English | Telugu

సినిమా పేరు:నిర్మలా కాన్వెంట్
బ్యానర్:అన్నపూర్ణ స్టూడియోస్
Rating:1.00
విడుదలయిన తేది:Sep 16, 2016

నాగార్జున నిర్మాత‌, దాంతో పాటు ఓ పాట పాడారు, కీల‌క పాత్ర పోషించాడు. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా రంగ ప్ర‌వేశం. కోటి అబ్బాయి రోష‌న్ సాలూరి సంగీతం, రెహ‌మాన్ త‌యుడు కూడా ఓ పాట పాడాడు. రాజీవ్ క‌న‌కాల త‌న‌యుడు, ఈటీవీ ప్ర‌భాక‌ర్ వార‌సుడు న‌టించిన సినిమా ఇది. ఓ సినిమాపై ఉత్సుక‌త పెర‌గ‌డానికి ఇంత‌కంటే ఏం కావాలి?  దానికి తోడు నాగార్జున‌కూడా భారీగా ప్ర‌మోట్ చేసిన సినిమా.. నిర్మ‌లా కాన్వెంట్‌. చిన్న సినిమాలు ఈమ‌ధ్య బాగా ఆడుతున్న నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా. మ‌రి.. నిర్మ‌లా కాన్వెంట్ ఎలా ఉంది?? హ‌డావుడి చేసినంత గొప్ప‌గా ఉందా?  లేదంటే చ‌ప్ప‌గా సాగిపోయిందా?   చూద్దాం.. రండి.

* క‌థ

నిర్మ‌లా కాన్వెంట్‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతుంటారు శ్యామ్యుల్ (రోష‌న్‌), శాంతి (శ్రియా శ‌ర్మ‌). ఇద్ద‌రి మ‌ధ్య అంత‌రాలెన్నో. మ‌తాలు వేరు.. ఆస్తి పాస్తులు వేరు. శాంతి రాజుగారి అమ్మాయి. కోటీశ్వ‌రురాలు. శ్యామ్యుల్ ఓ రైతు కొడుకు. ఈ రెండు కుటుంబాల‌కూ తాత‌ల కాలం నాటి వైరం ఉంది. శ్యామ్యూల్ పుస్త‌కాల పురుగు. చ‌దువులో త‌నే టాప్‌. శాంతి అల్ల‌రి పిల్ల‌. శ్యామ్యూల్‌ని ఇష్ట‌ప‌డుతుంది. శామ్యూల్ కూడా శాంతిని ఇష్ట‌ప‌డతాడు. వీరిద్ద‌రూ క్లోజ్‌గా ఉండ‌డం శాంతి నాన్న(ఆదిత్య మీన‌న్‌) కి తెలుస్తుంది. దాంతో శ్యామ్యూల్‌ని చిత‌గ్గొట్టించి వార్నింగ్ ఇస్తాడు. శామ్యూల్ మ‌న‌సు అర్థం చేసుకొన్న వాళ్ల నాన్న (సూర్య‌).. శాంతి ఇంటికి సంబంధానికి వెళ్తాడు. అక్క‌డ శామ్యూల్‌కున్న ఒకే ఒక్క ఎకరం పొలాన్ని బ‌ల‌వంతంగా లాక్కుని పంపించేస్తాడు. అంతేకాదు. 'నా బిడ్డ కోటీశ్వ‌రురాలు. నీ ద‌గ్గ‌ర ఏముంది?  నాలా నీ కొడుకు కూడా బాగా సంపాదిస్తే.. అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా' అంటూ ష‌ర‌తు విధిస్తాడు. అది తెలుసుకొన్న శామ్యూల్‌.. హైద‌రాబాద్ వెళ్తాడు. అక్క‌డ నాగార్జున (నాగార్జున‌)ని క‌లుసుకుంటాడు. త‌ర‌వాత ఏం జ‌రిగింది? అనేది తెర‌పై చూడాలి.


ఎనాలసిస్ :

*  విశ్లేష‌ణ‌

జి. నాగ కోటేశ్వ‌ర‌రావు ఓ సాదా సీదా క‌థ‌ని ఎంచుకొన్నాడు. కోట‌లో రాణి - తోట‌లో రాజులాంటి క‌థ ఇది. ప్రేమికుల మ‌ధ్య ఆస్తి అంత‌స్తుల అంత‌రాలు అడ్డు రావ‌డం, హీరో క‌ష్ట‌ప‌డి సంపాదించ‌డం, త‌న ప్రేమ‌ని ద‌క్కించుకోవ‌డం.. ఎప్ప‌టి కాన్సెప్ట్ ఇది?  దాన్ని న‌మ్మి నాగార్జున ఈ సినిమా చేయ‌డానికి ఎలా ముందుకొచ్చాడో అర్థంకాదు. రొటీన్ క‌థ‌ని ఎంచుకోవ‌డం ఏమాత్రం త‌ప్పు కాదు. అలాంటి క‌థ‌ని మ‌రింత రొటీన్‌గా తీయ‌డం మాత్రం త‌ప్పే!  ఈ సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశం కొత్త‌ద‌నానికి కిలో మీట‌ర్ల దూరంలో ఉంటుంది. తొలి స‌గం ఎంత‌కీ త‌ర‌గ‌దు. ఓ టీనేజ్ ల‌వ్ స్టోరీని తీస్తున్న‌ప్పుడు క‌థ‌ని ఎంత అందంగా రాసుకోవాలి?  వాళ్ల మ‌ధ్య ఉన్న‌ది ప్రేమో, ఆక‌ర్ష‌ణో తెలియ‌ని అయోమ‌యాన్ని ఎంత అద్భుతంగా చూపించాలి? అయితే ఇవేం ఈ సినిమాలో క‌నిపించ‌వు. నిండా ప‌ద‌హారేళ్లు నిండ‌ని కుర్రాడు తండ్రితో `నాన్నా.. ఆ అమ్మాయి లేక‌పోతే నేను బ‌త‌క‌ను. ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయ‌వా?` అని అడ‌గ‌డం, దానికి తండ్రి త‌లూప‌డం ఇవ‌న్నీ ఎంత కృత‌కంగా ఉంటాయి?   టీనేజ్ ల‌వ్ స్టోరీకి ఓ మెచ్యూర్డ్ కోటింగ్ ఇచ్చిన‌ట్టు అనిపిస్తుంది. వాళ్ల ఆలోచ‌న‌ల‌కు, వాళ్ల వ‌య‌సుకీ ఎక్క‌డా పొంతన ఉండ‌దు. సెకండాఫ్ అయితే అన్న‌పూర్ణ స్టూడియో, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్ర‌మోష‌న్ల కోసం వాడుకొన్న‌ట్టు ఉంటుంది.  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడులో క‌థానాయ‌కుడు ఆడి, గెల‌వ‌డం సెకండాఫ్ కాన్సెప్ట్‌. ఈ పోటీలో అడిగే ప్ర‌శ్న‌లు, దానికి చెప్పే స‌మాధానాలూ ఆ.. ప‌రంప‌ర కూడా బోర్ కొట్టించింది. ఈ స‌న్నివేశాల‌న్నీ స్ల‌మ్ డాగ్ మిలీయ‌నీర్ నుంచి ఎత్తేసిన‌వే. నాగార్జున‌, అఖిల్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్.. వీటి ప్ర‌స్తావ‌న ఈ సినిమాలో మాటి మాటికీ వ‌స్తూనే ఉంటుంది. అదేదో సొంత డ‌బ్బా కొట్టుకొన్న ఫీలింగ్ క‌లుగుతుంది.  లాజిక్‌కి అంద‌ని సీన్ ఏదంటే.. బి పాజిటీవ్ బ్ల‌డ్‌ని.. ఓ నెగిటీవ్ గా మార్చేయ‌డం. సైన్స్‌కి అంద‌ని అద్భుతం అది.

తొలి స‌గంలో నాగార్జున క‌నిపించ‌లేదు. సెకండాఫ్‌లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి అద్భుతాలు సృష్టించినా ఈ సినిమా ముందుకు సాగ‌ద‌న్న విష‌యం ఫ‌స్టాఫ్‌లోనే అర్థ‌మైపోతుంది. దానికి త‌గ్గ‌ట్టే సెకండాఫ్ కూడా సాగింది. ప్ర‌తీ స‌న్నివేశం ఊహించిన‌ట్టుగానే.. సాగుతూ.. సాగుతూ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టింది.  వినోదం లేక‌పోవ‌డం, అస‌లు అలాంటి ప్ర‌య‌త్నం ఏమీ చేయ‌క‌పోవ‌డం ఈ క‌థ‌లోని మ‌రో బ‌ల‌మైన లోపం.

*  న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఇది వ‌ర‌కు రుద్ర‌మ‌దేవిలో న‌టించిన రోష‌న్‌కి న‌టుడిగా ఇదే పూర్తి స్థాయి చిత్రం. త‌న వ‌ర‌కూ చాలా బాగా చేశాడు. చూడ్డానికి అందంగా క‌నిపించాడు. ఎక్క‌డా త‌డ‌బ‌డిన‌ట్టు అనిపించ‌లేదు. ఎదురుగా నాగార్జున ఉన్నా ధైర్యంగా చేశాడు. ఓ రెండేళ్లు ఆగితే అప్పుడు ఎలా ఉంటాడో చూడాలి. శ్రియ‌  చూడ్డానికి శ్వేతా బ‌సు ప్ర‌సాద్ చెల్లెలుగా క‌నిపించింది. అందంగా ఉంది. ఎక్స్‌ప్రెష‌న్స్ బాగున్నాయి. అలాగ‌ని అవ‌స‌రం లేని చోట కూడా ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చేసింది. అయితే త‌న‌కూ మంచి భ‌విష్య‌త్తు ఉంది. నాగ్‌ది త‌న స్థాయికి త‌గిన పాత్ర కాదు. నాగ్‌ని చూస్తుంటే మా టీవీలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పోగ్రాంని వెండి తెర‌పై చూస్తున్న‌ట్టే అనిపిస్తుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న క‌థ‌ల్ని, చిన్న ప్ర‌య‌త్నాల‌నీ ప్రోత్స‌హించే విష‌యంలో మాత్రం నాగ్‌ని మ‌రోసారి మెచ్చుకోవాలి. ఆదిత్య మీన‌న్ విల‌నిజం బ‌లంగా లేదు. త‌న పాత్ర‌కున్న ప‌రిధి అంతంత మాత్ర‌మే. ఎల్బీ క‌నిపించింది కాసేపే. అయినా చ‌క్క‌గా న‌టించాడు. సూర్య ఎప్ప‌ట్లా నేచుర‌ల్ ఆర్టిస్ట్ అనిపించుకొన్నాడు.

* సాంకేతికత‌

రోష‌న్ సాలూరి బాణీలు బాగున్నాయి. కొత్త కొత్త భాష ఆడియోలో హిట్ట‌య్యింది. తెర‌పై అంతంత మాత్రంగానే క‌నిపిస్తుంది. నేప‌థ్య సంగీతం ఓకే.  అర‌కు అందాల్ని కెమెరా చ‌క్క‌గా చూపించింది. సినిమా రిచ్‌గా ఉంది. అది కెమెరా మ‌హిమే. క‌థ‌, క‌థ‌నం, మాట‌లు ఇవ‌న్నీ సాదా సీదాగా ఉన్నాయి. గుర్తు పెట్టుకొనే డైలాగ్ ఒక్క‌టీ లేదు. స్క్రిప్ట్ ద‌శ‌లోనే ఈ సినిమా తేలిపోయింది. అందుకే రోష‌న్, నాగార్జున‌, శ్రియ‌.. వీళ్లంతా రాణించినా ఫ‌లితం లేకుండా పోయింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైన‌ల్ ట‌చ్‌:  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, అన్న‌పూర్ణ స్డూడియో ప్ర‌మోష‌న్ల కోసం తీసిన సినిమా ఇది

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00