English | Telugu
బ్యానర్:సంపత్‌నంది టీమ్ వర్క్క్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్.సినిమా
Rating:1.75
విడుదలయిన తేది:Aug 31, 2018
తారాగణం: సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యహోప్, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్
సంగీతం: భీమ్స్ సిసిరిలియో
నిర్మాతలు: సంపత్‌నంది, రాములు, వెంకట్, నరసింహ
బ్యానర్: సంపత్‌నంది టీమ్ వర్క్క్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్.సినిమా
కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు: సంపత్‌నంది
దర్శకత్వం: జయశంకర్
ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టని, తనివితీరని ఓ అందమైన ఎమోషన్. అందుకే వెండితెరపై ప్రేమకథలు ఎప్పుడూ వెలుగులీనుతూనే ఉంటాయి. స్థాయిభేధాలకు అతీతంగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. ఈ ప్రేమకథల్లో రాజు-పేద జోనర్ ఎవర్‌గ్రీన్. కోటలో రాణి తోటలో రాముణ్ణి ప్రేమించడం అంతరాల్ని ఎదిరించి తమ ప్రణయగాథను విజయతీరాలకు చేర్చుకోవడం కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్న ఫార్ములా. ఇదే పాయింట్‌ను కొంచెం పాలిష్‌గా అందమైన తళుకులు అద్ది పేపర్‌బాయ్ చిత్రంలో్ చూపించే ప్రయత్నం చేశారు. కమర్షియల్ దర్శకుడిగా పేరున్న సంపత్‌నంది తన స్వీయ అభిరుచుల్ని ప్రతిబింబించే సినిమాలు చేయాలనే లక్ష్యంలో సంపత్‌నంది టీమ్ వర్క్స్ పేరుతో సొంత నిర్మాణ స్థాపించి తొలి ప్రయత్నంగా గాలిపటం అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ద్వితీయ ప్రయత్నంగా పేపర్‌బాయ్ చిత్రాన్ని రూపొందించారు. షార్ట్స్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపును సంపాందించుకున్న జయశంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
కథ
రవి (సంతోష్‌శోభన్) పేపర్‌బాయ్‌గా పనిచేస్తుంటాడు. బి.టెక్ చదివినప్పటికీ పేపర్‌డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ బస్తీలోని తన కుటుంబానికి ఆసరాగా ఉంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన గద్వాలరెడ్డిగారి అమ్మాయైన ధరణి (రియా సుమన్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తన మంచితనంతో ఆమెకు దగ్గరవుతాడు. ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. తన కుటుంబ సభ్యులతో చర్చించి రవితో నిశ్చితార్థం కుదుర్చుకుంటుంది. పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుండగా అమెరికా నుంచి వచ్చిన ధరణి అన్నయ్యలిద్దరూ వారి పెళ్లిని వ్యతిరేకిస్తారు. రవి తల్లిదండ్రులను అవమానించడంతో కుటుంబం మొత్తం హైదరాబాద్ వదిలి పోతారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రవి ప్రేమకథకు సంబంధించిన డైరీ ముంబయిలో ఉంటున్నమేఘకు ఎలా దొరికింది? మేఘ వ్యక్తిగత జీవితంలోని విషాదమేమిటి? చివరకు పేపర్‌బాయ్ ప్రేమకథ ఏ తీరాలకు చేరింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ.
ఎనాలసిస్ :
"నేను ఆటోడ్రైవర్ మీ ఇంటి గేటు ముందుకు వరకే రాగలను. మా వాడు పేపర్‌బాయ్ మీ ఇంటి తలుపు దగ్గరకు మాత్రమే రాగలడు. మా ఆవిడ పనిమనిషి..మీ ఇంటి వంటిల్లు వరకే రాగలదు. అలాంటిది మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు..ఇది పేపర్‌బాయ్ రవి తల్లిదండ్రులకు, ధరణి అమ్మానాన్నలకు మధ్య జరిగే ఓ సంభాషణ. ఇంతటి అంతరాల్ని చూపిస్తూ ఓ పేపర్‌బాయ్ ప్రేమను సంపన్న కుటుంబం అంగీకరించినట్టు చూపించడంలోనే ఈ కథలో ఎంతటి వీక్ పాయింట్ ఉందో అర్ఠం చేసుకోవచ్చు. అయితే పేపర్‌బాయ్‌కి ప్రేమ కథ వుండొద్దని కాదు.. ప్రతి ఒక్కరు ప్రేమకు అర్హులే. అయితే సినిమాల్లో లవ్‌స్టోరీని హార్ట్‌టచింగ్‌గా, ఓ ఎమోషనల్ జర్నీగా ఆవిష్కరించాలంటే కథలోని ఉద్వేగాలతో ప్రేక్షకులు కనెక్ట్ కావాలి. కథ, పాత్ర చిత్రణలో వాస్తవికత కనిపించాలి. జీవితానికి దూరంగా కథ సాగకూడదు. ఇలాంటివన్నీ నిజ జీవితంలో సాధ్యమేనా అనే సందేహం కలిగితే ఇక ఆ కథతో ప్రేక్షకులు ప్రయాణం చేయలేరు. గొప్పంటి అమ్మాయిని తొలి చూపులోనే వలచిన పేపర్‌బాయ్ ఆమెకు పేపర్‌లోని అందమైన పదాల్ని అండర్‌లైన్ చేస్తూ వాటిని కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంటాడు. అతని కవిత్వానికి, మంచితనానికి అమ్మాయి పడిపోతుంది. తన కుటుంబానికి పరిచయం చేసి నిశ్చితార్థానికి ఒప్పిస్తుంది. ఇదంతా ఎలాంటి సంఘర్షణ లేకుండానే సాదాసీదాగా సాగిపోతుంది. ఇద్దరి పరిచయం, ప్రేమలో ఎక్కడా బలమైన ఉద్వేగాలు కనిపించవు.. ప్రథమార్థమంతా ఇద్దరి మధ్య ప్రేమను ఎస్టాబ్లిస్ చేసే ప్రయత్నం చేశారు. పేపర్‌బాయ్ ఫ్రెండ్స్ బ్యాచ్‌తో చేసిన కామెడీ ఏమంతగా ఆకట్టుకోలేదు. నువ్వు గొప్పింటి అమ్మాయివని ప్రేమించలేదు..నీ అభిరుచులు నచ్చి ప్రేమించానని ఓ సందర్భంలో ధరణితో చెబుతాడు రవి. తనను ఓ పేపర్‌బాయ్ అనుకునే ప్రేమించమని అంటాడు. తీరా నిశ్చితార్థం కుదిరిన తర్వాత..మీలాంటి గొప్పింటికి అల్లుడుగా వస్తున్నాను. కాబట్టి ఇక నుంచి పేపర్లు వేయను అంటాడు..ఇలాంటివన్నీ పేపర్‌బాయ్ పాత్ర చిత్రణలోని లోపాల్ని బయటపెడతాయి. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత రవి ఇంటికి వచ్చిన ధరణి అన్నయ్యలు..ఇక నుంచి మా చెల్లెలు ఇదే ఇంటిలో ఉండాలి. రేపు దానికి పుట్టబోయే బిడ్డ బస్తీలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి..అంటూ కొన్ని డైలాగ్‌లు చెబుతాడు. ఇవన్నీ సత్యదూరంగా అనిపిస్తాయి. పేదవాన్ని పెళ్లి చేసుకోబోతున్న సంపన్నకుటుంబానికి చెందిన అమ్మాయి పేదరాలు అయిపోతుందని చెప్పడంలో అర్థం లేదనిపిస్తుంది. రవి తల్లిదండ్రులు ఇల్లు విడిచిపోవడానికి కూడా సరైన కారణం కనిపించదు. ప్రీక్లైమాక్స్ ఘట్టాల్లో కొంత ఉత్కంఠతను రేకెత్తించారు. మేఘ పాత్ర ద్వారా పేపర్‌బాయ్ కథను చెప్పడం బాగుంది. రవిని వెతుక్కుంటూ మేఘ హైదరాబాద్‌కు రావడం, ధరణిని కలిసి నిజం తెలుసుకోవడం..ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. అయితే పతాక ఘట్టాలు కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఏదో కథను సుఖాంతం చేశారనిపించింది. బిత్తిరి సత్తిపై చిత్రీకరించిన పేరడీ యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. సంపత్‌నంది సంబాషణలు అద్భతంగా కుదిరాయి. ప్రతి సన్నివేశంలో అర్థవంతమైన డైలాగ్‌లు రాశారు. కథా రచన, సంభాషణల పరంగా సంపత్‌నంది ముద్ర స్పష్టంగా కనబడింది. ఓ రకంగా సినిమాకు అదే ప్రధానమైన బలంగా నిలిచింది.
నటీనటుల పనితీరు..
పేపర్‌బాయ్‌గా సంతోష్‌శోభన్ మంచినటననే కనబరిచాడు. ప్రతి సినిమాకు అతనిలో పరిణితి కనిపిస్తున్నది. ప్రధాన కథానాయిక రియా సుమన్ ఫర్వాలేదనిపించింది. ఆమె పాత్ర తాలూకు ఉద్వేగాల్నిమరింతగా ఆవిష్కరిస్తే బాగుండేదనిపించింది. తాన్యా హోప్ పాత్ర చిన్నదైనా మంచి అభినయాన్ని కనబరచింది. ఇద్దరూ అందంగా కనిపించారు. అన్నపూర్ణమ్మ తెలంగాణ స్లాంగ్‌ను బాగా పలికించింది. బిత్తిరి సత్తి ఉన్నంతలోనే మంచి వినోదాన్ని పంచాడు. మిగతా పాత్రలు ఫర్వాలేదనిపించాయి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్‌ను ఓ అందమైన వర్ణ చిత్రంలా మలిచాడు. సినిమా ఆద్యంతం కన్నులపండువగా అనిపించిందంటే ఆ క్రెడిట్ సౌందర్‌రాజన్‌దే. భీమ్స్ సంగీతం బాగుంది. రెండు మెలోడీ పాటలు, బొంబాయ్ పోతావా మామ..అనే మాస్‌బీట్ సాంగ్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. మేకింగ్‌పరంగా ఎక్కడా రాజీపడలేదు. ఈ సినిమాతో సంపత్‌నంది టీమ్ మంచి ప్రయత్నమే చేసింది. అయితే కథాపరమైన కొన్ని లోపాలు కనిపించాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ప్రేమకథలో వైవిధ్యం కంటే భావోద్వేగం ముఖ్యం. పేపర్‌బాయ్ మంచి కథ కుదిరింది కానీ..దానిని తెరపై తీసుకొచ్చే విధానంలో కొంత తడబాటు కనిపించింది. అయితే అందమైన ఫొటోగ్రపీ, చక్కటి సంభాషణలు, సంగీతం, నిర్మాణ విలువలతో సినిమా ఫర్వాలేదనిపించింది. మరికొంత జాగ్రత్తలు తీసుకుంటే పేపర్‌బాయ్ అందరికి అలరించే ప్రేమకథగా నిలిచిపోయేది.