English | Telugu

సినిమా పేరు:ఒకే ఒక జీవితం
బ్యానర్:డ్రీమ్ వారియర్ పిక్చర్స్
Rating:3.00
విడుదలయిన తేది:Sep 9, 2022

సినిమా పేరు: ఒకే ఒక జీవితం 
తారాగ‌ణం: శర్వానంద్, రీతు వర్మ, అక్కినేని అమల, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అలీ, రవి రాఘవేంద్ర
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
మ్యూజిక్: జేక్స్‌ బెజాయ్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్‌: శ్రీజిత్ సారంగ్
ప్రొడ్యూసర్స్: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శ్రీ కార్తీక్
బ్యాన‌ర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
విడుద‌ల తేదీ: 9 సెప్టెంబ‌ర్ 2022

 

యువ హీరో శర్వానంద్ లో ప్రతిభకు కొదవలేదు. కానీ కొంతకాలంగా వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాపై ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. ట్రైలర్ విడుదలయ్యాకే దీనిపై సినీ ప్రియుల్లో కాస్త ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది తల్లికొడుకుల బంధం నేపథ్యంలో తెరకెక్కిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కావడం, పైగా ఇటీవల ఈ మూవీ ప్రివ్యూ చూసి నాగార్జున కంటతతి పెట్టడం వంటివి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మరి ఈ ఐదేళ్లలో వరుసగా ఆరు పరాజయాలు చూసిన శర్వా ఈ చిత్రంతోనైనా విజయాన్ని అందుకునేలా ఉన్నాడో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:

చిన్న వయసులోనే యాక్సిడెంట్ లో తల్లి(అమల)ని పోగొట్టుకున్న ఆది(శర్వానంద్) 20 ఏళ్లు గడిచినా ఆమె జ్ఞాపకాలతోనే గడుపుతుంటాడు. సంగీతం పట్ల ఎంతో ఆసక్తి ఉన్నా తన ప్రతిభను నాలుగు గోడలకే పరిమితం చేస్తాడు. పక్కన అమ్మ లేకపోవడంతో నలుగురిలో పాడటానికి భయపడుతుంటాడు. ఒకసారి తన ఫ్రెండ్ శ్రీను(వెన్నెల కిషోర్) కారణంగా అనుకోకుండా సైంటిస్ట్ పాల్(నాజర్)ని కలుస్తాడు. ఆయన కనిపెట్టిన టైమ్ మిషన్ గురించి తెలుసుకొని, గతంలోకి వెళ్లి తన తల్లిని కాపాడుకోవాలి అనుకుంటాడు. మరి ఆది 20 ఏళ్లు వెనక్కి వెళ్ళి తన తల్లిని కాపాడుకోగలిగాడా?.. అతనితో పాటు గతానికి వెళ్లిన శ్రీను(వెన్నెల కిషోర్), చైతన్య(ప్రియదర్శి) ఎవరు? వాళ్ళు గతానికి వెళ్ళడానికి కారణాలేంటి?.. 20 ఏళ్లు వెనక్కి వెళ్ళడం వల్ల ఆ ముగ్గురు జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి?.. ఈ ప్రయాణంలో వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఏం సాధించారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

తెలుగులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అప్పట్లో 'ఆదిత్య 369', ఇటీవల 'బింబిసార' చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఆ సినిమాలలో హీరోలు అనుకోకుండా గతంలోకో, భవిష్యత్ లోకో టైమ్ ట్రావెల్ చేస్తారు. కానీ ఇందులో అలా కాదు. హీరోకి తెలిసే 20 ఏళ్లు వెనక్కి వెళ్ళి తన తల్లిని కాపాడుకోవాలి అనుకుంటాడు. అంటే 20 ఏళ్ల క్రితం చనిపోయిన తల్లిని బ్రతికించుకోవడానికి ఓ కొడుకు గతంలోకి చేసిన ప్రయాణం ఈ కథ అన్నమాట. ఈ స్టోరీ లైన్ తోనే సగం విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు కార్తీక్. ఇది తల్లికొడుకుల కథ కాబట్టి పూర్తి ఎమోషనల్ గా సాగుతుంది అనుకుంటే పొరపాటే. ఇందులోనూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది.

ఫస్ట్ హాఫ్ శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రల తీరును పరిచయం చేస్తూ మొదలవుతుంది. శర్వా తల్లి జ్ఞాపకాలు, సంగీతంతో గడిపేస్తుంటే.. వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రలు చిన్నప్పుడు చేసిన చిన్నచిన్న పొరపాట్లు కారణంగా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాయి. అందుకే ఈ ముగ్గురూ గతంలోకి వెళ్లి తమ భవిష్యత్ ని అందంగా మార్చుకోవాలి అనుకుంటారు. ఈ క్రమంలో శర్వా, అమల మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఇక వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రలు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ట్రాక్ అయితే థియేటర్లలో నవ్వుల మోత మోగించేలా ఉంది. అలాగే ప్రియదర్శి ట్రాక్ కూడా బాగానే ఉన్నప్పటికీ కామెడీ డోస్ మరింత పెంచుంటే ఇంకా బాగుండేది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఫస్టాఫ్ బ్యూటిఫుల్ రైటింగ్, ఎగ్జిక్యూషన్, పర్ఫామెన్స్ లతో ఆకట్టుకునేలా ఉంది.

సెకండాఫ్ అక్కడక్కడా కాస్త ల్యాగ్ అనిపించినా ఓవరాల్ గా మాత్రం రెండు కాలాలను కలుపుతూ నడిపిన కథనం ఆసక్తికరంగా సాగింది. చిన్న చిన్న మలుపులతో కాస్త ఉత్కంఠను రేకిత్తిస్తూనే ఎమోషనల్ గా, ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. "మనకు ఉండేది ఒకే ఒక జీవితం.. ప్రస్తుతం ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడమే అసలైన జీవితం" అనే పాయింట్ ని చక్కగా చూపించాడు దర్శకుడు.

ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు ప్లస్ అయ్యాయి. కొన్ని కన్నీళ్లు, కొన్ని కితకితలు పెట్టించేలా ఉన్న ఆ సంభాషణలు సన్నివేశాలకు బలాన్ని చేకూర్చాయి. అలాగే జేక్స్‌ బెజాయ్‌ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన స్వరపరిచిన అమ్మ సాంగ్ గుండెని హత్తుకునేలా ఉంది. ఇక ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రస్తుతాన్ని ఎంత అందంగా చూపించాడో.. తన కెమెరా కళ్ళతో మనం 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిన అనుభూతిని కలిగించాడు. 90ల నాటికి తగ్గట్లు ఎంపిక చేసిన లొకేషన్స్, ఆర్ట్ వర్క్ కూడా ఆకట్టుకున్నాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుంది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఆకట్టుకున్నప్పటికీ సెకండాఫ్ లో కనీసం పది నిముషాలు ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది. మొత్తానికి ప్రియదర్శి ట్రాక్ కి కామెడీ డోస్ పెంచి, సెకండాఫ్ ని మరింత క్రిస్పీగా మార్చి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది.

నటీనటుల పనితీరు:

నలుగురితో అంతగా కలవలేక, తన ప్రతిభను నాలుగు గోడలకు పరిమితం చేస్తూ తల్లి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న యువకుడి పాత్రలో శర్వానంద్ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించేలా చేశాడు. ఇందులో శర్వాకి జోడిగా రీతు వర్మ నటించినప్పటికీ ఆమె పాత్ర నిడివి తక్కువ. తల్లీకొడుకుల కథ ఫ్లోను డిస్టర్బ్ చేసేలా ఆమె సన్నివేశాలను ఇరికించే ప్రయత్నం చేయలేదు దర్శకుడు. అందుకే ఆమె సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఉన్నంతలో తన మార్క్ చూపించింది రీతు వర్మ. ఇక శర్వా తల్లి పాత్రకు అమల పూర్తి న్యాయం చేశారు. ఆమె వల్ల ఆ పాత్రకు మరింత వెయిట్ వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె చాలా సహజంగా నటించారు. ఇక శర్వా ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్, ప్రియదర్శి తమ మార్క్ కామెడీతో అలరించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తన చిన్న నాటి పాత్రతో చేసే కామెడీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో శర్వా, వెన్నెల కిషోర్, ప్రియదర్శిల చిన్నప్పటి పాత్రలు పోషించిన పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకొని వారు నటించిన తీరు అభినందనీయం. ఇక సైంటిస్ట్ పాత్రలో నాజర్ తన సీనియారిటీతో సులువుగా రాణించారు.

కొన్ని కన్నీళ్లు, కొన్ని నవ్వులతో భూత-భవిష్యత్ కాలాల నడుమ సాగే అందమైన ప్రయాణం 'ఒకే ఒక జీవితం'. పేరుకిది సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉన్నాయి. శర్వానంద్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. విజయం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న శర్వాకి ఇది చాలా ఊరటనిచ్చే సినిమా అని చెప్పొచ్చు.

-గంగసాని