English | Telugu

సినిమా పేరు:మళ్ళీ పెళ్లి
బ్యానర్:విజయకృష్ణా మూవీస్
Rating:2.50
విడుదలయిన తేది:May 26, 2023

సినిమా పేరు: మళ్ళీ పెళ్లి
తారాగణం: నరేశ్, పవిత్రా లోకేశ్, వనితా విజయకుమార్, జయసుధ, శరత్‌బాబు, రవి వర్మ, అనన్య నాగళ్ల, రోషన్, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు
పాటలు: అనంత శ్రీరాం
సంగీతం: సురేశ్ బొబ్బిలి, అరుల్ దేవ్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్‌రెడ్డి
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
ప్రొడక్షన్ డిజైన్: భాస్కర్ ముదావత్
నిర్మాత: నరేశ్ వి.కె.
రచన-దర్శకత్వం: ఎం.ఎస్. రాజు
బ్యానర్: విజయకృష్ణా మూవీస్
విడుదల తేదీ: 26 మే 2023

నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా ఎం.ఎస్. రాజు 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా చేస్తున్నారనే విషయం బయటకు వచ్చినప్పట్నుంచీ అది వాళ్ల సొంత జీవితాలకు సంబంధించిందనే అభిప్రాయం చాలామందిలో కలిగింది. ట్రైలర్ వచ్చాక ఆ అభిప్రాయం బలపడింది. కారణం.. బెంగళూరు హోటల్ ఘటన సీన్. ప్రొమోషనల్ ఈవెంట్స్‌లో ఇది ప్రత్యేకించి ఒకరి జీవితం గురించి చెప్తున్నది కాదనీ చాలా మంది జీవితాల్లో జరిగిన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయనీ దర్శకుడు ఎమ్మెస్ రాజు నమ్మబలుకుతూ వచ్చారు. నరేశ్, పవిత్ర సైతం అలాంటి మాటలే చెప్పారు. మరి ఇప్పుడు మన ముందుకొచ్చిన 'మళ్ళీ పెళ్లి' ఎలా ఉందో తెలుసా?...

కథ

నరేంద్ర (నరేశ్), పార్వతి (పవిత్ర) నటులు. ఇద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు కూడా ఉంటారు. నరేంద్ర మూడో భార్య సౌమ్యా సేతుపతి (వనిత)తో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. పార్వతి తీరు నచ్చి ఆమెకు ఆకర్షితుడవుతాడు నరేంద్ర. పార్వతి మొదట ఫ్రెండ్స్‌లా ఉందామంటుంది కానీ, తర్వాత తనూ అతనికి దగ్గరవుతుంది. విచ్చలవిడిగా తిరుగుతూ నరేంద్ర డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడుతుండే సౌమ్య.. ఆ ఇద్దరి వ్యవహారాన్ని మీడియా సాయంతో బజారుకు ఈడ్చాలని చూస్తుంది. చివరకి నరేంద్ర, పార్వతి కథ ఏ తీరానికి చేరిందనేది క్లైమాక్స్.


ఎనాలసిస్ :

నిజ జీవితంలో నరేశ్, పవిత్రా లోకేష్ మధ్య సన్నిహితత్వం విషయం 'మా' ఎన్నికల సందర్భంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. బెంగళూరులో ఆ ఇద్దరూ ఒకే హోటల్లో ఉండగా, నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి వెళ్లి గొడవ చేయడం మీడియాలో వైరల్ అవడం మనకు తెలుసు. దాంతో నరేశ్, పవిత్ర సహజీవనం చేస్తున్న విషయం వెల్లడైంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ ఘటననలను హైలైట్ చేస్తూ సినిమా తీసినప్పుడు ఇది వాళ్ల నిజ జీవితానికి సంబంధించింది కాదని ఎవరు అనుకుంటారు? "అసలు సూపర్‌స్టార్ పెద్దాయన (శరత్‌బాబు), చిన్న సూపర్‌స్టార్ హరీశ్ బాబు ఆయన పెద్ద భార్య కొడుకు, నరేంద్ర మేడం విమల(జయసుధ) కొడుకు" అని అన్నపూర్ణ చేత చెప్పించిన మాటలు కృష్ణ ఫ్యామిలీని ఉద్దేశించినవని ఎవరైనా చెప్పేస్తారు కదా! 

ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని రమ్యను వదిలేసి, పవిత్రతో నరేశ్ సహజీవనం చేయడం వెనుక కారణాలు ఇవన్నట్లుగా నరేశ్, పవిత్ర సైడ్ తీసుకొని ఈ సినిమా చేసినట్లు అనిపించింది. ఈ క్రమంలో సౌమ్యను తిరుగుబోతు దానిగా, పెళ్లికి ముందే శారీరక సౌఖ్యం అనుభవించి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ద్వారా నరేంద్రను ఆమె పెళ్లికి ఒప్పించినట్లుగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. సౌమ్యకు 'టవర్ టీవీ' సీఈఓ రాజేశ్‌రెడ్డి (ప్రవీణ్ యండమూరి)తో అనుబంధం ఉందన్నట్లు కూడా చూపించారు. డబ్బు కోసం నరేంద్రను ఆమె టార్చర్ చేయడం కూడా మనం చూస్తాం. 

అంతే కాదు.. నరేంద్ర, పార్వతి ఒకరికొకరు సోల్‌మేట్స్ అనీ, దేవుడే వాళ్లను కలిపాడన్నట్లు చూపించి కితకితలు పెట్టాడు దర్శకుడు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సౌమ్య పెద్ద విలన్‌గా మనకు దర్శనమిస్తుంది. ఆమెకు పార్వతి భర్త (రవివర్మ) తోడవడాన్నీ మనం చూస్తాం. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే.. పార్వతికి భర్తతో కష్టాలుంటాయి. అతను అగ్ర కులస్తుడు కాబట్టి, తనకంటే తక్కువ కులానికి చెందిన పార్వతితో సెక్స్ జరపడానికి కూడా అతను అయిష్టత చూపుతుంటాడు. ఆస్తులు తన పేర రాయించుకొని, లోన్లు మాత్రం పార్వతి పేరిట తీసుకుంటూ ఉంటాడు. ఆమె ఇద్దరు కొడుకులు కూడా సందర్భం వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వెళ్లకుండా తల్లితోనే ఉంటారు. అది ఆమె కథ.

నరేంద్రకు మొదటి రెండు పెళ్లిళ్లు చేయడంలో తప్పులు చేశానని అతని తల్లి విమల బాధపడుతుంది. మూడో పెళ్లి ఎలా జరిగిందో ఇంతకు ముందే చెప్పుకున్నాం. అలా తమ వైవాహిక జీవితంలో ప్రశాంతత కోల్పోయిన ఇద్దరు నడివయస్కులు ఎలా సోల్‌మెట్స్ అయ్యారో 'మళ్ళీ పెళ్లి' ద్వారా కన్విన్స్ చెయ్యాలని చూశాడు రచయిత కూడా అయిన దర్శకుడు ఎమ్మెస్ రాజు. కానీ ఇటీవల మీడియాలో చూసిన కొన్ని సీన్లను (ప్రహసనాలను) మళ్లీ చూసి కాసేపు వినోదించే జనం నిజంగా కన్విన్స్ అవుతారా? పూర్తిగా వన్ సైడెడ్‌గా ఈ కల్పిత కథ ఉందని అనుకోకుండా ఉంటారా?

టెక్నికల్‌గా చూస్తే.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ క్వాలిటీగా అనిపించింది. మ్యూజిక్ సూపర్‌గా లేకపోయినా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. రెండు గంటల 10 నిమిషాల నిడివితో ఎంతో కొంత ఆసక్తికరంగా చిత్రాన్ని ఎడిట్ చేయడానికి కృషి చేశాడు జునైద్. ప్రొడక్షన్ డిజైన్ బాగానే ఉంది. సంభాషణలు సందర్భోచితంగా సాగాయి. కొన్నిచోట్ల ద్వంద్వార్థాలు పలికాయి.

నటీనటుల అభినయం

నరేంద్రగా నరేశ్ చక్కని అభినయం ప్రదర్శించాడు. హావభావాల విషయంలో ఆయన ఎంత రాటుతేలినవాడో మనకు తెలిసిందే కదా! ఆల్‌మోస్ట్ తన నిజ జీవితానికి బాగా దగ్గరైన పాత్రలో సహజంగా జీవించాడు. మేకప్‌తో వయసును దాచడానికి చేసిన ప్రయత్నం తెలిసిపోతోంది. పార్వతిగా పవిత్రా లోకేష్ సైతం తన నటనతో ఆకట్టుకుంది. పాత్రలోని మానసిక సంఘర్షణను బాగా పలికించింది. ఆమె యవ్వన కాలానికి సంబంధించిన పాత్రలో అనన్య నాగళ్ల బాగా గ్లామర్ కురిపించింది. సౌమ్య సేతుపతి పాత్రలో వనిత చాలా బోల్డ్‌గా యాక్ట్ చేసింది. విలన్ రోల్‌కు ఆమె వాయిస్ కూడా బాగా పనికొచ్చింది. పార్వతి భర్త పాత్రలో రవివర్మ, యంగ్ ఫేజ్ రోల్‌లో రోషన్ సరిపోయారు. నరేంద్ర తల్లి విమలగా జయసుధ, ఆమె సూపర్‌స్టార్ భర్తగా శరత్ బాబు కనిపించారు. టవర్ టీవీ సీఈఓగా ప్రవీణ్ యండమూరి, నిజ జీవిత పాత్రలో అన్నపూర్ణమ్మ, ఇతరులు పాత్రల పరిధి మేరకు చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మనకు తెలిసిన, మీడియాలో చూసిన కొన్ని ఘటనలను కూర్చి, రాసిన స్క్రిప్టుతో తీసిన ఈ వన్‌సైడెడ్ 'ట్రూ' లవ్ స్టోరీ 'మళ్ళీ పెళ్లి'కి కనెక్ట్ అయ్యే ఆడియెన్స్ బహు తక్కువ. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లోని డ్రామా కొంతవరకు ఆకట్టుకుంటుంది కానీ, హీరో హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులైన నరేశ్, పవిత్రా లోకేశ్‌ను చూడాల్సి రావడం కాస్త ఇబ్బందికర విషయమే.

- బుద్ధి యజ్ఞమూర్తి