Read more!

English | Telugu

సినిమా పేరు:ఓయ్
బ్యానర్:యూనివర్సల్ మీడియా
Rating:2.50
విడుదలయిన తేది:Jul 3, 2009
ఒక పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడు ఉదయ్(సిద్ధార్థ) ఒక పార్టీలో తనను "ఓయ్‌‍" అంటూ టిష్యూ పేపర్ అడిగిన సంధ్య (షామిలి) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఒక మధ్య తరగతి అమ్మాయి. చాలా పద్ధతిగా పెరిగిన పిల్ల. ఉదయ్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే టైపు. తను ప్రేమించిన సంధ్యను తన సొంతం చేసుకోటానికి ఉదయ్ పడని పాట్లుండవు. ఇద్దరి పద్ధతులూ వాళ్ళ పేర్లలాగే తూర్పూ పడమరలు. ఆమె అలవాట్లు తన అలవాట్లూ వేరైనా, ఆమె కోసం తన అలవాట్లను కూడా ఆమె అలవాట్లుగా మార్చి చెపుతాడు. ఎలాగోలా చివరికి ఆమె ప్రేమను పొందుతాడు ఉదయ్‌‍. కానీ ఇంతా కష్టపడి ఆమె ప్రేమను గెలుపొందగానే ఆమెకు ప్రాణాంతకమైన ఒక భయంకర రోగం ఉందనీ, ఆమె ఎక్కువ కాలం బ్రతకదనీ ఉదయ్‌కి తెలుస్తుంది.ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ ఆమె కోరికలన్నీ తీర్చి, ఆమె ప్రశాంతంగా మరణించటానికి సహకరిస్తాడు. తాను ఒంటరిగానే మిగిలిపోతాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ కథ.
ఎనాలసిస్ :
గతంలో నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ "గీతాంజలి" చిత్రానికీ, ఈ చిత్రానికీ కొంచెం పోలికలు కనిపిస్తాయి. కన్నడ డబ్బింగ్ చిత్రం "అమృతం" చిత్రం కథతో కూడా ఈ చిత్రం కథ చాలా వరకూ కలుస్తుంది. ఇక ఈ చిత్రం దర్శకుడి గురించి చెప్పాలంటే తొలి చిత్రమే అయినా బాగా అనుభవమున్న వాడిలా అతని దర్శకత్వం ఉంది. కానీ కథాగమనంలో ఇంకొంచెం పరిణితి చూపించి ఉంటే ఇంకా బాగుండేది. స్క్రీన్‌ప్లే ఆవిషయాన్ని తెలియజేస్తుంది. అంటే మెలో డ్రామా ఉండాల్సిన సీన్లలో లైటర్ వే లో కథను నడిపించటం అతని అనుభవ రాహిత్యాన్ని సూచిస్తుంది. అంటే హీరోయిన్ చనిపోతుందన్న విషయాన్ని హీరో తెలుసుకున్న సీన్లో మెలో డ్రామా ఉంటే ఇంకా బాగుండేది. కానీ కొన్ని సీన్లు చాలా బాగుండి మనసుని కదిలిస్తాయి. సినిమా తొలి సగం ఒ.కె. అనిపించుకున్నా, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ పదినిమిషాలూ ప్రేక్షకులను ఆకట్టునేలా అతని దర్శకత్వం ఉందని చెప్పాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బాలల చిత్రం "అంజలి" చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన ఆ నాటి బాలనటి షామిలి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ పాత్ర ఆమెకు సరిగ్గా సరిపోయింది. యాదృచ్చికమో ఏమో తెలియదు గానీ, బాలనటిగా ఆ చిత్రంలో కూడా ఆమెకు ఒక వ్యాధితో బాధపడే పాత్రే లభిస్తే, ఈ చిత్రంలో కూడా ఆమెకు అంతే బరువైన పాత్ర లభించింది. కాకపోతే ప్రేక్షకులు ఆనాటి బాలనటిలోని ప్రతిభను ఊహించుకుని, ఈనాటి హీరోయిన్‌లో ఆ ప్రతిభను ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశపడక తప్పదు. కాకపోతే హీరోయిన్‌ని మొదట్లో చాలా సాంప్రదాయబద్ధంగా చూపించి, తర్వాత ఆమెతో సిగిరెట్‍ తాగుతానని చెప్పించటం, తాళిబొట్టుని కుక్క మెడలోని బెల్టుతో పోల్చి మాట్లాడించటం వంటివి సరిగ్గా పండకపోతే దర్శకుడికి ఇబ్బందిని కలిగించే విషయాలుగా మారతాయి. ఇక హీరో సిద్ధార్థ మాత్రం ఈ పాత్రలో చాలా బాగా నటించాడు. అతని నటనలో చక్కని పరిణితి కనిపిమచింది. ఇకసాత్వికమైన పాత్రలో నేపోలియన్ నటన బాగుంది. రకరకాల వేషాలతో హీరో స్నేహితుడిగా కృష్ణుడి నటన కూడా బాగుంది. సునీల్‍కామెడీ, తణికెళ్ళ భరణి, సురేఖావాణిల ట్రాక్, ఆలీ, మాస్టర్ భరత్ ల ట్రాక్‌‍, ఒ.కె. ప్రదీప్ రావత్ "ఛత్రపతి" ట్రాక్ పెద్దగా పండలేదనే చెప్పాలి. రావికొండలరావు, రాధాకుమారి వారి పరిధిలో వారు బాగానే నటించారు. ఇక నిర్మాణపు విలువల విషయానికొస్తే చాలా బాగున్నాయి. సంగీతం -: ఈ చిత్రానికి సంగీతం బాగా ప్లస్సయ్యింది. పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్‍ సాంగ్, పోవద్దే పోవద్దే ప్రేమా అనే పాటలు చాలా బాగున్నాయి. ఇక రీ-రికార్డింగ్ చక్కగా ఉంది. యువన్ శంకర్ రాజా సంగీతం చాలా బాగుందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ -: ఈ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేయటంలో కెమెరా పనితనం చాలా బాగుంది. అది ట్రాజెడీ అయితే దానికి తగ్గట్టుగా లైటింగ్ చేయటం, అలాగే హ్యాపీమూడ్ ఉంటే దానికి తగ్గట్టుగా లైటింగ్ చేయటం చూస్తే కేమెరా కూడా ఈ చిత్రంలో ఒక పాత్ర పోషించిందా అనిపిస్తుంది. ఎడిటింగ్ -: మార్తాండ్‌‍.కె.వెంకటేష్ ఎడిటింగ్ చాలా బాగుంది. కొరియోగ్రఫీ -: గొప్పగా లేకపోయినా ఫరవాలేదు బాగుంది. ఆర్ట్ -: రాజీవన్ ఆర్ట్ పనితనం బాగుంది. పూర్తి విషాదాత్మక కథతో నిర్మించబడిన ఈ సినిమాకి ఏ అంచనాలు లేకుండా వెళితే ఫరవాలేదనిపిస్తుంది. ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.