English | Telugu
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Feb 3, 2017
నాని సినిమా అనగానే ఎగిరి గంతేస్తున్నారంతా. ఆడియన్సూ అలానే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ బయ్యర్లు కూడా! ఎందుకంటే జనాలకు కావల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని కావల్సిన దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు నాని. నేను లోకల్ నుంచి ఆశించేది కూడా అదే ఎంటర్‌టైన్‌మెంట్. సినిమా చూపిస్త మావని వినోదాల హరివిల్లులా నడిపించాడు త్రినాథరావు నక్కిన. సో.. నేను లోకల్‌లో వినోదాలకు ఢోకా లేదు... అనే సంగతి ముందే అర్థమైపోయింది. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? నాని తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడా, లేదా?
* కథ
బాబు (నాని) అల్లర చిల్లర అబ్బాయి. కీర్తి (కీర్తి సురేష్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ... `నీకు నేను అంత తేలిగ్గా పడిపోను` అంటుంది కీర్తి. `నిన్ను డిస్ట్రబ్ చేస్తా చూడు` అంటూ పందెం కాస్తాడు బాబు. చివరికి మెల్లమెల్లగా కీర్తి బాబు ప్రేమలో పడిపోతుంది. అయితే... కీర్తి నాన్న (సచిన్ ఖేడేకర్)ని బాబు అంటే అస్సలు పడదు. ఈలోగా సిద్దార్థ్ వర్మ (నవీన్ చంద్ర) రంగ ప్రవేశం చేస్తాడు. తనో ఎస్.ఐ. `కీర్తిని ప్రేమించింది నేను.. తను నాది` అంటాడు. ఇంతకీ ఈ సిద్దార్థ్ వర్మ ఎవరు? కీర్తి ఎవరిని పెళ్లి చేసుకొంటుంది? అనేదే... `నేను లోకల్` సినిమా.
ఎనాలసిస్ :
ఈ సినిమా చూస్తున్నంత సేపూ చాలా పాత సినిమాలు కళ్ల ముందు కదులుతుంటాయి. అందులోనూ లేటెస్ట్‌గా వచ్చిన సినిమా చూపిస్త మావ, భలే భలే మగాడివోయ్ సీన్లు ఇక్కడా రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. భలే భలేలో నాని హీరో అయితే... సినిమా చూపిస్త మావకి దర్శకుడు త్రినాథరావు నక్కిన. వీళ్లిద్దరూ కలసి తమ పాత సినిమాల్నే మళ్లీ టైటిల్ మార్చి తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించడం. నాన్న నో చెప్పడం, క్లైమాక్స్‌లో నాన్న తన మనసుని మార్చుకొని ఇద్దరికీ పెళ్లి చేయడం అనే అరిగిపోయిన కాన్సెప్ట్ ఈ సినిమాలోనూ కనిపించింది. కొత్త కొత్త కథలు ఎంచుకొనే నాని.. మరీ ఇంత రొటీన్ స్టోరీని ఎలా అంగీకరించాడో అర్థం కాదు. ద్వితీయార్థంలో నవీన్ చంద్ర పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచైనా కథ మలుపు తిరుగుతుందనుకొంటే... అక్కడా నిరాశ తప్పదు. సెకండాఫ్‌లో మొదలైన స్టోరీ క్లైమాక్స్ వరకూ నత్తనడక నడుస్తూనే ఉంటుంది. చివర్లో నాని స్పీచ్ తో క్లైమాక్స్ కానిచ్చేశారు. అక్కడక్కడ సినిమా మరీ బోర్ కొట్టించేలా సాగుతుంటుంది. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగడమే కాకుండా... ఈ సినిమాపై ఇంప్రెషన్ సైతం తగ్గించేస్తాయి. అయితే... ఇంత రొటీన్ గా సాగినా సినిమా చూడబుద్దేసిందంటే అదంతా నాని వల్లే. నానితోనే డైలాగులు, రొటీన్ సన్నివేశాలు రక్తి కట్టాయి. పోసాని కామెడీ, ఓ కామెడీ ఫైటు, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కొన్ని మంచి సంభాషణలు ఈ సినిమాని టైమ్ పాస్ మూవీగా మార్చేశాయి.
* నటీనటుల ప్రతిభ
నాని మరోసారి వన్ మ్యాన్ షో చూపించాడు. తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. నాని నటన కోసం మాత్రమే ఈ సినిమా చూడొచ్చు అనుకొనేలా చేశాడు. కీర్తి సురేష్ అందంగా ఉంది. తన పాత్రకూ ప్రాముఖ్యత ఇచ్చాడు దర్శకుడు. నవీన్ చంద్రకు ఇదో కొత్త తరహా పాత్ర. పోసాని తన పాత స్టైల్‌నే ఫాలో అయిపోయాడు. హీరోయిన్ తండ్రిగా నటించిన సచిన్ మంచి నటుడే. కానీ.. తన సంభాషణలు, నటన ఈ సినిమాలో మాత్రం చాలా కృత్రిమంగా కనిపిస్తాయి. రావు రమేష్ ఈసారి అతిథి పాత్రకు పరిమితమయ్యాడు.
* సాంకేతిక వర్గం
దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ ఈసారి వినిపించలేదు. నెక్ట్ ఏంటి? అనే పాట ఒక్కటే పాడుకొనేలా ఉంది. కెమెరా వర్క్ సూపర్బ్. ప్రసన్న మాటలు ఆకట్టుకొన్నాయి. చాలా సందర్భాల్లో చిన్న చిన్న డైలాగులతో నవ్వించాడు. దానికి నాని ఎక్స్‌ప్రెషన్ తోడవ్వడంతో.. డైలాగ్స్ దూసుకెళ్లాయి. సినిమా చూపిస్త మావ లోని డైలాగులు కొన్ని రిపీట్ అయినట్టు అనిపించాయి. బహుశా దర్శకుడు ఆ సీన్లనే మళ్లీ వాడుకోవడం మూలానేమో..?? త్రినాథరావు నక్కిన ప్రతిభావంతుడే. పరమ రొటీన్ కథనే టైమ్ పాస్ మూవీగా మార్చగలిగాడంటే.. కాస్త కొత్త కథ రాసుకొంటే కచ్చితంగా మంచి సినిమాలు తీయగలడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చివరగా: నాని మ్యాజిక్ కోసం చూడొచ్చు.