English | Telugu
బ్యానర్:డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
Rating:2.75
విడుదలయిన తేది:Sep 25, 2025
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు
సంగీతం: తమన్ ఎస్
డీఓపీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
రచన, దర్శకత్వం: సుజీత్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: సెప్టెంబర్ 25, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. 'ఓజీ' నుంచి విడుదలైన ప్రతి కంటెంట్.. విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చింది. 'ఓజీ' మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. తెలుగునాట సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి 'ఓజీ' మూవీ ఎలా ఉంది? అభిమానుల అంచనాలను అందుకుందా లేదా? అనేది రివ్యూలో చూద్దాం. (OG Movie Review)
కథ:
ముంబైలో ఓ పోర్టును ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు సత్య దాదా(ప్రకాష్ రాజ్). అయితే ఆ పోర్టు స్థాపించడం వెనుక, దానిని ఇతరుల గుప్పిట్లోకి వెళ్ళకుండా కాపాడటం వెనుక ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్) ఉంటాడు. ఓజీ ఉండగా దాదాని కానీ, అతని సామ్రాజ్యాన్ని కానీ ఎవరూ టచ్ చేయలేరు. అయితే ఓ అనుకోని సంఘటన వల్ల.. దాదాను వదిలేసి, ముంబైకి దూరంగా వెళ్ళిపోతాడు ఓజీ. దీంతో ఏళ్ళు గడుస్తున్న కొద్దీ.. సత్య దాదా ముంబై మీద పట్టు కోల్పోతూ ఉంటాడు. అప్పటికే పెద్ద కొడుకుని పోగొట్టుకున్న దాదా.. చిన్న కొడుకుని కూడా కోల్పోతాడు. ఓమి(ఇమ్రాన్ హష్మీ) కన్నుపడి, అసలు దాదా సామ్రాజ్యమే కూలిపోయే పరిస్థితి వస్తుంది. దాంతో మళ్ళీ ఓజీ ముంబైలో అడుగుపెడతాడు. అసలు ఓజీ ఎవరు? అతను ముంబై నుంచి ఎందుకు దూరంగా వెళ్ళాడు? దాదా పెద్ద కొడుకు చావుకి, ఓజీకి సంబంధం ఏంటి? దాదా సామ్రాజ్యాన్ని, ముంబై నగరాన్ని నాశనం చేయాలనుకుంటున్న ఓమి ఎవరు? అతనికి ఓజీ ఎలా చెక్ పెట్టాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
కథగా చూసుకుంటే ఇది పెద్ద కథ కాదు. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ సినిమాలలో చూసే కథనే. అయితే ఈ రెగ్యులర్ కథని తీసుకొని.. తనదైన మేకింగ్ తో, టెక్నికల్ టీం సపోర్ట్ తో మ్యాజిక్ చేశాడు దర్శకుడు సుజీత్. ఎక్కడా బోర్ కొట్టకుండా కథని నడిపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్యాన్స్, యాక్షన్ లవర్స్ మెచ్చేలా ఈ సినిమాని మలిచాడు.
ముంబైలో పోర్టు పెట్టడం కోసం షిప్ లో బంగారం తీసుకొని వస్తున్న సత్య దాదా(ప్రకాష్ రాజ్) మీద ఎటాక్ జరగడం, ఆ ఎటాక్ నుంచి టీనేజ్ లో ఉన్న ఓజీ కాపాడటంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సత్య దాదా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పడం, దాని వెనుకున్న ఓజీ మాత్రం ఎటో వెళ్లిపోవడం వంటి సన్నివేశాలతో ఆసక్తికరంగా నడిచింది. ఈ క్రమంలో ఓజీ గురించి చెబుతూ వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ అదిరిపోయింది. ఇది ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది. ఓజీ, కన్మణి(ప్రియాంక మోహన్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. యాక్షన్ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా.. హీరోయిన్ పాత్రని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, అంతవరకు తెలివిగా ఉపయోగించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ఫైట్ పైసా వసూల్ అని చెప్పవచ్చు. ఇంట్రో, ఇంటర్వెల్ ఫైట్స్ ఇచ్చిన ఇంపాక్ట్ తో.. అసలు ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎంతసేపు స్క్రీన్ మీద కనిపించాడనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మర్చిపోతారు.
ఫస్ట్ హాఫ్ టెంపోని కంటిన్యూ చేస్తూ.. సెకండ్ హాఫ్ లో కూడా హై మూమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ వార్నింగ్ సీన్ మెస్మరైజ్ చేసింది. ఆ సీన్ ని ఎంతబాగా డిజైన్ చేశారో, అదే రేంజ్ లో పవన్ విజృంభించి ఆ సీన్ ని మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఓమి ఎంతో పవర్ ఫుల్.. కానీ అతని కంటే ఓజీ ఇంకా ఎన్నో రెట్లు పవర్ ఫుల్ అని తెలిపేలా కథని డ్రైవ్ చేసిన తీరు బాగుంది. క్లైమాక్స్ సైతం వావ్ అనేలా ఉంది. సెకండ్ పార్ట్ కి లీడ్ కూడా ఇవ్వడం విశేషం.
స్టార్ హీరోతో యాక్షన్ సినిమా అంటే.. కథను డ్రైవ్ చేసుకుంటూ బలమైన యాక్షన్ సీన్స్ రాసుకోవాలి, భారీ ఎలివేషన్స్ ఉండేలా చూసుకోవాలి. ఆ విషయంలో సుజీత్ సక్సెస్ అయ్యాడు. ఓజీ పాత్రని మలిచిన తీరు కానీ, ఆ పాత్రలో పవన్ ని ప్రజెంట్ చేసిన తీరు కానీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునే మూమెంట్స్ సినిమాలో ఎన్నో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అనగానే.. కామెడీ, సాంగ్స్, డ్యాన్స్ లు ఆశిస్తుంటారు ప్రేక్షకులు. అలాంటి అంశాలు ఆశించి సినిమాకి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. ఇది యాక్షన్ సినిమా.. కంప్లీట్ యాక్షన్ సినిమా.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
పవన్ కళ్యాణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో కట్టిపడేశారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఉగ్ర రూపం చూపించారు. పవన్ కళ్యాణ్ ను ఢీ కొట్టే ఓమి పాత్రలో ఇమ్రాన్ హష్మీ తన మార్క్ చూపించాడు. పవన్ తో పోటాపోటీగా నటించాడని చెప్పవచ్చు. ఓజీ తర్వాత తెలుగులో ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. నిడివి తక్కువే అయినప్పటికీ, కథకి కీలకమైన కన్మణి పాత్రలో ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
రైటర్ గా సుజీత్ అద్భుతాలు చేయలేదు కానీ, డైరెక్టర్ గా మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. మేకింగ్ బాగుంది. టెక్నికల్ టీం నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు. తమన్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం కట్టిపడేసింది. చాలా సీన్స్ ని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు తమన్. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ ని తెరపై ఎలా చూడాలని అభిమానులు కొన్నేళ్లుగా ఆశ పడుతున్నారో.. అలా చూపించాడు దర్శకుడు సుజీత్. ఈ సినిమా పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా, యాక్షన్ ప్రియులకు కూడా నచ్చే అవకాశముంది.
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.