Read more!

English | Telugu

సినిమా పేరు:నింగీ..నేలా...నాదే
బ్యానర్:సుజన్ మీడియా వర్క్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 3, 2009
ఇదొక చైనా చిత్రం. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో "ఇన్విజబుల్‍ వింగ్స్" పేరుతో అనువదించగా, ఆ చిత్రాన్ని తెలుగులో "నింగీ..నేలా..నాదే"గా అనువదించారు. ఈ చిత్రంలోని కథ విషయానికొస్తే జిహ్వ అనే అమ్మాయి చాలా చక్కని పిల్ల. ఆమె తల్లిదండ్రులు పేదవారైనా ఆమెను ఎంతగానో ప్రేమిస్తుంటారు. జిహ్వ స్కూల్‍ చదువయిపోగానే కాలేజీకి వెళ్ళాల్సిన సమయంలో కరెంట్‍ షాక్ తగలటం వల్ల డాక్టర్లు ఆమె రెండు చేతులూ తీసివేస్తారు. ఆ తర్వాత జిహ్వ చదువుకోటానికే కాకుండా తన పనులు తాను చేసుకోటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటుంది.ఆ డిప్రెషన్‌లో జిహ్వ ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తుంది.కానీ ఆమె తండ్రి ఆమెను కాపాడి ప్రోత్సాహించటం వల్ల ఆత్మస్థైర్యంతో తన అంగవైకల్యాన్ని అధిగమించటానికి ప్రయత్నిస్తుంటుంది. తనకు చేతుల్లేని కారణంగా తన పనులన్నీ కాళ్ళతోనే చేయటానికి ప్రయత్నిస్తూ, ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తుంది. భోజనం చేయటం, ముఖం కడుక్కోవటం, చిరిగిన బట్టలు సూదితో కుట్టటం, అందుకు సూదిలోకి దారం ఎక్కించటం, వంటచేయటం, సైకిల్‍ తొక్కటం వంటి అనేక పనులను జిహ్వ తన కాళ్ళతోనే చేస్తుంది. చివరికి కాళ్ళతో వ్రాయటం ప్రాక్టీస్ చేసి, కాలేజీలో సీటు సంపాదిస్తుంది. కష్టపడి చదువుతుంటూంది.ఆమెకు యూనివర్సిటీలో సీటు సంపాదించాలని కోరిక. దానికామె కృషిలో లోపం లేకుండా కష్టపడుతుంది. కానీ సీటు రాదు. కారణం ఏమిటంటే రెండు చేతులు లేని జిహ్వ దాక్టర్ కోర్సుకి అప్లై చేయటం వల్లే ఆమెకు సీటు రాదు. ఈ విషయం తెలిసిన జిహ్వ స్పోర్ట్స్ కోటాలో సీటు సంపాదించటానికి ఈత పోటీలకు వెళ్ళాని కోచింగ్ తీసుకుంటుంది. కానీ ఆమె తల్లి చనిపోతుంది. అయినా ఎంతో పట్టుదలతో ఈత పోటీలకు వెళ్ళి ప్రథమ స్థానం సంపాదించి చివరికి మెడిసన్‌లో సీటు సంపాదిస్తుంది. క్లుప్తంగా ఇదీ కథ.
ఎనాలసిస్ :
ఈ సినిమా గురించి ఎంతరాసినా తక్కువే అవుతుంది. ప్రమాదవశాత్తూ రెండు చేతులూ కోల్పోయిన ఒక ఆడపిల్ల తన జీవితంలో, తన అవిటి తనాన్ని ఛాలెంజ్‍ చేసి, ఎదురైన అడ్డంకులన్నింటినీ అధిగమించి జీవితంలో తను అనుకున్నది సాధిస్తే, అన్ని అవయవాలూ సవ్యంగా ఉన్న మామూలు వ్యక్తులు తమ తమ జీవితంలో ఎంత సాధించవచ్చో, ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు తీసిన విధానం మనల్నిచాలా ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో హృదయం చెమ్మగిల్లుతుంది. రెండు చెతులు లేనివారూ, ఒకకాలున్నవారూ, ఒకచేయి కలిగిన వారూ ఈత పోటీకి శిక్షణ తీసుకునే సీను నిజంగా మనసుల్ని కదిలిస్తుంది. చేతులు కోల్పోయిన జిహ్వ తన తల్లికి వంటచేసి పెట్టే సీను .. ఇలా చెప్పుకుంటూపోతే చాలా సీన్ల గురించి చెప్పాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: జిహ్వ పాత్రధారిణి చాలా అద్భుతంగా నటించింది అంటే అది ద్రోహమే అవుతుంది.ఎందుకంటే నిజానికి ఆమె నటించలేదు.. జీవించింది. ఇది ఆమె జీవిత కథే కాబట్టి. మిగిలిన వారు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సంగీతం-: ఈ చిత్రంలోని పాటను చంద్రబోస్ వ్రాశారు."ఆరాటం ముందు ఆటంకం ఎంత-సంకల్పం ముందు వైకల్యం ఎంత,ఎదురీత ముందు విధిరాత ఎంత, ధృఢ చిత్తం ముందు-దురదృష్టం ఎంత"అనే పాట చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది. కెమెరా -: చాలా బాగుంది. ఎడిటింగ్ -: ఇంకా బాగుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే బలహీన మనస్కులు ఈ చిత్రాన్ని తప్పకుండా చూసి తీరాలి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఈ చిత్రం తప్పకుండా చూపించాలి.ఇది చూసిన ఆ పసి మనస్సుల్లో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం నెలకొల్పుతుంది.