Read more!

English | Telugu

సినిమా పేరు:ముగ్గురు
బ్యానర్:సురేష్ ప్రొడక్షన్
Rating:2.50
విడుదలయిన తేది:Aug 19, 2011

పవన్ (నవదీప్), అంజి (అవసరాల శ్రీనివాస్), మారుతి (రాహుల్) ముగ్గురూ చిన్నప్పటి నుండీ స్నేహితులు. వీళ్ళు ముగ్గురూ కనీసం టెంత్ క్లాస్ కూడా పాసవని వాళ్ళు. వీళ్ళు బాగా డబ్బున్న జె.పి. (ఆహుతి ప్రసాద్) ని కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించే సమయానికి అతనికి గుండెనొప్పి రావటం వలన అతన్ని కాపాడి, అతని ద్వారా మలేసియాలో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మలేసియాలో జె.పి. ముగ్గురు కూతుర్ల శ్రద్ధా దాస్, సంజన, సౌమ్య ముగ్గురినీ, ఈ ముగ్గురూ ప్రేమించేలా చేసుకుంటారు. అది జె.పి. దగ్గర పనిచేసే బడేమియా (ఆలీ)కి ఇష్టముండదు. ఆ సమయంలో బాలాత్రిపుర సుందరి మలేసియాలోని వీళ్ళ ఆఫీస్ కి వస్తుంది. ఆమెను చూసి పవన్, అంజి, మారుతి ముగ్గురూ పారిపోతారు. వాళ్ళు ఎందుకలా పారిపోయారు...? ఆమెకీ ఈ ముగ్గురికీ సంబంధం ఏమిటి...? జె.పి. ముగ్గురు కూతుర్లనూ ఈ ముగ్గురూ పెళ్ళిచేసున్నారా...? అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

దర్శకుడు వి.యన్.ఆదిత్య గురించి ఈ రోజు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. గతంలో అతను దర్శకత్వం వహించిన మనసంతా నువ్వే, నేనున్నాను వంటి చిత్రాలే చెపుతాయి. ఇక శతాధిక చిత్రాలను నిర్మించిన మూవీ మొగల్ రామానాయుడి గారి నిర్మాణపు విలువల గురించి కూడా చర్చ అనవసరం.

నటన - నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్, శ్రద్ధా దాస్, సంజన, సౌమ్య, ఇంకా రీమాసేన్, శివాజీ, ఆహుతి ప్రసాద్ ఇలా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. బడేమియాగా ఆలీ తన పాత్రలో లైట్ గా నెగెటీవ్ షేడ్స్ కనిపించినా కూడా బాగానే నవ్వించాడు. చివరిగా ఛోటా డాన్ గా డాక్టర్ బ్రహ్మానందం నటన క్లైమాక్స్ లో మనల్ని ఆకట్టుకుంటుంది.
సంగీతం - కొత్తదనం లేకపోయినా, బోర్ కొట్టేలా మాత్రం ఈ చిత్రంలోని సంగీతం లేదు. పాటలన్నీ బాగానే ఉన్నాయి. రీ-రికార్డింగ్ బాగుంది.
సినిమాటోగ్రఫీ - బాగుంది.
మాటలు - ఈ చిత్రంలోని మాటలు గొప్పగా లేకపోయినా ఫరవాలేదనిపించేలా ఉన్నాయి. "ఫ్యూచర్ గుర్తొచ్చి ఫ్యూయల్ కారుతోందా" వంటి మాటలు కొన్ని చోట్ల మనల్ని బాగానే నవ్విస్తాయి.
పాటలు - టైటిల్ సాంగ్ ఒక కొత్త ప్రయోగం. ఈ పాటలో సినిమాకి పనిచేసిన అందరి పేర్లనూ కూర్చి పాట వ్రాయటం బాగుంది. అలాగే మిగిలిన పాటలు కూడా బాగున్నాయి.
ఎడిటింగ్ - ఒ.కె.
ఆర్ట్ - బాగుంది.
కొరియోగ్రఫీ - ఈ చిత్రంలోని పాటల్లో కొరియోగ్రఫీ అద్భుతంగా లేకపోయినా రీజనబుల్ గా ఉంది.
యాక్షన్ - ఇలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలకు యాక్షన్ అవసరం లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ సినిమాలో హింస లేదు. అసభ్యత లేదు. అశ్లీలత లేదు. మొదటి నుండీ చివరి వరకూ నవ్వు తప్ప ఈ సినిమాలో మరొకటి లేదు. కనుక మీరు కాసేపు హాయిగా నవ్వుకోవాలంటే ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు.