెల్వ‌న్ (జ‌యం ర‌వి) చెరో దిక్కు ఇతర రాజ్యాలను హస్తగతం చేసుకుంటూ తమ రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉండగా.. పెద్ద ప‌ళువేట్ట‌రాయుడు(శ‌ర‌త్‌కుమార్‌) తోటి సామంతుల‌తో క‌లిసి చోళ రాజ్య సింహాసనంపై మ‌ధురాంత‌కుడి(రెహ‌మాన్‌)ని కూర్చోబెట్టడానికి కుట్రలు పన్నుతుంటాడు. మరోవైపు క‌రికాలుడి మాజీ ప్రేయసి, పెద్ద ప‌ళువేట్ట‌రాయుడి సతీమణి నందిని(ఐశ్వ‌ర్యా రాయ్‌) పాండ్య రాజ వంశ‌స్థులతో కలిసి చోళ రాజ్యాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పొన్నియిన్ సెల్వ‌న్ సముద్ర గర్భంలో కలిసిపోయాడని అందరూ భావిస్తారు. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుంది. మొదటి భాగంలో కలిగిన ఎన్నో సందేహాలు, ప్రశ్నలకు రెండో భాగంలో సమాధానాలు దొరుకుతాయి. సముద్రంలో పడిపోతున్న పొన్నియిన్ సెల్వ‌న్ ని కాపాడిన నందిని రూపంలో ఉన్న వన దేవత ఎవరు? ఆమెకి, నందినికి ఉన్న సంబంధం ఏంటి? ఓ వైపు నందిని చోళ సామ్రాజ్య అంతం కోసం చూస్తుంటే, ఆమె మాత్రం చోళ యువరాజుని కాపాడటానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని, అతని రాజ్యాన్ని అంతం చేయాలని నందిని ఎందుకు కంకణం కట్టుకుంది?. ఓ వైపు చోళ రాజ్య సింహాసనంపై కన్నేసిన మ‌ధురాంత‌కుడు, మరోవైపు పాండ్యులతో కలిసి చోళ రాజ్యాన్ని అంతం చేయాలని చూస్తున్న నందిని. వారి నుంచి ఆదిత్య క‌రికాలుడు, పొన్నియిన్ సెల్వ‌న్ తమ రాజ్యాన్ని రక్షించుకోగలిగారా? ఈ పోరాటంలో వ‌ల్ల‌వ‌రాయుడు(కార్తీ) పాత్ర ఏంటనేది రెండో భాగం చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

మొదటి భాగం ఇతర భాషల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం.. ముఖ్య పాత్రలు ఎక్కువ ఉండటం, ఆ పాత్రల పేర్లు గుర్తుపెట్టుకునేలా లేకపోవడం, ఆ పాత్రల మధ్య బంధం అర్థంగాక పోవడం. అయితే మొదటి భాగం చూసి ఆ పాత్రల మీద అంతోఇంతో అవగాహన తెచ్చుకున్నవారికి రెండోభాగం విషయంలో ఆ పరిస్థితి ఏర్పడదు. అయితే మొదటి భాగంలో మరో ప్రధాన సమస్య నెమ్మదిగా సాగే కథనం. ఇప్పుడు రెండో భాగం విషయంలోనూ అదే ప్రధాన సమస్యగా మారింది.

యుక్త వయసులో ఆదిత్య క‌రికాలుడు-నందిని ప్రేమ సన్నివేశాలతో రెండో భాగం ప్రారంభమైంది. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతనికి వ‌ల్ల‌వ‌రాయుడు ఎలా తోడుగా నిలిచాడు వంటి సన్నివేశాలను చూపించారు. ఓ వైపు నందిని సహకారంతో పాండ్యుల కుట్రలు, మరోవైపు మ‌ధురాంత‌కుడిని రాజుని చేసి చోళ రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే పెద్ద ప‌ళువేట్ట‌రాయుడు పన్నాగాలతో కథనం ఎంతో ఆసక్తికరంగా, బిగువుగా సాగాలి. కానీ అలా జరగలేదు. కథనం నెమ్మదిగా సాగింది. కొన్ని కొన్ని చోట్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది.

మణిరత్నం దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో ఉన్న అగ్ర దర్శకుల్లో ఆయన ఒకరు. పొన్నియిన్ సెల్వన్ విషయంలోనూ ఆయన దర్శకత్వ ప్రతిభ అడుగడునా కనిపించింది. అయితే కథనం విషయంలోనే ఆయన మరింత శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. నవలను సినిమాగా తెరకెక్కించే క్రమంలో ఆయన సహజత్వానికి పెద్ద పీట వేయాలనుకోవడం బెడిసికొట్టింది. రాజుల కథతో భారీ చిత్రమంటే ప్రేక్షకులు గూజ్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఆశిస్తారు. ఇందులో యుద్ధపు సన్నివేశాలు కూడా సహజంగా ఉన్నాయి తప్ప.. హీరోయిజం ఎలివేట్ చేసేలా, వావ్ అనిపించేలా లేవు. నిజానికి ఈ కథకి పొన్నియిన్ సెల్వన్ హీరో. కానీ ఆ భావన మనకు పెద్దగా కలగదు. మొదటి భాగంలో మాదిరిగానే మిగతా పాత్రల్లో ఒకటిగా ఆ పాత్ర కలిసిపోయింది. అయితే పొన్నియిన్ సెల్వన్ వ్యక్తిత్వాన్ని, తెలివితేటలను తెలిపేలా ఉన్న ఒకట్రెండు సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. ఇందులో భారీతనం, యుద్ధపు సన్నివేశాల కంటే కూడా ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆదిత్య-నందిని మధ్య వచ్చే సన్నివేశం మెప్పిస్తుంది. క్లైమాక్స్ చుట్టేసినట్టు ఉన్నా, కథని ముగించిన తీరైతే బాగానే ఉంది.

రవి వర్మన్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. తన ఆర్ట్ వర్క్ తో తోట త‌ర‌ణి చోళ రాజ్యాన్ని, అప్పటి వాతావరణాన్ని చక్కగా నిర్మిస్తే.. రవి వర్మన్ తన కెమెరాతో చక్కగా బంధించి మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లారు. స‌న్నివేశాల్లోని మూడ్‌కు త‌గ్గ‌ట్లుగా ఎ.ఆర్‌. రెహ‌మాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆయన మార్క్ కనిపించలేదు. 

నటీనటుల పనితీరు:
సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులంతా తమ నటనతో మెప్పించారు. ఆదిత్య క‌రికాలుడి పాత్రలో విక్రమ్ ఒదిగిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి మరొకరిని పెళ్లి చేసుకుందనే బాధ మనసులో ఉన్నా.. పైకి మాత్రం కఠినంగా కనిపించే వీరుడి పాత్రలో విక్రమ్ చక్కగా రాణించాడు. ఇక సినిమాకి ఎంతో కీలకమైన నందిని పాత్రకి ఐశ్వ‌ర్యా రాయ్ పూర్తి న్యాయం చేసింది. ప్రేమ, పగ, బాధ ఇలా ఎన్నో భావోద్వేగాలతో మిళితమైన పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఇక తన తెలివితేటలు, మాయ మాటలతో సరదాగా కనిపిస్తూ.. యుద్ధభూమిలో వీరత్వం చూపించే వ‌ల్ల‌వ‌రాయుడి పాత్రలో కార్తీ కట్టిపడేసాడు. పొన్నియిన్ సెల్వన్ గా జయం రవి స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. కుంద‌వ‌ల్లిగా త్రిష‌, సుంద‌ర చోళునిగా ప్ర‌కాశ్ రాజ్, మ‌ధురాంత‌కునిగా రెహ‌మాన్‌, పెద్ద ప‌ళువేట్ట‌రాయునిగా శ‌ర‌త్‌కుమార్‌, చిన్న ప‌ళువేట్ట‌రాయునిగా పార్తీప‌న్‌, పార్తివేంద్ర ప‌ల్ల‌వునిగా విక్ర‌మ్ ప్ర‌భు, జ‌య‌రామ్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, శోభిత ధూళిపాళ‌ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మొదటి భాగం నచ్చిన వారికి రెండో భాగం కూడా నచ్చుతుంది. కథనం నెమ్మదిగా సాగినా.. మ‌ణిర‌త్నం టేకింగ్, భారీతనం, నటీనటుల అద్భుతమైన అభినయాల కోసం ఒక్కసారి చూడొచ్చు. 

 

-గంగసాని