Read more!

English | Telugu

సినిమా పేరు:మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
బ్యానర్:యువి క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 7, 2023

సినిమా పేరు : మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి
తారాగణం: అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి, జయసుధ, నాజర్‌, మురళీశర్మ, తులసి, సోనియా, అభినవ్‌ గోమఠం, హర్షవర్థన్‌, భద్రం తదితరులు
సంగీతం: రథన్‌
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: గోపీసుందర్‌
సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
రచన, దర్శకత్వం: మహేష్‌బాబు పి.
నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌
బ్యానర్‌: యువి క్రియేషన్స్‌
విడుదల తేదీ: 07 సెప్టెంబర్‌, 2023
సినిమా నిడివి: 151 నిమిషాలు

2020లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత సినిమా చేయని అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో మళ్ళీ పేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ‘జాతిరత్నాలు’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఈ సినిమాతో ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి వచ్చాడు నవీన్‌ పొలిశెట్టి. వీరిద్దరి రేర్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ, ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండడం సహజం. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య గురువారం విడుదలైన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్‌ అయ్యిందీ, ఏ మేరకు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసింది అనే విషయాలను సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ:

ఓపెన్‌ చేస్తే లండన్‌లోని ఓ కాస్ట్‌లీ హోటల్‌లో అన్విత(అనుష్క) షెఫ్‌గా పనిచేస్తుంటుంది. ఆమె చేసే రెసిపీల గురించి, ఆమె టాలెంట్‌ గురించి కొన్ని సీన్స్‌ అయిపోయిన తర్వాత ఇండియాలోని తన తల్లి(జయసుధ)ను చూసేందుకు  బయల్దేరుతుంది. ఆరోగ్య స్థితి అంతగా బాగోని తల్లి.. అన్వితను పెళ్ళి చేసుకోమని పోరుతుంటుంది. మొదటి నుంచి పెళ్ళి మీద సరైన అభిప్రాయం లేని అన్విత జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని డిసైడ్‌ అవుతుంది. ఈ క్రమంలోనే తల్లి ఆరోగ్యం క్షీణించడం, ఆమె చనిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు తనకు తల్లి అనే తోడు ఉంది. ఇకపై తనకు తోడెవరు? అనే ప్రశ్న మొదలవుతుంది అన్వితలో. ఆ ఆవేదన నుంచే ఓ కొత్త ఆలోచన పుడుతుందామెలో. పెళ్ళి చేసుకోకుండానే బిడ్డను కంటే.. ఈ ఆలోచన వచ్చిందే తడవు ఫెర్టిలిటీ సెంటర్‌కి వెళ్ళి దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటుంది. వేరొకరి స్పెర్మ్‌ సేకరించి దాన్ని ప్రాసెస్‌ చెయ్యడం ద్వారా తల్లి అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో దానికే ప్రిపేర్‌ అవుతుంది అన్విత. తన బిడ్డలో అన్నీ మంచి క్వాలిటీస్‌ వుండాలని కోరుకుంటుంది. తను కోరుకున్న క్వాలిటీస్‌ ఉన్న వ్యక్తిని వెతికి అతని స్పెర్మ్‌ తీసుకునేందుకు చేసే ప్రయత్నంలో స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి(నవీన్‌ పొలిశెట్టి) తారసపడతాడు. స్టాండప్‌ కామెడీ షో ఇప్పిస్తానని అతనితో పరిచయం పెంచుకుంటుంది అన్విత. అతనికి అసలు విషయం చెప్పకుండా, అతనికి తెలియకుండా అతని బ్యాక్‌గ్రౌండ్‌ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పరిచయాన్ని ప్రేమగా భావించిన సిద్ధు ఒక ఫైన్‌ మార్నింగ్‌ ఆమెకు ప్రపోజ్‌ చేసే ప్రయత్నం చేస్తాడు. షాక్‌ అయిన అన్విత అతనికి అసలు విషయం చెప్పేస్తుంది. అప్పుడు షాక్‌ తినడం సిద్ధు వంతవుతుంది. విషయం తెలుసుకున్న సిద్ధు ఎలా రియాక్ట్‌ అయ్యాడు? అన్విత కోరినట్టు స్పెర్మ్‌ డొనేట్‌ చెయ్యడానికి ఒప్పుకున్నాడా? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది మిగతా కథ. 


ఎనాలసిస్ :

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైనప్పుడే కథ అందరికీ తెలిసిపోయింది. అయితే ఆ కథని దర్శకుడు ఎలా నడిపించాడు, రెండున్నర గంటలపాటు ఎంటర్‌టైనింగ్‌గా ఎలా తీశాడు అనేది ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. లండన్‌లో ఓపెన్‌ అయిన కథ పది నిమిషాలు ఎంతో సాదా సీదాగా నడుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్‌ ఇండియాకి రావడం, తనకు స్పెర్మ్‌ డొనేట్‌ చేసే లిస్ట్‌లో హీరో తగలడంతో కథ కాస్త స్పీడందుకుంటుంది. దానికి కారణం నవీన్‌ పొలిశెట్టే. మంచి కామెడీ టైమింగ్‌తో అందర్నీ నవ్వించాడు. ఓ పక్క అన్విత ప్రయత్నాలు, మరో పక్క సిద్ధు స్టాండప్‌ కామెడీ షోలు, మధ్య మధ్య ఇద్దరూ కలుసుకోవడం. ఈ ప్రాసెస్‌లోనే ఫస్ట్‌హాఫ్‌ అంతా నడుస్తుంది. ఓ పక్క నవ్వుకుంటూనే స్టోరీని ఎంజాయ్‌ చేస్తాం. విషయం తెలుసుకున్న సిద్ధు.. అన్వితను ఎవాయిడ్‌ చెయ్యడం, తర్వాత అన్విత కూడా సిద్ధుని వదిలేసి మరో డోనర్‌ కోసం ప్రయత్నాలు చెయ్యడం, ఆ తర్వాత అన్విత మనసు తెలుసుకొని స్పెర్మ్‌ డొనేట్‌ చెయ్యడానికి మళ్ళీ సిద్ధు రావడం.. ఇలా ఒక దాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. అయితే ఫస్ట్‌హాఫ్‌ కథనంలో ఉన్నంత వేగం సెకండాఫ్‌లో లేదు. నిజానికి ఫస్ట్‌హాఫ్‌ తర్వాత స్టోరీని ఎక్కడైనా ఎండ్‌ చేసే అవకాశం ఉంది. కానీ, కొన్ని లెంగ్తీ సీన్స్‌, రిపీటెడ్‌ సీన్స్‌, నవ్వు రాని కామెడీ సీన్స్‌తో సెకండాఫ్‌ని నింపేయడంతో ల్యాగ్‌ అనిపిస్తుంది, అక్కడక్కడా బోర్‌ కొడుతుంది కూడా. అసలు జీవితంలో పెళ్ళే వద్దనుకున్న అన్విత రియలైజ్‌ అవ్వడం, స్పెర్మ్‌ డొనేట్‌ చేసిన తర్వాత అగ్రిమెంట్‌ ప్రకారం ఆమెను కలవకూడదని అన్విత పెట్టిన కండీషన్‌ ప్రకారం ఆమెకు దూరంగా ఉంటున్న సిద్ధు కూడా రియలైజ్‌ అయి ఆమెను కలవడం కోసం లండన్‌ వెళ్ళడం.. ఈ సీన్స్‌ అన్నీ కథని ఎప్పుడో ఎండ్‌ చెయ్యొచ్చు కదా! ల్యాగ్‌తో ఇంకా లాగడం ఎందుకు అనిపిస్తుంది. అలాగే ఇద్దరూ చాలా కాలం తర్వాత కలుసుకునే క్లైమాక్స్‌ సీన్‌ కూడా వీక్‌గా అనిపిస్తుంది. అంతేకాదు ఎమోషనల్‌గా టచ్‌ చేసేలా లేదు. 

నటీనటుల పనితీరు:

ఇక పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పాల్సి వస్తే.. ఎక్కువ మార్కులు నవీన్‌ పొలిశెట్టికే పడతాయి. ఎందుకంటే అతను కథలో ఎంటర్‌ అయిన తర్వాత కథనంలో కాస్త హుషారు కనిపిస్తుంది. అతను చేసిన కామెడీ అందరికీ హుషారు తెప్పించింది. అయితే కథలో వచ్చే కామెడీ కంటే స్టాండప్‌ కామెడీలో వచ్చిన కామెడీయే ఎక్కువగా ఉంది. ఇక అనుష్క పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. లుక్‌ పరంగా ఎంతో డిగ్నిటీగా కనిపించింది. మిగతా క్యారెక్టర్స్‌లో జయసుధ, నాజర్‌, మురళీశర్మ, తులసి, అభినవ్‌, సోనియా... వారి వారి క్యారెక్టర్లకు ఉన్న పరిధి మేరకు పెర్‌ఫార్మ్‌ చేశారు. 

సాంకేతిక నిపుణుల పనితీరు: 

ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. నిరవ్‌షా మంచి ఫోటోగ్రఫీ అందించాడు. సినిమా అంతా ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది. రథన్‌ ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా, గోపీసుందర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను సమకూర్చారు. పాటల పరంగా రథన్‌ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఒక్క పాట కూడా క్యాచీగా అనిపించదు. కాస్త మెరుగైన విషయం ఏమిటంటే గోపీసుందర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మంచి సంగీతం అందించే ప్రయత్నం చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌ వరకు బాగుంది. సెకండాఫ్‌లో ల్యాగ్‌ ఎక్కువగా ఉంది. రెండున్నర గంటల సినిమాని మరో 20 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే దాదాపు 10 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత మెగాఫోన్‌ పట్టుకున్న మహేష్‌బాబు వీలైనంతవరకు ఒక మంచి సినిమా తియ్యడానికే ట్రై చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌ని, సెకండాఫ్‌ని బ్యాలెన్స్‌ చెయ్యడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. ఫస్ట్‌హాఫ్‌పై పెట్టిన శ్రద్ధ సెకండాఫ్‌పై కూడా పెట్టి కొన్ని ల్యాగ్‌ సీన్స్‌ తగ్గించి వుంటే సినిమా స్పీడ్‌ పెరిగేది. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ జోనర్‌ సినిమాలు గతంలోనూ వచ్చినప్పటికీ ఒక కొత్త బ్యాక్‌డ్రాప్‌.. హీరో, హీరోయిన్‌ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్స్‌తో కథను కొత్త ప్రజెంట్‌ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌ మహేష్‌. సినిమాను స్టార్ట్‌ చెయ్యడంతోనే ఆడియన్స్‌ని ఎమోషనల్‌ చేశాడు. అయితే హీరో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆడియన్స్‌లోనూ హషారు వచ్చింది. చక్కని కామెడీతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా నవ్వించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్‌. ఒక ఇంట్రెస్టింగ్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఇక ఫస్ట్‌ హాఫ్‌లో కనిపించినంత స్పీడ్‌ సెకండాఫ్‌లో కనిపించదు. కథానుసారం హీరోకి నవ్వించే అవకాశం కూడా లేదు. దాంతో సీన్స్‌ అన్నీ ఎంతో సాదా సీదాగా వెళతాయి. క్లైమాక్స్‌లో హెవీ సెంటమెంట్స్‌ అప్లయ్‌ చేద్దామని ట్రై చేశాడు డైరెక్టర్‌. కానీ, అది అంతగా రుచించలేదు. సినిమాలో హైలైట్స్‌ అంటూ వుంటే అవి నవీన్‌ పొలిశెట్టి పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌లో చేసిన కామెడీ, అనుష్క సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, గోపీ సుందర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. ఓవరాల్‌గా చెప్పాలంటే అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా అని ఉత్సాహంగా వెళ్ళే ఆడియన్స్‌కి నిరాశే ఎదురు కావచ్చు. ఎందుకంటే లుక్‌ పరంగా అనుష్క ఆకట్టుకుంటుందే తప్ప, గ్లామర్‌గా కనిపించడానికి ఈ కథలో స్కోప్‌ లేదు. ఫస్ట్‌ హాఫ్‌ ఎంజాయ్‌ చేసే ఆడియన్స్‌ సెకండాఫ్‌ చూసి నిరుత్సాహపడతారు. కమర్షియల్‌గా కూడా ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో చెప్పడం కష్టం. 

- జి.హరా