Read more!

English | Telugu

సినిమా పేరు:పంచతంత్రం
బ్యానర్:టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్
Rating:2.50
విడుదలయిన తేది:Dec 8, 2022

సినిమా పేరు: పంచతంత్రం
తారాగణం: బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద, ఉత్తేజ్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, వికాస్, ప్రాణ్య, శ్రీవిద్య 
సంగీతం: ప్రశాంత్ విహారి, శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి
ఎడిటర్: గ్యారీ బీహెచ్ 
రచన, దర్శకత్వం: హర్ష పులిపాక
నిర్మాత: సృజన్ యరబోలు, అఖిలేష్ వర్ధన్
బ్యానర్: టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022

నూతన దర్శకులు విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కిన 'పంచతంత్రం' ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, శివాత్మిక, దివ్య శ్రీపాద ఇలా ఎందరో తెలిసిన నటీనటులు నటించిన చిత్రం కావడం అదనపు ఆకర్షణ. ట్రైలర్ చూసినప్పుడే ఇదొక ఫీల్ గుడ్ సినిమా అనే విషయం అర్థమైంది. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీని మీడియా కోసం ప్రత్యేకంగా ఒకరోజు ముందుగానే ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ట్రైలర్ లో చూపించినట్లుగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:-

ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వేదవ్యాస్(బ్రహ్మానందం) 60 ఏళ్ళ వయస్సులో రచయితగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటాడు. తన కూతురు రోషిణి(స్వాతి రెడ్డి) ఈ వయసులో ఇవన్నీ ఎందుకు, మంచిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా వేదవ్యాస్ ఒక కథల పోటీకి వెళ్తాడు. ఒకే థీమ్ తో ఒకదానికొకటి సంబంధంలేని విభిన్న కథలు చెప్పాలనేది అక్కడ షరతు. అప్పుడు 'పంచేంద్రియాలు' అనే థీమ్ తో ఐదు కథలు చెప్తాడు వేదవ్యాస్. అసలు ఆ ఐదు కథలు ఏంటి? ఆ కథల ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? ఆ కథలు విన్నాక రోషిణి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

'పంచేంద్రియాలు'(five senses) అనే కాన్సెప్ట్ తీసుకొని ఐదు కథలు చెప్పాలనుకున్న దర్శకుడు హర్ష పులిపాక ఆలోచన చాలా బాగుంది. దృష్టి, రుచి, వాసన, స్పర్శ, ధ్వని ఇలా ఒక్కో దానిని ఒక్కో కథకి ముడిపెడుతూ ఐదు కథలను నడిపించిన తీరు ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం సందేహమే.

థియేటర్ లో 'పంచతంత్రం' చూసినప్పుడు సినిమా చూసిన ఫీలింగ్ కలగదు. ఓటీటీలో ఆంథాలజీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకే థీమ్ అయినప్పటికీ ఐదు కథలకు ఒకదానికొకటి సంబంధం లేకపోవడంతో.. వరుసగా ఐదు షార్ట్ స్టొరీలు చూసినట్లు అనిపిస్తుంది. ఆ ఐదు కథల్లోని కొన్ని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఒక్క కథ కూడా బలంగా ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్ళేలా లేదు. ఒక కథలో లీనమయ్యేలోపు మరో కథ రావడంతో ఆడియన్స్ దేనికీ పూర్తిగా కనెక్ట్ కాలేరు.

తాను అనుకున్న కాన్సెప్ట్ కి తగ్గట్లు దర్శకుడు రాసుకున్న కొన్ని సున్నితమైన సన్నివేశాలు బాగున్నాయి. సింపుల్ గా, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. విహారి(నరేష్) మొదటిసారి సముద్రం చూసే సన్నివేశం, సుభాష్(రాహుల్ విజయ్), లేఖ(శివాత్మిక) మధ్య బేకరీలో జరిగే సంభాషణ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రతి కథలోని చివరి సన్నివేశం హత్తుకునేలా ఉంది.

సినిమాటోగ్రాఫర్ రాజ్ నల్లి సన్నివేశాలను ఎంతో అందంగా చిత్రీకరించాడు. కథ, సన్నివేశాల్లోని భావానికి తగ్గట్లుగా ఆయన ఫ్రేమ్స్, లైటింగ్ ఉన్నాయి. ప్రశాంత్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ ల సంగీతం పర్లేదు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఒక వ్యక్తి చేత ఐదు కథలు చెప్పించే క్రమంలో దర్శకుడి ఆలోచనకు తగ్గట్లుగా ఎడిటర్ గ్యారీ బీహెచ్ కూర్పు బాగుంది. అయితే మూడు, నాలుగు కథల్లోని కొన్ని సన్నివేశాలను ఇంకా షార్ప్ గా కట్ చేస్తే బాగుండేది. నటీనటుల ఎంపిక, నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా బాగున్నాయి.

నటీనటుల పనితీరు:-

బ్రహ్మానందం చాలా రోజులు తర్వాత వెండితెర మీద కనిపించారు. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. కథలు చెప్పేది ఆయనే కాబట్టి సినిమాకి ఆయనది కీలకమైన పాత్ర. వేదవ్యాస్ పాత్రలో ఆయన నవ్వించలేదు, ఏడిపించలేదు.. కానీ ఆకట్టుకున్నారు. ఐదు కథలు, నాలుగు మంచి మాటలతో ఆ పాత్రకి తగ్గట్లుగా తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించారు. స్వాతి రెడ్డి రెండు విభిన్న పాత్రలు పోషించి తనదైన శైలిలో మెప్పించింది. ముఖ్యంగా చిత్ర పాత్రతో ఆకట్టుకుంది. తనకి మాత్రమే ఏదో వాసన వస్తుంది అంటూ కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేసే రామనాథం పాత్రలో నటించిన సముద్రఖని తన సహజ నటనతో మరోసారి రాణించారు. అలాగే లేఖ పాత్రలో శివాత్మిక, దేవి పాత్రలో దివ్య శ్రీపాద, సాంబయ్య పాత్రలో ఉత్తేజ్, సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్, విహారి పాత్రలో నరేష్ అగస్త్య, శేఖర్ పాత్రలో వికాస్, రూప పాత్ర ప్రాణ్య, మైత్రి పాత్రలో శ్రీవిద్య నటించి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'పంచేంద్రియాలు' కాన్సెప్ట్ తో ఐదు కథలు చెప్పాలనుకున్న దర్శకుడి ఆలోచన బాగుంది. కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఆంథాలజీ ఫిల్మ్ ఓటీటీ వరకు ఓకే గానీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడం సందేహమే.

-గంగసాని