Read more!

English | Telugu

సినిమా పేరు:మిత్రుడు
బ్యానర్:వైష్ణవి సినిమా
Rating:2.50
విడుదలయిన తేది:May 1, 2009
మలేసియాలో ఉంటున్న ఆదిత్య (బాలకృష్ణ) పక్కా తాగుబోతు.అతను చావుకోసం ఎదురుచూస్తున్న మనిషి. ఇందు (ప్రియమణి) మలేసియాలో ఉండి యమ్.బి.ఎ. చదువుకునే ఇండియన్ అమ్మాయి. ఆమే తండ్రి సాయికృష్ణ (రంగనాథ్) పెద్ద పారిశ్రామికవేత్త. అతని ఒక్కగానొక్క కూతురు ఇందు. మునుస్వామి (ప్రదీప్ రావత్) అనే గూండా తన కొడుక్కి ఇందూని ఇవ్వమని సాయికృష్ణని అడుగుతాడు. అందుకు సాయి కృష్ణ అంగీకరించడు. మలేసియా ఉన్న ఇందు తన జాతకాన్ని తమిళనాడులోని మధురైలో చూపించగా, ఆమెకు వైధవ్యం ఉందనీ, అది పోవాలంటే ఒక ప్రత్యేకమైన జాతకుణ్ణి పెళ్ళి చేసుకుంటే, అతను నెలరోజుల్లో చనిపోతాడనీ చెపుతారు అక్కడి జ్యోతిష్కులు. ఆ లక్షణాలున్న వ్యక్తి ఆదిత్యని చూసి, అతని వెంటపడి ప్రేమించానని పట్టుబట్టి మరీ పెళ్ళిచేసుకుంటుంది ఇందు. ఆమె నిజానికి మధు (దీపక్)ని పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. ఈ మధు మరెవరో కాదు ఇందు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే కేశవరావు (చంద్రమోహన్) కోడుకు. కానీ తన జాతకం ప్రకారం భర్త చనిపోతాడు గనుక, ఆదిత్యను పెళ్ళిచేసుకుని అతను చనిపోగానే, తనకిష్టమైన మధుని చేసుకుందామని ఇందు ఆలోచన. పైకి మంచి వాడుగా కనిపించే మధు నిజానికి దుర్మార్గుడు.ఇవేవీ తెలియని ఆదిత్య, ఇందుని వివాహం చేసుకుంటాడు. మలేసియా నుండి ఇంటికి రాగానే ఇందు తండ్రి ఇందూని, ఆమె భర్త ఆదిత్యనూ అవమానపరుస్తాడు. ఒకసారి సాయికృష్ణ కొత్త ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మంత్రి అయిన మునుస్వామి వచ్చి సాయి అల్లుడి గురించి హేళనగా మాట్లాడతాడు. దాంతో ఇంట్లో భోజనం చేసే అల్లుణ్ణి అవమానిస్తాడు సాయికృష్ణ. అయినా ఇందు కోసం అవన్నీ భరిస్తాడు ఆదిత్య. తన మావను అవమానించినందుకు గాను మునుస్వామి ఇంటికెళ్ళి అతన్ని కొట్టి వస్తాడు ఆదిత్య. ఇందుతో ఆదిత్య పెళ్ళి జరిగి 29 రోజులవుతాయి. 30వ రోజున కేశవరావు తన మనుషులతో ఆదిత్యను రెచ్చగొట్టే మాటలనిపించి, వారు అతని చేతిలో తన్నులుతినేలా చేసి, సాయికృష్టకు ఫోన్ చేసి పిలుస్తాడు. అది చూసి కేశవరావు కొడుకు మధు తన తండ్రినే కత్తితో పొడుస్తాడు. అది చూసిన ఆదిత్య అతన్ని వెంబడిస్తాడు. అక్కడికి ఇందు వస్తుంది.ఇందు, మధు, ఆదిత్య గొడవ పడుతూంటే ఒక లారీ వచ్చి ఆదిత్యను గుద్దేస్తుంది. దాంతో ఒక రాయికి తలకొట్టుకుని స్పృహ కోల్పోతాడు ఆదిత్య. అతన్ని హాస్పిటల్లో చేరుస్తారు. హాస్పిటల్లో కూడా సాయికృష్ణ ఆదిత్యని తూలనాడుతూ మాట్లాడుతుంటే విన్న లాయర్ విశ్వనాథ్ (కృష్ణ భగవాన్) అప్పుడు అతనికి నిజం చెపుతాడు. నిజానికి ఆదిత్యను తన అల్లుడు చేసుకోవాలనుకుంటాడు సాయికృష్ణ. కానీ సాయికృష్ణ వల్లే ఒక ప్రమాదంలో గ్యాస్ సిలెండర్‌లు పేలి గంపెడుమంది ఉంటే ఆదిత్య కుటుంబం అంతా ఆ మంటల్లో మాడి మసైపోతుంది. ఆ విషయం సాయికృష్ణకు లాయర్ విశ్వనాథ్ చెప్పగానే, లోపలికి వెళ్ళి ఆదిత్యను చూడాలనుకుని వెళ్ళగా అక్కడ అతనుండడు. తన వారు చనిపోయి అప్పటికి సరిగ్గా సమవత్సరమ కావటంతో, అతను తన ఊరుకి వెళ్ళి తన వారందరికీ పిండప్రదానం చేసి, తన ఇంటికి వెళ్ళి అక్కడ పడిపోతాడు. అక్కడికి చేరుకున్న ఇందుకి తన నిజస్వరూపం చూపిస్తాడు మధు. అదే సమయానికి అక్కడికి మంత్రి మునుస్వామి తన బలగంతో వస్తాడు. ఆ తర్వాతేం జరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం -: రివర్స్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలో అక్కడక్కడా వాడారు. దర్శకుడు మహాదేవ్. అతను తొలిసారి దర్శకత్వం వహిస్తున్నా ఆ తడబాటు చిత్రంలో మనకెక్కడా కనపడదు. ఎంతో అనుభవమున్న దర్శకుడిలా అతని దర్శకత్వం ఉంది. అతని టేకింగ్ డీసెంట్‍గా ఉంది. ఇక ఈ చిత్రానికి ఎంచుకున్న కథ కొత్తగా, విభిన్నంగా ఉంది. మాములుగా మన సినిమాల్లో ముందు జరుగబోయే సీన్ ఏమిటో మనం తెలిగ్గానే ఊహించవచ్చు కానీ ఈ సినిమాలో అదంత తేలిక కాదు. ఏ సీను కూడా మనం ముందుగా ఊహించలేము. కథ ఆ విధంగా తయారుచేయబడింది. సీనిక్ ఆర్డర్ కూడా ఈ చిత్రంలో కొత్తగానే ఉంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం -: బాలయ్య చిత్రాలకు మణిశర్మ సంగీతం ఎప్పుడూ ఒక ఎస్సెట్‍గానే ఉంటుంది. సమరసింహారెడ్డి నుంచీ అది ఒక ఆచారంలా వస్తోంది. అందుకే ఈ చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి. అలాగే రీ-రికార్డింగ్ కూడా సినిమాని బాగానే ఎలివేట్‍ చేసే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ -: చూడ ముచ్చటగా ఉంది. ఒక డిఫరెంట్‍ లైటింగ్ స్కీము వాడారీ చిత్రానికి. తొలిపాటలో, ఆ విభిన్నత మనక్కనిపిస్తుంది. ముఖ్యంగా పాటల్లో, ఫైటుల్లో కేమేరా పనితనం బాగుంది. ఎడిటింగ్ -: బాగుంది. ఉన్నంతలో నీట్‍గా, క్రిస్ప్ గా కట్‍ చేశారు. యాక్షన్ -: రామ్-లక్ష్మణ్‍ లు కంపోజ్‍ చేసిన ఫైట్స్ చాలా ఎఫె క్టీవ్‌గా ఉన్నాయి. మాటలు -: యమ్.రత్నం ఈ చిత్రానికి వ్రాసిన మాటలు బాగానే ఉన్నాయి. నిర్మాణపు విలువలు -: ఈ సినిమాని రిచ్‌గా చూపించటంలో నిర్మాత రాజీ పడకుండా ఖర్చుచేశారని ఈ చిత్రం చూసిన ఏవరికైనా అర్థమయ్యే విషయం.ఈ చిత్రంలోని నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఏ అసభ్యత, అశ్లీలత లేని ఈ చిత్రాన్ని సకుటుంబ సమేతంగా చూడవచ్చు. చాలా రోజుల తర్వాత బాలయ్య ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ఏ రేంజ్‍ హిట్టనేది మరో రెండు వారాలు గడిస్తే గానీ చెప్పలేము.