Read more!

English | Telugu

సినిమా పేరు:నాన్నకు ప్రేమతో
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
Rating:2.50
విడుదలయిన తేది:Jan 13, 2016

సినిమా వాళ్ల‌కు, అందునా ద‌ర్శ‌కుడికి క్రియేటివిటీ ఉండాల్సిందే. ఓ క‌థ‌ని క్రియేటీవ్ గా చెప్ప‌డం అంద‌రికీ సాధ్యం కాదు. అయితే.. కొంత‌మందిలో ఆ క్రియేటివిటీ మ‌రీ టూమ‌చ్‌గా ఉంటుంది. పావ‌లా విష‌యాన్ని.. పాతిక రూపాయ‌ల క్రియేటివిటీలో ముంచి తేల్చేయ‌డంలో... ఆ క్రియేటివిటీ త‌ప్ప సినిమాలో ఏం క‌నిపించ‌దు. సుకుమార్ సినిమాల్లో ఈ ల‌క్ష‌ణం ఎక్కువ‌గా కనిపిస్తుంటుంది. తన అద్భుత‌మైన మేధ‌స్సుని.. మాస్ జ‌నాల‌కు అర్థ‌మ‌య్యేలా చూపించాల‌ని చాలా సార్లు ప్ర‌య‌త్నించాడు.. అందులో కొన్నిసార్లు స‌క్సెస్ అయ్యాడు కూడా. 1 కూడా ప్రేక్ష‌కుల క్రియేటివిటీకి ప‌రీక్ష పెట్టే సినిమానే. ఇప్పుడు నాన్న‌కు ప్రేమ‌తో కూడా అచ్చంగా అలానే తీశాడు. మ‌రి ఈసారైనా.. స‌క్సెస్ అయ్యాడా, వ‌న్ లాంటి ప్ర‌తిఫ‌ల‌మే ద‌క్క‌బోతోందా? తెలియాలంటే.. రివ్యూలోకి అడుగుపెట్టాల్సిందే

కథ:

లండన్ లో పెద్ద వ్యాపారవేత్త  రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్). త‌న వార‌సుడే  అభిరామ్(ఎన్టీఆర్‌). అభికి నాన్నంటే పంచ ప్రాణాలు.నాన్నే స్ఫూర్తి.. ఒకరోజు ర‌మేష్ చంద్ర‌.. తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వుతాడు. డాక్ట‌ర్లు కూడా ఇక ఆయ‌న ఎంతో కాలం బ‌త‌క‌డ‌ని తేల్చేస్తారు. తండ్రి స్థితికి కార‌ణం.. కృష్ణమూర్తి(జగపతిబాబు) అనే విష‌యం అర్థం అవుతుంది. మైండ్ గేమ్‌తో ఎదుటివాళ్ల‌ని మోసం చేసే దుర్మార్గుడు కృష్ణమూర్తి. తన తండ్రి మ‌నో వేద‌న‌కు కార‌ణ‌మైన కృష్ణ‌మూర్తిని వ‌ద‌ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకొంటాడు అభి. అందుకోసం లండ‌న్ వెళ్తాడు.. అక్క‌డ కృష్ణ‌మూర్తితో అభిరామ్ ఆడిన గేమ్ ఏంటి?? అందులో ఎలా గెలిచాడు?  అన్న‌దే ఈ సినిమా.


ఎనాలసిస్ :

ఎన్టీఆర్ ఓ గొప్సస్టార్‌. కోట్లాది అభిమానుల్ని త‌న వైపుకుతిప్పుకోగ‌లిగే స్టార్ డ‌మ్ ఉంది. త‌న 25వ సినిమా ఇది. దాంతో పాటు సుకుమార్‌కీ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఇద్ద‌రూ క‌లిస్తే.. అదిరిపోయే క‌థేదో రెడీ అయిపోయి ఉంటుంద‌నుకొంటారంతా. కానీ తండ్రిని మోసం చేసిన విల‌న్‌పై ఓ కొడుకు ప్ర‌తీకారం తీర్చుకొనే మామూలు క‌థ‌ని ఎంచుకొన్నాడు సుకుమార్‌. నాన్న‌కు ప్రేమ‌తో స్టోరీ ఇదే.. అంటూ.. ఎన్టీఆర్‌, సుకుమార్ కూడా ఆల్రెడీ చెప్పేశారు. క‌థ‌లో అద్భుతం ఆశించ‌డం మ‌న అమాయ‌క‌త్వ‌మే. అయితే సుకుమార్ టేకింగ్‌, ఎన్టీఆర్ న‌ట‌న‌తో ఈ సినిమా మ‌రో రేంజుకు వెళ్తుంద‌ని ఆశించారంతా. కానీ.. అందులో ఎన్టీఆర్ మాత్ర‌మే స‌క్సెస్ అయ్యాడు.. సుక్కు తేలిపోయాడు.

సుకుమార్ ఆలోచ‌న‌లు, అత‌ని క్రియేటివిటీ అద్భుతంగా ఉంటాయి. వ‌న్ సినిమా ఫ్లాప‌యినా కొన్ని కొన్ని స‌న్నివేశాలు, బ్లాక్స్ సూప‌ర్బ్ అనిపిస్తాయి. సేమ్ టూ సేమ్ అదే మ్యాజిక్ నాన్న‌కు ప్రేమ‌తోలో కూడా రిపీట్ అవుతుంద‌ని ఆశించారు. కానీ.. అది ఈ సినిమాలో లేకుండా పోయింది. అత్యంత సాదా సీదా క‌థ‌ని బ‌తికించే క్రియేటివిటీ.. స‌త్తా సుకుమార్ క‌థ‌నంలో లేదు. కొన్ని కొన్ని చోట్ల మ‌రీ టూ ఇంటిలిజెంట్ గా ఆలోచించి సీన్లు రాసుకొన్నాడు. అది కామన్ ఆడియ‌న్ బుర్ర‌కి ఎక్కదు. మ‌నోళ్లకు సినిమా అంటే అర‌టి పండు వ‌ల‌చి నోట్లో పెట్టిన‌ట్టుండాలి. అయితే అర‌టి పాదు ఇచ్చి, నీళ్లు పోసి పెంచు.. అప్పుడు కాయ‌లు కాస్తాయ్‌.. ఆ త‌రవాత పండుద్ది.. అంటూ దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక అస్స‌లు న‌చ్చదు. ఈ సినిమా అదే టైపు. ఓ సీన్ చూస్తే.. అర్థం కాదు. నాలుగైదు సీన్లు గ‌డిచాక‌... ఆ సీను ఇందుకు తీశాడా అనిపిస్తుంది. ఆ లింకు ప‌ట్టుకొంటే..సుకుమార్‌ని మెచ్చుకోకుండా ఉండ‌లేం.. కానీ దుర‌దృష్టం.. ఆ లింకు మిస్స‌యిపోతుంది. దాంతో.. సుకుమార్  ప‌డిన క‌ష్టం ఎలివేట్ కాలేదు. వ‌న్ లో క‌న్‌ఫ్యూజ్ స్ర్కీన్ ప్లేతో ఇబ్బంది పెడితే ..  ఈసినిమాలో ఇంటిలిజెంట్ డైలాగ్స్ తో క‌న్‌ఫ్యూజ్ చేశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్‌, ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాల్లో సుకుమార్ మార్క్ క‌నిపిస్తుంది. మ‌ధ్య‌లో సినిమా అంతా కేవ‌లం ఎమోష‌న్ మీద క్యారీ అయ్యేదే. దాన్ని ఎన్టీఆర్ త‌న న‌ట‌న‌తో నిల‌బెట్టుకొంటూ వ‌చ్చాడు. కానీ.. క‌థ‌, క‌థ‌నాల్లో లోపంతో ఆ క‌ష్టం కాస్త వృధా అయిపోయింది.



తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఆహా అద్భుతంగా ఉన్నాయి అన్న స‌న్నివేశాలు ఈ సినిమాలో చాలా త‌క్కువ‌. ఉన్నా... సుకుమార్ క్రియేటివీ తో... అవ‌న్నీ మ‌రుగైపోయాయి. ఓ స‌న్నివేశాన్ని కొత్త‌గా రాసుకోవ‌డం ఎంత ముఖ్యమో, సూటిగా ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం కూడా అంతే ముఖ్యం. ఆ విష‌యంలో సుక్కు చేసిన త‌ప్పే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తున్నాడ‌నిపిస్తోంది. అంత తెలివిగా ఆలోచించే సుకుమార్ కూడా కొన్నిసార్లు లాజిక్ మిస్స‌య్యాడు. డ్ర‌గ్స్ కేసులో పోలీసులు వ్య‌వ‌హ‌రించే తీరే ఇందుకు తార్కాణం..

మాస్ హీరో ఎన్టీఆర్‌ని పెట్టుకొని క్లాస్ క‌థ చెప్పాల‌నుకొనే విష‌యంలో సుక్కుని అబినందించాలి. అంద‌రిలా తొడ‌గొట్టే సీన్లు రాసుకోకుండా.. ఎన్టీఆర్లో ని న‌టుడ్ని పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు తీసుకురావాల‌నుకొన్నాడు. అందుకే.. 24 సినిమాల్లోనూ మ‌న‌కు క‌నిపించ‌ని కొత్త ఎన్టీఆర్ ఈ సినిమాలో క‌నిపించాడు. ప‌తాక స‌న్నివేశాల్లో భారీ పోరాటాల‌తో చుట్టేయ‌కుండా భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాలు రాసుకొన్నాడు. ఈ విష‌యంలో సుక్కు, ఎన్టీఆర్ ల గట్స్‌ని అభినందించాల్సిందే. ఎన్టీఆర్ న‌ట‌న ఎలా ఉంటుంది అనే విష‌యాన్ని పాఠంలా బోధించాలంటే ఈ సినిమా డీవీడీ ఇవ్వాలి. ఓ సాధార‌ణ‌మైన కథ‌.. స‌రైన స్ర్కీన్ ప్లే లేక‌పోతే ఏమ‌వుతుందో చెప్ప‌డానికి ఈ సినిమా చూపించాలి. అంతే...

ఎన్టీఆర్ త‌న స్టైలింగ్ తో న‌ట‌న‌తో ఆక‌ట్టుకొంటాడు. న‌టుడిగా ఇది త‌న బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. జ‌గ‌ప‌తిబాబుతో, రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో చేసిన సీన్ల‌లో.. ఎన్టీఆరే హైలెట్ అయ్యాడు. ఇక జ‌గ‌ప‌తిబాబుని కూడా అంతే స్టైలీష్ గా చూపించాడు... సుక్కు. ఆ పాత్ర‌లో జ‌గ్గూభాయ్ ఇమిడిపోయాడు.

ర‌కుల్ తొలిసారి త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకొంది. ఫ‌ర్వాలేదు.. ఇంకొంత మెరుగు ప‌ర్చుకొంటే.. ఇంకాస్త మంచి ఫ‌లితం ఉంటుంది.  వినోదం  లేక‌పోవ‌డం, నిడివి ఎక్కువ‌వ్వ‌డం ఈ సినిమాకి అత్యంత పెద్ద మైన‌స్‌లు. కొన్ని సీన్లు రిపీటెడ్‌గా క‌నిపిస్తాయి. డెలాగుల్లో డెప్త్ ఎక్కువైంది. దేవి త‌న పాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేయ‌లేక‌పోయాడు. ఫాలో ఫాలో పాట ఒక్క‌టే హ‌మ్మింగ్ గా ఉంటుంది. ఆర్‌.ఆర్ బాగుంది. ఫొటోగ్ర‌ఫీ.. మిగిలిన సాంకేతిక విభాగాలు అత్యున్న‌త స్థాయిలో ప‌నిచేశాయి.

కొత్త‌ద‌నం కావాలి, మాస్ హీరోలు పార్ములా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అని అంద‌రూ కోరుకొంటున్నారు. ఈ ద‌శ‌లో ఇలాంటి ప్ర‌య‌త్నాలు.. చేయాల్సిందే. కాక‌పోతే.. ఆ ప్ర‌య‌త్నంలో నిజాయ‌తీ ఎంత ముఖ్య‌మో... ఆ ప్ర‌య‌త్నాన్ని ఇంకాస్త అర్థ‌వంతంగా ముగించ‌డం ఇంకా ముఖ్యం. ఎమోష‌న్‌నీ, స్టార్ హీరోని తీసుకొన్నంత మాత్ర‌న పాత క‌థ గొప్ప క‌థ అయిపోదు. ఈ విష‌యం నాన్న‌కు ప్రేమ‌తో మ‌రోసారి నిరూపిస్తుంది. అయితే.. 25వ సినిమాగా మాస్ మ‌సాలా క‌థ‌ని ఎంచుకోకుండా ఎమోష‌న్ ట‌చ్ ఇవ్వాల‌ని చూసిన ఎన్టీఆర్‌ని మ‌న‌స్ఫూర్తిగా అభినందించాల్సిందే.