English | Telugu

సినిమా పేరు:మిషన్ ఇంపాజిబుల్
బ్యానర్:మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
Rating:2.75
విడుదలయిన తేది:Apr 1, 2022

సినిమా పేరు: మిషన్ ఇంపాజిబుల్
తారాగ‌ణం: తాప్సీ పన్ను, హరీష్ పేరడీ, హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయాతీర్థ మొలుగు, సత్యం రాజేష్, వైవా హర్ష
సంగీతం: మార్క్ కె రోబిన్
సినిమాటోగ్రఫీ: దీపక్
ఎడిటర్: రవితేజ గిరజాల
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
రచన, దర్శకత్వం: స్వరూప్ RSJ
విడుదల తేదీ: ఏప్రిల్ 1, 2022

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్‌ మొదటి సినిమాతోనే మెప్పించి మంచి విజయంతో కెరీర్ ని స్టార్ట్ చేశాడు. తన రెండో సినిమాని ఏ హీరోతో చేస్తాడో అనుకుంటే.. ఊహించని విధంగా ముగ్గురు పిల్లలను లీడ్ రోల్స్ లో పెట్టి 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమా తీశాడు. తాప్సీ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'మిషన్ ఇంపాసిబుల్' ఎలా ఉంది? ఈ సినిమాతో స్వరూప్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? తెలుసుకుందాం.

కథ:- ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన శైలజ(తాప్సీ).. తన పలుకుబడితో పోలీసులని, పొలిటీషియన్స్ ని మేనేజ్ చేస్తూ చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్న రామ్ శెట్టి(హరీష్ పేరడీ) అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు తిరుపతి దగ్గర చిన్న పల్లెటూరుకి చెందిన రఘుపతి, రాఘవ, రాజారామ్ అనే ముగ్గురు పిల్లలు.. డబ్బు, పేరు సంపాదించాలన్న ఆశతో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంని పట్టుకోవడానికి ముంబై బయల్దేరుతారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురైన అవాంతరాలు ఏంటి? దావూద్ ని పట్టుకోవాలన్న వారి ఆశ నెరవేరిందా? శైలజను ఈ పిల్లలు ఎలా కలిశారు? రామ్ శెట్టిని పట్టుకోవడానికి శైలజ వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

మొదటి సినిమా 'సాయి శ్రీనివాస ఆత్రేయ'ని క్రైమ్ కామెడీ జోనర్ లో తీసి హిట్ కొట్టిన స్వరూప్.. రెండో సినిమాని కూడా అదే జోనర్ లో రూపొందించాడు. రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకొని దానికి కామెడీ జోడించి ఎంటర్ టైనింగ్ గా చెప్పడం తన స్టైల్ అని.. రెండో సినిమాతోనూ చెప్పేశాడు స్వరూప్. మొదటి సినిమాలో మూఢనమ్మకాలను అడ్డుపెట్టుకొని మృతదేహాలతో డబ్బు సంపాదిస్తున్న గ్యాంగ్ గురించి చూపించిన స్వరూప్.. రెండో సినిమాలో చైల్డ్ ట్రాఫికింగ్ గురించి చూపించాడు. ఈ సినిమాలో ఊహించని సన్నివేశాలు, ఊహకందని మలుపులు ఉండవు. సినిమా చూస్తున్నంత సేపు సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

'మిషన్ ఇంపాసిబుల్' బాగా తెలిసిన కథ, చాలా చిన్న కథ. దానిని దావూద్ కి లింక్ చేస్తూ సరదాగా చెబుతూ నవ్వించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. ముగ్గురు పిల్లల ఇంట్రడక్షన్లు, వాళ్ళు దావూద్ ని పట్టుకోవడానికి బయల్దేరడం వంటి సీన్స్ కామెడీగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో క్రైమ్ ఉన్నప్పటికీ దానిని కూడా కామెడీగానే చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని కొన్ని సీన్స్ మరీ ఆర్టిఫీషియల్ గా ఉన్నాయి. పిల్లల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి తాప్సీ ప్లాన్ చేసే సీన్స్ సినిమాటిక్ గా ఉన్నాయి. అయితే చివరిలో పిల్లలను అవెంజర్స్ లా, విలన్ ని జోకర్ లా చూపించిన ఆలోచన బాగుంది.

ఈ సినిమా చూస్తే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన రెండు సినిమాలను మిక్సీలో వేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా జోనర్, దానిని నడిపించిన తీరు నవీన్-స్వరూప్ కాంబినేషన్ లో వచ్చిన 'సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమా లాగే ఉంటుంది. అలాగే నవీన్ మరో మూవీ 'జాతిరత్నాలు' కూడా గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో పిల్లల క్యారెక్టర్స్ డిజైన్ చేసిన తీరు చూస్తే జూనియర్ జాతిరత్నాలు అనిపిస్తారు. వాళ్ళ మాట తీరు, చేష్టలు అడుగడుగునా జాతిరత్నాలను గుర్తు చేస్తుంటాయి.

మార్క్ కె రోబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఫ్రెష్ గా అనిపించింది. దీపక్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ ఇద్దరూ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. 

నటీనటుల పనితీరు:- ఈ సినిమాకు ప్రధానబలం రఘుపతి, రాఘవ, రాజారామ్ పాత్రలలో నటించిన ముగ్గురు పిల్లలు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా, సినిమాలో ఎక్కడా హీరో లేడు అనే ఫీలింగ్ కలగకుండా చాలా చక్కగా నటించారు. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ ఒదిగిపోయింది. పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ తన మార్క్ చూపించింది. రామ్ శెట్టి పాత్రలో హరీష్ పేరడీ ఆకట్టుకున్నాడు. సత్యం రాజేష్, వైవా హర్ష తదితరులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' సినిమాలను మిక్స్ చేసినట్లుండే సరదాగా సాగిపోయే పిల్లల సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. ఏ అంచనాలు లేకుండా సరదాగా ఫ్యామిలీతో వెళ్లి చూసేయొచ్చు.

 

-గంగసాని

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00