Read more!

English | Telugu

సినిమా పేరు:నేను నా రాక్షసి
బ్యానర్:శ్రీ లక్ష్మి నరసింహ ప్రోడుక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Apr 29, 2011

నిర్మాత - నల్లమలపు శ్రీనివాస్

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - పూరీ జగన్నాథ్

సంగీతం - విశ్వ, రెహమాన్, అనూప్

సినిమాటోగ్రఫీ - అమోల్ రాథోడ్

పాటలు - విశ్వ, రెహమాన్, భాస్కరభట్ల రవికుమార్

ఎడిటింగ్ - శేఖర్

కొరియోగ్రఫీ - రాజు సుందరం, ఆంథోనీ

తారాగణం - రానా దగ్గుపాటి, ఇలియానా .డి. క్రూజ్, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, నాగినీడు, ఆలీ, ఆహుతి ప్రసాద్, ముమైత్ ఖాన్ తదితరులు...

కథ -

ఒక సమస్య ఎంత తీవ్రమైనదైనా, ఎంత చిన్నదైనా, ఆ సమస్యకి ఆత్మహత్యా పరిష్కారం...? అన్న ప్రశ్నకి సమాధానమే ఈ చిత్రకథ. ఇక కథ విషయానికొస్తే అభిమన్యు (రానా) ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అతను రైఫిల్ షూటింగ్ లో ఎక్స్ పర్ట్. మీనాక్షి (ఇలియానా) ఒక కాఫీబార్ లో పనిచేస్తూంటుంది. మీనాక్షి ఒక వెబ్ సైట్ రన్ చేస్తూంటుంది. ఆమెను చూడగానే అభిమన్యు ప్రేమిస్తాడు. ఆత్మహత్య చేసుకోదలచిన వారు ఆ వెబ్ సైట్ ను కాంటాక్ట్ చేస్తే, ఇలియానా వారి చావుని వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతుంది. సుపారీ (చంపటానికి తీసుకునే కిరాయి) తీసుకుని అమ్మాయిలను ఏడిపించే కుర్రాణ్ణి ఒకణ్ణి చంపుతాడు అభి. విక్రం (సుబ్బరాజు) అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఏడేళ్ళ కూతురుకి క్యాన్సర్.

 

ఆమెను చమపమని ఆ కుర్రాడి తండ్రి అభిమన్యుకి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ పసిపిల్ల అభికి మంచి ఫ్రెండ్. దాంతో అభి ఆ కుర్రాడి తండ్రిని కూడా చంపేస్తాడు. కోమాలో ఉన్న అభి తల్లి కూడా చనిపోవటంతో అభి తాను కూడా చావాలనుకుంటాడు. అందుకు మీనాక్షి వెబ్ సైట్ ని కాంటాక్ట్ చేస్తాడు. కానీ పొడుచుకుని చనిపోయే సమయంలో తన చావుని విడియో తీస్తుంది తను ప్రేమించిన అమ్మాయేనని తెలుసుకుని బ్రతకాలనుకుంటాడు అభి. అభి చంపిన ఆ తండ్రి పెద్ద కొడుకు జైలు నుండి బయటకొస్తాడు. అతనే అభి తల్లిదండ్రుల చావుకి కారకుడు. అతను అభిని చంపటానికి ప్రయత్నిస్తుంటాడు. ఆత్మహత్యల వెబ్ సైట్ నడుపుతున్న మీనాక్షిని చివరికి పోలీసులు ట్రేస్ చేస్తారు. అప్పుడు అభి, మీనాక్షి కలసి వెనిస్ వెళ్తారు. తనను గాఢంగా ప్రేస్తున్నానన్న అభితో తాను కూడా ఓ పదిహేను రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటానంటుంది మీనాక్షి. ఆ తర్వాత ఏమయింది అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఈ సినిమా భయంకరమైన డ్రై సబ్జెక్ట్. ముందు ఇలాంటి కథతో సినిమా తీయాలనుకున్న దర్శక, నిర్మాతలకు హేట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే హీరో, హీరోయిన్లు ఇద్దరికీ డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ వల్ల సూయిసైడల్ టెండెన్సీ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి కథలను మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారో తెలియదు. విభిన్నమైన కథలతో సినిమాలు రావాలి అంటూ గోలపెట్టే వారికి ఈ సినిమాలో విభిన్నత గోచరిస్తుంది. కానీ ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ ని క్యారీ చేయటంలో దర్శకుడి అసమర్థత మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పూరీ జగన్నాథ్ ( మైండ్ యూ పీప్యుల్ ఈ సినిమా వరకూ మాత్రమే నేను దర్శకుడు అసమర్థుడన్నది) దర్శకుడిగా టెకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ కథలోని సోల్ ఎక్కడో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.

 

ఇక నటన విషయానికొస్తే...

హీరోగా రానా తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. అతను డ్యాన్స్ లో కాస్త వెనకపడ్డట్టనిపించాడు. కానీ దాన్ని దర్శకుడు పూరీ చాలా జాగ్రత్తగా కవర్ చేశాడు. చక్కని ధవళ గాత్రంతో రానా డైలాగ్స్ చెప్పినా, భాష విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఇలియానా నటనలో మమచి కసి కనిపించింది. కానీ ఆమె పాత్రలో పరిపక్వత లేకపోవటం వలన ఆమె నటనకు రావలసిన గుర్తింపు రాదేమోననిపిస్తుంది. కమెడియన్ గా ఆలీకి వంక పెట్టేదెవరు....? ముమైత్ ఖాన్ ఈ చిత్రంలో మామూలుగా తను నటించే పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించటం విశేషం. అభిమన్యు సింగ్ కన్నా బాగా నటించే నటులు వెతికితే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మందే ఉంటారు. కాని వెతికే ఓపిక మన వాళ్ళకి ఎక్కడిది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి.

సంగీతం -ఈ చిత్రంలో అద్భుతం అనిపించక పోయినా వినటానికి పాటలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ -జిగ్ జాగ్ షాట్లతో కళ్ళకి శ్రమ కలిగించకుండా ఉండి బాగుంది.

మాటలు - పూరీ జగన్నాథ్ మాటల్లో అక్కడక్కడ "పోకిరి" పోలికలు కనిపించినా, ఆ స్థాయిలో ఈ చిత్రంలోని డైలాగులు లేవనే చెప్పాలి.

పాటలు - ఈ సినిమాలోని పాటల్లో సాహిత్యం బాగానే ఉంది. ఒక పాటలో "బంగారానికి బంధువా-నా దాహం తీర్చే బిందువా" వంటి ప్రయోగాలు సాహిత్య పరంగా బాగున్నాయి.

ఎడిటింగ్ -బాగుంది.

ఆర్ట్ -ఒ.కె.

కొరియోగ్రఫీ - సగటు స్థాయిలో ఉంది.

యాక్షన్ - ముగ్గురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేశారు కాబట్టి ఈ సినిమాలోని ఫైట్స్ బాగుండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కదా.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

వెరైటీ సినిమా కావాలీ....వెరైటీ సినిమా కావాలీ...... అని గుండెలు బాదుకునే వాళ్ళ కోసమే తీసిన వెరైటీ సినిమా ఇది. మీకు గనక అలాంటి వెరైటీ సినిమా చూడాలనిపిస్తే ఈ సినిమా నిరభ్యంతరంగా చూడండి.